సీఎం జగన్ మరోసారి పాదయాత్ర చేయాలి.. వైసీపీ నేత కీలక సలహా..
posted on Aug 10, 2021 @ 3:55PM
జగన్ పాదయాత్ర చేసి అందలమెక్కారు. రెండున్నరేళ్ల క్రితం రాష్ట్రం నలుమూలలా కాలినడకన చుట్టేశారు. నేను విన్నాను.. నేను ఉన్నానంటూ.. ప్రజలను నమ్మించారు. ఒక్క ఛాన్స్ అంటూ గద్దె నెక్కి.. జనాల నెత్తిన చెయ్యి పెట్టారు. అంతా ఆగమాగం. జగన్‌రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రం సర్వనాశనం అంటూ విపక్షం విమర్శిస్తోంది. రాజధానిని మూడు ముక్కలు చేసి.. అమరావతి అడ్రస్ గల్లంతు చేసి.. తమాషా చూస్తున్నారని మండిపడుతున్నారు. పోనీ, ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖనైనా ఏమైనా బాగు చేశారా అంటే అదీ లేదు. కూల్చివేతలు, కబ్జాలతో.. పీస్ సిటీని క్రైమ్ సిటీగా మార్చేశారని అంటున్నారు. అందుకే, విశాఖలో కబ్జాల పర్వాన్ని కళ్లారా చూసేందుకు సీఎం జగన్ ఓసారి వైజాగ్‌లో పాదయాత్ర చేస్తే బాగుంటుందంటూ సలహా ఇస్తున్నారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు.
ఏపీలో తిరోగమన పాలన నడుస్తోందంటూ ఎంపీ రఘురామ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వలసలు పెరిగిపోయాయన్నారు. ఉన్న పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచి పోతున్నాయని, రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు వచ్చే పరిస్థితి కనబడటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో కబ్జాలు పెరిగిపోయాయని.. ఒకసారి సీఎం జగన్ వైజాగ్‌లో పాదయాత్ర చేస్తే బాగుంటుందన్నారు. ఏపీలో శాంతిభద్రతలు లేవని రఘురామ ఆరోపించారు.
పాలకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్న అధికారులనూ ఓ ఆట ఆడుకున్నారు రఘురామ. రాజకీయ నాయకుల మెప్పు కోసం అధికారులు తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మించిన అంశంలో ఐఏఎస్‌లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తప్పును తప్పుగా చెప్పాలని అధికారులకు రఘురామ హితవు పలికారు. అనవసర అత్యుత్సాహం ప్రదర్శిస్తే శిక్ష తప్పదన్నారు. గత అనుభవాలను గుర్తుంచుకోవాలంటూ అధికారులను అలర్ట్ చేశారు ఎంపీ రఘురామ కృష్ణరాజు.