రాజీనామాకు యడ్డీ రెడీ.. ఏపీ గవర్నర్ ఆయనేనా ?
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, ముఖ్యమంత్రి గద్దె దిగేందుకు సిద్దమయ్యారు. ఈ నెల (జులై) 26 తేదీతో ఆయన చివరిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు సంవత్సరాలు పుతవుతాయి.ఆ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు విందు లాంటి కార్యక్రమం ఏదో ఏర్పాటు చేశారు.ఆ తర్వాత పార్టీ అధిష్ఠానం ఎప్పుడంటే అప్పుడు రాజీనామా చేస్తానని ఆయన స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు. జులై 26 తర్వాత పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అయన ప్రకటించారు.
తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని,, పార్టీ అభివృద్ధే కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని యడ్యూరప్ప స్పష్టం చేశారు. అంతేకాకుండా, 75 సంవత్సరాల వయసు నిండిన ఎవ్వరినీ దేశంలో ఎక్కడా అధికారంలో కొనసాగనీయ లేదని, తనకు మాత్రమే ఆ అవకాశం దక్కిందని యడ్యూరప్ప(77) మోడీ, షా, నడ్డా నాయక త్రయానికి కృతజ్ఞతలు కూడా చెప్పారు. అయితే పార్టీ అధిష్ఠానం ఆయనకు, పార్టీ బాధ్యతలు అప్పగిస్తుందా, ఏపీ రాజ్ భవన్’కు పంపుతుందా అనేది ఇంకా తేలవలసి వుంది.
యద్యూరప్పను సగౌరవంగా సాగనంపేందుకు, చాలా చాలా చెమటోడ్చిన బీజేపీ అధిష్ఠానం, ఆయన వారసుని ఎన్నికకు కూడా అంతే కష్టపడవలసి ఉంటుందని పార్టీ నాయకులు అంటున్నారు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, యడ్యూరప్ప నిస్సందేహంగా రాష్ట్రంలో ప్రజాదరణ ఉన్న పెద్ద నాయకుడు. అంతే కాదు, దక్షిణాదిలో బీజేపీని అధికారంలోకి తెచ్చిన ఘనత కూడా నిస్సందేహంగా యద్యూరప్పకే దక్కుతుందని, ఆస్థాయి నాయకుడు ఇంకెవరు లేరని పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు.
పార్టీ అధిష్ఠానం కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని భావిస్తోందని, అయితే, రాష్ట్ర జనాభాలో 16 శాతం ఉన్న, బీజేపీ ప్రధాన ఓటు బ్యాంక్, యడ్యూరప్పకు పూర్తి పట్టున్న. లింగాయత్ కమ్యూనిటీని కాదనే పరిస్థితి లేదన్న మాట కూడా వినవస్తోంది. యడ్యూరప్ప, తాను తన వారసుని ఎంపిక చేయనని, ముఖ్యమంత్రి పదవికి ఎవరి పేరును తాను సూచించనని అన్నారు. అయితే,పార్టీ పునాదులైన లింగాయత్ కమ్యూనిటీపై పూర్తి పట్టున్న ఆయన్ని కాదని బీజేపీ కొత్త ప్రయోగం చేస్తుందా అనేది అనుమానమే అంటున్నారు. అయితే పార్టీ ఢిల్లీ పెద్దలు, ‘సర్ప్రైజ్’ అభ్యర్ధిని తెరమీదకు తెస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవంక పార్టీ అధినాయకత్వం మాత్రం మూడవ కంటికి తెలియకుండా వారసుని ఎంపిక కసరత్తును చాలా గోప్యంగా సాగిస్తోంది.
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి వీరే అంటూ చాలా పేర్లే వినిపిస్తున్నాయి. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు, కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి (బ్రాహ్మణ),బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి (వక్కలింగ) పేర్లు ముందువరసలో ఉన్నాయి. ఈ ఇద్దరు కాకుండా, అనుకోకుండా, ఎంపీ, ఆశించకుండా బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు అయి కూర్చున్న తేజస్వీ సూర్య సహా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీఎల్ సంతోష్, అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే, గనుల శాఖ మంత్రి మురుగేశ్ నిరానీ, ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ పేర్లు వినిపిస్తున్నాయి. అదలా ఉంటే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వారు, తమ పేరు మీడియాలో వస్తే సర్ప్రైజ్ ఎలిమెంట్ తప్పిపోయి, ఛాన్స్ మిస్ అవుతామని తమ పేరు మీడియాలో రాకూడదని కోరుకుంటున్నారని, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీని బట్టి చూస్తే, ఉత్తరప్రదేశ్, అస్సాం,ఉత్తరాఖండ్’ తరహాలలో బీజీపీ అధిష్ఠానం నిజంగానే ఇంతవరకు వినిపించని పేరును పైకి తీసినా ఆశ్చర్య పోనవసరం లేదని ... విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మరోవైపు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ కార్యదర్శి సీటీ రవి కార్యాలయం గురువారం సందడిగా కనిపించింది. కర్ణాటక నాయకులు అనేక మంది ఆయనను కలిశారు. దీంతో ఆయనే కాబోయే కర్ణాటక సీఎం అన్న పుకారు జోరుగా షికారు చేసింది. అలాగే కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి కార్యలయంలోనూ సందడి కనిపించింది. అయితే, ఇందుకు సంబంధించి మీడియా అడిగినప్పుడు రవి , జోషి ఇద్దరూ అలాంటిదేమీ లేదని ముక్తసరిగా చెప్పేసి తప్పించుకున్నారు. అయితే కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది తేలాలంటే, ఇంకొంత నిరీక్షణ తప్పదంటున్నారు. అంతేకాదు, కాదు .. యడ్యూరప్ప మరోసారి ఢిల్లీ వెళ్లోచ్చిన తర్వాతనే, ఆయన భవిష్యత్ (పార్టీ బాధ్యతా, గవర్నర్ పోస్ట్), అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నది తేలుతుందని .. అంతవరకు కర్నాటకం నడుస్తూనే ఉంటుందని అంటున్నారు.