షర్మిలకు ఇగో.. జగన్ కు అధికార పిచ్చి! కొండా సురేఖ హాట్ కామెంట్స్..
posted on Aug 10, 2021 @ 9:40AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుల గురించి చెప్పాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది కొండా దంపతులు. వరంగల్ జిల్లాకు చెందిన కొండా మురళీ, సురేఖలు వైఎస్సార్ నమ్మిన బంటుగా ఉన్నారు. అందుకే వైఎస్ఆర్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో కొండా దంపతులు ఇబ్బందులు కూడా పడ్డారు. జగన్ కోసం ఏకంగా మంత్రి పదవికి కూడా కొండా సురేఖ రాజీనామా చేసి రోశయ్య కేబినెట్ నుంచి వైదొలిగారు సురేఖ. వైఎస్ఆర్ ఫ్యామిలీ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చుక్కలు చూపించారు. వైఎస్ షర్మిలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. అసెంబ్లీలోనూ విజయమ్మకు అండగా నిలిచారు కొండా సురేఖ. తర్వాత వైఎస్ జగన్ సమైక్య నినాదం ఎత్తుకోవడంతో ఆ పార్టీకి దూరమయ్యారు.
2014లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ.. 2018లో తిరిగి కాంగ్రెస్ లో చేరారు. కాని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత రాజకీయాల్లో అంత యాక్టివ్ గా లేరు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి వచ్చాకా మళ్లీ యాక్టివ్ అయ్యారు. గతంలో చంద్రబాబు కోసం వైఎస్సార్ ను టార్గెట్ చేస్తూ తమపైనా ఎన్నో ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచి అందరికి షాకిచ్చారు కొండా దంపతులు. అంతేకాదు తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో వైఎస్సార్ కుటుంబం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. షర్మిల-జగన్.. చివరకు విజయమ్మపైనా కీలక కామెంట్లు చేశారు.
వైఎస్ షర్మిలకు ఇగో అని కొండా సురేఖ హాట్ కామెంట్ చేశారు. ఆమె పార్టీలో చేరే ఆలోచన లేదని స్ఫష్టం చేశారు. జగన్ జైలుకు వెళ్లిన తర్వాత షర్మిల పాదయాత్ర చేసే సమయంలో తాను ఆమె తీరు చూశానని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో రాణించాలనుకునే వారికి అసలు అలాంటి స్వభావం ఉండరాదని సురేఖ చెప్పుకొచ్చారు.
ప్రజలతో సాఫ్ట్ గా .. ఫ్రెండ్లీగా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నారు కొండా సురేఖ.హైప్రోఫైల్ తో వెళితే మనుగడ కష్టమన్నారు. అన్న జగన్ అక్కడ ఒక తీరు మాట్లాడి.. చెల్లి ఇక్కడ మరో తీరు మాట్లాడుతున్నారని.. షర్మిల అధికారంకోసం వచ్చిందని సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీ నుంచి తనకు ఆహ్వానం వచ్చినా తాను ఆ పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు. విజయమ్మపై కూడా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ మీటింగ్లో ఎలా మాట్లాడాలో విజయమ్మకు తెలియదని.. పబ్లిక్ ఏమైనా పిచ్చోళ్లనుకుంటోందా? అని ఘాటుగా వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కోటరీలో కీలక నేతగా ఎదిగి, ఆ కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన కొండా సురేఖ .. తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.