పొయ్యేటోడు పోక పొగ బెట్టి పాయె..

కాషాయ దళానికి గుడ్ బై చెప్పిన మోత్కుపల్లి నరసింహులు... పోతూపోతూ తెలంగాణ బీజేపీ గాలి తీసి పోయారంటూ బీజేపీ శ్రేణులు వాపోతున్నాయి. చంద్రబాబు బంటుగా టీడీపీలో రాచమర్యాదలు అందుకున్న మోత్కుపల్లి.. తమ పార్టీలోకి వస్తే ఎస్సీల్లోని అతిపెద్ద వర్గం తమకు అండగా ఉండడం ఖాయమనుకొని సంబరపడ్డారు బీజేపీ నేతలు. అటు మోత్కుపల్లి కూడా చాలా హై రేంజ్ లో ఊహించుకున్నారు. అందుకే జాతీయ పార్టీలో చేరితే ఏదో ఒక స్థాయిలో చక్రం తిప్పవచ్చనుకొని ఎంతో సంతోషంతో బీజేపీలో చేరిపోయారు. అనుకోకుండా వచ్చి పడ్డ హుజూరాబాద్ ఉపఎన్నికతో తనకు బీజేపీలో గల స్థానమేంటోతెలిసొచ్చిందని, ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదని ఇప్పుడాయన వాపోతున్నారు. టీఆర్ఎస్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న నాయకుడు పార్టీలో చేరితే కనీసం తనకు మాట మాత్రమైనా చెప్పకూడదా... తన అభిప్రాయం తీసుకోకూడదా... అంటూ అసంతృప్తితో రగిలిపోయారు మోత్కుపల్లి.  ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన తననే పూచికపుల్లతో సమానంగా చూస్తే ఇక పార్టీలోకి ఇతర పార్టీల సీనియర్లు ఎలా వస్తారంటూ అక్కసు, ఆవేదన వెళ్లగక్కారు. అసలు వేరే పార్టీ నుంచి వచ్చినవారు బీజేపీలో ఇమడలేరని, ఇప్పుడున్నవారు కూడా ఎప్పుడో ఒకప్పుడు వెళ్లిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మోత్కుపల్లి శాపరనార్థాలతో కంగుతినడం బీజేపీ నేతల వంతైంది.  మోత్కుపల్లి బీజేపీని వీడాక మీడియాతో మనసులోని అంశాలు బయటపెట్టుకున్నారు. రాష్ట్ర నాయకత్వంలో సమర్థత లోపించిందని, ఎవరిని ఏ విధంగా ఆకర్షించాలో ఇక్కడ ఎవరికీ తెలియదన్న మోత్కుపల్లి.. పనిలోపనిగా జాతీయ పార్టీ నాయకత్వాన్ని సమర్థించడం విశేషం. ఇదే స్థానిక నాయకులకు మింగుడపడని అంశంగా మారింది. ఎవరైనా ఏ పార్టీ నుంచైనా తమకు నచ్చనప్పుడు ఎప్పుడైనా బయటికి వెళ్లిపోవచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన హక్కు అది. కానీ.. పోతూపోతూ స్థానిక నాయకత్వం మీద అసమర్థ ముద్ర వేసి వెళ్లిపోవడంతో బండి అనుచరులు జుట్టు పీక్కుంటున్నారు. అదీగాక జాతీయ నాయకత్వాన్ని చూడండి... మోడీ గానీ, అమిత్ షా గానీ.. ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారో.. ఇతర పార్టీల నేతలను ఎంత సక్సెస్ ఫుల్ గా క్యారీ చేస్తున్నారో చూసి నేర్చుకోవాలంటూ హితవు పలకడాన్ని బండి ఫ్యాన్స్, రాష్ట్ర బీజేపీ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. అది కూడా హుజూరాబాద్ లో ఉపఎన్నికలు జరుగుతున్న తరుణంలో మోత్కుపల్లి కామెంట్లు భారీ కుదుపేనంటున్నారు బీజేపీ శ్రేణులు. హుజూరాబాద్ ఎన్నికల ముందే ఒక్క వారం రోజుల్లోనే మోత్కుపల్లి, ఎర్రా శేఖర్, గండ్ర సత్యనారాయణరావు బీజేపీని వీడారు. అటు జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు స్వామిగౌడ్ లాంటి సీనియర్ నేతలు బీజేపీలో చేరారు. నాగం జనార్దన్ రెడ్డి సైతం బీజేపీలో ఇమడలేకపోయారు. నాగం పార్టీని వీడినప్పుడు సైతం స్థానిక బీజేపీ నాయకత్వ మూస ధోరణిపై తీవ్రమైన విమర్శలే వచ్చాయి. అప్పుడు లక్ష్మణ్ పోస్టుకు ఎసరు పెట్టింది కూడా ఇలాంటి పరిస్థితులేనని చెబుతారు.  అలాంటిది తాజాగా రిపీట్ కాకుండా ఉండేందుకు బండి సంజయ్ ఎర్రా శేఖర్, గండ్రతో ఫోన్లో మాట్లాడి బుజ్జగించినట్లు సమాచారం. అయినా ఫలితం లేకపోవడంతో.. మోత్కుపల్లి శాపనార్థాల ప్రభావం ఇంకా ఏ రూపం తీసుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. అందుకే పార్టీని వీడే మోత్కుపల్లి తన దారి తాను చూసుకోక.. మరికొందరికి కూడా దారి చూపిస్తున్నాడా అన్న వ్యాఖ్యానాలు పార్టీ నుంచి వినిపిస్తున్నాయి.  

రియ‌ల్ లీడ‌ర్ కేటీఆర్‌.. డౌట్ ఉంటే ఈ రియ‌ల్ ఎపిసోడ్‌ చూడండి...

ద‌శాబ్దం కింద‌టి విష‌యం. ప‌శ్చిమ బెంగాల్‌లో నానో కార్ల త‌యారీ ప్లాంట్ కోసం టాటా కంపెనీ సిద్ధ‌మ‌వుతోంది. సింగూర్‌ ప్రాంతంలో వెయ్యి ఎక‌రాల భూమిని ప్ర‌భుత్వం కేటాయించింది. అయితే, వ్య‌వ‌సాయ భూముల్లో ప‌రిశ్ర‌మ ఏర్పాటు వ‌ద్దంటూ అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నేత మ‌మ‌తా బెన‌ర్జీ పెద్ద ఎత్తున ఉద్య‌మించారు. టాటా నానో ప్లాంట్‌కు వ్య‌తిరేకంగా రైతుల‌తో క‌లిసి పోరాడారు. విసిగిపోయిన‌.. టాటా కంపెనీ ఛైర్మ‌న్ ర‌త‌న్‌టాటా.. 2008, అక్టోబ‌ర్ 3న‌ బెంగాల్ సీఎం బుద్ద‌దేవ్ భ‌ట్టాచార్య‌ను క‌లిసి.. తాము రాష్ట్రం నుంచి వైదొలుగుతున్నామ‌ని ప్ర‌క‌టించారు. ర‌త‌న్‌టాటా ఇలా స్టేట్‌మెంట్ ఇచ్చారో లేదో.. ఆయ‌న మొబైల్ ఫోన్‌కు ఓ SMS వ‌చ్చింది. ఆ మెసేజ్ ఓపెన్ చేస్తే.. అందులో "WELCOME" అని రాసుంది. అంతే, ర‌త‌న్ టాటా క‌ళ్ల‌ల్లో ఆనందం. ఇంత‌కీ ఆయ‌న‌కు వెల్‌క‌మ్ అని మెసేజ్ పంపించింది మ‌రెవ‌రో కాదు.. అప్ప‌టి గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఇక అంతే. క‌ట్ చేస్తే.. నాలుగు రోజుల వ్య‌వ‌ధిలో.. 2008, అక్టోబ‌ర్ 7న ర‌త‌న్‌టాటా మ‌రో ప్ర‌క‌ట‌న చేశారు. టాటా నానో కార్ల త‌యారీ ప్లాంట్‌ను గుజ‌రాత్‌లోని స‌నంద్‌లో ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. జ‌స్ట్‌, ఓ సింపుల్ మెసేజ్‌తో వంద‌ల కోట్ల పెట్టుబ‌డిని గుజ‌రాత్‌కు తీసుకొచ్చిన మోదీ ప‌నితీరును అప్ప‌ట్లో అంతా మెచ్చుకున్నారు. ఆయ‌న టైమింగ్‌, క‌మిట్‌మెంట్‌ను కార్పొరేట్ వ‌ర్గాలు అప్రిషియేట్ చేశాయి.  సేమ్ టూ సేమ్‌.. అలాంటి ఘ‌ట‌నే తెలంగాణ‌లోనూ జ‌రిగింది. అప్ప‌టి గుజ‌రాత్‌ సీఎం మోదీలానే, ఇప్ప‌టి తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైతం వెయ్యి కోట్ల ప‌రిశ్ర‌మ‌ను త‌న నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో సాధించారు. ఆ ఎపిసోడ్ టాటా నానో ప్లాంట్ త‌ర‌లింపుకంటే కూడా డ్ర‌మెటిక్‌గా న‌డిచింది. ఆ ఎపిసోడ్‌లో భాగ‌స్వామి అయిన‌ ఐటీ డైరెక్ట‌ర్ దిలీప్ కొణ‌తం చెప్పిన‌ వివ‌రాల ప్ర‌కారం... ఇటీవ‌ల కిటెక్స్‌ కంపెనీ తెలంగాణకు వచ్చిన తీరు పారిశ్రామిక, రాజకీయ వ‌ర్గాల్లో సంచలనంగా నిలిచింది. కిటెక్స్ రాకతో వెయ్యి కోట్ల పెట్టుబ‌డి, 4వేల ఉద్యోగాలు వ‌స్తాయి. అయితే, కిటెక్స్‌ కంపెనీ తెలంగాణలో పెట్టుబడి పెట్టడం వెనక మంత్రి కేటీఆర్ చేసిన‌ కృషి, జ‌రిగిన అత్యంత నాట‌కీయ ప‌రిణామాలు తెలిస్తే.. కేటీఆర్ ప‌నితీరును అభినందించాల్సిందే.    కిటెక్స్‌ గ్రూప్‌ సుమారు 50 ఏళ్లుగా కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. కంపెనీ విస్తరణలో భాగంగా ఇటీవలే రూ.3,500 వేల కోట్లతో ఒక మెగా ప్రాజెక్టును ప్రకటించింది. అయితే, తాజాగా కేరళ వామపక్ష ప్రభుత్వానికి, కిటెక్స్‌ కంపెనీకి మధ్య విభేదాలు వ‌చ్చాయి. కేరళ ప్రభుత్వం అనేక విభాగాల అధికారులతో సోదాలు చేయిస్తూ, తమను అనవసరంగా వేధిస్తున్నదని కంపెనీ ఎండీ జాకబ్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కేరళలో పెట్టాలనుకుంటున్న పెట్టుబడిని ఉపసంహరించుకుంటున్నట్టు.. ఇత‌ర రాష్ట్రాల‌కు తరలిస్తామని ప్రకటించారు. ఈ విష‌యం తెలియగానే అనేక రాష్ట్రాలు కిటెక్స్ అధిప‌తి జాకబ్‌ను సంప్రదించాయి. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించాయి. కర్ణాటక సీఎం యడ్యూరప్ప స్వయంగా జాకబ్‌తో మాట్లాడారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ సహా దాదాపు 10 స్టేట్స్ జాక‌బ్‌ను రిక్వెస్ట్ చేశాయి. అందులో తెలంగాణ స్టేట్ కూడా ఉంది. పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ మొదట జాకబ్‌తో మాట్లాడారు. తర్వాత మంత్రి కేటీఆర్ ఫోన్ చేశారు. కానీ, కిటెక్స్‌ యాజమాన్యం తెలంగాణ‌పై అంతగా సానుకూలత క‌న‌బ‌ర‌చ‌లేదట‌.  ఇక్క‌డే కేటీఆర్ త‌న నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను ప్ర‌ద‌ర్శించారు. ‘మీరేమీ ముందే మాకు నిర్ణయం చెప్పనక్కర్లేదు. ఒక్కసారి తెలంగాణ‌కి రండి. ఇక్కడి పారిశ్రామిక వాతావరణం చూడండి. మా ప్రభుత్వం ఎంత ప్రోయాక్టివ్‌గా ఉందో గమనించండి. తర్వాతే మీ నిర్ణయం ప్రకటించండి’ అంటూ కేటీఆర్‌ జాకబ్‌ను ఆహ్వానించారు. టెక్స్‌టైల్స్‌ తమ ప్రభుత్వ ప్రాధాన్య రంగాల్లో ఒకటని నచ్చజెప్పారు. అప్పటికీ జాకబ్‌ పెద్దగా ఆసక్తి చూపలేదట‌. “పెట్టుబడి సంగతి తర్వాత. మా ప్రభుత్వం ఎలా పని చేస్తున్నదో చూడడానికైనా తెలంగాణకు రండి. మీ బృందం కోసం నేను ప్రత్యేక విమానం పంపిస్తున్నా. డేట్స్‌ చెప్పండి” అని జాకబ్‌కు చెప్పారట‌ కేటీఆర్‌!  త‌మ కోసం ప్ర‌త్యేక విమానం పంపిస్తాన‌న‌డంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం జాకబ్ వంతైంది. ఒక పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ప్రత్యేక విమానాన్ని పంపించడం ఏమిటని అనుకున్నారు కాబోలు, వెంట‌నే తెలంగాణ‌కు రావ‌డానికి ఒప్పేసుకున్నారు. “సరే చూడడానికి వస్తా. నిర్ణయం తర్వాత చెబుతా” అంటూ జాకబ్‌ అంగీకరించారట‌. కేటీఆర్‌ వెంటనే విమానం అరేంజ్‌ చేశారట‌.  ప్రభుత్వం పంపించిన ప్రత్యేక విమానంలో గ‌త‌ శుక్రవారం ఉదయం జాకబ్‌ బృందం హైదరాబాద్‌కు వ‌చ్చింది. కాకతీయ ఐటీసీ హోటల్‌లో సమావేశం జ‌రిగింది. తెలంగాణ అంటే ఏమిటి? ఐపాస్‌తో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఎలా లభిస్తున్నాయి? 24 గంటల కరెంటు ఎలా అందుబాటులో ఉంది? పరిశ్రమలకు నీళ్ల లభ్యత ఎలా ఉంది? తదితర అంశాలపై కేటీఆర్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. తమ కంపెనీ విశేషాల గురించి జాకబ్‌ బృందం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది.  “వచ్చిన వాళ్లు ఎలాగూ వచ్చారు. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేశాం. దాన్ని ఓసారి చూడండి” అంటూ కేటీఆర్‌.. కిటెక్స్ టీమ్‌కు ఆఫర్‌ చేశారట‌. వరంగల్‌ వెళ్లి వచ్చేంత సమయం లేదని జాకబ్‌ బృందం అన‌గా.. “టైం గురించి మీకెందుకు? హెలికాప్టర్‌ అరేంజ్‌ చేస్తాం.. వెంట‌నే వెళ్లి రావొచ్చు” అంటూ కేటీఆర్ అన‌డంతో మ‌రోసారి షాక్ అయ్యార‌ట జాక‌బ్‌. అప్పటికప్పుడు హెలికాప్టర్‌లో కిటెక్స్‌ బృందం వరంగల్‌కు వెళ్ల‌డం.. అక్కడి అధికారులు మెగా పార్క్‌ను ద‌గ్గ‌రుండి చూపించి.. దాని విశేషాలను వివ‌రించ‌డంతో.. ఆ ఏర్పాట్లు చూసిన జాకబ్‌ బృందం సంతృత్తి చెందింద‌ట‌. సాయంత్రానికళ్లా హెలికాప్టర్లోనే హైదరాబాద్‌ తిరిగివచ్చేసి.. కేటీఆర్‌ను మ‌రోసారి క‌లుస్తామ‌న్నార‌ట కిటెక్స్ ప్ర‌తినిధులు.  ప్ర‌గ‌తి భ‌వ‌న్ వెళ్లిన కిటెక్స్ బృందం.. తెలంగాణ ప్రభుత్వాన్ని, కేటీఆర్‌ను ప్రశంసించి.. అప్ప‌టిక‌ప్పుడే త‌మ నిర్ణ‌యాన్ని చెప్పేసింది. తెలంగాణలో తాము వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులూ పెడతామని హామీ ఇచ్చింది. ఏ నిర్ణయమూ లేకుండా తెలంగాణ వచ్చిన కిటెక్స్‌ బృందాన్ని.. గంటల్లోనే నిర్ణయం తీసుకునేలా చేసిన‌ కేటీఆర్‌ ప‌నితీరును అంతా ఫిదా అవుతున్నారు. కిటెక్స్‌ పెట్టుబడి విలువ‌.. వెయ్యికోట్లు, నాలుగు వేల ఉద్యోగాలు. కేటీఆర్ సామ‌ర్థ్యానికి ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఇంకేం కావాలి?

మ‌ల్లీశ్వ‌రి త‌ర్వాత మీరాబాయి.. స‌రిలేరు నీకెవ్వ‌రూ...

టోక్యో ఒలంపిక్స్‌లో భార‌త్ మురిసింది. మీరాబాయి చాను వెండి ప‌త‌కం ముద్దాడింది. మణిపుర్‌ మణిపూస ఆ ఘ‌న‌త సాధించింది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత భారత్‌కు పతకం అందించింది మీరాబాయి చాను. 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో భార‌త్ ప‌త‌క‌దారిగా నిలిచింది.  మహిళల 49 కిలోల విభాగంలో మీరాబాయి చాను మెడ‌ల్ సాధించారు. స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోలు ఎత్తి.. వెండి వెలుగులు విర‌జిమ్మింది. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో అద్భుతమే చేసింది. ఎందుకంటే ఈ విభాగంలో మీరాకు ప్రపంచంలోనే తిరుగులేదు. పోటీల్లో మీరాబాయికి గట్టి పోటీనిచ్చింది చైనా వెయిట్‌ లిఫ్టర్‌ హూ జిహూయి. మొత్తంగా 210 కిలోలు ఎత్తి స్వర్ణం అందుకుంది.  టోక్యో ఒలింపిక్స్‌లో తొలి పతకం సాధించి భారత్‌కు శుభారంభం అందించిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్‌మీడియాలో అభినంద‌న‌లు చెప్పారు.  టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి భారత పతకాల పట్టికను తెరిచిన వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చానుకు హృదయపూర్వక అభినందనలు - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌    టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను అద్భుతమైన ప్రదర్శనతో యావత్ భారతం ఉప్పొంగిపోతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన ఆమెకు అభినందనలు. ఆమె విజయం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి దాయకం - ప్రధాని మోదీ    తొలి రోజే.. తొలి పతకం. మీరా.. భారత్‌ గర్వపడుతోంది - క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌    టోక్యో ఒలింపిక్స్‌ ఆరంభంలోనే దేశానికి తొలి పతకం అందించిన మీరాబాయి చానుకు అభినందనలు. తన పుత్రికను చూసి భారతావని గర్వపడుతోంది - కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ   వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన మీరాబాయి చానుకు అభినందనలు. టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి గొప్ప ఆరంభం లభించింది. కరణం మల్లీశ్వరి తర్వాత ఒలింపిక్స్‌ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పతకాన్ని గెలుచుకున్న రెండో భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. - తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు   ఎంత మంచి రోజు! భారత్‌కు ఎంత మంచి విజయం. 49 కిలోల విభాగంలో వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను రజతాన్ని ముద్దాడింది. దీంతో భారత పతకాల పట్టిక మొదలైంది. యావత్‌ దేశాన్ని గర్వపడేలా చేశావు చాను - మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌. బీరేన్‌ సింగ్‌    టోక్యోలో భారత్‌ తొలి పతకం నమోదు చేసింది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజత పతకం అందుకుంది. యావత్ భారతావని గర్వపడే విషయం. అభినందనలు చాను - కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు     

రాష్ట్రపతి, ప్రధానికి రక్తంతో లేఖ రాసిన యువకుడు.. 

ఈ మధ్య కాలంలో అందరూ ఏదో ఒక రకంగా గుర్తింపు పొందాలని ఆలోచిస్తున్నారు.. అందుకు వినూతనమైన పనులు చేస్తున్నారు..అందులో కూడా కొంత మంది సమాజ శ్రేయస్సు కోసం కంకణం కట్టుకుంటున్నారు.  కరోనా టైం లో అందరికి అడ్డగానిలిచిన సోను సూద్ ను కావడానికి ఒక యువకుడు హైదరాబాద్ నుండి ముంబై వరకు పాదయాత్ర చేశాడు. ఆ విషయం అందరికి తెలిసిందే.. తాజాగా కర్ణాటకు  చెందిన ఓ యువకుడు.. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తదితరులకు తన రక్తంతో లేఖ రాశాడు. ఈ అంశం ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ లేఖ లో ఏం రాశాడు అని తెలుసుకోవాలంటే మీరు ఈ వార్త చదవాలి మరి. ఇంకెందుకు ఆలస్యం పదండి ముందుకు..  కర్ణాటకకు చెందిన ఓ యువకుడు.. అతని పేరు రోషన్..దేశ వ్యాప్తంగా గో సంరక్షణకు చర్యలు తీసుకోవాలని  తన లేఖలో కోరాడు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరాడు. కర్ణాటక గో వధ నిషేధ చట్టాలు పగడ్భందీగా అమలయ్యేలా చూడాలని, దేశంలో గో వధ నిషేధ చట్టాలున్నా… విచ్చలవిడిగా గో మాంసం విక్రయిస్తున్నారని తన లేఖలో వారి   రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశం ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది అయినా గో వధ కొనసాగుతుండటంతో మనోవేధనతో ఇప్పుడు వారికి తన రక్తంతో లేఖలు రాసినట్లు చెప్పాడు. గత ఐదారు సంవత్సరాలుగా రాష్ట్రపతి, ప్రధానికి ఈ విషయమై లేఖలు రాసినట్లు తెలిపాడు. ఆవులను తాము దేవుడితో సమానంగా భావిస్తామని పేర్కొన్న రోషన్..అది హిందువుల సంస్కృతిలో భాగమయ్యిందన్నారు. ఆవులతో ప్రతి హిందువుకు ప్రత్యేక అనుబంధం ఉందని..మాంసం కోసం గోవులను వధించడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నట్లు రోషన్ తెలిపాడు. దేశ వ్యాప్తంగా పశువుల అక్రమ రవాణా, వధ కొనసాగుతోందని..దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కూడా రక్తంతో రాసిన లేఖను పంపారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేందుకు చొరవ చూపాలని కోరాడు. ఇక ఈ రోషన్ ఎవరు.. అంటే కర్ణాటకలో  జరుగుతున్న గో సంరక్షణ ఉద్యమంలో రోషన్ చురుగ్గా పాల్గొంటున్నాడు. తమ ప్రాంతంలో పశువులను అక్రమంగా గోశాలకు తరలిస్తున్నట్లు సమాచారం అందితే తక్షణం స్పందించి గో సమితి సభ్యులతో కలిసి అక్కడ వాలిపోతాడు. మూగజీవాలకు విముక్తి కల్పించి గో సంరక్షణ కేంద్రానికి తరలిస్తాడు. గోవుల సంరక్షణ కోసం పలు కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇలా సంఘంలో జరిగే అవాంఛనీయ సంఘటనలు అడ్డుకట్ట వేయడానికి నిత్యం ప్రయత్నిస్తాడు రోషన్.. చట్టవిరుద్ధంగా సాగుతున్న గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు సరైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని రోషన్ ఒక వైపు ఆవేదన వ్యక్తం చేస్తూనే మరో వైపు ప్రశ్నిస్తున్నారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులతో రాత్రిపూట గస్తీ ఏర్పాటు చేయాలని మూగజీవుల ప్రేమికుడు రోషన్  డిమాండ్ చేశారు. గో సంరక్షణ కోసం రోషన్ రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు తన రక్తంతో లేఖలు రాయడం ఆ రాష్ట్ర మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

గుట్కా, గంజాయి, డ్రగ్స్ తీసుకునే మంత్రులు.. బండి సంజ‌య్ స్ట్రాంగ్ వార్నింగ్‌

మంత్రులంటే ఎంత హుందాగా ఉండాలి? ప్ర‌జ‌ల‌కు ఎంత ఆద‌ర్శంగా ఉండాలి? కానీ, తెలంగాణ మంత్రులు కొంద‌రు త‌మ చేష్ట‌ల‌తో మంత్రి హోదాకే క‌లంకం తీసుకొస్తున్నారు. ఇటీవ‌ల తెలంగాణ మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, గంగుల క‌మ‌లాక‌ర్‌లు చాటుమాటుగా గుట్కా తింటున్న య‌వ్వారం కెమెరాల‌కు చిక్క‌డం.. ఆ దృశ్యాలు వైర‌ల్‌గా మార‌డం క‌ల‌క‌లం రేపుతున్నాయి. మంత్రుల తీరుపై తాజాగా బీజేపీ అధ్య‌క్షులు బండి సంజ‌య్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. గంగుల క‌మ‌లాక‌ర్ హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపున‌కు తీవ్రంగా ప‌ని చేస్తుండ‌టం.. ఈట‌ల‌ను క‌ట్ట‌డి చేసే కుట్ర‌లు చేయ‌డంపై బీజేపీ బాస్ ఫైర్ అయ్యారు.    గుట్కా, గంజాయి, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను ఓడించేదంటూ గ‌ట్టిగా ప్రశ్నించారు. హుజురాబాద్‌లో ప‌ర్య‌టించిన బండి సంజ‌య్‌.. ఈటల పాదయాత్ర సీఎం కేసీఆర్‌కు నిద్ర లేకుండా చేస్తోందన్నారు. ఈటల గెలిచిన తర్వాత డైరెక్ట్‌గా అయోధ్యకు వెళతామన్నారు. కేసీఆర్ సర్వేలను మాత్రమే నమ్ముకున్నార‌ని.. తాము ప్ర‌జ‌ల‌నే న‌మ్ముకున్నామ‌న్నారు.   దళిత బంధు.. రాజ‌కీయ డ్రామా అంటూ బండి సంజ‌య్ మండిప‌డ్డారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతిలకు కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏది అంటూ కేసీఆర్‌ను నిలదీశారు. బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నడి బొడ్డున అంబేద్కర్ విగ్రహం పెడతామన్నారు బండి సంజ‌య్‌. హుజురాబాద్‌లో బీజేపీ గెలుపును ఎవ‌రూ అడ్డుకోలేరంటూ స‌వాల్ విసిరారు.  

వెయిట్‌ లిఫ్టర్‌ మీరాభాయి చానుకు సిల్వర్.. ఒలింపిక్స్ లో భారత్ బోణి

టోక్సో ఒలంపిక్స్ లో భారత్ ఖాతా తెరిచింది. తొలి రోజే వెయిట్‌ లిఫ్టర్‌ మీరాభాయి చాను అద్భుతం చేసింది. భారత కీర్తి పతాకను రెపరెపలాడిస్తూ మహిళల 49 కేజీల విభాగంలో చానుకు రజత పతకం లభించింది.  స్నాచ్‌లో 87 కిలోలు ఎత్తిన ఆమె క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు ఎత్తింది. మొత్తంగా 202 కిలోలు ఎత్తి తొలి పతకం సాధించింది. చైనాకు చెందిన హూ ఝూహీ 210 కిలోల (94, 116) బరువునెత్తి ఈ విభాగంలో స్వర్ణం సాధించింది. 2000 సంత్సరం తర్వాత వెయిట్ లిఫ్టింగులో భారత్ కు మెడల్ వచ్చింది. 2000 ఒలింపిక్స్ లో తెలుగుమ్మాయి కరణం మల్లీశ్వరీ మెడల్ సాధించారు. ఒలింపిక్స్ లో సిల్వడ్ మెడల్ సాధించిన మీరాభాయి చానును ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. భారతీయులందరికి చాను స్పూర్తిదాయకమని  కీర్తించారు.  10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో యువ కెరటం సౌరబ్ చౌదరి ఫైనల్ లో ఓడిపోయాడు. ఆరు సిరీస్ ల క్వాలిఫికేషన్ రౌండ్ లో 586 పాయింట్లు సాధించి టాప్ 8లో టాపర్ గా నిలిచి ఫైనల్ లోకి దూసుకెళ్లిన అతడు.. ఫైనల్ లో తడబడి నిష్క్రమించాడు. మొదటి సిరీస్ లో తొలి ఐదు షాట్లకు పదికి పది పాయింట్లు సాధించిన అతడు.. ఆ తర్వాత కొంచెం తడబడ్డాడు. తర్వాతి ఐదు షాట్లకు తొమ్మిది చొప్పున పాయింట్లు సాధించి.. మొత్తం 95 పాయింట్లతో నిలిచాడు. ఆ తర్వాతి సిరీస్ లలో పుంజుకున్న సౌరబ్.. వరుసగా 98, 98, 100, 98, 97 పాయింట్లను సాధించి.. భారత్ కు పతకం ఆశలను మరింత పటిష్ఠం చేశాడు. ఫైనల్ లో పోటీ ఇవ్వలేకపోయాడు. ఇదే విభాగంలో అభిషేక్ వర్మ క్వాలిఫికేషన్ రౌండ్​ లోనే వెనుదిరిగాడు. బ్యాడ్మింటన్ లో నిరాశే ఎదురైంది. తెలుగు తేజం సాయి ప్రణీత్ తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలయ్యాడు. 17–21, 15–21  తేడాతో ఇజ్రాయెల్ క్రీడాకారుడు జిల్బర్ మ్యాన్ చేతిలో ఓడిపోయాడు. ఇటు ఆర్చరీ మిక్స్ డ్ డబుల్స్ లోనూ చేదు ఫలితాలే వచ్చాయి. క్వార్టర్ ఫైనల్స్ లో దీపికా కుమారి, ప్రవీణ్ జాధవ్ ల జోడీ ఓడిపోయింది. కొరియా జంట ఆన్ సాన్ , కిమ్ జే దియోక్ చేతిలో 2–6 తేడాతో ఓటమిపాలయ్యారు. ఒలింపిక్స్‌ హాకీలో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. పురుషుల హాకీలో న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో ఘన విజయం సాధించింది. 3-2 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (26ని, 33ని) రెండు గోల్స్‌తో దుమ్మురేపారు.   ఇక టోక్యో ఒలింపిక్స్‌లో  మొదటి స్వర్ణాన్ని చైనా ముద్దాడింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో యాంగ్‌ కియాన్‌ విజయం సాధించింది. రష్యన్‌ (రష్యా ఒలింపిక్‌ కమిటీ) షూటర్‌ గలాషినా అనస్టాసియాను స్వల్ప తేడాతో ఓడించింది. 

భార్య పై భర్త  తన నలుగురు స్నేహితులతో కలిసి  15 రోజులు  దారుణం.. 

మహిళలపై రోజు ఎక్కడ చూసిన దాడులు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న  దాడులను అదుపులోకి తీసుకురావడం కోసం ప్రభుత్వాలు, కోర్టులు ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన ఆ చట్టాలను లేకచేయడం లేదు కొంత మంది దుర్మార్గులు. ప్రేమించలేదని ఒకడు, తనతో మాట్లాడలేదని మరొకడు. కామంతో ఇంకొకడు, ఇలా రకరకాలుగా ఆడవాళ్లపై నిత్యం దాడులు చేస్తున్నారు. తాజాగా కట్నం కోసం భార్యను వేధించిన ప్రబుద్ధుడు.. అంతే కాదు  ఆమెపై తన స్నేహితులతో కలిసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రెండు వారాలు నిర్బంధించి సామూహిక అత్యాచారం చేశారు.   ధర్మార్ధ కామ మోక్షములలో ఎప్పుడు  తోడు ఉంటాను అని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసిన కట్టుకున్న వాడే , భార్య పాలిట యముడయ్యాడు. రక్షణగా ఉండాల్సిన కట్టుకున్నవాడే తన స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.  నిర్బంధించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను రోజులపాటు ఆమెపై భర్తతో సహా ఐదుగురు ఆఘాయిత్యం చేశారు. పెళ్లయిన కొద్ది రోజులకే అదనపు కట్నం తేవాలని భార్యను చిత్రహింసలకు గురిచేసి, అనంతరం ఆమెకు తలాక్ చెప్పాడు. ఈ అమానవీయ సంఘటనకు పాలుపడ్డాడు ఆ ప్రబుద్దుడు. చివరికి ఎలాగో అలా వారి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు పుట్టింటికి చేరుకుని తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్షాయ్‌ ఘంజ్‌కు చెందిన బాధిత యువతికి.. అదే ప్రాంతానికి చెందిన నజీమ్‌తో వివాహమైంది. పెళ్లైన కొన్నాళ్ల తర్వాత భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం తేవాలని ఆమెను చిత్రహింసలు పెట్టాడు. నరకం చూపించాడు తాను చెప్పినట్టు చేయకపోవడంతో తలాక్ చెప్పాడు. తన నలుగురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. స్నేహితులు జుల్‌ఫికర్‌, జబ్బార్‌, సాజిమ్‌, అమీర్‌లతో కలిసి 15 రోజుల పాటు ఆమెకు నరకం చూపించాడు.  భర్త చెర నుంచి ఎలాగోలా బయటపడ్డ బాధితురాలు.. తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు వివరించింది. దీంతో ఆమె వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కనౌజ్ ఎస్పీ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, నిందితుల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని వివరించారు. ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్‌ జిల్లాలో వెలుగుచూసింది. ఎప్పుడు వచ్చును మహిళకు స్వతంత్రం.. అది తెచ్చుట కదా మన కర్తవ్యం.. ఎప్పుడు వచ్చును స్త్రీ కి స్వేచ్ఛ అది ఇచ్చుట కదా సమాజం కర్తవ్యం.. గాంధీ కలలు కన్నా స్వరాజ్యం లో ఇంకా మహిళలపై దాడులు చేసే సమాజం నశించేది ఎన్నడూ నడి రాతిరి స్త్రీ దైర్యంగా, స్వేచ్ఛగా తిరిగేది ఎన్నడు..

సలహాదారులకు త్వరలో మంగళం? హైకోర్టు కామెంట్లతో వైసీపీలో కలవరం 

ప్రభుత్వానికి కొందరు సలహాదారులు ఉంటారు. పాలనలో సహకరించేందుకు కొందరని ఇలా నియమిస్తుంటారు. గతంలో చాలా పరిమితంగా సలహాదారులు ఉండేవారు. కాని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సలహదారుల పదవికి అర్ధమే మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఎడాపెడా సలహదారులను నియమించేశారు సీఎం జగన్ రెడ్డి. అవసరాలు, అర్హతలు ఇవేమి లేకుండా ఇష్టారాజ్యంగా కట్టబెట్టేశారు. ఏపీలో 50 మందికి పైగానే  సలహదారులు ఉన్నారంటే నమ్మక తప్పదు. ఇందులో దాదాపు 80 శాతం ఒక సామాజిక వర్గం వారే ఉండటం మరో విశేషం. అంటే ఓ వర్గం వారి కోసమే సలహాదారుల పదవి స్పష్టించి అపాయింట్ చేసుకున్నారనే ఆరోపణలు జగన్ రెడ్డిపై ఉన్నాయి.  సలహాదారులుగా నియమించబడిన వారు  ఏం చేస్తున్నారో , ఏం ఎలగబెడుతున్నారో ఎవరికీ తెలియదు. ఇక్కడ మరో కీలక అంశం ఏంటంటే.. ఏపీ ప్రస్తుతం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వాలన్న రుణం తీసుకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లోనూ అడ్డగోలుగా సలహాదారులను నియమించుకుని ఖజానా ఖాళీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సలహాదారులకు ప్రభుత్వం నుంచి వేతనాలు ఇవ్వడంతో పాటు ఇతరత్రా అలవెన్సుల పేరుతో నెలనెలా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది జగన్ రెడ్డి సర్కార్. సలహాదారుల నియామకం, వాళ్ల పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఏపీ హైకోర్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. రాష్ట్ర ప్రభుత్వ, ముఖ్యమంత్రి సలహాదారులకు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలు హైకోర్టు న్యాయమూర్తులకు సైతం లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఖజానా నుంచి వారికి అలవెన్స్‌లు, ఇతర సౌకర్యాలు రూపేణా లక్షల్లో చెల్లిస్తున్నదని పేర్కొంది.  సలహాదారులనే పేరుతో 50 నుంచి 60 మందిని నియమించడం ఏమిటని హైకోర్టు ఆక్షేపించింది. వారి నియామకం విషయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా చూసుకోవాలి  కదా అని వ్యాఖ్యానించింది. గతంలో సలహాదారులు మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువని...ప్రసుత్తం కొంతమంది మీడియా ముందుకు వచ్చి రాజకీయాలు కూడా మాట్లాడుతున్నారని పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కు సలహాదారుగా ఉన్న కేవీపీ రామచంద్రరావు... రాజశేఖరెడ్డి మరణించిన తరువాత ప్రజలకు ధైర్యం చెప్పేందుకే మీడియా ముందుకు వచ్చారని వ్యాఖ్యానించింది. ఎస్‌ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.  నీలం సాహ్నిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడాన్ని సవాల్‌ చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది బి.శశిభూషణ్‌రావు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ వాదించారు. విచారణ సందర్భంగా ఎస్‌ఈసీగా నియామకానికి గల అర్హతలు గురించి చర్చ జరిగింది. ముఖ్యకార్యదర్శి హోదాకు తగ్గని అధికారి ఎస్‌ఈసీగా నియమితులయ్యేందుకు అర్హులని పంచాయతీరాజ్‌ చట్టంలో స్పష్టంగా ఉన్నప్పుడు స్వతంత్ర వ్యక్తే ఆ పోస్టుకు అర్హులని ఎలా చెబుతారని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సలహాదారుల నియామకం విషయం చర్చకు వచ్చింది. సలహాదారుల అర్హత, నియామకం విషయంలో నిబంధనలు ఏమైనా ఉన్నాయా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎలాంటి నిబంధనలు లేవని...వివిధ రంగాల్లో నిపుణులైన వారిని నిర్దిష్ట కాలంపాటు సలహాదారులుగా నియమించుకుంటారని ఏజీ బదులిచ్చారు. ‘‘సలహాదారుల నియామక జీవోలో వారి విధులు పేర్కొన్నారు. అర్హత గురించి ఎలాంటి నిబంధనలు లేవు. ప్రభుత్వ ఖజానా నుంచే వారికి జీతం, అలవెన్స్‌లు చెల్లిస్తారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. 40, 50 సలహాదారులను నియమించుకొనేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చూడాలి కదా అని వ్యాఖ్యానించారు. దీంతో ప్రభుత్వ సలహాదారుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. తాజా పరిణామాలు చూస్తుంటే.. త్వరలోనే సలదాహారులకు మంగళం పాడే రోజులు ఉన్నాయని తెలుస్తోంది. 

హిజ్రాగా మారితే పెళ్లి.. మోసపోయిన యువతి

బాల్యం..యవ్వనం.. వృధాప్యం మనిషి జీవితం లో  ప్రధానమైన స్టేజెస్ . అలాగే మనిషి జీవితంలో పెళ్లి అనేది కూడా చాలా ముఖ్యమైన ఘట్టం అని చెప్పాలి.. మన భారత దేశంలోపూర్వం నుండి పెళ్ళికి చాలా ప్రాధాన్యత ఉంది. అయితే నేటి పెళ్లి అనేది సరైన సమయంలో లేకపోతె ఇక అంతే.. చాలా మంది మంది సరైన సమయంలో పెళ్లిళ్లు అవ్వక అలాగే ఉండిపోయే వాళ్ళను కూడా మనం చూస్తూనే ఉంటాం. పెళ్ళికి ముందు అబ్బాయికి అయినా అమ్మాయికి అంటే కొన్ని షరతులు విధించడం చూశాం. అయితే తాజాగా ఒక విందా షరతు పెట్టింది ఒక మహిళా.. ఇంతకీ ఆ షరతు ఏంటని అనుకుంటున్నారా ? తెలుసుకోవాలనుకుంటున్నారా ? ఒక మహిళా మరొక మహిళను పెళ్లి చేసుకోవడానికి షరతులు పెట్టింది.. ఆ షరతులు అంటే మాములు షరతులు కాదు. హిజ్రా గా మారితే పెళ్లి చేసుకుంటాను అని షరతు పెట్టింది. తీరా హిజ్రాగా మారితే పెళ్లాడతానన్న మహిళ మాటలు నమ్మిన ఓ యువతి మోసపోయింది. హిజ్రాగా మారాక సదరు మహిళ పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రము అయినా  ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కారుణ్య నియామకాల్లో భాగంగా ఓ యువతికి ప్రభుత్వ ఉద్యోగం లభించింది. శిక్షణ సమయంలో ఓ మహిళ యువతికి పరిచయమైంది. అది ఇద్దరి మధ్య సాన్నిహిత్యానికి దారితీసింది. ఆ అమ్మాయి లేకపోతె బతకలేను అనే స్టేజ్ లోకి వెళ్ళిపోయింది మరో అమ్మాయి . ఎలాగైనా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. ఆ విషయాన్నీ ఆ అమ్మాయికి చెప్పాడు.. ఈ క్రమంలో హిజ్రాగా మారితే పెళ్లాడతానంటూ మహిళ చెప్పింది. ఆ అమ్మాయికి శుభం కార్డు పడింది. ఆమె మాటలు నమ్మిన యువతి హిజ్రాగా మారింది. కొంతకాలంగా కలిసి జీవిస్తున్నారు. తాజాగా యువతిని పెళ్లాడేందుకు ఆ మహిళ నిరాకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హిజ్రాగా మారమని చెప్పి, మారిన తర్వాత తనను మోసం చేసిందంటూ బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకున్నా

ఈటల అనుచరులకు పదవులు.. కేసీఆర్ కు హుజురాబాద్ భయం! 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హుజురాబాద్ భయం పట్టుకుందా? ఉప ఎన్నికపై సర్వేల్లో  ఆశాజనక ఫలితాలు రావడం లేదా? అంటే అవుననే తెలుస్తోంది. టీఆర్ఎస్ వర్గాల నుంచి కూడా ఇదే సమాచారం వస్తోంది. అంతేకాదు కేసీఆర్ వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అలాగే ఉన్నాయి. ఉప ఎన్నికలో గెలవకపోతే పార్టీ భవిష్యత్ కు గండం వస్తుందన్న ఆలోచనలో ఉన్న కేసీఆర్.. హుజురాబాద్ లో ఎలాగైనా గెలిచేలా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలన్ని హుజురాబాద్ కేంద్రంగానే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కేసీఆర్ కు హుజురాబాద్ భయం పట్టుకుందనే చర్చ జరుగుతోంది,  హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులకు భారీగా మేలు జరిగేలా దళిత బంధు స్కీం ప్రకటించారు కేసీఆర్.  ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంలోనే దాదాపు 12 వందల కోట్ల రూపాయలు ఈ స్కీం కింద ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం  నియోజకవర్గంలోని దాదాపు 400 మంది దళితులతో  ఈనెల 26న ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. గ్రామానికి నలుగురుని పిలిపించుకుంటున్నారు. నియోజకవర్గంలోని దళితుల ఓట్లన్ని గంపగుత్తగా కారుకు పడేలా కేసీఆర్ ఈ వ్యూహ రచన చేస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వ పరంగా ఈ నిర్ణయాలు ఉండగానే.. పదవుల పందేరంలోనూ హుజురాబాద్ కు పెద్ద పీట వేస్తున్నారు కేసీఆర్. తాజాగా తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పోరేషన్) చైర్మన్గా బండా శ్రీనివాస్ ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నామినేటెడ్ నియామకం వెనుక ఆసక్తికర కారణాలు ఉననాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వాసి ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన బండా శ్రీనివాస్. టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ మండలాధ్యక్షునిగా జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా పలు హోదాల్లో పనిచేశారు. దీంతో పాటుగా హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరక్టర్గా హుజూరాబాద్ టౌన్ నుంచి ఎంపీటీసీగా రెండుసార్లు ఎన్నికయ్యారు. ఈ శ్రీనివాస్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అనుచరుడు. ఎందరో రాష్ట్ర స్థాయి నాయకులు ముఖ్య నేతలు మాజీ మంత్రులుఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండగా శ్రీనివాస్కు పదవి కట్టబెట్టడం వెనుక కారణం హుజురాబాద్ ఉప ఎన్నికేనని అంటున్నారు. హుజూరాబాద్‌లో మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు ఓడించడంపై ఫోకస్ చేసిందిఅధికార టీఆర్ఎస్. ఈ క్రమంలోనే అనేక వ్యూహాలు రచిస్తోంది. హుజూరాబాద్‌లోని టీఆర్ఎస్‌ క్యాడర్ ఈటల వెంట వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న టీఆర్ఎస్ నాయకత్వం.. ఆయన ప్రధాన అనుచరులు కూడా ఆయన వెంట వెళ్లకుండా చూస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ముఖ్య అనుచరుల్లో ఒకరైన బండా శ్రీనివాస్‌కు కీలక పదవి కట్టబెట్టిందని చెబుతున్నారు. నియోజకవర్గంలో మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ముఖ్య అనుచరుల్లో ఒకరిగా శ్రీనివాస్ కొనసాగుతూ వచ్చారు. ఆయన ఈటల వెంట వెళ్లకుండా ఉండేలా కీలకమైన కార్పొరేషన్ పదవి అప్పగించినట్టు తెలుస్తోంది.

వివేకా టీడీపీలో చేరాలనుకున్నారా? హత్యకు సుపారీ ఇచ్చిందెవరు? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరుగుతోంది. వివేకా మర్డర్ కి సంబంధించి సీబీఐ విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయని తెలుస్తోంది. వివేకా అనుచరుడు ఎర్రగంగి రెడ్డి, పీఏ కృష్ణా రెడ్డి, డ్రైవర్ దస్తగిరి, పులివెందులకి చెందిన కృష్ణయ్య కుటుంబం, వాచ్మెన్ రంగన్న, ఇనాయతుల్లాను ప్రశ్నించిన సీబీఐ అధికారులు .. కీలక సమాచారం సేకరించారని సమాచారం.  వివేకా హత్య కేసులో అత్యంత కీలకంగా భావిస్తున్న వాచ్మెన్ రంగన్న స్టేట్మెంట్ ను జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట  రికార్డు చేసినట్లు సమాచారం. వివేకానంద రెడ్డిని సుపారీ గ్యాంగ్ హత్య చేశారని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. వివేకా హత్యకు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చారని.. తొమ్మిది మంది ప్రమేయం ఉన్నట్లు రంగన్న చెప్పాడని తెలుస్తోంది. హత్య జరిగిన రోజు ఇంటికి ఐదుగురు కొత్త వ్యక్తులు వచ్చినట్లు స్టేట్మెంట్ లో రంగన్న పేర్కొన్నట్లు సమాచారం. ఇద్దరు ప్రముఖుల హస్తం కూడా ఉందని రంగన్న చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వాచ్ మెన్ రంగయ్య చెప్పిన ఆ ఇద్దరు ప్రముఖులెవరన్నదీ ఇప్పుడు సస్పెన్స్ మారింది. వివేకా హత్యకు సుపారీ ఇచ్చిందెవరు.. హత్య చేసిందెవరు అన్నది కొన్ని రోజుల్లోనే తేలిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. వివేకా హత్య కేసులో ఇద్దరు ప్రముఖుల హస్తం ఉందని తెలుస్తుండటంతో దీని వెనుక రాజకీయ కోణం ఖచ్చితంగా ఉందనే అనుమానాలు వస్తున్నాయి. అదే సమయంలో వివేకానంద రెడ్డి హత్య కావడానికి కొన్ని రోజుల ముందు జరిగిన రాజకీయ పరిణామాలు బయటికి వస్తున్నాయి. అందులో సంచలన అంశాలు ఉన్నాయి. 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు వివేకానంద రెడ్డి. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు ఈ హత్య జరగడం తీవ్ర కలకలం రేపింది. అయితే వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు వైసీపీలోనే ఉన్నా... ఆయన పార్టీ మారాలనే ఆలోచనలో అప్పుడు ఉన్నారని తెలుస్తోంది. రాజకీయ వర్గాలు, వైఎస్ వివేకా సన్నిహితులు చెబుతున్న వివరాల ప్రకారం వైఎస్ వివేకానంద రెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. వైఎస్ జగన్ తో విభేదాలు పెరగడంతో పార్టీ మారాలని ఆయన భావించారని అంటున్నారు. అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతోనూ వివేకా టచ్ లోకి వెళ్లారట. చంద్రబాబు కూడా కడప జిల్లా టీడీపీ నేతలతో పాటు ముఖ్య నేతలకు ఈ విషయం చెప్పారని తెలుస్తోంది. వైఎస్ వివేకానంద రెడ్డి మన పార్టీలోకి రాబోతున్నారు.. కడప జిల్లాలోనూ మంచి ఫలితాలు సాధించబోతున్నామని పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు చెప్పారని చెబుతున్నారు. వివేకా టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్న కొన్ని రోజులకే హత్య జరగడం పలు అనుమానాలకు తావిచ్చిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.  2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఆ సమయంలో వివేకానంద రెడ్డి పార్టీ మారితే వైసీపీకి భారీగా నష్టం జరిగేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో వివేకా హత్య జరగడంతో.. దీని వెనుక రాజకీయ కోణం ఉండే అవకాశాలు ఉన్నాయని వాళ్లంతా  అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు వాచ్ మెన్ రంగయ్య కూడా వివేకా హత్య వెనుక ఇద్దరు ప్రముఖులు ఉన్నారని చెప్పారని వార్తలు వస్తుండటంతో.. ముందు నుంచి అనుమానిస్తున్నట్లుగా రాజకీయ కోణంలోనే హత్య జరిగిందనే వాదన నిజం కావచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.  చూడాలి మరీ సీబీఐ దర్యాప్తులో ఏం తేలుతుందో, వివేకా హత్య కేసులో ఉన్న ప్రముఖులు ఎవరో.. వైసీపీ నేతల హస్తం ఉందని తేలితే మాత్రం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రావడం ఖాయం... 

గంటలో మూడు కోట్ల మొక్కలు! కేటీఆర్ కు గ్రీన్ గిఫ్ట్.. 

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్,  ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా టీఆర్ఎస్ నేతలు ఫుల్ హడావుడి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ కు బర్త్ డే కానుకగా గంటలోనే మూడు కోట్ల మొక్కలు నాటే లక్ష్యంగా తలపెట్టిన ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు ప్రకటించారు. వివిధ జిల్లాల్లో నమోదవుతున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఒక్క గంటలో నాటాలన్న నియమాన్ని సడలించినట్లు తెలిపారు.  వర్షాల తెరిపి, వీలును బట్టి రోజంతా తమ తమ ప్రాంతాల్లో మొక్కలు నాటి ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాల్సిందిగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. మూడు కోట్ల‌ మొక్కలు నాటడ‌మే కేటీఆర్‌కు పుట్టినరోజు కానుక అని తెలిపారు. అన్ని స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తమ పరిధిలో వీలైనన్ని మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవటం ద్వారా హరిత తెలంగాణ సాధనలో భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తిని దేశవ్యాప్తం చేయాలన్న తమ సంకల్పానికి ప్రజలు ఇచ్చే ఈ మద్దతు చాలా విలువైనదని ఎంపీ చెప్పారు.  మంత్రి కేటీఆర్‌పై వరంగల్ తూర్పు ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ త‌న అభిమానాన్ని చాటుకున్నారు. కేటీఆర్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని, ముక్కోటి వృక్షార్చ‌న కార్య‌క్ర‌మానికి మ‌ద్ద‌తుగా వ‌రంగ‌ల్‌లోని గ్రౌండ్‌లో కేటీఆర్ రూపాన్ని వంద అడుగుల్లో గ్రీన్ ఆర్ట్ రూపొందించారు. వరంగల్ కు చెందిన  TRS నాయకుడు రాజనాల శ్రీహరి ఒక రోజు ముందే వినూత్న రీతిలో KTR జన్మదిన వేడుకలు నిర్వహించి తన అభిమానాన్ని చాటాడు.. KTR చిత్ర పటాలను మొక్కలకు అంటించి ఓ నర్సరీలోని మొక్కలన్నీ ప్రజలకు పంచాడు. KTR చిత్ర పటాలతో సిద్ధం చేసిన మొక్కలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశాడు. 500 మొక్కలు పంపిణీ చేసి పంపిణీ  ముక్కోటి వృక్ష అర్చన  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  

కేసీఆర్ ను టార్గెట్ చేసిన ప్రవీణ్ కుమార్.. వీఆర్ఎస్ కు కారణం ఇదేనా?

ఐపీఎస్ కు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన భవిష్యత్ కార్యాచరణపై ఒక్కొక్కటిగా క్లారిటీ ఇస్తున్నారు. రాజకీయ ప్రవేశం ఖాయమన్నట్లుగా సంకేతాలు ఇస్తున్న సీనియర్ ఐపీఎస్.. సంచలన వ్యాఖ్యలతో కాక రేపుతున్నారు. తాజాగా తెలంగాణ సిఎం కేసిఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. సంగారెడ్డిలో స్వేరోస్ సంస్థ సభ్యులతో సమావేశం నిర్వహించిన ప్రవీణ్ కుమార్.. కేసిఆర్ పై విమర్శల వర్షం కురిపించారు.  తన పైన నమోదైన కేసులపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.  తాను ఉద్యోగానికి వీఆర్ఎస్ చేసిన మరుసటి రోజునే కరీంనగర్‌లో తనపైన పోలీస్ కేస్ పెట్టారని, తాను వాటికి  భయపడనని ప్రవీణ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీఎం హుజరాబాద్‌లో ఖర్చు పెట్టే వెయ్యి కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల కోసం ఖర్చు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.దళిత ముఖ్యమంత్రి అని ఓట్ల కోసం మోసం చేస్తారు, అలాంటివి మళ్ళీ రానీయకండని ఆయన పిలుపునిచ్చారు. ఇటువంటి అవకాశము వెయ్యి ఏళ్ళు వరకు రాదన్నారు.  దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో రెండు శాతం మాత్రమే దళిత ప్రొఫెసర్లు  ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే కోట్ల ప్రవీణ్‌లు పుట్టుకు వస్తారని ఆయన అన్నారు. బహుజన రాజ్యం సృష్టించుకుందామని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అయిందని, మన బతుకులు ఎక్కడ వేసిన గొంగళిలా ఉన్నాయని ఆయన అన్నారు. ఆ బతుకులు మార్చడానికే తాను రాజీనామా చేసి పదవిని త్యాగం చేసి వచ్చానని ఆయన తెలిపారు. తమకు నిజమైన అభివృద్ధి కావాలి, అధికారం కావాలని అన్నారు. ఉద్యోగాన్ని వదిలేసి వచ్చినప్పుడు కుటుంబములో చాలా బాధ ఉంటుందన్నారు. కోట్ల మంది బాగుపడాలనే తాను ఒంటరి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.  ప్రవీణ్ కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్ డైరెక్షన్ లోనే ఆయన నడుస్తున్నారన్న వాదనకు చెక్ పడినట్లైంది. అంతేకాదు కేసీఆర్ టార్గెట్ గానే ఆయన రాజకీయ అడుగులు ఉండబోతున్నాయన్నది స్పష్టమవుతోంది. ప్రవీణ్ కుమార్ తాజా కామెంట్లతో టీఆర్ఎస్ పార్టీలో కలవరం కనిపిస్తోందని అంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో దళిత ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారు కేసీఆర్. అందుకోసమే దళిత బంధు స్కీం తీసుకువస్తున్నారు. అయితే ప్రవీణ్ కుమార్ తమకు వ్యతిరేకంగా మాట్లాడితే.. దళిత వర్గాలపై ఆ ప్రభావం ఉంటుందనే ఆందోళన గులాబీ లీడర్ల నుంచి వస్తోంది.

రాజీనామాల‌కు సై.. జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు ఉక్కు స‌వాల్‌...

విశాఖ‌ ఉక్క ఫ్యాక్ట‌రీ కోసం ఆంధ్రులంతా ఉద్య‌మిస్తున్నారు. కార్మికులు ధ‌ర్నాలు, దీక్ష‌ల‌తో పోరాడుతున్నారు. టీడీపీ శ్రేణులు అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ప్ర‌జ‌లు ఎంత‌గా వ‌ద్దంటున్నా.. పాల‌కులు మాత్రం స్టీల్ ప్లాంట్‌ను అంగ‌డి స‌రుకుగా అమ్మేసుకోడానికి సిద్ద‌మ‌వుతున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ లోపాయికారి స‌హకారంతో కేంద్రం దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించడానికే అన్న‌ట్టు.. వైసీపీ ఎంపీలు పార్ల‌మెంట్‌లో ఉత్తుత్తి నిర‌స‌న‌లు తెలుపుతున్నార‌ని అనుమానిస్తున్నారు. ఎంపీ విజ‌య‌సాయి నేతృత్వంలో స్టీల్‌ప్లాంట్‌పై రాజ‌కీయ డ్రామా రంజుగా సాగుతోంద‌ని అంటున్నారు. విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబు దూకుడు పెంచారు. స్టీల్ ప్లాంట్‌ పరిరక్షణ కోసం టీడీపీ నుంచి ఎన్నికైన  ప్రజాప్రతినిధులంతా రాజీనామాకు సిద్ధమని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు చంద్రబాబు. గెలుపు-ఓట‌ములు ప‌ట్టించుకోకుండా.. విశాఖ ఉక్కు కోసం రాజీనామాల‌కు సిద్ధ‌ప‌డ్డారు చంద్ర‌బాబు. ఈ మేరకు విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ నేతలకు ఆయ‌న లేఖ రాశారు.  విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో 1960లో తెలుగు ప్రజలు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ సాధించారని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి చంద్రబాబు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘‘ఎన్నో ఆటంకాలు దాటి 1992లో స్టీల్‌ ప్లాంట్‌ను దేశానికి అంకితం చేస్తే.. 2000 సంవత్సరంలో నాటి వాజ్‌పేయీ ప్రభుత్వం  ఈ ప్లాంటును రూ.4వేల కోట్లకు ప్రైవేటీకరించేందుకు సిద్ధపడింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నేను వ్యక్తిగతంగా అభ్యర్థించడం, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో రూ.1,333 కోట్ల ప్యాకేజీ ఇచ్చింది. దీంతో విశాఖ ప్లాంట్‌ తిరిగి లాభాల బాట పట్టేలా చేశాం. విశాఖ ఉక్కు పరిరక్షణకు సీఎం జగన్‌ నేతృత్వం వహించాలి. ఉక్కు ఉద్యమాన్ని సీఎం జగన్‌ ముందుండి నడిపించాలి. ఐక్య పోరాటం వల్లే ఉక్కును ప్రైవేటీకరించకుండా కాపాడగలం’’ అని చంద్రబాబు లేఖ‌లో తెలిపారు.  మ‌రి, చంద్ర‌బాబు స‌వాల్ విసిరిన‌ట్టుగా రాజీనామాల‌కు జ‌గ‌న్ సిద్ధ‌మా? త‌మ‌దే అధికార‌మంటూ విర్ర‌వీగుతున్న వైసీపీకి రాజీనామాలు చేసేంత ధైర్యం ఉందా? చంద్ర‌బాబు డిమాండ్ చేసిన‌ట్టు.. విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ‌కు సీఎం జ‌గ‌న్ నేతృత్వం వ‌హిస్తారా? చంద్ర‌బాబు స‌వాల్‌ను జ‌గ‌న్ స్వీక‌రిస్తారా? విశాఖ ఉక్కు కోసం చిత్త‌శుద్ధి చూపిస్తారా? లేక‌, ఎప్ప‌టిలానే ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టేలా రాజ‌కీయ‌ కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తారా?   

ఉద్యోగులకు ఐదేళ్ల సెలవులు.. ఆర్థిక కష్టాలతో స‌ర్కారు కీలక నిర్ణయం..

క‌రోనా వైర‌స్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను అత‌లాకుత‌లం చేసింది. దాదాపు అన్ని వ్య‌వ‌స్థ‌లూ దారుణంగా దెబ్బ‌తిన్నాయి. ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తి ప‌డిపోయింది. ప్ర‌భుత్వానికి రాబ‌డి త‌గ్గిపోయింది. మ‌రోవైపు, సంక్షేమ ప‌థ‌కాల గుదిబండ ఉండ‌నే ఉంది. వ‌స్తున్న కాస్తో కూస్తో సొమ్ము కూడా ఉద్యోగుల జీతాల‌కే పోతోంది. ఆ శాల‌రీలు ఇవ్వ‌డం కూడా చాలా క‌ష్ట‌మ‌వుతోంది. అప్పులతో, భూముల అమ్మ‌కాల‌తో ప్ర‌భుత్వ ఖ‌ర్చులు నెట్టుకొస్తున్నారు. అయినా.. ద‌మ్మిడి రాక లేక‌పోవ‌డంతో చేసేది లేక చేతులెత్తేస్తోంది స‌ర్కారు. తాజాగా, ప్ర‌భుత్వానికి ఓ బంప‌ర్ ఐడియా వ‌చ్చింది. ఆ ఐడియా రాష్ట్ర ఆర్థిక దుస్థితిని మార్చేస్తుంద‌ని భావిస్తున్నారు పాల‌కులు. ఇంత‌కీ ఆ ఐడియా ఏంటంటే.... అత్య‌వ‌స‌ర‌మైన‌ పోలీస్‌, వైద్యం, రెవెన్యూ, విద్యా విభాగాలు మినహా ఇతర అన్ని ప్రభుత్వ శాఖ‌ల ఉద్యోగులకు ఐదేళ్ల పాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సుదీర్ఘ‌ సెలవు సమయంలో వారికి సగం జీతం ఇస్తారు. ఈ మేర‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉద్యోగులకు ఐదేళ్ల సెల‌వుల ఐడియాకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 2.53 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. కరోనా వల్ల ఆ రాష్ట్ర‌ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నిరర్థక ఆస్తులు అమ్మి రూ. 500 కోట్లను సమీకరించారు. అయినా, ఏ మూల‌కూ స‌రిపోక పోవ‌డంతో.. తాజాగా ఉద్యోగులకు స‌గం వేతనంతో కూడిన దీర్ఘ‌కాల‌ సెలవులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. సగం శాల‌రీ మిగులుతుండ‌టంతో.. ఏటా రూ. 6 వేల కోట్ల మేర ఆదా అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఉద్యోగులు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు సెలవు తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఐడియా అదిరింద‌ని పాల‌కులు భావిస్తున్నా.. సెల‌వులు తీసుకోవ‌డానికి మాత్రం ఉద్యోగులు సిద్ధంగా లేర‌ని తెలుస్తోంది. స‌ర్కారు ఇచ్చిన ఈ ఆఫ‌ర్‌ను వినియోగించుకునే ఉద్యోగుల సంఖ్య త‌క్కువ‌గానే ఉంటుంద‌ని అంటున్నారు.  ఈ మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఈ ఆఫ‌ర్ గురించి ఇంకా మ‌న తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు తెలియ‌లేదేమో. లేదంటే, అప్పుల కుప్ప‌గా మారి, దివాళా స్థితికి చేరిన రాష్ట్రాన్ని గ‌ట్టెక్కించేందుకు మ‌నోళ్లు సైతం ఇలా ఉద్యోగుల‌ను సెల‌వుల‌పై పంపే కార్య‌క్ర‌మం చేప‌ట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదంటున్నారు.     

భూమి కుంగిపోలేదు.. పొంగుకొచ్చింది.. ఏమిటీ వైపరీత్యం?

భూకంపం అంటే భూమి కుంగిపోతుంది. భూమికి పగుళ్లు ఏర్పడతాయి. ఆ సమయంలో ఎవరైనా అనుకోకుండా అట్నుంచి వెళ్తుంటే గనక సజీవసమాధి కావాల్సిందే. కానీ తాజా భూకంపంలో మాత్రం భూమి కుంగిపోలేదు. పొంగుకొచ్చింది. చూపరులను విపరీతంగా భయపెట్టింది. హర్యానాలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. హర్యానాలోని ఓ ప్రదేశంలో నీళ్ల కింద ఉండే భూమి అకస్మాత్తుగా పైకి రావడం కనిపించింది. దాదాపు 2 నిమిషాల పాటు అలా అడుగున ఉన్న భూమి ఏకబిగిన పొంగుకురావడం చూసినవారు చాలా ఆందోళనకు లోనయ్యారు. అంతా దూరం జరగండి.. దగ్గరకు వెళ్తే అది కబళిస్తుందేమో.. దూరంగా ఉండండి..అంటూ ఆ వీడియోలో అరుపులు వినిపిస్తున్నాయి. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో ఆ వీడియోలో లేకున్నా.. దాదాపు నాలుగున్నర మిలియన్ల మంది ఇప్పటికే చూశారు. ఆ భయపెట్టే వీడియో బీభత్సంగా వైరల్ అవుతోంది.  అయితే భూమిలో టెక్టానిక్ ప్లేట్ల సర్దుబాటు వల్ల అలా జరిగి ఉంటుందని కొందరు.. కాదుకాదు... భూమిపొరల్లో ఉండే మిథేన్ వాయువు బయటకు రావడం వల్ల భూమి పొరలు కాస్తా బుడగలుగా పైకి తన్నుకొచ్చాయని మరికొందరు.. ఇలా ఎవరికి తోచినట్టు వారు సముదాయించుకుంటున్నారు. అయితే కరోనా తరువాత ఇలాంటి చిత్రవిచిత్రమైన అనేక ఘటనలు చోటు చేసుకోవడాన్ని బట్టి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినట్టుగానే ఇదంతా జరుగుతోందని, ప్రజలంతా నీతి-న్యాయంగా బతకాలని స్వామివారి కాలజ్ఞానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ వీడియోను పరిశీలించి, భూమి అలా ఎందుకు పొంగుకొచ్చిందో శాస్త్రవేత్తలు చెప్పేదాకా క్లారిటీ రాదంటున్నారు మరికొందరు.

గేదెను ఇంటర్వ్యూ చేసిన  జర్నలిస్టు..  

ఎవరైనా సెలెబ్రెటీ ని ఇంటర్వ్యూ చేస్తారు. రాజకీయనాయకులను ఇంటర్వ్యూ చేస్తారు.. లేదంటే లైఫ్ లో ఏదైనా సాధించిన వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తారు.. కానీ తాజాగా  ఒక వ్యక్తి ఏకంగా గేదెను  ఇంటర్వ్యూ చేశారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు..? అతను గేదెను ఎందుకు ఇంటర్వ్యూ.. అతను అడిగిన ప్రశ్నలకు ఆ గేదె ఏమని సమాధానం చెప్పింది. అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మారేందుకు ఆలస్యం పదండి ముందుకి..  అతని పేరు అమిన్  హఫీజ్అ. అతను ఒక విలేకరి వస్తువులను జంతువులను ఇంటర్వ్యూ చేస్తూ అప్పుడప్పుడు నవ్విస్తూ ఉంటాడు. తాజాగా అతడు లాహోర్‌లో ఓ గేదెను ఇంటర్వ్యూ చేసి వార్తల్లోకి ఎక్కాడు. మనుషులను ఇంటర్వ్యూ చేయడం రొటీన్.. జంతువులను, వస్తువులను ఇంటర్వ్యూ చేయడం వెరైటీ అంటున్నారు ఔనండి.. అతను ట్రెండ్ ఫాలో ఎవ్వడు సెట్ చేస్తున్నాడు.. అన్నింటికీ మించి అక్కడ ఇదోరకమైన  ట్రెండ్ ఫాలో అవుతున్నారు. వెంటకారం అనుకోవాలో.. వ్యంగ్య బాణాలు అనుకోవాలో తెలియదుగానీ.. వారు అలాంటి ఇంటర్వ్యూలతో టీవీ చానెళ్లకు కావాల్సిన టీఆర్పీ ర్యాటింగులను బాగానే తెచ్చిపెడుతున్నారు. ముఖ్యంగా అమిన్ హఫీజ్ అనే విలేకరి ఈ విషయంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇలాంటి ఐడియాలు టీవీ టీఆర్పీ ర్యాటింగులను పెంచడానికి అని స్థానికులు అనుకుంటున్నారు.   తాజాగా అతడు లాహోర్‌లో ఓ గేదెను ఇంటర్వ్యూ చేసి వార్తల్లోకి ఎక్కాడు. గేదెలను విక్రయించే ఓ మార్కెట్‌లోకి వెళ్లిన అమిన్ ఓ గేదె వద్ద చిన్న మైకును పుట్టుకుని ప్రశ్నలు అడిగాడు. ‘‘మీరు లహోర్ వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తోందో చెప్పండి’’ అని ఆ గేదెను ప్రశ్నించాడు. ఇందుకు ఆ గేదె తనదైన భాషలో ‘‘అంబా’’ అని అరిచింది. దీంతో అమిన్ కెమేరా వైపు తిరిగి.. ‘‘చూశారా.. గేదెకు లాహోర్ నచ్చిందట’’ అని తెలిపాడు. ఆ తర్వాత ‘‘నీకు లాహోర్‌లో ఆహారం ఎక్కువ నచ్చిందా? లేదా మీ గ్రామంలో ఆహారం రుచిగా ఉంటుందా?’’ అని ప్రశ్నకు కూడా ఆ గేదె మరో సారి  ‘‘అంబా’’ అని సమాధానం ఇచ్చింది. దీంతో అతడు ‘‘గేదెకు లాహోర్‌లో ఆహారం బాగా నచ్చిందట’’ అని తెలిపాడు. ఈ వీడియో క్లిప్‌ను మరో జర్నలిస్ట్ నైలా ఇనయత్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏదైమైనా క్రియేటివిటి అంటే హద్దు అదుపులేకుండా పోతుంది. హఫీజ్ 2016లో కూడా పసువులను ఇంటర్వ్యూ చేసి అమిన్ వైరల్ అయ్యాడు. 2018లో గాడిదలకు, మనుషులకు ఉండే స్నేహం గురించి వివరించేందుకు గాడిదపై కూర్చొని సవారి చేశాడు. జియో (Geo) టీవీ ఉర్దు రిపోర్టర్‌గా పనిచేస్తున్న అమీన్ కొద్ది రోజుల కిందట ఓ చారిత్రాత్మక కట్టడం గురించి చెప్పేందుకు.. ఏకంగా రాజు అవతారం ఎత్తాడు. రాజులా వస్త్రాలు ధరించడంతోపాటు చేతిలో కత్తి పట్టుకుని రిపోర్టింగ్ చేశాడు. దీంతో నెటిజనులు అతడిని జోకులతో ఆడేసుకున్నారు. మన ఇండియా తరహాలోనే పాకిస్తాన్ రిపోర్టర్లు కూడా క్రియేటీవ్‌గా వార్తలను చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. కొన్నాళ్ల కిందట పాకిస్తాన్‌కు చెందిన ‘జీ-టీవీ’ న్యూస్ రిపోర్టర్ అజాదర్ హుస్సేన్ పీకల్లోతు నీటిలోకి దిగి సమాచారం చెప్పాడు. తమ రిపోర్టర్ ప్రాణాలను ఫణంగా పెట్టి రిపోర్టింగ్ చేశాడని ఆ టీవీ చానల్ యూట్యూబ్‌లో వీడియో పెట్టింది. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. భారత నెటిజనులు ఆ రిపోర్టర్‌ను జోకుల వరదలో ముంచేశారు. యూట్యూబ్ కామెంట్లలో ఓ యూజర్ స్పందిస్తూ.. ‘‘ఇంకా నయం, అతడిని ఏ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడో, సెక్స్ రాకెట్ సోదాలకో పంపించకండి. వాటిని కూడా అనుభవిస్తూ సమాచారం ఇస్తాడు’’ అని కామెంట్ చేశాడు. ఒకప్పుడు ప్రజా పాట్లనే చెప్పే మీడియా ఇప్పుడు ఇలాంటి పంటకు చేస్తుంది.. ఇప్పుడు పెరిగిన పోటీ ప్రపంచంలో మేమే ఆ న్యూస్ ముందు చెప్పాలి మేమే ముందు చెప్పాలని టీఆర్పీ ర్యాటింగుల కోసం పగులుతీస్తున్నాయి.. 

వివేకా హత్యలో ఇద్దరు ప్రముఖులు? కీలక ఆధారాలు సేకరించిన సీబీఐ... 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పురోగతి చోటు చేసుకుంది. రాష్ట్రంలో సంచలనం స్పష్టించిన వివేకా హత్య కేసులో సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది. వివేకా హత్యకు రూ. 8 కోట్లు సుపారీ ఇచ్చినట్లు తేలిందని తెలుస్తోంది. ఇద్దరు ప్రముఖులు ఈ మొత్తన్ని అందజేసినట్లు సీబీఐ విచారణలో స్పష్టమైందని సమాచారం. ఈ కేసుకు సంబంధించి దాదాపు 45 రోజులుగా సీబీఐ బృందం కడప జిల్లాలో మకాం వేసి విచారణ జరుపుతోంది. సుమారు 16 వందలమందికిపైగా విచారించింది. వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగయ్య ఇచ్చిన సమాచారంతో కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని అంటున్నారు.  వివేకా హత్య కోసం ఇద్దరు వ్యక్తులు రూ. 8 కోట్లు సుపారీ ఇచ్చినట్లుగా రంగయ్య జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట  వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఆ వాంగ్మూలం కీలకంగా మారబోతోంది. సుపారీ ఇచ్చిన ఇద్దరు వ్యక్తులతోపాటు మరో ఐదుగురు వ్యక్తులకు ఈ హత్యతో సంబంధం ఉందని రంగయ్య చెప్పినట్లుగా తెలుస్తోంది. హత్యలో పాల్గొన్న ఆ ఐదుగురు బయట ప్రాంతానికి చెందినవారని, ఇద్దరు సుపారీ ఇచ్చారని, మరో వ్యక్తి.. మొత్తం 8 మంది ఈ హత్యలో పాల్గొన్నట్లు రంగయ్య వాంగ్మూలం ఇచ్చినట్లుగా సమాచారం. ఈ వాంగ్మూలంతో సీబీఐ అధికారులు ముందుకువెళ్లే అవకాశం ఉంది మరోవైపు వివేకా హత్య కేసు విచారణలో మరో కీలక మలుపు కూడా చోటు చేసుకుంది. కేసు విచారణ పర్యవేక్షణ అధికారిని సీబీఐ మార్చేసింది. డీఐజీ సుధాసింగ్‌ నుంచి ఎస్పీ రాంకుమార్‌కు కేసు బదిలీ అయ్యింది. వివేకా హత్య కేసులో ఇప్పటికే 44 రోజుల పాటు విచారణ కొనసాగింది. కేంద్ర ద‌ర్యాప్తు బృందం కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో విచార‌ణ కొనసాగిస్తోంది. కొన్ని రోజులుగా అక్క‌డే సీబీఐ అధికారులు అనుమానితుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు.  కీలక సమాచారాన్ని సీబీఐ రాబట్టింది. ఈ కేసులో మ‌రిన్ని వివ‌రాల‌ను రాబ‌ట్టేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇంతలోనే పర్యవేక్షణ అధికారి మార్పు చర్చనీయాశంగా మారింది. 

"అశోక"వనంలో కిష్కిందకాండ!

కేంద్ర మాజీ మంత్రి,మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు చుట్టూ అనూహ్యమైన పరిణామాలు  చోటు చేసుకుంటున్నాయి. ఆయనను మాన్సాస్ పీఠం నుంచి తప్పించాలని,ఆపై ఎలాగైనా ఆయనను ఒక్కసారి జైలుకు పంపించాలనే వ్యూహంతో కుట్రలు జరుగుతున్నట్టు ఇటీవల చోటు చేసుకున్న కొన్ని ఉదంతాలు స్పష్టంగా చెబుతున్నాయి.వీటి వెనుక అధికార పార్టీకి చెందిన అతి పెద్ద తలకాయల ప్రమేయం ఉందనేది ప్రధాన సందేశం.            వర్తమాన రాజకీయాల్లో దేశంలోనే అత్యంత నిజాయితీపరుడైన నాయకుడిగా ప్రస్తుతి గాంచిన అశోక్ గజపతి వంటి వ్యక్తిని అభాసుపాలు చేసేదెలా..సుదీర్ఘ రాజకీయ జీవితంలో అశోక్ ఏ దశలోనైనా అవినీతికి పాల్పడినట్టు రుజువు చేయడం కాదు కదా ఆయనపై అవినీతి ఆరోపణలు చెయ్యడానికి  సైతం ఆస్కారం లేని పరిస్థితుల్లో ఆయనను అప్రతిష్ట పాల్జేసేందుకు ఇటీవలి కాలంలో కొన్ని కుట్రలు జరిగినా ప్రత్యర్థులు ఆశించిన ఫలితం రాలేదు. అశోక్ అన్నయ్య పూసపాటి ఆనంద గజపతి రాజు కుమార్తె సంచయితను అస్త్రంగా చేసుకుని ఆయనపై దాడికి దిగారు.అశోక్ ను మాన్సాస్ నుంచి వెళ్లగొట్టేందుకు అమలు చేసినట్టుగా పేర్కొన్న వ్యూహాలకు స్థానికంగా ఉన్న ఆయన ప్రత్యర్థులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా స్వస్థలానికి దూరంగా ఎక్కడో ఉంటున్న సంచయితను విజయనగరానికి దిగుమతి చేసి హైడ్రామా నడుమ ఆమెను మాన్సాస్ పీఠంపై కూర్చోబెట్టి అశోక్ గజపతిని పదవీచ్యుతుడిని చేసి సంబరాలు చేసుకున్నారు. ఆ సందర్భంలోనే అశోక్ కు వ్యతిరేకంగా పావులు కడపడంలో దిగువ స్థాయిలో కీలక పాత్ర పోషించిన కొన్ని తలకాయలు బహిరంగంగానే తెరపై ప్రత్యక్షమయ్యాయి. అలా సంచయితను అడ్డం పెట్టుకొని అశోక్ పై కక్ష తీర్చుకోవడమే గాక పనిలో పనిగా మాన్సాస్ చేతిలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను కూడా తమ పడగ నీడలోకి తెచ్చుకునేందుకు ఆ శక్తులు ప్రయత్నించాయి. అయితే తామొకటి తలస్తే అన్న చందాన న్యాయపోరాటంలో నెగ్గిన అశోక్ గజపతి రాజు మళ్లీ మాన్సాస్ సింహాసనాన్ని అధిరోహించారు.అప్పటి నుంచి  ప్రత్యర్థులు రూటు మార్చి ప్లాన్ టూ..త్రీ.. ఫోర్ ఇత్యాదులు అమలు చేయడం ప్రారంభించారు. అలాంటి కార్యక్రమాల్లో భాగంగా మాన్సాస్ వ్యవహారాలపై దృష్టి పెంచారు..ఎప్పటి నుంచో మాన్సాస్ లో జరుగుతున్న లావాదేవీలపై ఆరా తీసే కార్యక్రమంలో కొన్ని బృందాలు నిమగ్నమై ఉన్నాయి. వాటి పరిశీలన,పరిశోధనల్లో కూడా అశోక్ కు వ్యతిరేకంగా ఎటువంటి సమాచారం దొరక్కపోవడంతో ఇతర ప్రణాళికలను అమలు చెయ్యడం ప్రారంభించారు.సింహాచలం,రామతీర్థం ఆలయాల్లో అవమానాలు..మాస్క్ లేకుండా పది మందిలోకి వస్తున్నారంటూ కేసులు తదితర వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి.మాన్సాస్ ఉద్యోగులు కొందరు చైర్మన్ తో మాట్లాడ్డానికి ఆయన ఛాంబర్ లోకి వస్తే ఎవరికీ మాస్కులు లేవంటూ కేసు నమోదైంది. అది కూడా మన్సాస్ లోని ఓ వ్యక్తి ఫిర్యాదుపైనే జరిగిందట..ఇది కొంత విడ్డూరంగానే జనాలకు అనిపించింది..వినిపించింది..కనిపించింది. ఇదంతా అజ్ఞాత శక్తుల ప్రోద్బలంతోనే జరిగిందనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.ఈ పరిణామాలు అశోక్ అభిమానులకే కాదు సాధారణ ప్రజలకు కూడా రుచించడం లేదు.అధికార పక్షం అనవసరంగా అశోక్ విషయంలో అతిగా వ్యవహరిస్తూ అభాసు పాలవుతోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.ఆయనపై చెయ్యడానికి బలమైన ఆధారాలతో కూడిన ఆరోపణలు లేకపోవడంతో ఇలాంటి చవకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారనే వ్యాఖ్యానాలు మిన్నంటాయి. ఈ తరహా తెరచాటు,బ్యాక్ డోర్ దాడులు ఇంకా జరుగుతాయనే అనుమానాలు సాధారణ ప్రజలే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎలాగైనా అశోక్ ను ఏదో ఒక కేసులో ఇరికించి ఆయన ఎన్నో సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఇమేజ్ ను ధ్వంసం చేసేందుకు పెద్ద స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయనేది ఇప్పుడు సర్వత్రా వినవస్తున్న అభిప్రాయం. అసలు ఈ ఎపిసోడ్ కు ఎక్కడ.ఎలా..ఏ నేపథ్యంలో బీజాలు పడ్డాయి..వెనక ఎవరు..ఏ ఉద్దేశంతో ఉండి కథ నడిపిస్తున్నారన్న అత్యంత ఆసక్తికర కథనం మరోసారి..త్వరలో.. ఈఎస్కే..