సోనియా గాంధీ కొత్త రికార్డ్ ..అధ్యక్ష పదవిలో 20 ఏళ్లు..
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మరో చరిత్రను సృష్టించారు. ఇంతవరకు, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అత్యధిక కాలం (19ఏళ్ళు) అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన రికార్డును సొంతం చేసుకున్న ఆమె పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా రెండేళ్ళు పూర్తి చేసుకుని మరో రికార్డ్ సృష్టించారు. సోనియా గాంధీ 2019 ఆగష్టు 10 వ తేదీన కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఆగష్టు 10తో ఆమె తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టి రెండేళ్ళు పూర్తవుతాయి. ఆ విధంగా కాంగ్రెస్ చరిత్రలో ఆమె మరో రికార్డు నమోదు చేశారు.
నిజానికి, కాంగ్రెస్ పార్టీకి గతంలో తాత్కాలిక అధ్యక్షుల అవసరం ఏర్పడలేదు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితి అనంతరం 1978లో ఇందిరాగాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత, మద్యలో ఒక సీతారం కేసరి (1996-98) ఒక పీవీ నరసింహ రావు,(1992-94) వంటి వారు కొద్దికాలం పార్టీ అధ్యక్షులుగా ఉన్నా,1998లో సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత, కాంగ్రెస్ అధ్యక్ష పదవి గాంధీ నెహ్రూ కుటుంబం గడప దాటలేదు. ఆ భారాన్ని, బాధ్యతను సోనియా గాంధీ 19 ఏళ్ల పార్టీ మోస్తునే వచ్చారు. 19 ఏళ్ల కాలంలో వరసగా రెండు సార్లు (2004, 2009) కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో విజయపథంలో నడిపించిన సోనియా గాంధీ, 2017 లో వయోభారం, అనారోగ్యం కారణంగా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే, ఆమె నుంచి అధ్యక్ష బాధ్యతలు అందుకున్న ఆమె కుమారడు, రాహుల గాంధీ, 2019 ఎన్నికల ఓటమి తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తప్పు కున్నారు. ఎవరు ఎన్ని విధాలా చెప్పినా, ఎంతగా వేడుకున్నా ఆయన అధ్యక్ష పదివిలో కొనసాగేందుకు ససేమిరా అన్నారు. అంతే కాదు , నెహ్రు గాంధీ కుటుంబం వెలుపలి వ్యక్తిని పార్టీ అధ్యక్షునిగా ఎన్నికోవాలని రాహుల్ గాంధీ సూచించారు.అయితే, అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, సుమారు ఆరేడు నెలల అనంతరం, అనివార్య పరిస్తితులలో 2019 ఆగష్టు 10 వతేదీన మరోమారు,సోనియా గాంధీ తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
అయితే, 70 ఏళ్ళు పైబడిన వయసు, అనారోగ్యం కారణంగా ఆమె పూర్తి స్థాయిలో బాధ్యతలను నిర్వర్తించలేక పోతున్నారు. మరో వంక ఆరు నెలలులో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావించినా అది కూడా ఇంతవరకు ముడి పడలేదు. దాంతో తాత్కాలిక అధ్యక్షురాలిగా ఆమె ఇంకా కొనసాగుతున్నారు. ఇప్పటికి రెండేళ్ళు పూర్తి చేసుకుని కొత్త రికార్డ్ సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ కోడా నిండా రెండేళ్ళు పూర్తి స్థాయి అధ్యక్షుడు లేని పార్టీ గా మనుగడ సాగించి మరో రికార్డ్ సాధించింది.ఒకప్పుడు రాజకీయాల పట్ల అంతకా ఆసక్తి చూపని సోనియా గాంధీ, 1998లో అప్పటి పార్టీ అధ్యక్షుడు సీతారం కేసరి నుంచి పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఏకబీకిన 19 సంవత్సరాలు పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగారు. చరిత్రను సృష్టించారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీనే కాదు, కాంగ్రెస్ పార్టీ 135 ఏళ్ల చరిత్రలో ఎవరూ కూడా అంచలంచెలుగా కూడా ఇంత సుదీర్ఘ కాలం పార్టీ అధ్యక్ష పదవిలో లేరు. ఇదొక చరిత్ర. ఆ చరిత్రను సోనియా సృష్టించారు.
సోనియా సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు కేంద్రంలో, సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అనేక రాష్ట్రాలలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. కేసరి సమయంలో, అయిపొయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ హయంలో పునర్జీవనం పొందింది.అయిన ఆమె, ప్రధాని పదవిని ఆశించలేదు. ఆమె ప్రదాని పదవిని ఎందుకు వద్దనుకున్నారు అనే విషయంలో విభిన్న అభిప్రాయాలు ఉన్నా, ఆమె అభిమానులు మాత్రం ఆమె ఆ పదవిని త్యాగం చేశారని అంటారు. అయితే, మన్మోహన్ సింగ్ ప్రధానిగా నియమించినా సోనియా గాంధీ యూపీఏ చైర్ పర్సన్’గా , నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యక్షురాలిగా, లోక్ సభలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా ఇలా అనేక హోదాలలో ఆమె ప్రభుత్వ పాలనలో, విధాన నిర్ణయాలలో కీలక పాటను పోషించారు. మహత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం వంటి యూపీఏ ప్రభుత్వ కీలక నిర్ణయాలు సోనియా గాంధీ అలోకాహనల నుంచి పుట్టినవే అంటారు.
సోనియా గాంధీ హయాంలోనే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరగని ఘోర ఓటమినీ చవిచూసింది. సోనియా గాంధీ సారధ్యంలోనే 2014 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కేవల 44 లోక్ సభ స్థానలకు పరిమితం అయింది.అలాగే, రాహుల్ గాంధీ సారధ్యంలో పోరాడిన 2019 ఎన్నికల్లోని కాంగ్రెస్ పార్టీ మూడంకెల సఖ్యకు చేరుకోలేక, 52 స్థానాలకే పరిమితం అయింది. అయితే, సోనియా గాంధీ 74 ఏళ్ల వయసులో (1946 డిసెంబర్ 9 న ఆమె ఇటలీలో జన్మిచారు) కూడా, కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు, ఆయనని ఆ పదవిలో చూసేందుకు సోనియా గాంధీ, ఇప్పటికీ పరితపిస్తున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పునర్జీవనం పొందడం సాధ్యం కాదని కాదు కానీ, అంత తేలికగా అయ్యే పని కాదని అంటున్నారు. గుర్రాన్ని రేవు వరకు తీసుకు పోవచ్చును కానీ, నీరు తాగించడం సాధ్యం కాదు. అల్లాగే, స్వతహాగా అధికార దాహం లేని రాహుల్ గాంధీ విషయం కూడా అంతే,అయిన సోనియా గాంధీ పుత్రా ప్రేమతో రాహుల్ గాంధీని ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. అదే, కాంగ్రెస్ పార్టీకి ముందడుగుకు ప్రధాన అవరోధం, అని కాంగ్రెస్ నాయకులే అంటుంటారు.
ప్రత్యర్ధి పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, బీజేపీ, అన్నివిధాలా శక్తి వంతమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఇంచుమించిగా 30 ఏళ్లకు పైగా సాగిన సంకీర్ణ యుగానికి 2014లో చుక్క పెట్టిన బీజేపీ, 2019 మరోమారు, మరింత సంఖ్యా బలం (303 సీట్లు)తో రెండవసారి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా సంకీర్ణమే అయినా వాస్తవంలో కాదు. అలాగే, అర్హిక వనరులు, సంస్థాగత నిర్మాణం, నాయకత్వ బలం ఇలా అనేక విషయాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ చాలా చాలా ముందుంది. సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగిన కాలంలో అద్వానీ మొదలు జేపీ నడ్డా వరకు కనీసం పదిమంది అధ్యక్షులు మారారు. ఇలా ఒకే వ్యక్తీ నాయకత్వం, ఒకే కుటుంబ నాయకత్వం కొనసాగడం ఒక విధంగా మంచిదే అయినా, మరో రకంగా అదే అనర్ధంగానూ మారుతుందని అంటారు. కాంగ్రెస్ పార్టీ క్రమానుగతి పతనానికి, కుటుంబ వారసత్వ పార్టీగా ముద్ర పడడం కూడా ఒక ప్రధాన కారణంగా భావిస్తారు. ఏమైనా, రాజకీయాలలో బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బడ్లవుతాయి. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏమిటనేది, కాలమే నిర్ణయిస్తుంది.