ముంచుకొస్తున్న థర్డ్ వేవ్.. తెలంగాణలో డేంజర్ బెల్స్
దేశం నుంచి కరోనా వెళ్ళిపోలేదు.ఈరోజు వరకు దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా ‘కరోనా రహిత రాష్ట్రం’ గా ప్రకటించుకోలేదు. అంటే, అన్ని రాష్ట్రాలలోనూ ఎక్కువ తక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. చాలా వరకు రాష్ట్రాలలో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తెలంగాణలో తాజాగా ఆదివారం ఐదు వందల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. ముగ్గురు చనిపోయారు. కానీ, అన్ని రాష్ట్రాలలో ఒకేలా లేదు. రాష్ట్రాలలో కొన్నికేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరుగుతోంది.
అయితే దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులను గమనిస్తే, థర్డ్ వేవ్ కు తోరణాలు, బ్యానర్లు కట్టి స్వాగతం పలుకుతున్నట్లు ఉందని డాక్టర్లు, వైద్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, పాలకులు, రాజకీయ నాయకులు మాత్రం కరోనా కథ ముగిసిపోయిందనే భ్రమల్లో ఉన్నారు అనిపిస్తోంది. కరోనా ఉదృతి తగ్గిన నేపధ్యంలో ప్రజా జీవనం దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేసింది.అయినా, మహమ్మారి ఇంకా పూర్తిగా పోలేదు, మరో వేవ్ వచ్చేందుకు సిద్దంగా ఉందని అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, అదే విధంగా ఇతర అన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని గొంతులు చించుకుంటున్నారు. అయినా, ప్రజలు చాలావరకు ప్రభుత్వ హెచ్చరికలను పెడ చెవిన పెడుతున్నారు. మహమ్మారి లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు తీసేశారు. భౌతిక దూరం మాటే మరిచి పోయారు. ఇక వ్యక్తిగత పరిశుభ్రత ఇతర నియమాల గురించి అయితే చెప్పనే అక్కరలేదు. టీకా తీసుకున్నామన్న అతి ధీమానో ఏమో ... కొవిడ్ భయం కొట్టుకు పోయింది. టీకా తీసుకోవడం విషయంలోనూ తొందరేముందిలే మెల్లిగా ఎప్పుడో వీలైన నప్పుడు చూద్దాం అన్న ధోరణి వ్యక్తమవుతోంది. ఈ విషయంలో రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్య జనాలే కాదు, అన్ని వర్గాల ప్రజలు ఒకే విధంగా ప్రవర్తిస్తున్నారు.
రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల నాయకులు ఎలాంటి సంకోచం లేకుండా సామూహిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ తమ దత్తత గ్రామం వాసాలమర్రికి వెళ్లారు. సంహపక్తి భోజనాలు చేశారు. బహిరంగ సభలో కరోనాపై జోకులు వేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత నిఅజమో కాదో కానీ, సంహపక్తి భోజనాలలో ముఖ్యమంత్రి పక్కన కూర్చున్న మహిళకు కరోనా సోకిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మరో వంక పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొంటున్న మంత్రులు, ఇతర్ ప్రజా ప్రతినిధులు, మాస్కులు లేకుండానే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎవరికి వారు, కరోనా అనేది ఒకటుందని, ఈ మహమ్మారి కొన్ని లక్షల ప్రాణాలు బలితీసుకుందనే మాటే మర్చి పోయారు. కరోనా స్పృహ లేకుండా ఎప్పుడో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే పరుగులు తీస్తున్నారు. హుజురాబాద్’ లో ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో ఏమో కానీ, అక్కడ అన్ని పార్టీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ కొద్ది రోజులుగా హుజూరాబాద్‌లో ఎన్నికల పాద యాత్ర నిర్వహిస్తున్నరు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొంటున్నారు. కరీంనగర్ జిల్లాల్లో నమోదయ్యే కేసుల్లో 30 శాతం హుజూరాబాద్ నుంచే వస్తున్నాయి, అంటే ఈటల పాదయాత్ర ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చును. ఇదలా ఉంటే బీజీపే అధ్యక్షడు బండి సంజయ్,కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల, తీన్ మార్ మల్లన్న ... ఇలా చాలా మంది నాయకులు పాద యాత్రలకు సిద్ధమువుతున్నారు.
నిజానికి, ఈ ఏడాది అక్టోబరు-నవంబరు నాటికి థర్డ్ వేవ్ వస్తుందని వైద్య శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అయితే పరిస్థితులు ఇలాగే ఉంటే అందాక ఆగదని, మరో వారం పదిరోజుల్లోనే థర్డ్‌వేవ్ తలుపులు తడుతుందని వైద్యులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవంక బోనాల పండగ సందర్భంగా ఆదివారాలు జనాలు గుమిగూడుతున్నారు. భక్తుల్లో ఎక్కువ శాతం మంది మాస్క్‌లు ధరించడం లేదు. ఇక మార్కెట్ల విషయం అయితే చెప్పనే అక్కరలేదు. నిజానికి రాష్ట్రంలో గత వరమా పదిరోజులుగా ఆస్పత్రుల్లో కొవిడ్ ఇన్‌పేషెంట్లు పెరుగుతున్నాయని గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వ బులెటిన్ ప్రకారమే ఆస్పత్రుల్లో శనివారం ఆక్సిజన్‌పై 1,728 మంది రోగులుండగా, ఆదివారం సాయంత్రానికి ఆ సంఖ్య 1,746కు పెరిగింది. ఐసీయూ పై ఉన్నవారి సంఖ్య 1,324 నుంచి 1,328కి చేరింది. హైదరాబాద్‌లోని అధిక శాతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో 15-20 మంది చికిత్స పొందుతున్నారు.కొన్ని ఆసుపత్రులలో ఆ సఖ్య 80 వరకు కూడా ఉందని సమాచారం. గాంధీ ఆస్పత్రిలో ఈ రోజుకు కూడా రోజుకు 20-30 కొత్త కేసులు నమోదవుతున్నాయి. సో...మహమ్మారి పోలేదు. కాబట్టి ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ..థర్డ్ వేవ్ ఇంకెంతో దూరంలో లేదు ... తస్మాత్ జాగ్రత్త అని అధికారాలు హెచ్చరిస్తున్నారు.