బెంగాల్ బీజేపీలో సువేందు కలకలం..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కథ ముగిసి చాల కాలమే అయింది. ఆ ఎన్నికల్లో బీజీపీ సీట్ల సంఖ్య పెరిగినా, ఆశించిన అధికారం మాత్రం అందనంత దూరంలోనే ఆగిపోయింది. అయితే, ఇంతకాలం తర్వాత, బీజేపీ శాసన సభా పక్ష నేత సువేందు అధికారి, పార్టీ ఓటమికి పార్టీ నాయకుల అతి విశ్వాసమే కారణమని విమర్శించారు. పార్టీ 170-180 సీట్లు సాధించి తీరుతుందంటూ పలువురు నేతలు అతిగా విశ్వసించారని,అదే బిజెపి ఓటమికి కారణమైందని మండిపడ్డారు. పూరబ్ మిడ్నాపూర్ జిల్లాలోని చండీపూర్ ప్రాంతంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మొదటి,రెండో దశలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అతి విశ్వాసానికి పోకుండా కష్టపడి పనిచేశారు. ఆ తర్వాత అతి విశ్వాసానికి పోయి, బాధ్యలు విస్మరించడంతో ఆశించిన ఫలితాలు అందుకోలేక పోయామని అన్నారు.
అది నిజమే కావచ్చును, అయితే, ఎన్నికలకు ముందు తృణమూల్ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి, ఇప్పుడు ఈ పాత గాయాన్ని ఎందుకు కెలుకు తున్నారు? దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు, ఇప్పుడు ఇంతకాలం తర్వాత ఈ విశ్లేషణలు ఎందుకు చేస్తున్నారు? అనేది బెంగాల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఉద్దేశం అతి విశ్వాసం అనర్ధదాయకం అని చెప్పడమేనా? లేక .. ఇంకేదోనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నిజానికి, బెంగాల్ ఎన్నికల విషయంలో స్థానిక నాయకుల కంటే జాతీయ నాయకత్వమే అతి విశ్వాసానికి పోయింది. ముఖ్యంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీకి రెండు వందలకు పైగా సీట్లు వస్తాయని ఆయన పాల్గొన్న ప్రతి సభలో, ప్రతి సమావేశంలో, విలేకరుల సమావేశాలలో, ఇంటర్వ్యూలలో ఒకటికి నాలుగు సార్లు, చెపుతూ వచ్చారు. బెంగాల్లో గెలిచేశామనే ధీమాను వ్యక్తం చేశారు. చివరకు అమిత్ షా లెక్క తప్పుతుందని, కమల దళం నెంబర్ వంద దాటదని, ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్, కూడా ఆయనకే సవాలు విసిరారు. ఆయన చెప్పినట్లుగానే, బీజేపీ బలం 70 దగ్గరే ఆగిపోయింది.అప్పట్లో అమిత్ షా, పరిస్థితి, మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు వంవ్వినందుకు అన్నట్లు అయిందని విశ్లేషణలు వినిపించాయి.
సరే, ఆదాల ఉంటే సువేందు అధికారి ఆపాత గాయాన్ని ఇప్పుడు ఎందుకు కెలుకుతున్నారు. ఆయన ఎవరిని తప్పు పడుతున్నారు... స్థానిక నాయకుల బుజాల మీద తుపాకి పెట్టి, జాతీయ నాయకత్వం మీద తూటాలు పేలుస్తున్నారా? అయితే, అయన ఉద్దేశం ఏమిటి ? సొంత గూటికి చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారా? ఇలా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలకు మందు సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నుండి బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. సువేందు వ్యాఖ్యలపై టిఎంసి అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ ఘాటుగా స్పందించారు. బిజెపి నేతలు వాస్తవాలకు విరుద్ధంగా తప్పుడు విశ్వాసాలతో ఊహల్లోనే విహరిస్తుంటారని అన్నారు. సువేందు అధికారి ఎవరినో ఎందుకు తప్పు పడుతున్నారు.. ఆయన కూడా 180 సీట్లు సాధిస్తామంటూ పలుసార్లు ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు.అయితే, ఎన్నికల సమయంలో గెలుపు మీద ధీమా వ్యక్తం చేయడం తప్పు కాదని,అది అన్ని పార్టీలు అందరు నాయకులు చేసేదేనని, అయితే ఈ సమయంలో సువేందు అధికారి అదేదో పెద్ద నేరం అన్నట్లు ప్రకటించడమే ఆశ్చర్య పరుస్తోందని, అయన మనసులో ఎదో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేస్నాట్లు ఉందని రాజకీయ పరిశీలకులు బావిస్తున్నారు.