రియల్ లీడర్ కేటీఆర్.. డౌట్ ఉంటే ఈ రియల్ ఎపిసోడ్ చూడండి...
దశాబ్దం కిందటి విషయం. పశ్చిమ బెంగాల్‌లో నానో కార్ల తయారీ ప్లాంట్ కోసం టాటా కంపెనీ సిద్ధమవుతోంది. సింగూర్ ప్రాంతంలో వెయ్యి ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే, వ్యవసాయ భూముల్లో పరిశ్రమ ఏర్పాటు వద్దంటూ అప్పటి ప్రతిపక్ష నేత మమతా బెనర్జీ పెద్ద ఎత్తున ఉద్యమించారు. టాటా నానో ప్లాంట్‌కు వ్యతిరేకంగా రైతులతో కలిసి పోరాడారు. విసిగిపోయిన.. టాటా కంపెనీ ఛైర్మన్ రతన్‌టాటా.. 2008, అక్టోబర్ 3న బెంగాల్ సీఎం బుద్దదేవ్ భట్టాచార్యను కలిసి.. తాము రాష్ట్రం నుంచి వైదొలుగుతున్నామని ప్రకటించారు. రతన్‌టాటా ఇలా స్టేట్‌మెంట్ ఇచ్చారో లేదో.. ఆయన మొబైల్ ఫోన్‌కు ఓ SMS వచ్చింది. ఆ మెసేజ్ ఓపెన్ చేస్తే.. అందులో "WELCOME" అని రాసుంది. అంతే, రతన్ టాటా కళ్లల్లో ఆనందం. ఇంతకీ ఆయనకు వెల్‌కమ్ అని మెసేజ్ పంపించింది మరెవరో కాదు.. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ. ఇక అంతే. కట్ చేస్తే.. నాలుగు రోజుల వ్యవధిలో.. 2008, అక్టోబర్ 7న రతన్‌టాటా మరో ప్రకటన చేశారు. టాటా నానో కార్ల తయారీ ప్లాంట్‌ను గుజరాత్‌లోని సనంద్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. జస్ట్, ఓ సింపుల్ మెసేజ్‌తో వందల కోట్ల పెట్టుబడిని గుజరాత్‌కు తీసుకొచ్చిన మోదీ పనితీరును అప్పట్లో అంతా మెచ్చుకున్నారు. ఆయన టైమింగ్, కమిట్‌మెంట్‌ను కార్పొరేట్ వర్గాలు అప్రిషియేట్ చేశాయి.
సేమ్ టూ సేమ్.. అలాంటి ఘటనే తెలంగాణలోనూ జరిగింది. అప్పటి గుజరాత్ సీఎం మోదీలానే, ఇప్పటి తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైతం వెయ్యి కోట్ల పరిశ్రమను తన నాయకత్వ లక్షణాలతో సాధించారు. ఆ ఎపిసోడ్ టాటా నానో ప్లాంట్ తరలింపుకంటే కూడా డ్రమెటిక్‌గా నడిచింది. ఆ ఎపిసోడ్‌లో భాగస్వామి అయిన ఐటీ డైరెక్టర్ దిలీప్ కొణతం చెప్పిన వివరాల ప్రకారం...
ఇటీవల కిటెక్స్ కంపెనీ తెలంగాణకు వచ్చిన తీరు పారిశ్రామిక, రాజకీయ వర్గాల్లో సంచలనంగా నిలిచింది. కిటెక్స్ రాకతో వెయ్యి కోట్ల పెట్టుబడి, 4వేల ఉద్యోగాలు వస్తాయి. అయితే, కిటెక్స్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడి పెట్టడం వెనక మంత్రి కేటీఆర్ చేసిన కృషి, జరిగిన అత్యంత నాటకీయ పరిణామాలు తెలిస్తే.. కేటీఆర్ పనితీరును అభినందించాల్సిందే.
కిటెక్స్ గ్రూప్ సుమారు 50 ఏళ్లుగా కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. కంపెనీ విస్తరణలో భాగంగా ఇటీవలే రూ.3,500 వేల కోట్లతో ఒక మెగా ప్రాజెక్టును ప్రకటించింది. అయితే, తాజాగా కేరళ వామపక్ష ప్రభుత్వానికి, కిటెక్స్ కంపెనీకి మధ్య విభేదాలు వచ్చాయి. కేరళ ప్రభుత్వం అనేక విభాగాల అధికారులతో సోదాలు చేయిస్తూ, తమను అనవసరంగా వేధిస్తున్నదని కంపెనీ ఎండీ జాకబ్ అసహనం వ్యక్తం చేశారు. కేరళలో పెట్టాలనుకుంటున్న పెట్టుబడిని ఉపసంహరించుకుంటున్నట్టు.. ఇతర రాష్ట్రాలకు తరలిస్తామని ప్రకటించారు.
ఈ విషయం తెలియగానే అనేక రాష్ట్రాలు కిటెక్స్ అధిపతి జాకబ్‌ను సంప్రదించాయి. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించాయి. కర్ణాటక సీఎం యడ్యూరప్ప స్వయంగా జాకబ్‌తో మాట్లాడారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సహా దాదాపు 10 స్టేట్స్ జాకబ్‌ను రిక్వెస్ట్ చేశాయి. అందులో తెలంగాణ స్టేట్ కూడా ఉంది. పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ మొదట జాకబ్‌తో మాట్లాడారు. తర్వాత మంత్రి కేటీఆర్ ఫోన్ చేశారు. కానీ, కిటెక్స్ యాజమాన్యం తెలంగాణపై అంతగా సానుకూలత కనబరచలేదట.
ఇక్కడే కేటీఆర్ తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. ‘మీరేమీ ముందే మాకు నిర్ణయం చెప్పనక్కర్లేదు. ఒక్కసారి తెలంగాణకి రండి. ఇక్కడి పారిశ్రామిక వాతావరణం చూడండి. మా ప్రభుత్వం ఎంత ప్రోయాక్టివ్‌గా ఉందో గమనించండి. తర్వాతే మీ నిర్ణయం ప్రకటించండి’ అంటూ కేటీఆర్ జాకబ్‌ను ఆహ్వానించారు. టెక్స్‌టైల్స్ తమ ప్రభుత్వ ప్రాధాన్య రంగాల్లో ఒకటని నచ్చజెప్పారు. అప్పటికీ జాకబ్ పెద్దగా ఆసక్తి చూపలేదట. “పెట్టుబడి సంగతి తర్వాత. మా ప్రభుత్వం ఎలా పని చేస్తున్నదో చూడడానికైనా తెలంగాణకు రండి. మీ బృందం కోసం నేను ప్రత్యేక విమానం పంపిస్తున్నా. డేట్స్ చెప్పండి” అని జాకబ్‌కు చెప్పారట కేటీఆర్!
తమ కోసం ప్రత్యేక విమానం పంపిస్తాననడంతో ఆశ్చర్యపోవడం జాకబ్ వంతైంది. ఒక పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ప్రత్యేక విమానాన్ని పంపించడం ఏమిటని అనుకున్నారు కాబోలు, వెంటనే తెలంగాణకు రావడానికి ఒప్పేసుకున్నారు. “సరే చూడడానికి వస్తా. నిర్ణయం తర్వాత చెబుతా” అంటూ జాకబ్ అంగీకరించారట. కేటీఆర్ వెంటనే విమానం అరేంజ్ చేశారట.
ప్రభుత్వం పంపించిన ప్రత్యేక విమానంలో గత శుక్రవారం ఉదయం జాకబ్ బృందం హైదరాబాద్‌కు వచ్చింది. కాకతీయ ఐటీసీ హోటల్‌లో సమావేశం జరిగింది. తెలంగాణ అంటే ఏమిటి? ఐపాస్‌తో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఎలా లభిస్తున్నాయి? 24 గంటల కరెంటు ఎలా అందుబాటులో ఉంది? పరిశ్రమలకు నీళ్ల లభ్యత ఎలా ఉంది? తదితర అంశాలపై కేటీఆర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తమ కంపెనీ విశేషాల గురించి జాకబ్ బృందం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది.
“వచ్చిన వాళ్లు ఎలాగూ వచ్చారు. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేశాం. దాన్ని ఓసారి చూడండి” అంటూ కేటీఆర్.. కిటెక్స్ టీమ్‌కు ఆఫర్ చేశారట. వరంగల్ వెళ్లి వచ్చేంత సమయం లేదని జాకబ్ బృందం అనగా.. “టైం గురించి మీకెందుకు? హెలికాప్టర్ అరేంజ్ చేస్తాం.. వెంటనే వెళ్లి రావొచ్చు” అంటూ కేటీఆర్ అనడంతో మరోసారి షాక్ అయ్యారట జాకబ్. అప్పటికప్పుడు హెలికాప్టర్‌లో కిటెక్స్ బృందం వరంగల్‌కు వెళ్లడం.. అక్కడి అధికారులు మెగా పార్క్‌ను దగ్గరుండి చూపించి.. దాని విశేషాలను వివరించడంతో.. ఆ ఏర్పాట్లు చూసిన జాకబ్ బృందం సంతృత్తి చెందిందట. సాయంత్రానికళ్లా హెలికాప్టర్లోనే హైదరాబాద్ తిరిగివచ్చేసి.. కేటీఆర్‌ను మరోసారి కలుస్తామన్నారట కిటెక్స్ ప్రతినిధులు.
ప్రగతి భవన్ వెళ్లిన కిటెక్స్ బృందం.. తెలంగాణ ప్రభుత్వాన్ని, కేటీఆర్‌ను ప్రశంసించి.. అప్పటికప్పుడే తమ నిర్ణయాన్ని చెప్పేసింది. తెలంగాణలో తాము వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులూ పెడతామని హామీ ఇచ్చింది. ఏ నిర్ణయమూ లేకుండా తెలంగాణ వచ్చిన కిటెక్స్ బృందాన్ని.. గంటల్లోనే నిర్ణయం తీసుకునేలా చేసిన కేటీఆర్ పనితీరును అంతా ఫిదా అవుతున్నారు. కిటెక్స్ పెట్టుబడి విలువ.. వెయ్యికోట్లు, నాలుగు వేల ఉద్యోగాలు. కేటీఆర్ సామర్థ్యానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి?