బీజేపీ కార్పొరేటర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి.. జెండా ఆవిష్కరణలో రచ్చ రచ్చ

స్వాతంత్ర దినోత్సవ వేడుక రాజకీయ రగడకు వేదికైంది. హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో రచ్చరచ్చైంది. జెండా ఆవిష్కరణ సందర్భంగా స్థానిక బీజేపీ కార్పొరేటర్, టీఆర్ఎస్ ఎమ్మెల్సే మధ్య జరిగిన గొడవతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఇరు వర్గాలు దాడులకు దిగాయి. ఈ ఘటనతో బీజేపీ కార్పొరేటర్ కు గాయాలు కావడంతో రాజకీయ వివాదం మరింత ముదిరింది.  మల్కాజిగిరి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ సందర్భంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ జాతీయ జెండా ఎగరవేసిన సందర్భంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.  ఈ ఘర్షణలో కార్పొరేటర్ శ్రావణ్ తీవ్రంగా గాయపడ్డారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. బీజేపీ కార్పొరేటర్ ను అంతు చూస్తానంటూ ఎమ్మెల్యే మైనంపల్లి బెదిరిస్తున్న విజువల్స్ వైరల్ గా మారాయి. మైనంపల్లి రెచ్చగొట్టడం వల్లే టీఆర్ఎస్ కార్యకర్తలు కార్పొరేటర్ పై దాడి చేశారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలంటూ  మల్కాజిగిరి చౌరస్తాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ ఘర్షణపై ఎమ్మెల్యే మైనంపల్లి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.అటు బీజేపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు.  టీఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్కాజ్‌గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీ విజయశాంతి, మాజీమంత్రి విజయరామరావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు  పరామర్శించారు. ఎమ్మెల్యే మైనంపల్లి నీచమైన వ్యక్తి అని, గూండాయిజం దాడులతో రాజకీయం చేస్తుండని  బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ లో చేరదామని వస్తే మేం తరిమికొట్టామని, అలాంటి వ్యక్తిని కేసీఆర్ పార్టీలో చేర్చుకోవడం సిగ్గుచేటన్నారు. మైనంపల్లి అక్రమాలను బయటపెట్టి రౌడీయిజాన్ని తొక్కిపడేస్తామని హెచ్చరించారు. దాడి జరుగుతున్న సమయంలో చోద్యం చూస్తున్న పోలీసుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే డీజీపీ స్పందించి మైనంపల్లి సహా టీఆర్ఎస్ గుండాలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. లేనిపక్షంలో బీజేపీ సత్తా చూపుతామన్నారు. గాయపడిన కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ తనకు ప్రాణ హాని ఉందని రక్షణ కలిపించాలని కోరారు. టీఆర్ఎస్ నాయకులు విచక్షణ రహితంగా బూతులు తిడుతూ తన పై దాడి చేసారని చెప్పారు. నిందితులని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

కశ్మీర్ కు త్వరలో ఎన్నికలు.. ఎర్రకోట వేదికగా ప్రధాని ప్రకటన 

75వ స్వాతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. వాడ వాడలా త్రివర్ణ పతకాలు రెపరెపలాడుతున్నాయి. జనాలంతా దేశభక్తితో ఉప్పొంగి పోతున్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎర్రకోటపై త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. తొలుత రాజ్‌ఘాట్‌కు చేరుకుని జాతిపిత మహాత్మగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించిన మోడీ అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. దేశం కోసం సరిహద్దులో కాపలా కాస్తున్న వీర జవాన్లకు మోదీ ప్రణామాలు అర్పించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగధనులను దేశం స్మరించుకుంటోందన్నారు. కరోనా సంక్షోభం వేళ వైద్యులు, సిబ్బంది అందించిన సేవలను మోడీ కొనియాడారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వారు చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. కొవిడ్‌తో దేశ ప్రజలు సహనంతో పోరాడారని మోదీ పేర్కొన్నారు. ఈ సమయంలో అనే సవాళ్లను ఎదుర్కొన్నామని, అసాధారణ వేగంతో పనిచేశామని గుర్తు చేశారు. ఇది మన పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు అందించిన బలమని అన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలు అందించిన క్రీడాకారులపై మోదీ ప్రశంసలు కురిపించారు. దేశానికి వారు పతకాలు మాత్రమే అందించలేదని, యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. వారందరికీ దేశం యావత్తూ గౌరవం ప్రకటిస్తోందన్నారు. దేశ సంపూర్ణ వికాసానికి పోషకాహార లోపం అతిపెద్ద అడ్డంకి అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశంలో ఏ ఒక్కరు పోషకాహార లోపంతో బాధపడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్ దుకాణాల్లో పోషకాహార ధాన్యాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. పోషకాహార లోపంతో పాటు వైద్యం కూడా అత్యంత కీలకమైనదని అన్నారు. మండలస్థాయి వరకు సంపూర్ణ వైద్య సౌకర్యాలు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభమైనట్టు చెప్పారు. ప్రతి  ఇంటికి విద్యుత్, తాగునీరు సుదూర స్వప్నంగా మిగిలిపోకూడదని అన్నారు. వచ్చే రెండేళ్లలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించాలన్నారు. పేదరికానికి కులం, మతం తేడా ఉండకూడదని పేర్కొన్నారు. ప్రతి పేదవాడు సగర్వంగా నిలబడేలా సహాయ, సహకారాలు అందించాలని మోడీ అన్నారు. శతాబ్ది ఉత్సవాల నాటికి దేశాన్ని ప్రబలశక్తిగా మార్చాలన్న సంకల్పం తీసుకోవాలని మోదీ కోరారు. శతాబ్ది ఉత్సవాలకు మిగిలి ఉన్న ఈ 25 ఏళ్లు అమృత ఘడియలని చెప్పారు. ఈ కాలంలో ప్రతి పౌరుడు క్షణం కూడా వృథా చేయకుండా ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొవిన్ యాప్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని ప్రధాని తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 54 కోట్ల మందికి టీకాలు అందించినట్టు తెలిపారు. భారతీయుల జీవనశైలి, సామాజిక కట్టుబాట్లు కరోనా నుంచి చాలా వరకు రక్షించాయని మోడీ వివరించారు.భారతదేశం నేడు టీకాల కోసం ఏ ఇతర దేశంపైనా ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు.  దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ పలు కీలక ప్రకటనలు చేశారు. దేశవ్యాప్తంగా గల అన్ని సైనిక పాఠశాలల్లో ఇకపై బాలికలకు కూడా ప్రవేశం కల్పించనున్నట్లు మోదీ ప్రకటించారు. ఇంతవరకూ బాలురకు మాత్రమే సైనిక స్కూళ్లలో ప్రవేశం కల్పించేవారు. భారత రక్షణ రంగంలో యువతులకూ ప్రాధాన్యత కల్పిస్తున్న నేపధ్యంలో సైనిక స్కూళ్లలో బాలికలకు ప్రవేశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జమ్ముకశ్మీర్ ఎన్నికలపై మోడీ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే అక్కడ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.  వ్యవసాయ రంగంలో నూతన సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. రేషన్ దుకాణాల్లో పోషకాహారాన్ని అందిస్తామని, దేశంలోని ప్రతీ ఇంటీకీ నల్లా నీరు వచ్చే ఏర్పాట్లు చేస్తామని ఎర్రకోట వేదికగా మోడీ హామీనిచ్చారు. 

రాష్ట్రపతి స్వాతంత్య్ర‌ దినోత్సవ సందేశం.. ఆయ‌న ఏమ‌న్నారంటే..

‘‘దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ స్వాంతంత్య్ర‌ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మీకు గొప్పగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ యేడాది స్వాతంత్య్ర‌ దినోత్సవం చాలా ప్రత్యేకమైంది. ఈ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవబోతున్నాయి. అమృత మహోత్సవంగా ఈసారి వేడుకల్ని నిర్వహించుకోబోతున్నాం’’ అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ దేశ‌ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.  ‘‘స్వాతంత్య్ర‌ దినోత్సవం మనకు పండగ దినం. మన స్వాతంత్య్ర‌ కాంక్ష ఎంతో మంది త్యాగధనుల ఫలితం. అందులో మనకు తెలిసినవాళ్లు ఉన్నారు, తెలియని వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు ఈ దేశం కోసం చాలా గొప్ప త్యాగం చేశారు. అలాంటి గొప్ప వీరులకు నా తల వంచి నమస్కరిస్తున్నాను. గత 75 ఏళ్లలో పలు రంగాల్లో అందనంత ఎత్తుకు ఎదిగాం. భారత భవిష్యత్‌లో బాలికలు, మహిళలకు ప్రాధాన్యత మరింత పెరుగుతుంది’’ అని అన్నారు రాష్ట్రపతి.  టోక్యో ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు ప్రదర్శించిన ప్రతిభను కొనియాడారు. క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా అమ్మాయిల్ని పోత్సహించినట్టు తెలిపారు. కరోనాపై పోరాటం ఇంకా ముగిసిపోలేదని.. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో అనేకమంది ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. కరోనా ఉద్ధృతిని తట్టుకొనేందుకు యుద్ధప్రాతిపదికన వైద్య వసతులు కల్పించామని, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కృషివల్లే కరోనా సెకండ్‌ వేవ్‌పై పైచేయి సాధించగలుగుతున్నామన్నారు.   ‘‘కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయరంగంలో పురోగతి సాధించాం. కరోనా వల్ల వ్యాపారులు, వలసదారులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఆయా రంగాలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 50కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ జరిగింది. సులభతర జీవనం, వాణిజ్యంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది’’ అని రాష్ట్ర‌ప‌తి తెలిపారు. ‘‘కరోనా మహమ్మారి ఇంకా పోలేదు. ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. ఈ మహమ్మారి నియంత్రణకు మన శాస్త్రవేత్తలు టీకాలను అభివృద్ధి చేయడంలో విజయవంతం కావడంవల్లే భారీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టగలిగాం. ఈ మహమ్మారి నుంచి రక్షించుకొనేందుకు వ్యాక్సిన్లే రక్షణ కవచంలా ఉపయోగపడుతున్నాయి. ఇంకా మనమంతా మరిన్ని జాగ్రత్తలు పాటించాలనేదే కరోనా మనకు నేర్పిన పాఠం. వైరస్‌ తీవ్రత తగ్గినప్పటికీ కరోనా ఇంకా పోలేదు. కరోనా కట్టడి కోసం పనిచేసిన వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, కరోనా వారియర్లకు అభినందనలు. వారి సేవలే కరోనా సెంకడ్‌ వేవ్‌ను అదుపుచేయడంలో దోహదపడ్డాయి. కరోనా సంక్షోభ సమయంలో ఆరోగ్య కార్యకర్తల పాత్ర శ్లాఘనీయం. కరోనా సవాళ్లను అధిగమించాలన్న మనందరి సమష్టి సంకల్పమే సెకండ్‌ వేవ్‌ బలహీనపడేలా చేసింది’’ అని రాష్ట్రపతి త‌న ప్ర‌సంగంలో అన్నారు.   

బాప్‌రేబాప్‌.. ఆర్టీసీ బస్సులో కిలోన్న‌ర బంగారు న‌గ‌లు ప‌ట్టివేత‌..

ఆర్టీసీ బ‌స్సు ర‌య్ ర‌య్ మంటూ వెళ్తోంది. అన్నీ బ‌స్సుల్లానే అది కూడా. డ్రైవ‌రు, కండ‌క్ట‌రు, కొంత‌మంది ప్యాసింజ‌ర్లు. అంతా రోటీన్‌. స‌డెన్‌గా చెక్‌పోస్ట్ ప‌డింది. బ‌స్సును ఆపారు. పోలీసులు బ‌స్సు ఎక్కారు. ప్ర‌యాణీకులంద‌రినీ త‌నిఖీ చేస్తున్నారు. అప్పుడు మొద‌లైంది స‌డెన్‌గా హ‌డావుడి. ఒక్క‌సారిగా సంచ‌ల‌నం. పోలీసుల‌తో పాటు ప్యాసింజ‌ర్లూ ఉలిక్కిప‌డ్డారు. ఆ సీన్ చూసి అంతా బిత్త‌ర‌పోయారు. త‌మ క‌ళ్ల‌ను న‌మ్మ‌లేన‌ట్టు.. గుచ్చి గుచ్చి చూశారు. జ్యూవ‌ల‌రీ షాపుల్లో మిన‌హా అన్ని బంగారు న‌గ‌ల‌ను బ‌య‌ట ఒకేసారి చూడ‌టం వారంద‌రికీ అదే మొద‌టిసారి. అందులోనూ ఆర్టీసీ బ‌స్సులో అంత బంగారం బ‌య‌ట‌ప‌డ‌టం మ‌రింత షాక్‌. అందుకే ఇది బ్రేకింగ్ న్యూస్‌. కర్నూలు జిల్లాలోని పంచలింగాల చెక్‌పోస్టు ద‌గ్గ‌ర‌ ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న బంగారు ఆభరణాలను సెబ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలుకు చెందిన షేక్‌ ముస్తాక్‌ హాక్‌ ఆర్టీసీ బస్సులో తెలంగాణలోని గద్వాల నుంచి కర్నూలుకు ఒక కేజీ 447 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకుని వస్తున్నాడు. ప‌క్కా స‌మాచారం మేర‌కు సెబ్‌ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బస్సును తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బ్యాగులో త‌ర‌లిస్తున్న‌ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును స్థానిక‌ పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు.  బంగారు న‌గ‌లు ఎవ‌రివి? ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి ర‌వాణా చేస్తున్నారు? ఏదైనా జ్యువ‌ల‌రీ షాపు వారివా? బిల్లులు లేని దొంగ బంగార‌మా? లేక‌, దొంగ‌త‌నం చేసుకొచ్చిన న‌గ‌లా? ఇలా పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.   

నా చావుకు సీఎం జ‌గ‌నే కార‌ణం.. వాలంటీర్ సూసైడ్ నోట్...

గ్రామ‌, వార్డు వాలంటీర్ల వ్య‌వ‌స్థ మేడిపండు లాంటిద‌ని మ‌రోసారి రుజువైంది. వాలంటీర్ల‌పై వైసీపీ నాయ‌కుల పెత్త‌నం ఎక్కువైంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. వాలంటీర్ల‌ను కూలీలకంటే హీనంగా చూస్తున్నారు. వారితో గొడ్డులా చాకిరీ చేయించుకుంటున్నారు. ఓవైపు అధికారులు, మ‌రోవైపు అధికార‌పార్టీ నాయ‌కులు.. పెద్ద‌ల ఒత్తిళ్ల వ‌ళ్ల వాలంటీర్లు శారీర‌కంగా, మాన‌సికంగా కుంగిపోతున్నారు. కొంద‌రు ఆత్మ‌హ‌త్య కూడా చేసుకోవ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.  తాజాగా, అనంతపురం జిల్లా రాయదుర్గంలో వాలంటీర్ మ‌హేశ్ ఇంట్లో ఉరి వేసుకొని.. సూసైడ్ చేసుకోవ‌డం మ‌రింత కలక‌లానికి కార‌ణ‌మైంది. త‌న‌ చావుకు కారణం ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ ఉద్యోగమే కార‌ణ‌మ‌ని సూసైడ్ లేఖ రాసి మరీ మహేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. తనతో గొడ్డు చాకిరీ చేయించుకున్నారని సూసైడ్‌ నోట్‌లో రాశాడు మ‌హేశ్‌. తన లాంటి పరిస్థితి మరో వాలంటీర్‌కు రాకుండా చూడాలని సూసైడ్ నోట్‌లో ప్ర‌దేయ‌ప‌డ‌టం సంచలనంగా మారింది.  మొద‌టినుంచీ వాలంటీర్ వ్య‌వ‌స్థ వివాదాస్ప‌దంగానే ఉంది. వాలంటీర్ల‌తో బండ చాకిరీ చేయిస్తున్నారనీ, అన్ని రకాలుగా వాడుకుంటున్నారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అధికారుల నుంచి ఎదురయ్యే ఒత్తిళ్ల కంటే.. అధికార పార్టీ నాయకుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు మ‌రింత ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. వైసీపీ నేత‌ల ఓవ‌రాక్ష‌న్‌ను, టార్చ‌ర్‌ను త‌ట్టుకోలేక‌పోతున్నామ‌ని అనేక‌మంది ఆరోపిస్తున్నారు. ఇవే విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ.. ఏకంగా త‌న చావుకు సీఎం జ‌గ‌నే కార‌ణ‌మ‌నేలా సూసైడ్ నోట్ రాసి మహేష్ అనే వాలంటీర్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌పై మ‌రోసారి చ‌ర్చ జ‌రుగుతోంది.   

ఏపీ ప్రభుత్వానిది కోర్టు ధిక్కరణేనా?  సీఎస్ జైలుకు వెళతారా? 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి చిక్కుల్లో పడబోతోంది. కోర్టు ధిక్కరణ విషయంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని తెలుస్తోంది. ఏపీ సీఎస్ జైలుకు వెళ్లాల్సి వచ్చినా రావచ్చని చెబుతున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబున్యుల్  కోర్టు ఏపీ ప్రభుత్వంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎన్జీటీ సీరియస్ గా స్పందిస్తే మాత్రం జగన్ రెడ్డి సర్కార్ కు కష్టాలు తప్పవని అంటున్నారు.  అసలు విషయానికి వెళితే.. తెలుగు రాష్ట్రాల మధ్య మంటలు రాజేసిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో  కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు పరిశీలన పూర్తైంది. ఎన్జీటీ ఆదేశాలతో రెండు, మూడు వాయిదా తర్వాత ఎట్టకేలకు ప్రాజెక్టును పరిశీలించిన కేఆర్‌ఎంబీ.. రాయలసీమ ఎత్తిపోతలపై నివేదికను రూపొందించింది. రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు కేఆర్‌ఎంబీ ధృవీకరించింది. ఈ మేరకు ఎన్జీటీకి కేఆర్‌ఎంబీ నివేదిక సమర్పించింది. డీపీఆర్‌కు అవసరమైన పనులకన్నా అధికంగా పనులు జరిగినట్లు కేఆర్‌ఎంబీ నివేదికలో నిర్ధారించింది. ఎన్జీటీ తీర్పును ధిక్కరించినట్లు కేఆర్‌ఎంబీ ధృవీకరించింది.  పంప్ హౌస్, అప్రోచ్ ఛానల్, ఫోర్ బే, డెలివరీ మెయిన్ ఛానల్, డెలివరీ సిస్టమ్, లింక్ కెనాల్ పనులు జరిగినట్లు నిర్ధారించినట్లు కేఆర్‌ఎంబీ పేర్కొంది. రెండ్రోజులపాటు ప్రాజెక్ట్ పనులను కేఆర్‌ఎంబీ అధికారులు తనిఖీ చేశారు. ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన పనులను పూర్తిచేసినట్లు కేఆర్‌ఎంబీ పేర్కొంది. ఫోటోలతో సహా సమగ్ర నివేదికను ఎన్జీటీకి సమర్పించినట్లు కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది. ఎన్జీటీ సోమవారం విచారణ జరపనుంది. కోర్టు తీర్పు ధిక్కరణకు పాల్పడితే సీఎస్‌ను జైలుకు పంపుతామని గతంలో ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.దీంతో కేఆర్‌ఎంబీ నివేదికలో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు తేలడంతో ఏపీ ప్రభుత్వంపై ఎన్జీటీ ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. గతంలో హెచ్చరించినట్లు సీఎస్ ను జైలుకు పంపుతుందా, అదే జరిగితే సంచనమే కానుంది. 

రేవంత్ సభకు సీనియర్లు బ్రేకులు! కాంగ్రెస్ కథ ఇక మారదా? 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి పార్టీని ఏకతాటి మీద ముందుకు తీసుకు పోయేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి, పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టక ముందు నుంచే పార్టీ  సీనియర్ నాయకుల ఇళ్ళకు వెళ్లి వారి వ్యక్తిగత యోగక్షేమాలతో పాటుగా, పార్టీ మంచి చెడులు కూడా చర్చించారు. ఆశీస్సులు అందుకున్నారు. కాంగ్రెస్ సీనియర్లతో పాటుగా దేవేందర్ గౌడ్ వంటి  ఇతర పార్టీల సీనియర్ నాయకుల ఇళ్ళకు వెళ్లి పలకరించి వచ్చారు. కాంగ్రెస్ కలిసినప్పుడు, అందరి సహాయ సహకారాలు కోరడమే కాకుండా, అందరం కలిసి పనిచేద్దామని,కాంగ్రెస్ పార్టీని బతికించుకుందామని చెప్పుకొచ్చారు. ఆ ప్రయత్నాలు కొంత ఫలించినట్లే కనిపించాయి.  అయినా ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా, ఎప్పటినుంచే పార్టీలో ఉన్న సీనియర్లను కాదని , నిన్నగాక మొన్న, (నాలుగేళ్ళ క్రితం) పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించడం సీనియర్లలో చాలా మందికి  అప్పట్లో  మింగుడు పడ లేదు. ఇప్పటికీ కొందరు ఆ బాధను జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే, అందరూ కాకపోయినా కొందరు నాయకులు పార్టీ కార్యకలాపాలకు సాధ్యమైనంత దూరంగానే ఉంటున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి అధ్వర్యంలో కనీవినీ ఎరగని రీతిలో జరిగిన ఇంద్రవెల్లి గర్జన సభకు కూడా కొందరు సీనియర్లు దూరంగానే ఉన్నారు. అయినా లక్ష మందితో జరిగిన ఇంద్రవెల్లి సభ కాంగ్రెస్ కార్యకర్తల్లో బూతన ఉత్సాహాన్ని నింపింది. రేవంత్ నాయకత్వం పట్ల విశ్వాసాన్ని మరింతగా పెంచింది.  ఇంద్రవెల్లి సభ అందించిన విజయోత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా  సభల విషయంలో ఆదిలోనే వివాదం తలెత్తింది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఏకంగా రేవంత్ రెడ్డిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా’ సభలలో తొలి ప్రారంభ సభను, ఆగష్టు 18న కోమటి రెడ్డి వెంకట రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి లోక్’సభ నియోజక వర్గం పరిధిలోని  ఇబ్రహీం పట్నంలో నిర్వహించాలని పీసీసీ ఆధ్వర్యంలోని దండోరా కమిటి నిర్ణయించింది. అయితే తమ నియోజక వర్గంలో జరపతలపెట్టిన సభకు సంబంధించి తనకు ముందస్తు సమాచారం లేదని కోమటి రెడ్డి కస్సు మన్నారు. ఇదే విషయాన్ని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ దృష్టికి, ఫిర్యాదు రూపంలో తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే వివాదం ఇంకా ముదరక ముందే అనూహ్యంగా పోలీసులు వివాదానికి పరిష్కారం చూపించరు. ట్రాఫిక్ సమస్యలు కారణంగా చూపింది,  ఇబ్రహీం పట్నంలో సభ నిర్వహణకు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసుల సూచనా మేరకు, ఔటర్ రింగ్ రోడ్డు పక్కన బొంగుళూరు సమీపమలో ముందుగ అనుకున్న విధంగా ఆగష్టు 18 సాయంత్రం నలుగు గంటలకు ‘దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా’ సభని నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది.  అయితే ఇక్కడితో కథ ముగిసినట్లు కాదని, రేవంత్ రెడ్డికి సీనియర్లు సహాయ నిరాకరణ కొనసాగుతూనే ఉంటుందని,అధిష్టానం అండదండలు ఉనంతవరకు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఎదురుండదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్య నారాయణ తెరాసలో చేరేందుకు సిద్దమవుతున్న సంకేతాలు ఇచ్చారు. దళిత బంధు రూట్ లో కారెక్కేందుకు, ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. దళిత బంధు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ కొచ్చిన గొప్ప అలోచన అంటూ మెచ్చుకున్నారు. రాష్ట్ర జనభాలో ఒక వంతున్న దళితులకు మేలు చేసే పథకాన్ని తీసుకొచ్చిన  ముఖ్యమంత్రిని రాజకీయాలకు అతీతంగా అందరూ అభినందించాలని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం పై కూడా సర్వే ఆచి తూచి స్పందించారు... ముందుంది ముసళ్ళ పండగ అన్నట్లుగా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఏమైనా రేవంత్ నాయకత్వం విషయంలో కాంగ్రెస్ సీనియర్ల కొందరు ఇంకా కినుగ్గానే ఉన్నారు. అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.. అది మాత్రం నిజం.. 

మాటలతో కవ్వించి.. నగ్నంగా కనిపించి...

ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు సొగసరి, గడసరి సుందరాంగులు.. కుర్రకారుకు వలపు వలలు వేస్తూ జేబులకు గాలం వేస్తున్నారు. "ఒంటరిగా ఉన్నామని ఫీలవుతున్నారా.. మీ భావాలు పంచుకోవడానికి ఒక మంచి స్నేహితుడో/స్నేహితురాలా కావాలా?" అంటూ వచ్చే ఒక్క ఎస్‌ఎంఎస్‌ ఎందరో యువకుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. కాసేపు మనసు విప్పి మాట్లాడుదాంలే అనుకుని ఫోన్ కలిపితే ఇక అంతే సంగతులు. ఆ విష వలయం నుంచి బయటకు రాలేకపోతున్నారు. వలపు వలలకు చిక్కి.. గిలగిలా కొట్టుకుంటున్నారు. ఎవరికీ చెప్పుకోలేక, చెప్పుకుంటే పోయే పరువు తిరిగిరాలేదన్న బెంగతో సతమతమవుతున్నారు. తమకు జరిగిన నష్టాన్ని కూడా కక్కలేక, మింగలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.  ఈ తరహాలోనే విశాఖ యువకుడి నుంచి జీడిమెట్లకు చెందిన గుండా జ్యోతి అనే 24 ఏళ్ల యువతి అక్షరాలా రూ.24 లక్షలు వసూలు చేసింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విశాఖ పోలీసులు ఆమెతో పాటు మరో ఇద్దర్ని కూడా అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల దర్యాప్తులో పలు విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. కుత్బుల్లాపూర్‌లోని ఓ కాల్‌సెంటర్‌లో సుమారు 25 మంది అమ్మాయిలు పనిచేశారు. అది మూతపడటంతో వీరందర్నీ అక్కడే పనిచేసే 30 ఏళ్ల షాహిక్‌ అబ్దుల్‌ రెహమాన్‌ అనే టీం లీడర్‌ చేరదీశాడు. ఈయనది కృష్ణాజిల్లా. రెహమాన్ ఈ యువతులకు ప్రత్యేకంగా తర్ఫీదునిచ్చి వీరితో ఈ మోసాలు చేయిస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. వీరే కాకుండా ఇంకా నగరంలో చాలామంది కిలాడీలు ఇలాగే తర్ఫీదు పొంది ఉన్నారని, వారి వివరాలు బయటపడితే.. ఇంకా ఎంతమంది కుర్రకారు బాధితులుగా మారారో బయటకొస్తుందంటున్నారు పోలీసులు. రెహమాన్ నుంచి మరిన్ని వివరాలు అందుకున్న పోలీసులు.. ఆ యువతుల కోసం అన్వేషిస్తున్నారు.  నెరజాణల వలకు ఎలా చిక్కుతున్నారంటే... మార్కెటింగ్‌ కంపెనీలు, సర్వీస్‌ ప్రొవైడర్లు, కాల్‌సెంటర్ల నుంచి బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ పంపిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు ఎస్‌ఎంఎస్‌లో ఉన్న నంబర్లకు ఫోన్‌ చేయగానే కి‘లేడీ’లు రంగంలోకి దిగుతున్నారు. వర్చువల్‌ నంబర్లతో కాల్‌ చేస్తున్నారు. పది పదిహేను రోజులు తరచూ ఫోన్లు చేసి ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. బాధితులు వారి నంబర్‌ అడిగితే ఈ కిలాడీలు నకిలీ ధ్రువపత్రాలతో తీసుకున్న నంబర్లను ఇస్తున్నారు. ఇక ఇక్కడే కథలోని అసలు ట్విస్టు మొదలవుతుంది. ఆ నెరజాణలు వాట్సాప్‌లో ఛాటింగ్‌ చేస్తూ కుర్రకారును ముగ్గులోకి దింపుతున్నారు. వీడియో కాల్స్‌ చేసి రెచ్చగొడుతున్నారు. నగ్నంగా చూడాలని ఉందా? అంటూ కవ్విస్తున్నారు. మత్తెక్కించే మాటలతో యూత్ ను టెంప్ట్ చేస్తున్నారు. పైదుస్తులు మాత్రమే తీసేస్తే రూ.500, ఇంకొంచెం కిందివి తీసేస్తే రూ.వెయ్యి, పూర్తిగా నగ్నంగా చూడాలనుకుంటే రూ.2 వేలు చెల్లించాలంటూ.... ఒక్కో ఆఫర్ కు ఒక్కో రేటుతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.  వీరి డ్రామాలో ఫైనల్ ట్విస్ట్ తెలుసుకున్న పోలీసులకు మతి పోతోంది. ఈ దశలో వారు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. వారు ఒకటి, రెండు దశల్లో సెమీ న్యూడ్ సీన్స్ చూపించడం పూర్తయ్యాక బాధితులను కూడా న్యూడ్ గా కనిపించాలంటూ షరతులు పెడుతున్నారు. నేను న్యూడ్ గా చూపించాను కదా... మరి నీ సంగతేంటి... అంటూ రెచ్చగొడుతున్నారు. వారి మాటలకు కుర్రకారు మంత్రముగ్ధులయ్యాక.. అప్పుడు ‘స్క్రీన్‌ రికార్డింగ్‌’ ఆప్షన్ తో వీడియో చిత్రీకరిస్తున్నారు. తర్వాత ఆ వీడియోను సంబంధిత యువకుల వాట్సాప్‌ నెంబర్స్ కు పంపిస్తున్నారు. ఆ తరువాత అవే వీడియోలను ఫేస్ బుక్, యూట్యూబ్‌ వంటి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయాలా.. అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దీంతో బాధిత యువకులు చేసేదేం లేక అడిగినంతా డబ్బు చెల్లించి అవమానకరమైన రీతిలో సీన్ నుంచి నిష్క్రమిస్తున్నారు. ఇదే వారి పాలిట వరదాయినిలా మారిందని పోలీసులంటున్నారు.

లాయర్ నే బురిడీ కొట్టించిన నైజీరియన్ నెరజాణ

సైబర్ నేరాల గురించి మన పోలీసులు ఎంతగా అప్రమత్తం చేస్తున్నా దాదాపుగా రోజుకో కొత్తరకం నేరం వెలుగుచూస్తూనే ఉంది. అది కూడా పోలీసుల ఇళ్లలోనే దొంగలు పడ్డట్టు... న్యాయవాదుల ఖాతాల్లోంచే తెలివిగా డబ్బులు తస్కరించే కిలాడీలు హైదరాబాద్ లో చాలా బాగా పెరిగిపోయారు. తాజాగా హైదారాబాద్ లోని మేడిపల్లకి చెందిన ఓ మహిళా న్యాయవాది నైజీరియన్ కిలాడీ విసిరిన సైబర్ వలకు చిక్కింది. 12,862 డాలర్లు (రూ. 9.26 లక్షలు) సమర్పించుకుంది. విషయం ఆలస్యంగా తెలిశాక లబోదిబోమనడం ఆ న్యాయవాది వంతయింది.  అసలెలా జరిగిందంటే... మేడపల్లికి చెందిన మహిళా న్యాయవాది రాధిక బల్లా... ఫేస్ బుక్ లో టీనా హ్యాన్సన్ అనే నైజీరియన్ యువతితో చాటింగ్ మొదలుపెట్టింది. ఆమెతో చాటింగ్ కాస్తా రాధిక ఖాతాకే ఎసరు తెచ్చింది. స్నేహంగా ముందుకెళ్తున్న రాధికను బాగా వాడేయాలని టీనా డిసైడైంది. ఒకానొక సందర్భంలో తన ప్రపోజల్ ను రాధిక ముందు పెట్టింది. తమకు బేస్ లైన్ సొల్యూషన్స్ అనే కంపెనీకి ఉందని, దానికి సంబంధించిన ఓ కేసును కోర్టులో వాదించేందుకు గాను న్యాయవాదిగా వ్యవహరించాలని టీనా కోరింది. అయితే భారీ ఎత్తున పారితోషికం లభించే ఆ కేసు వాదించే అవకాశం రావాలంటే ముందుగా కొంత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని సూచించింది.  టీనా మాటలు నమ్మిన రాధిక ఆమె సూచించిన బ్యాంకు ఖాతాకు అక్షరాలా రూ. 9.26 లక్షలు ట్రాన్స్ ఫర్ చేసింది. ఇక డబ్బు ట్రాన్స్ ఫర్ అయ్యాక ఫోన్ చేస్తే రాధిక ఫోన్ నెంబర్ బ్లాక్ చేసినట్టు చెబుతోంది. ఆ తరువాత ఫేస్ బుక్ లో వెతగ్గా... టీనా అకౌంట్ కూడా డిలీట్ చేసుకున్నట్టు కనిపించింది.  నైజీరియన్ నెరజాణ టీనా హ్యాన్సన్ చేసిన మోసానికి.. న్యాయవాది రాధిక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. మన సైబరాబాద్ పోలీసులు ఇలాంటి నేరాల గురించి ఎంతో అప్రమత్తం చేస్తున్నా... న్యాయవాదులే బలైపోతుండడం విచిత్రమే.

మాకు కావాలి.. మాబంధు! గులాబీ లీడర్లకు నిలదీతలు

ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చింది, అంటే ఇదే నేమో, హుజూరాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్’ను ఎలగైనా ఓడించాలని కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, కొత్త కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. కేసీఆర్ అండదండలతోనే కావచ్చును, ఈటల హుజూరాబాద్’లో తిరుగులేని నేతగా ఎదిగారు. రాజకీయంగానే కాదు, ఆర్థికంగానూ నియోజక వర్గం పరిధిలో మరే ఇతర నాయకునికి అందనంత ఎత్తుకు చేరుకున్నారు.  అయితే అనూహ్య పరిణామాల నడుమ రాజకీయ ప్రత్యర్ధిగా మారిన ఈటలను, ఎన్నికలలో ఓడించడం ముఖ్యమంత్రి కేసీఆర్’ కు  ఒక విధంగా అనివార్యంగా మారింది, మరో వంక అంత తేలిగ్గా అయ్యే పని కాదని అర్థమైంది. సర్వ శక్తులువడ్డి పోరాడక తప్పని పరిస్థతి ఎదురైంది. ఈ నేపధ్యంలోనే, ముఖ్యమంత్రి కేసీఆర్, దళిత బంధు, బ్రహ్మాస్త్రాన్ని సంధించారు. పథకం మంచి చెడులు ఎలా ఉన్నప్పటికీ, ఇప్పుడు కేసీఆర్ సంధించిన బ్రహ్మాస్త్రం,నాగాస్త్రమై  తెరాస ఎమ్మెల్యేలు, మంత్రుల  మెడకు చుట్టుకుంటోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికెళితే అక్కడ ఇతర సామాజిక వర్గాల పేదలు మాకూ కావలి ... మా బంధు అంటూ చుట్టుముడుతున్నారు. చికాకు పరుస్తున్నారు.    మరోవైపు రాజకీయ పార్టీలు దళిత బందుకు స్వాగతం పలుకుతూనే, దళిత బంధు అనుబంధ డిమాండ్లతో మంత్రులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇందులో భాగంగానే, శనివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ కమిటీ  చైర్మన్ సురేంద్ర ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రిని కాంగ్రెస్ కార్యకర్తలు ఘోరావ్ చేసినంత పని చేశారు. ఓవైపు చైర్మన్ ప్రమాణ స్వీకారం జరుగుతుండగా.. ఇంకోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఎస్టీ, బీసీ బంధు ప్రకటించాలని నినాదాలు చేస్తూ  నిరసనకు దిగారు.దీందో  ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతటితో ఆగకుండా, మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే ఇదేదో ఒక్క వికారబాద్’లో ఒక్క సబితా ఇంద్రా రెడ్డికి మాత్రమే ఎదురైన చేదు అనుభవం కాదు. మంత్రులకు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు హుజూరాబాద్ వరాలు, గుదిబండగా మారుతున్నాయి. కొన్ని నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, జనం డిమాండ్ చేస్తుంటే, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి “ మేమూ రాజీనామా చేస్తాం, మళ్ళీ పోటీ కూడా చేయం, మా నియోజక వర్గాలలో హుజురాబాద్ వరాల వాన కురిపించండి” అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈటలను ఓడించడం మాట ఎలా ఉన్నా హుజూరాబాద్ వారాలు మంత్రులు, అధికార  పార్టీ ఎమ్మెల్యేలకు జనంలోకి వెళ్ళకుండా చేస్తోంది. ఎంకి పెళ్ళి సుబ్బి చావు వచ్చిందన్న సామెతను గుర్తుచేస్తోంది.

అక్రమార్కులకే కార్యదర్శి వత్తాసా? జూబ్లీ హిల్స్ సొసైటీలో కొత్త కుట్రలా? 

జూబ్లీ హిల్స్ సొసైటీకి సంబంధించిన రికార్డుల విషయంలో తలెత్తిన వివాదం పోలీసు స్టేషన్ వరకు చేరింది. సొసైటీ బైలా ప్రకారం.. దీనికి సంబంధించిన రికార్డులను సభ్యులు పరిశీలించుకునే అవకాశం ఉంది. అయితే.. ఈ విషయంలో సొసైటీ అధ్యక్షుడు, ఇతర సభ్యులతో సెక్రటరీ వ్యవహరించిన తీరు గొడవకు కారణమైందని అంటున్నారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ సెక్రెటరీ మురళీముకుంద్‌ వ్యవహరిస్తున్న తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది. పాత రికార్డులన్నీ పరిశీలిద్దామని అధ్యక్షుడు బొల్లినేని రవీందర్  కోరితే.. ఆయనకు సహకరించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కార్యదర్శిపై వస్తున్నాయి.  గత పాలకమండలి చేసిన అక్రమాలన్నీ తవ్వితీసి వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచాలని, వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రస్తుత పాలకమండలి సీరియస్‌గా ప్రయత్నం చేస్తోంది. అయితే కార్యదర్శిగా దానికి సపోర్ట్ చేయాల్సిన మురళీ ముకుంద్ రివర్స్ కావడం చర్చగా మారింది. ప్రస్తుత అధ్యక్షుడిపైన, ఇతర సభ్యులపైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం అందరిని అశ్చర్యపరుస్తోంది.  పాత రికార్డులన్నీ పరిశీలిద్దామని అడగడటం వాటిని తప్పెలా అవుతుందని పాలకమండలి సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అడిగిన వివరాలు ఇవ్వడం, రికార్డులు పక్కాగా మెయింటెన్ చేయడం సొసైటీ కార్యదర్శి పని అని.. అది చేయకుండా అక్రమార్కులకు వంత పాడేలా మురళీ ముకుంద్ వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. 'ఓట్ ఫర్ ఛేంజ్' అన్న నినాదంతో గెలిచి ఇప్పుడు 'నాట్ ఫర్ ఛేంజ్‌' అంటూ పాత పాలకమండలికి సపోర్ట్ చేసేలా ఆయన చర్యలు ఉన్నాయని అంటున్నారు.కొందరి ప్రయోజనాల కోసం ఆయన యూటర్న్‌ తీసుకున్నారని జూబ్లీహిల్స్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.   జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కొత్త పాలకమండలి మార్చిలో బాధ్యతలు చేపట్టింది. గతంలో వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగిన నేపథ్యంలో వాటిని వెలికి తీసేందుకు యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకుంది. రికార్డులు, పక్కా ఆధారాలతో వాటిని నిరూపించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి టైమ్‌లో.. ఎవరికో లాభం చేయడానికే మురళీ ముకుంద్‌ ప్రస్తుత పాలకమండలిని బద్నాం చేయాలని చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీమ్ వర్క్‌గా ముందుకు సాగాల్సిన చోట మురళీ ముకుంద్ ఏకఛత్రాధిపత్యం కోరుకున్నారని, రెండిళ్ల పూజారిలా అటు జూబ్లీహిల్స్ పబ్లిక్‌ స్కూల్ ఛైర్మన్‌గా, ఇటు సొసైటీ కార్యదర్శిగా సర్వం తన పెత్తనమే సాగాలనుకున్నారని చెబుతున్నారు. సొసైటీ ప్రెసిడెంట్‌ను సైతం లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం ఎంత వరకు సబబని జూబ్లీ హిల్స్ సొసైటీ సభ్యులు నిలదీస్తున్నారు. సొసైటీ బైలాస్ ప్రకారం రికార్డులన్నీ కార్యదర్శి దగ్గరే ఉంటాయి. అయితే ఆ రికార్డులు పరిశీలించడానికి ఇంకెవ్వరికీ హక్కు లేదని కార్యదర్శి ఎదురు తిరగడంతోనే ఈ పేచీ అంతా వచ్చిందని అంటున్నారు.  నిజాయితీగా రికార్డులన్నీ పరిశీలించి పాత పాలకమండలి అక్రమాల్ని బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు కొత్త అధ్యక్షుడు. దీనికి మురళీ ముకుంద్ సహకరించడం లేదు. సొసైటీ కార్యదర్శిగా మురళీముకుంద్‌ పోరాడాల్సింది గతంలో పలు రికార్డులు మాయం చేసిన వారితోనా..? లేదంటే ఆ అక్రమాల్ని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న అధ్యక్షుడితోనా..? ఈ విషయంలో ఆయనకు క్లారిటీ ఉంటే ఈ గొడవలు, వివాదాలు ఉండనే ఉండవని అంటున్నారు.  జూబ్లీ హిల్స్ సొసైటీ వివాదంపై కొత్త పాలకమండలి బహిరంగ లేఖ విడుదల చేసింది... సొసైటీ ప్రెసిడెంట్ రవీంధ్రనాథ్ చౌదరి ఇచ్చిన ప్రెస్ నోట్ వివరాలు ఇలా ఉన్నాయి...  ఎన్నో ఆశలతో జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్‌ సొసైటీ సభ్యులు ఎన్నుకున్న పాలకవర్గానికి సంబంధించి గత రెండు, మూడు రోజులుగా వస్తున్న కొన్ని వార్తలు ఆవేదనను, బాధను కలిగిస్తున్నాయి. కొత్త పాలకవర్గం గురించి కొంత మంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కొన్ని వాస్తవాలు మీ ముందు ఉంచుతున్నాను.  కొత్త పాలకవర్గానికి సభ్యులు ఓట్లేసి గెలిపించింది ఎందుకు? గత 15 సంవత్సరాలుగా జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగానే కదా? ఈ విషయం కాదని ఎవరూ అనలేరు. మరి పాలకవర్గం మారాక గతంలో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చాలి కదా .. అ పనే మా పాలకవర్గం మొదలు పెట్టింది. గతంలో జరిగిన కొన్ని  స్థలాల కేటాయింపులను పరిశీలించినప్పడు అనేక అవకతవకలు బయటపడ్డాయి. వాటిని మరింత క్షుణ్ణంగా విచారించాలని పాలకవర్గం భావించింది. అందులో భాగంగానే అటువంటి ఫైళ్ళను కేపీఎంజీ లేదా డెల్లాయిట్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలతో ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని నిర్ణయించాం. ఈనెల 11వ తేదీన జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశాం. తద్వారా స్థలాల కేటాయింపులు ఎవరెవరికి ఎలా జరిగాయి. ఎంత ధరలకు ఇచ్చారనే అన్ని విషయాలు తేల్చాలని భావించాం.  కానీ కార్యదర్శి మురళీముకుంద్‌ పాత పాలకవర్గం తప్పులను బయటపెట్టే ప్రయత్నాలకు అడ్డుపుల్ల వేశారు. కమిటీ నిర్ణయాల అమలుకు కార్యరూపం ఇవ్వాల్సిన కార్యదర్శి ఫైళ్ళను తన ఆధీనంలోనే ఉంచేసుకున్నారు. అసలు గత కొంతకాలంగా ఆయన అక్రమాలకు పాల్పడ్డ వారికి అండగా నిలవాలనే వైఖరితోనే ఉన్నారు. తన అధీనంలో ఉన్న ఫైళ్ళను ఇంటి వద్దకు తీసుకెళ్ళడం లాంటి అనైతిక చర్యలకు పాల్పడ్డారు. కొంత మంది సభ్యులకు సంబంధించిన న్యాయమైన లావాదేవీలకు సంబంధించిన ఫైళ్ళను కూడా పెండింగులో పెట్టేశారు. కార్యాలయంలో ఫైళ్లు ఉన్న లాకర్లకు తాళం వేసుకుని వెళ్ళారు. ఎవరి అక్రమాలను బయటపెడతామని నమ్మి సభ్యులు మమ్మల్ని గెలిపించారో ఆ పాత పాలకవర్గంలోని పెద్దలతో మురళీ ముకుంద్ కుమ్మక్కయ్యారు. వాళ్ళ అవినీతి బయటికి రాకుండా కుట్ర పన్నారు. అందులో భాగంగానే తనను బెదిరిస్తున్నారంటూ పోలీసులకు, సహకార శాఖకు తప్పుడు ఫిర్యాదులు చేశారు.  ఈనెల 11 వ తేదీన జరిగిన సమావేశంలో తనపై ఒత్తిడి తెచ్చారని, బెదిరించారని మురళీ ముకుంద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశానంటున్నారు. అక్కడ ఏం జరిగిందనే దానికి హాజరైన సభ్యులే సాక్ష్యం. అసలు ఆ సమావేశంలో ఏం జరిగిందో తెలియాలంటే సీసీ టీవీ ఫుటేజ్ చూసినా తేటతెల్లమవుతుంది. ఆడియో, వీడియో రికార్డింగ్ ఉంది. వాటి ద్వారా  మా చిత్తశుద్ధి ఏంటో నిరూపితమవుతుంది. మురళీ ముకుంద్ ఏ ప్రయోజనాలను ఆశించారో కానీ గత పాలకవర్గంతో లాలూచీ పడ్డారు. తాను వాళ్ళతో చేరిపోయానని, పాలకవర్గాన్ని రద్దు చేయిస్తానని, ఇంకెవరికో ధారాదత్తం చేస్తానని అంటున్న ఆడియో రికార్డింగ్‌లు కూడా బయటికొచ్చాయి. ఇవి అతని నిజస్వరూపాన్ని బయటపెట్టాయి. ఈ పరిస్థితుల్లోనే బుధవారం జరిగిన సమావేశంలో సభ్యులు మురళీముకుంద్ వైఖరిని తప్పుపట్టారు. దాంతో ఆయనే సమావేశంలో అసహనాన్ని ప్రదర్శించి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. దాంతో సభ్యుల హక్కులను కాపాడే క్రమంలో పాలకవర్గం కార్యదర్శి అధికారాలను తప్పించేలా నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం కార్యదర్శికి ఉండే అధికారాలన్నీ సొసైటీ ప్రెసిడెంట్‌కు దఖలుపరుస్తూ పాలకవర్గం తీర్మానాన్ని ఆమోదించింది. సొసైటీ బైలాస్‌లో ఉన్న నిబంధనలకు అనుగుణంగానే ఈ చర్యలు తీసుకున్నాం. సొసైటీ అధ్యక్షుడు స్వయంగా ఎన్ని సార్లు అడిగినా, మొత్తం మేనేజింగ్‌ కమిటీ చెప్పినా ఫైళ్ళను ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. దాంతో ఆయన గత పాలవర్గంలో అక్రమాలు చేసిన వారితో కుమ్మక్కయ్యారనేది తేలిపోయింది. దీనివల్లే  అయనకున్న అధికారాలను తొలగించాం. దీనికి సంబంధించిన వివరాలు సంబంధిత ప్రభుత్వ విభాగాలకు అందజేస్తాం. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎట్టి పరిస్థితుల్లోను అక్రమాలను నిరోధించి తీరుతాం. సభ్యులు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం అంటూ కొత్త పాలకమండలి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. 

కాంగ్రెస్ గూటికి చెరుకు సుధాకర్? రాజకీయ పునరేకీకరణ దిశగా రేవంత్ స్కెచ్.. 

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ టార్గెట్ గా రాజకీయ పునరేకీకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ దిశగా ముమ్మర యత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కేసీఆర్ కు వ్యతిరేకంగా వివిధ వేదికల ద్వారా ఉద్యమిస్తున్న నేతలందరిని ఏకం చేసేలా ఆయన చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది. చెరుకు సుధాకర్ తో పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ప్రచార కమిటి చైర్మెన్ మధు యాష్కి గౌడ్ చర్చలు జరిపారని సమాచారం. ఆ చర్చలు ఫలించడంతో త్వరలోనే చెరుకు సుధాకర్ అధికారికంగా హస్తం గూటికి చేరనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారట. కాంగ్రెస్ లో సముచిత స్థానం ఇస్తామని చెరుకుకు పీసీసీ పెద్దలు హామీ ఇచ్చారని చెబుతున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన చెరుకు సుధాకర్ కు బలమైన అనుచర గణం ఉంది.  తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చెరుకు సుధాకర్ కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్ లో కీలక నేతగా పని చేసిన చెరుకు సుధాకర్.. చాలా సార్లు జైలుకు వెళ్లారు. తెలంగాణ ఉద్యమంలో చెరుకు సుధాకర్ పై పీడీ యాక్ట్ కూడా నమోదైంది.  వరంగల్ సెంట్రల్ జైలులో ఆయన చాలా రోజుల పాటు గడిపారు. తర్వాత కేసీఆర్ తో విభేదాలు రావడంతో ఆయన టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లో పొత్తులో భాగంగా నకిరేకల్ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించినా చివరి నిమిషంలో విఫలమైంది. నకిరేకల్ సీటును తెలంగాణ ఇంటి పార్టీకి ఇచ్చారని మొదట ప్రచారం జరిగినా.. తర్వాత సీన్ మారిపోయింది. కోమటిరెడ్డి బ్రదర్స్ వల్లే తనకు సీటు రాకుండా పోయిందని చెరుకు సుధాకర్ అప్పట్లో ఆరోపించారు. ఇటీవల జరిగిన శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెరుకు సుధాకర్ పోటీ చేశారు. గట్టిగానే పోరాడినా అనుకున్నతంగా ఓట్లు సాధించలేకపోయారు. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో మొదటి నుంచి చెరుకుకు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో చెరుకును కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించడంతో ఆయన సానుకూల స్పందించారని తెలుస్తోంది. మధుయాష్కి గూడా చెరుకు రాజకీయ భవిష్యత్ కు భరోసా ఇచ్చారని చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలో జరిగే రెండో దళిత గిరిజన దండోరా సభలోనే చెరుకు సుధాకర్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. చెరుకు సుధాకర్  తో పాటు ఆయన వర్గీయులు కూడా కాంగ్రెసు పార్టీ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

టీచర్లకు జన సమీకరణ బాధ్యతలు! జగన్ బాటలో కేసీఆర్ సర్కార్ విడ్డూరం..

ముఖ్యమంత్రి అంటే చాలా ఎంతో ప్రాముఖ్యం ఉన్న తరహాలో ఆలోచించి, నిర్ణయాలు అమలు చేస్తాడని అంతా ఆలోచిస్తారు. మంత్రివర్గంలో ముఖ్యమైనవాడు కాబట్టి ఆయన్ని ముఖ్యమంత్రి అన్నారు. కానీ... తెలంగాణ సీఎం అయినా, ఏపీ సీఎం అయినా ఇద్దరూ ఇంత వరస్ట్ గా ఎలా ఆలోచిస్తున్నారో అర్థం కాక తెలుగు ప్రజలంతా తలలు పట్టుకుంటుున్నారు.  ఆ మధ్య లాక్ డౌన్ సమయంలో ఏపీ సీఎం జగన్.. వైన్స్ షాపుల ముందు ప్రభుత్వ టీచర్లు విధులు నిర్వహించేలా ఆర్డర్లు పాస్ చేసి అభాసుపాలయ్యారు. ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి, పౌర సమాజం నుంంచి వచ్చిన వ్యతిరేకతతో ఆ నిర్ణయాన్ని వాపస్ తీసుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక అదే ఒరవడిని ఇప్పుడు తెలంగాణ సీఎం కూడా పాటిస్తున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ముంగిట ఆయనకు బుర్ర చెడిందా.. లేక బుర్ర ఉన్నవాళ్ల సలహా తీసుకోవడం లేదా తెలీదు కానీ... ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం కేసీఆర్ పరిపాలనను నవ్వులపాలు చేస్తోంది.  ఈ నెల 16న దళితబంధు స్కీము ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ హుజూరాబాద్ వెళ్తున్నారు. అక్కడ భారీఎత్తున బహిరంగ సభ నిర్వహించి ఎంతో ఘనంగా అక్కడే ఆ పథకాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక ఇందుకోసం భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని డీఈవో నుంచి టీచర్లకు, ఎంఈవోలు, జీహెచ్ఎంలకు ఆదేశాలు అందాయి. జన సమీకరణ బాధ్యత వీరిదేనని జిల్లా విద్యాధికారే చెప్పడంతో ఎడ్యుకేషన్ స్టాఫంతాా ఆ కసరత్తులో తలమునకలై ఉన్నారు. వీరంతా స్పెషల్ ఆఫీసర్లుగా ఉంటూ.. స్థానికంగా కోఆర్డినేటర్లను నియమించుకోవాలని, వారి ద్వారా జనసమీకరణ, సభ ఏర్పాట్ల పనులు పర్ఫెక్ట్ గా పూర్తి చేయాలని ఆదేశాలు అందడంతో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  దళిత బంధు ప్రభుత్వ పథకమైనా... హుజూరాబాద్ ఉపఎన్నిక అనేది పార్టీ వ్యవహారం కాబట్టి.... ఒక పార్టీకి ఉపయోగపడేలా ప్రభుత్వ స్టాఫ్ ను ఎలా వాడుకుంటారంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రైవేటు కూలీలను పెట్టి పని పూర్తి చేయించుకోవాలే తప్ప... ఖజానాలో డబ్బు లేదని ఇలా ప్రభుత్వ ఉపాధ్యాయులను రాజకీయ సభలకు వాడుకోవడం సరికాదని, దీనివల్ల పిల్లల ముందు ఉపాధ్యాయులు నైతికంగా దిగజారిపోతారన్న వ్యాఖానాలు వినిపిస్తున్నాయి. మరి జగన్ లాగే కేసీఆర్ ఈ నిర్ణయం మీద వెనుకడుగు వేస్తారా.. చూడాలి మరి.

ఇటు రెడ్డి.. అటు బండి.. మ‌రి, ఈట‌ల సంగ‌తేంటి? ఆయ‌న ఆగ‌మేనా?

'జ‌న ఆశీర్వాద యాత్ర‌'.. కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి చేయ‌బోతున్న జోర్దార్ ప‌ర్య‌ట‌న‌. ఈ నెల 19 నుంచి 21 వ‌ర‌కు షెడ్యూల్‌. కోదాడ నుంచి మొద‌లు.. వ‌యా సూర్యపేట‌, వ‌రంగ‌ల్‌, జ‌న‌గాం, ఆలేరు, యాద‌గిరిగుట్ట‌, భువ‌న‌గిరి, హైద‌రాబాద్ వ‌ర‌కు. 12 జిల్లాలు, 7 పార్ల‌మెంట్, 17 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల మీదుగా 324 కిలోమీట‌ర్ల యాత్ర‌. కిష‌న్‌రెడ్డి యాత్ర‌కు మ‌ద్ద‌తుగా బండి సంజ‌య్‌, డీకే అరుణ‌, కె.ల‌క్ష్మ‌ణ్‌ల‌తో పాటు బీజేపీ నాయ‌క‌గ‌ణ‌మంతా ఆయ‌న వెంట యాత్ర చేయ‌నుంది. మూడు రోజుల పాటు 'జ‌న ఆశీర్వాద యాత్ర‌' కొన‌సాగ‌నుంది.  రెండు రోజుల‌ గ్యాప్ త‌ర్వాత‌.. ఆగ‌స్టు 24 నుంచి ఇక అస‌లైన బీజేపీ దండ‌యాత్ర‌. నియంతృత్వ‌, కుటుంబ‌, అవినీతి పాల‌న విముక్తి కోస‌మంటూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్‌కుమార్ 'ప్ర‌జా సంగ్రామ యాత్ర'తో తెలంగాణ ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తున్నారు. విడ‌త‌ల వారీగా 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కూ ఈ యాత్ర కంటిన్యూ అయ్యేలా సుదీర్ఘ పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టింది బీజేపీ. 'ప్ర‌జా సంగ్రామ యాత్ర' తొలిద‌శ‌ హైద‌రాబాద్‌ భాగ్య‌ల‌క్ష్మి టెంపుల్ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ ఇలాకా అయిన హుజురాబాద్ వ‌ర‌కూ సుమారు 2 నెల‌ల పాటు బండి యాత్ర కొన‌సాగ‌నుంది. ఆగ‌స్టు 24న పాత‌బ‌స్తీలో బండి పాద‌యాత్ర ప్రారంభ‌మై.. గోల్కొండ, చేవెళ్ల, వికారాబాద్‌, సదాశివపేట, సంగారెడ్డి, జోగిపేట మీదుగా మెదక్‌.. అలా అలా హుజురాబాద్ వ‌ర‌కూ చేరుకుంటుంది. బండి సంజయ్‌ పాదయాత్ర విజయవంతానికి పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కీలక బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లిపోయాయి. పాదయాత్రను విజయవంతం చేసేందుకు 30 నిర్వహణ కమిటీలు ఏర్పాటు కాగా.. అవి వాటి ప‌నుల్లో బిజీగా ఉన్నాయి. బీజేపీ శ్రేణుల‌తో పాటు ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌లు పాద‌యాత్ర స‌క్సెస్‌కు ప‌క్కాగా గ్రౌండ్‌వ‌ర్క్ చేస్తున్నాయి.  తెలంగాణ‌లో ఈసారి ఎలాగైనా అధికారం చేప‌ట్టేందుకు క‌మ‌ల‌నాథులు ప‌క్కాగా పావులు క‌దుపుతున్నారు. కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి 3 రోజుల‌ 'జ‌న ఆశీర్వాద యాత్ర‌'తో పార్టీలో జోష్ తీసుకురానున్నారు. ఆ వెంట‌నే బండి సంజ‌య్ చేప‌ట్టే 'ప్ర‌జా సంగ్రామ యాత్ర'  హుజురాబాద్ చేరే వ‌ర‌కూ జ‌ర‌గ‌నుంది. ఈ రెండు యాత్ర‌ల‌పైనే బీజేపీ త‌న బ‌లాన్ని, బ‌ల‌గాన్ని ప్ర‌ధానంగా మోహ‌రిస్తోంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ రెండు యాత్ర‌లు గ్రాండ్ స‌క్సెస్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 200ల‌కు పైగా క‌మిటీలు యాత్ర స‌న్నాహాల్లో నిమ‌గ్న‌మై ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇక రాష్ట్ర‌స్థాయి బీజేపీ బ‌డా నేత‌లంతా ఈ యాత్ర‌ల్లో భాగ‌స్వామ్యం కానున్నారు. అంతా ఓకే. క‌మ‌ల‌నాథుల ప్లానింగ్ బాగుంది. యాత్ర‌ల సంగ‌తి స‌రేగానీ.. మ‌రి, హుజురాబాద్‌లో ఈట‌ల ప‌రిస్థితి ఏంటి? నేత‌లంతా యాత్ర‌లో బిజీగా ఉంటే.. కురుక్షేత్రంలో అభిమాన్యుడిలా పోరాడుతున్న ఈట‌లకు అండాదండా అందించేది ఎవ‌రు? రానున్న రెండు నెల‌ల పాటు బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్రతో పాద‌యాత్ర‌లో ఉంటే.. ఆయ‌న వెంటే కాషాయ ద‌ళ‌మంతా న‌డిస్తే.. హుజురాబాద్‌లో గులాబీ దూకుడును ఎదుర్కొంటూ ఈట‌ల వెనుక ఊరేగే వారు లేక‌పోతే ఆయ‌న ఒంట‌రివారు కారా? అనే అనుమానం వ్య‌క్తమ‌వుతోంది.  ఓవైపు అధికార టీఆర్ఎస్ ప‌లువురు మంత్రులు, డ‌జ‌న్ల కొద్ది ఎమ్మెల్యేలు, ప‌దుల సంఖ్య‌లో పార్టీ నాయ‌కుల‌ను హుజురాబాద్‌లో మోహ‌రించి.. ఫంక్ష‌న్ హాళ్లు, హోట‌ళ్లలో తిష్ట వేసి.. ఈట‌ల అనుచ‌రులంద‌రికీ వ‌ల‌లు విసిరి.. ద‌ళిత బంధుతో ఊద‌ర‌గొట్టి.. దూకుడు మీదుంటే.. బీజేపీ మాత్రం ఈట‌ల‌ను అనామ‌కుడిలా వ‌దిలేసి.. క‌మ‌ల‌నాథులంతా యాత్ర‌ల్లో మునిగితేలుతుంటే.. అస‌లుకే ఎస‌రు వ‌చ్చే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని అంటున్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక‌ను.. ఈట‌ల వ్య‌క్తిగ‌త పోరుగానే బీజేపీ చూస్తోందా? అనే అనుమానం. రాజేంద‌ర్ గెలుపుతో బీజేపీకి అద‌నంగా వ‌చ్చే లాభం లేమీ లేద‌ని.. ఆయ‌న గెలిచినా.. ఆ క్రెడిట్ కాషాయం ఖాతాలో కాకుండా ఈట‌ల అకౌంట్లోనే ప‌డుతుంద‌ని.. ఓడినా పెద్ద‌గా పోయేదేమీ లేద‌ని భావిస్తోందా? అనే డౌట్‌. అందుకే క‌మ‌ల‌నాథులు ఈట‌ల గెలుపుకంటే కూడా తెలంగాణ వ్యాప్తంగా పార్టీ బ‌లోపేతంపైనే అధికంగా దృష్టి సారించార‌ని అంటున్నారు.  కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి 'జ‌న ఆశీర్వాద యాత్ర‌', బండి సంజ‌య్ 'ప్ర‌జా సంగ్రామ యాత్ర'ల‌తో కాషాయ‌ద‌ళ‌మంతా బిజీగా మారిపోయింది. ఈ యాత్ర‌ల ఎఫెక్ట్ ఈట‌ల గెలుపోట‌ముల‌పై త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని అంటున్నారు. హుజురాబాద్‌లో ఎన్నిక‌లు పెట్టుకొని.. ఈ స‌మ‌యంలో న‌ల్గొండ‌, వ‌రంగ‌ల్‌, హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మెద‌క్ జిల్లాల్లో యాత్ర‌లు చేస్తే.. అది ఈట‌ల‌కు ఏమాత్రం లాభం చేకూర్చ‌క‌పోగా.. న‌ష్ట‌మే జ‌రుగుతుంద‌ని విశ్లేషిస్తున్నారు. మ‌రి, క‌మ‌ల‌నాథులు ఆలోచ‌న ఎలా ఉందో.. ఎందుకు ఇలా పోటాపోటీ యాత్ర‌లు చేస్తున్నారో.. వారికో తెలియాలి.. బీజేపీలో జూనియ‌ర్ అయిన ఈట‌ల రాజేంద‌ర్ మాత్రం ఆ యాత్ర‌ల విష‌యంలో ఏమాత్రం సంతృప్తిగా లేర‌ని స‌మాచారం. కీల‌క స‌మ‌యంలో త‌న ఇలాకాలో, త‌న‌కు మ‌ద్ద‌తుగా ఉండ‌కుండా.. యాత్ర‌ల పేరుతో తోటి క‌మ‌ల‌నాథులంతా త‌న‌ను ఒంట‌రి వాడిని చేస్తున్నార‌నే అస‌హ‌నం స‌న్నిహితుల ద‌గ్గ‌ర వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలుస్తోంది. నిజ‌మేగా..! ఈట‌ల వాద‌న‌లోనూ వాస్త‌వం ఉందిగా...!!

జగన్ కేబినెట్ నుంచి 18 మంది అవుట్? కొత్తగా చోటు దక్కేది వీరికేనా?

సమయం దగ్గర పడుతోంది. పాత నీటిని సాగనంపి కొత్త నీటితో కొత్త కలరివ్వాలి. ముఖ్యమంత్రి జగన్ ముందే చెప్పినట్టు రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గంలో మార్పులుంటాయని, అందుకు అందరూ సమ్మతించాలని, ఎవ్వరు కూడా తోకలు జాడించకుండా వారి నుంచి ప్రమాణ పత్రాలు కూడా జగన్ రాయించుకున్నారు ఎంతో ముందుచూపుతో. జగన్ మంత్రివర్గంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులతో పాటు 20 మంది కేబినెట్ మినిస్టర్స్ ఉన్నారు.  వచ్చే దసరాకు కేబినెట్ రీషఫుల్ చేయాలనే యోచనలో జగన్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరి సీటుకు  ఎసరొస్తుందో.. ఎవరు కంటిన్యూ అవుతారనేది వైసీపీలోనే గాక ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిగ్గా మారింది.  ఇప్పుడున్న సమాచారం ప్రకారం పద్దెనిమిది మందికి పైగా మంత్రులకు ఉద్వాసన తప్పదంటున్నారు. కొత్తవారికి చాన్స్ ఇవ్వడంతో పాటు కొన్ని సామాజికవర్గాలకు పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. తొలి దఫాలో రెడ్డి సామాజిక వర్గం నుండి నలుగురికి మాత్రమే అవకాశం కల్పించారు జగన్. అప్పట్లో ముఖ్యమంత్రి కాకుండా రెడ్డి సామాజిక వర్గం నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు), బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (కర్నూలు), మేకపాటి గౌతమ్‌రెడ్డి ( నెల్లూరు), బాలినేని శ్రీనివాస రెడ్డి ( ప్రకాశం)కి కేబినెట్ లో చోటు దక్కింది. గుంటూరు, అనంతపురం నుంచి గెలుపొందిన రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఎన్ని ప్రయత్నాలుచేసినా జగన్ కరుణించలేదు. తరువాత  చూద్దాం లే అంటూ దాటవేశారు. ఇప్పుడు వారంతా తమకు తప్పకుండా చోటు దక్కుతుందన్న భావనలో ఉన్నారు.  శ్రీకాకుళం నుంచి: ధర్మాన కృష్ణ దాస్, సీదిరి అప్పల రాజు మంత్రివర్గంలో వున్నారు. నర్సన్నపేట నియోజకవర్గం నుండి గెలుపొందిన ధర్మాన కృష్ణ దాస్ ది కొప్పులవెలమ సామాజిక వర్గం. సీదిరి అప్పల రాజు అనూహ్యంగా మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నవారు. గుంటూరు జిల్లా రేపల్లె లో వైకాపా అభ్యర్థి గా పోటీ చేసి ఓడిపోయిన మోపిదేవి వెంకటరమణరావుకి సామాజిక సమీకరణలో భాగంగా జగన్ కేబినెట్ లో చోటు దక్కింది. మోపిదేవిని ఆ మధ్య రాజ్యసభకు పంపడంతో ఏర్పడిన ఖాళీని అప్పల రాజుతో పూరించారు. ధర్మాన కృష్ణ దాస్ ను తొలగించి ధర్మాన సోదరుడు మాజీ మంత్రి అయిన శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది.  ఇక స్పీకర్ గా ఉన్న ఒకనాటి మాజీ మంత్రి కళింగ సామాజికవర్గానికి చెందిన ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. స్పీకర్ గా వైదొలిగి మంత్రి కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. తూర్పు కాపు సామాజిక వర్గం నుండి పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి మహిళా కోటాలో... ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ లు మంత్రి పదవి ఆశిస్తున్నా వీరిద్దరూ మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు కాబట్టి చాన్స్ లేనట్టేంటున్నారు. విజయనగరం నుంచి: చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మంత్రి మండలిలో కొనసాగుతున్నారు. కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. గిరిజన కోటాలో అత్యున్నత పదవి పొందిన పుష్పశ్రీవాణి పనితీరు బాగుందని టాక్. అయితే జిల్లాలో బొత్స శిష్యుడు వైశ్య సామాజిక వర్గానికి చెందిన విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన వెలంపల్లి శ్రీనివాస రావు (కృష్ణా జిల్లా) ని మంత్రి మండలి నుండి తప్పిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. జిల్లాలో తూర్పు కాపులు బలమైన సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం నుండి బొత్స సత్యనారాయణ తో పాటు బొత్స సోదరులు అప్పల నర్సయ్య, మేనల్లుడు బడుకొండ అప్పల నాయుడు ఎమ్మెల్యేలు గా రాణిస్తున్నారు. పుష్పశ్రీవాణి ని మార్చాల్సి వస్తే జిల్లాలోని సాలూరు ఎమ్మెల్యే వరుసగా మూడు సార్లు గెలుపొందిన గిరిజనుడు పి. రాజన్నదొర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విశాఖపట్నం నుంచి: విశాఖ జిల్లా మొత్తం మీద ఒకే ఒక్కడిగా మంత్రిమండలిలో వెలుగొందుతున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎన్నికలకు ముందుగా వైకాపా లో చేరారు. అప్పటి వరకు తెదేపా ఎంపిగా అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించిన ముత్తంశెట్టి వైకాపాలో భీమిలి నుంచి పోటీ చేసి గెలిచి ఎకాఎకిన మంత్రి అయిపోవడం వైకాపా లోని చాలామంది సీనియర్ నేతలకే అంతుచిక్కలేదు. అయితే ముత్తంశెట్టిని మార్చాల్సి వస్తే ఇదే సామాజిక వర్గానికి చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.  తూర్పు కాపు (బిసి) సామాజిక వర్గం నుండి చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, కొప్పుల వెలమ (బిసి)ల కోటా లో నర్సీపట్నం ఎమ్మెల్యే, సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు పి. ఉమా శంకర గణేష్ లు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉమా శంకర్ గణేష్ అప్పటి మంత్రి, తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడ్ని భారీ ఆధిక్యతతో ఓడించడం కలిసొచ్చే అంశం. కొప్పుల వెలమల నుండి ధర్మాన బ్రదర్స్ లో ఒకరికి శ్రీకాకుళం జిల్లా నుండి ఛాన్స్ ఇచ్చినా మరొకరికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇవ్వాల్సి వస్తే తనకు అవకాశం ఇవ్వాలంటూ ఉమా శంకర గణేష్ ప్రయత్నాలు వేగిరం చేశారు. ఇందుకు సోదరుడు పూరీ జగన్నాధ్ కూడా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. తూర్పు గోదావరి నుంచి: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్న బాబు, అమలాపురం ఎస్సీ రిజర్వుడు ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్, రామచంద్రాపురం నుండి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ లు మంత్రి మండలిలో వున్నారు. కురసాలను కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవి వరించనుందని ప్రచారం జరుగుతోంది. తుని ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా కూడా మంత్రి పదవి కోసం ఎప్పటినుంచో రేసులో ఉన్నారు. ఇటీవలే శాసనమండలికి ఎంపికైన తోట త్రిమూర్తులు కూడా పోటీ పడుతుండటంతో ఆసక్తికరంగా మారింది. తోట త్రిమూర్తులుకి వరసకు వియ్యంకుడైన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకి మంత్రి వర్గంలో చోటు కల్పించనున్న నేపథ్యంలో త్రిమూర్తులుకి చోటు లేనట్టేనంటున్నారు. దళిత సామాజికవర్గ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ ని మార్చబోవడం లేదు. శాఖ మారితే మారొచ్చు అంటున్నారు. ఈ జిల్లా లో కాపులుగా చలామణీ అయ్యే తెలగ బలిజ సామాజిక వర్గం నుండి కురసాల కన్నబాబును మినహాయిస్తే దాడిశెట్టి రాజా(తుని), పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ (ప్రత్తిపాడు), పెండెం దొరబాబు ( పిఠాపురం), జక్కంపూడి రాజా ( రాజానగరం), జ్యోతుల చంటిబాబు (జగ్గంపేట)తో పాటు.. తోట త్రిమూర్తులు ఒక్క ఛాన్స్ కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు.  పశ్చిమ గోదావరి నుంచి : ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), ఆచంట ఎమ్మెల్యే సి.హెచ్. శ్రీరంగనాథరాజు, కొవ్వూరు ఎస్సీ రిజర్వుడు ఎమ్మెల్యే తానేటి వనితలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఆళ్ల నాని కొనసాగనుండగా రంగనాథ రాజు, తానేటి వనితల్ని తొలగించనున్నట్టు సమాచారం. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన రంగనాథరాజు స్థాననంలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజుకి చోటు దక్కనుండగా యాదవ సామాజిక వర్గం నుండి తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ని మంత్రివర్గం నుండి తప్పించనున్నారన్న వార్త విస్తృతంగా ప్రచారంలో ఉండడంతో కారుమూరి నాగేశ్వరరావు తన అదృష్టాన్ని పరీక్షంచుకోబోతున్నారు. ఆళ్లనాని సామాజికవర్గానికే చెందిన భీమవరం ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించిన గ్రంధి శ్రీనివాస్ ఈసారి రేసులో ఉన్నారు.  కృష్ణా నుంచి: కృష్ణా జిల్లా బందరు నుండి పేర్ని వెంకట్రామయ్య (నాని), గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని), విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మంత్రివర్గంలో ఉండగా తెలగ కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని నానికి ఉద్వాసన కలిగించి ఇదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ భానుకి చోటు కల్పించే అవకాశం ఉందంటున్నారు. వైశ్యుల కోటాలో వెలంపల్లి శ్రీనివాసరావు ప్లేస్ మెంట్ సురక్షితంగానే కనిపిస్తున్నా... విజయనగరం నుండి వీరభద్రస్వామి, ప్రకాశం జిల్లా గిద్దలూరు నుండి అన్నా రాంబాబు తమ ప్రాధాన్యతను గుర్తించాల్సిందిగా పట్టు బడుతున్నారు. వెలంపల్లిని తప్పిస్తేనే మరొకరికి ఛాన్స్ దొరుకుతుంది. బ్రాహ్మణుల కోటాలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం ఆశిస్తున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థ సారథి యాదవ్, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ గౌడ్ లు వెనుకబడిన తరగతుల కోటాలో మంత్రి పదవి ఆశిస్తుండగా వీరిలో ఒకరికి తప్పక అవకాశం ఉంటుందని సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు (ఎస్సీ రిజర్వుడు) ఎమ్మెల్యే తానేటి వనితను తప్పించి ఆ ఖాళీని కృష్ణా జిల్లా నుండి భర్తీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలు ఆంధ్ర ప్రదేశ్ లోనే అతిపెద్ద జిల్లాలు కావడంతో ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాల నుండి ఎక్కువ సంఖ్యలో మంత్రులు కొలువు తీరే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లా నుండి నలుగురు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి ముగ్గురు గుంటూరు, కృష్ణా జిల్లాల నుండి ఒక్కొక్క జిల్లా నుండి నలుగురికి తగ్గకుండా అవకాశం లభించే వీలుంది. గుంటూరు నుంచి: పత్తిపాడు (ఎస్సీ రిజర్వుడు) ఎమ్మెల్యే ఎం.సుచరిత హోమ్ మంత్రిగా ఉన్నారు. వెనుకబడిన తరగతుల నుండి మంత్రి పదవి పొందిన మోపిదేవి వెంకటరమణ రావు రాజ్యసభకు ఎంపికయ్యారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం నుండి కోన రఘుపతి మంత్రి పదవి ఆశిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుండి తీవ్రమైన ఒత్తిడి ఉంది. వరుసగా నాలుగుసార్లు గెలిచిన మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వరుసగా రెండుసార్లు గెలిచిన నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలలో ఒకరికి మంత్రి పదవి తప్పదనే ప్రచారం సాగుతోంది. ఆశావహులలో ప్రత్యేకించి పేర్కొన దగినవారు ఎస్సీ మాదిగ సామాజికవర్గానికి చెందిన తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, బి.సి. రజక సామాజికవర్గానికి చెందిన చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజిని కూడా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ఇరువురు మహిళలు తెలగ బలిజ కులస్తుల్ని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఇరువురు మహిళా ఎమ్మెల్యేలు విద్యాధికులే. ఇటీవల విడుదల రజిని ముఖ్యమంత్రిని కలసి ప్రత్యేకంగా చర్చించడం కూడా చర్చనీయాంశం అయ్యింది.  ముస్లిం మైనారిటీల నుండి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మంత్రివర్గంలో చోటు కోసం తహతహలాడుతున్నారు. వరుసగా రెండుసార్లు వైకాపా అభ్యర్థిగా గెలిచి రావడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఇక అంబటి రాంబాబు 1989 తర్వాత మళ్లీ 2019 ఎన్నికల్లో గెలిచి వచ్చారు.తెలగ కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు సత్తెనపల్లి నుండి 2014 లో ఓడిపోయినా 2019 ఎన్నికల్లో కోడెల శివప్రసాద్ రావు పై భారీ ఆధిక్యంతో గెలుపొంది మంత్రి పదవి ఆశించారు. భంగపాటు తప్పలేదు. ఇప్పుడు తనవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్య రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఈయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అల్లుడు.  ప్రకాశం నుంచి: ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎర్రగొండ పాలెం (ఎస్సీ రిజర్వుడు) ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్ మంత్రులుగా కొనసాగే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుండి ఎం.మహీధర్ రెడ్డి (కందుకూరు) కి అవకాశం ఉందంటున్నారు. వైశ్యుడైన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. అన్నా రాంబాబు 78 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందడం ఒక కారణంగా చూపుతున్నారు. నెల్లూరు నుంచి: నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ని మంత్రివర్గం నుండి తప్పించనుండగా, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రి వర్గంలో కొనసాగుతారు. ఒకవేళ గౌతమ్ రెడ్డిని తప్పించాల్సివస్తే.. సీనియర్ అయిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కి బెర్త్ కన్ఫర్మ్ అయ్యే చాన్సుంది.  సూళ్లూరుపేట (ఎస్సీ) రిజర్వుడ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే చిత్తూరు జిల్లాకి చెందిన ఉప ముఖ్యమంత్రి, గంగాధర నెల్లూరు (ఎస్సీ రిజర్వుడ్) ఎమ్మెల్యే కె.నారాయణ స్వామిని తప్పిస్తేనే కిలివేటి సంజీవయ్య కు ఛాన్స్ అని తెలుస్తోంది. చిత్తూరు నుంచి: పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి వర్గంలో కంటిన్యూ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దళిత సామాజికవర్గం నుండి కె.నారాయణస్వామిని తప్పిస్తే నెల్లూరు జిల్లాలో కానీ అనంతపురం, కడప జిల్లాల నుండి కానీ దళితులకి అవకాశం కల్పిస్తారు. రెడ్డి సామాజిక వర్గం నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్.కె. రోజా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కడప నుంచి: కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా కొనసాగుతారు. ఈసారి ముస్లిం మైనారిటీల నుండి మరొకరికి కూడా అవకాశం కల్పించాలనే సమీకరణాలలో భాగంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జగన్ సొంత జిల్లా కావడంతో మైనారిటీలతో పాటు దళితులకు కూడా పెద్దపీట వేయాలని యోచిస్తున్నారు. బద్వేలు (ఎస్సీ రిజర్వుడ్) ఎమ్మెల్యే జి.వెంకట సుబ్బయ్య మరణించడంతో రైల్వే కోడూరు (ఎస్సీ రిజర్వుడ్) ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఒక్కరే మిగిలారు. వరుసగా నాలుగు సార్లు గెలిచిన కొరముట్ల శ్రీనివాసులు మూడుసార్లు వైకాపా తరపున గెలిచి రావడం ఆయనకి బాగా కలిసి వస్తున్న అంశం. అయితే నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో మొత్తమ్మీద ఇద్దరు తక్కువ కాకుండా మంత్రుల్ని దళిత సామాజిక వర్గం నుండి ఎంపిక చేసే అవకాశం ఉంది.  అనంతపురం నుంచి: పెనుకొండ ఎమ్మెల్యే, కురబ(బిసి) సామాజిక వర్గానికి చెందిన ఎమ్.శంకర్ నారాయణ ప్రస్తుత మంత్రి వర్గంలో ఉన్న ఏకైక మంత్రి. కనీ వినీ ఎరుగని రీతిలో దాదాపు రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు పోటాపోటీగా మంత్రి పదవిని ఆశిస్తున్న జిల్లా అనంతపురం జిల్లా కావడం విశేషం. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే ఎల్లారెడ్డి వెంకటరామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎవరి స్థాయిలో వారు మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవడం కోసం రకరకాల కారణాలు చూపుతున్నా... పరిటాల సునీతపై రెండు సార్లు ఓడిపోయి పరిటాల శ్రీ రామ్ ని 2019లో ఓడించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు, మాజీ ఎమ్.పి. కూడా అయిన అనంత వెంకటరామిరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో అంతిమ విజేత ఎవరో చూడాలి. ఈ జిల్లా నుండి రెడ్డి కులస్తులెవ్వరికీ అవకాశం ఇవ్వకూడదు అనుకుంటే ఉషశ్రీ చరణ్... రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. తను కురబ (బి.సి) సామాజిక వర్గం, భర్త రెడ్డి కావడంతో సమీకరణ సరిపోతుందంటున్నారు.  దళితుల కోటాలో శింగనమల (ఎస్సీ రిజర్వుడ్) నుండి జొన్నలగడ్డ పద్మావతి, మడకశిర (ఎస్సీ రిజర్వుడ్) నుండి డాక్టర్ ఎమ్.తిప్పేస్వామి పోటీపడుతున్నారు. తిప్పేస్వామి సీనియర్. ఆయన వరుసగా మూడుసార్లు గెలిచారు. అయితే తిప్పేస్వామి... ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న ఆదిమూలపు సురేష్ స్వయంగా బావా-బావమరుదులు. సురేష్ ని తప్పిస్తేనే తిప్పేస్వామికి అవకాశం లేకుంటే నో ఛాన్స్.  కర్నూలు నుంచి: ఆలూరు ఎమ్మెల్యే బోయ (బి.సి) సామాజికవర్గానికి చెందిన పి.జయరామ్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. తొలిసారి మంత్రివర్గ సమయంలో ఒత్తిడికి గురైన వైకాపా అధినాయకత్వం అప్పుడు తట్టుకోగలిగిన ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతోంది. శ్రీశైలం నుండి శిల్పా చక్రపాణి రెడ్డి, నంద్యాల నుండి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తమలో ఒకరికి అవకాశం కల్పించాల్సిందేనని పట్టు బడుతున్నారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి కూడా పైరవీలు చేసుకుంటున్నారు.  మొత్తానికి 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత కొందరిని సంతృప్తి పరిచిన జగన్... మరికొందరిని రెండున్నర ఏళ్ల పాటు అని ఊరించడం వల్లే ఈ తిప్పలన్నీ అంటున్నారు. మరి ఈ సస్పెన్స్ వీడాలంటే దసరా వరకు ఎదురు చూడాల్సిందే.

విపక్ష శిబిరంలో విందు రాజకీయాల జోరు.. మోడీ టార్గెట్ గా ఏకమయ్యేనా? 

ఢిల్లీలో ఇప్పుడు విందు రాజకీయాల సీజన్ నడుస్తోంది. పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న సమయంలోనే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ ఐదు రోజులు ఢిల్లీలో మకాం చేశారు. ఈ ఐదు రోజులలోనూ ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా వివిధ పార్టీల నాయకులను విడివిడిగా కలిశారు. విందులలో, తేనీటి విందులలో పాల్గొని, విపక్షాల ఐక్యతగా గీతానికి సిగ్నేచర్ ట్యూన్ సెట్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఢిల్లీ  కాన్సిట్యూషన్ క్లబ్’లో  ప్రతిపక్ష పార్టీల నాయకులకు అల్పాహర విందు ఇచ్చారు. ఇంచుమించుగా రెండు దశాబ్దాలకు పైగా క్రియాశీల రాజకీయాల్లో, 17 ఏళ్ళకు పైగా పార్లమెంట్ సభ్యునిగా ఉన్న రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా పెద్దగా కాంగ్రెస్ గడప దాటలేదు. రాహుల్ గాంధీ కాంగ్రేస్సేతర పార్టీల నాయకులతో కలిసి కూర్చున్న సందర్భాలను వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చును. అలాంటిది ఈ మద్య ఆయన తరచూ విపక్ష పక్షాల నాయకులతో ముచ్చట్లు పెడుతున్నారు.  గత వారంలో కాంగ్రెస్ జీ 23 నాయకుడు, కపిల్ సిబల్ విపక్ష పార్టీల నాయలకు విందు నిచ్చారు.ఇక ఇప్పుడు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ వంతు వచ్చింది. ఆమె యూపీఏ భాగస్వామ్య పార్టీల ముఖ్యమంత్రులతో పాటుగా, భావసారుప్యత ఉన్న పార్టీల ముఖ్యమంత్రులు,  ముఖ్య నేతలకు ఆగష్టు మూడవ వారంలో విందు ఏర్పాటు చేశారు. అయితే, తాజా సమాచారం ప్రకారం అందరూ ఢిల్లీ రావడం కుదరక పోవడం వల్లనో ఏమో, సోనియా గాంధీ, విందుకు బదులుగా ఆగష్టు 20 న వర్చువల్’‘గా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. తృణమూల్ అధినేత్రి  మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్దావ్ థాకరే, తమిలందు మ ముఖ్యమంత్రి, డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం, జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’తో పాటుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు.     ఈ సమావేశం కానీ, ఇంతకు ముందు జరిగిన, ఇక ముందు జరిగే సమావేశాలు కానీ,  అన్నిటి లక్ష్యం,అందరి లక్ష్యం ఒక్కటే, విపక్షలాను ఏకతాటిపైకి తీసుకువచ్చి, 2024 ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని మోడీని ఓడించడం. ఈ అజెండా చుట్టూనే విపక్ష పార్టీలు ప్రదక్షిణ చేస్తున్నాయి.  కిందా మీద అవుతున్నాయి.  రెండు నెలల క్రితం జూన్ నెలలో  ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్ కిశోర్ ఒకసారి ముంబైలో మరోమారు ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ను కలవడంతో మొదలైన విపక్షాల ఐక్యత యత్నాలలో ఇంతవరకు పెద్దగా ముందడుగు పడలేదు. ఇంతవరకు   సాధించింది కూడా ఏమీ లేదు. ఎక్కడ వేసిన గొంగళి  అక్కడే అన్న చందంగానే ఐక్యత కథ నడుస్తోంది అంతే కాదు, ఒక విధంగా, అలీ లేదు చూలూ లేదు కొడుకు పేరుసోమ లింగం అన్నట్లుగా, పుట్టని ఫ్రంట్ నాయకత్వం కోసం విపక్షాల మధ్య అప్పుడే పోటీ మొదలైంది. ఓ వంక నుంచి మమత, మరో వంక పవార్ మధ్యలో రాహుల్ గాంధీ, బీజేపీ, మోడీ వ్యతిరేక ‘కాషాయ ద్వేష కూటమి’ నాయకత్వం కోసం పోటీ పడుతున్నారు. అదలా ఉంటే, విపక్షాల ఐక్యతా రాగం కాంగ్రెస్’లో పార్టీలోని విబేధాలకు మరింతగా బయట పెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు.  పార్లమెంట్ సమావేశాలు జరుగతున్న సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన అల్పాహార విందుకు, జీ 23 నేతలకు ఆహ్వానం లేదు. అందుకు ప్రతిగా జీ23 నేత కపిల్ సిబల్ ఇచ్చిన విందుకు సోనియా, రాహుల్ సహా గాంధీలు ఎవరికీ ఆహ్వానం లేదు. పైగా, సిబల్ విందులో రాహుల్ గాంధీ విందులోపాల్గొనని వైసీపీ, తెరాస, బిజు జనతా దళ్, ఆప్, శిరోమణి అకాలీదళ్  వంటి పార్టీలు కూడా హాజరయ్యాయి. అంతే కాకుండా కపిల్ సిబల్ విందుకు మీడియాలో ఎక్కువ కవరేజ్ వచ్చింది. అందుకే ఇప్పుడు రాహుల్ గాంధీ కాకుండా నేరుగా సోనియా గాంధీ రంగంలోకి దిగారు. అదలా ఉంటే. ఇలా పోటీ పోటీగా సాగుతున్న విందు రాజకీయాలను దగ్గరగా చూస్తున్న విశ్లేషకుల  విపక్షాల ఐక్యత విషయం ఎలా ఉన్నా, విపక్షలా మూలా స్థంభం కాంగ్రెస్ విబేధాలు బయట పడుతున్నాయని అనటున్నారు. అంటే కాదు,కాంగ్రెస్’లో మరో చీలిక అనివార్యంగా కనిపిస్తోందని అంటున్నారు. అలాగే, విపక్ష్ల ఐక్యతా ప్రయత్నాలు, హనుమంతుని చేయబోతే కోతి బొమ్మ తయారైంది అన్నట్లుగా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  అయితే, ఇప్పటికిప్పుడు, అంతిమ తీర్పుఇవ్వలేమని కూడా అంటున్నారు.

వైఎస్ సునీత ఫిర్యాదుపై యాక్ష‌న్‌.. రెక్కీ చేసిన మ‌ణికంఠారెడ్డి అరెస్ట్‌..

ఇంటిచుట్టూ తిరిగాడు. ఇంట్లో ఎవ‌రున్నారా అని అబ్జ‌ర్వ్ చేశాడు. గేటు బ‌య‌ట ఆగి ఎవ‌రెవ‌రికో ఫోన్లు చేశాడు. మాకు భ‌యంగా ఉంది. మా కుటుంబానికి ప్రాణ‌హాని ఉంది. వెంట‌నే ర‌క్ష‌ణ క‌ల్పించ‌మంటూ సీబీఐని, క‌డ‌ప జిల్లా ఎస్పీని కోరారు వైఎస్ వివేకానంద‌రెడ్డి కూతురు సునీత‌. ఆమె ఫిర్యాదుపై పోలీసులు రంగంలోకి దిగారు. సీసీకెమెరా ఫూటేజీని ప‌రిశీలించారు. సునీత అనుమానం వ్య‌క్తం చేసినట్టుగానే ఆ అగంత‌కుడు మ‌ణికంఠారెడ్డి అని గుర్తించారు. పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సునీత ఇంటి ద‌గ్గ‌ర రెక్కీ ఎందుకు చేశారు? ఎవ‌రి ఆదేశాల మేర‌కు చేశారు? అక్క‌డి నుంచి ఎవ‌రెవ‌రికి ఫోన్లు చేశారు? అని మ‌ణికంఠారెడ్డిని ప్ర‌శ్నిస్తున్నారు పులివెందుల పోలీసులు.  వైఎస్ సునీత ఫిర్యాదుతో శుక్ర‌వారం నుంచి పులివెందుల‌లో అల‌జ‌డి మొద‌లైంది. తమ కుటుంబానికి ప్రాణ‌హాని ఉంద‌ని.. భద్రత కల్పించాలని కడప ఎస్పీకి వైఎస్‌ సునీత లేఖ రాయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ నెల 10న సాయంత్రం 5:20 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటికి స‌మీపంలో ఆగి ఎవ‌రికో ఫోన్‌ కాల్స్ చేశాడని లేఖలో సునీత తెలిపారు. ఆ వ్యక్తి మణికంఠరెడ్డి అని.. శివశంకర్‌రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత చెప్పారు. తన తండ్రి వైఎస్ వివేకా హత్యకేసులో శివశంకర్‌రెడ్డి కీలకమైన అనుమానితుడని, అత‌ని అనుచ‌రుడు మ‌ణికంఠ‌రెడ్డి త‌మ ఇంటి ద‌గ్గ‌ర రెక్కీ నిర్వ‌హించడం త‌మ‌కు భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోందని సునీత వాపోయారు. త‌మ కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంతో పాటు.. త‌న తండ్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో శివశంకర్‌రెడ్డి పాత్రను నిగ్గు తేల్చాలని సీబీఐని కోరారు సునీత‌. ఆమె ఫిర్యాదుతో క‌దిలిన పోలీస్ యంత్రాంగం.. తాజాగా మ‌ణికంఠారెడ్డిని అదుపులోకి తీసుకొని రెక్కీపై విచారిస్తోంది. పులివెందుల‌లోని సునీత ఇంటి ద‌గ్గ‌ర పోలీసు బందోబ‌స్తు కూడా ఏర్పాటు చేశారు.   మ‌రోవైపు, వైఎస్ వివేక హ‌త్య కేసు విచార‌ణ వేగంగా జ‌రుగుతోంది. రెండు నెల‌లుగా సీబీఐ ఇదే ప‌ని మీద ఉంది. వాచ్‌మెన్ వాంగ్మూలం కీల‌కంగా మారింది. కొంద‌రు పెద్ద‌లు మిన‌హా అనుమానితులంద‌రినీ ప్ర‌శ్నిస్తోంది. వేరు వేరు కోణాల్లో ఎంక్వైరీ చేస్తోంది. నిందితుడు సునీల్‌ను ఇప్ప‌టికే అరెస్ట్ చేసింది. ఇంకా చాలామంది పేర్లే వినిపిస్తున్నాయి. గొడ్డ‌లిపోటును గుండెపోటుగా ప్ర‌క‌టించిన వారినీ విచారించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సీబీఐ ద‌ర్యాప్తు వేగం పుంజుకుంటున్న నేప‌థ్యంలో.. స‌డెన్‌గా వైఎస్ వివేకా కూతురు సునీత ఇంటి ద‌గ్గ‌ర మ‌ణికంఠారెడ్డి రెక్కీ నిర్వ‌హించడం సంచ‌ల‌నంగా మారింది. పోలీస్ ఎంక్వైరీలో రెక్కీకి కార‌ణాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంది. వ‌రుస ప‌రిణామాలు చూస్తుంటే.. వివేక హ‌త్య వెనుక పెద్ద త‌ల‌కాయ‌లే ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.   

బీజేపీ అధ్య‌క్షుడిపై మ‌ర్డ‌ర్ అటెంప్ట్‌.. దాడి వెనుక వైసీపీ హ‌స్తం?

ఆయ‌నేమీ చిన్నాచిత‌కా నాయ‌కుడు కాదు. బీజేపీలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే లీడ‌ర్. అలాంటి నేత‌పై అటాక్ జ‌రిగింది. మార్నింగ్ వాకింగ్‌కు వెళ్తుండ‌గా.. కాపు కాసి.. స్కెచ్ వేసి.. ప‌క్కాగా దాడి చేశారు దుండ‌గులు. కర్ర‌ల‌తో దాడి చేసి కొట్ట‌డంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. విష‌యం తెలిసి క‌మ‌ల‌నాథులు ఉలిక్కిప‌డ్డారు. స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం చెల‌రేగింది. అస‌లు ఏం జ‌రిగిందంటే.... వినుగొండ బీజేపీ పట్టణ అధ్యక్షుడు మేడం రమేష్‌పై హత్యాయత్నం సంచలనం రేపింది. మార్నింగ్ వాక్‌కు వెళ్తున్న ఆయనపై దుండగులు ఒక్క‌సారిగా దాడి చేశారు. పట్టణంలోని డైమండ్‌ టవర్స్‌లో నివాసముండే ర‌మేశ్‌.. ద్విచక్ర వాహనంపై ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో వాకింగ్‌కు బయలుదేరారు. రోడ్డు మలుపు తిరుగుతుండగా ముఖానికి మాస్క్‌లు ధరించి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు ఆయ‌న్ను అడ్డగించారు. వెనుక నుంచి మ‌రో ముగ్గురు వ‌చ్చారు. అంతా క‌లిసి.. రౌండ‌ప్ చేసి.. కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాల‌తో.. రక్తస్రావం అవుతూ.. కింద‌ప‌డిపోయారు ర‌మేశ్‌.  బీజేపీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు ర‌మేశ్‌పై జ‌రిగిన దాడిని చూసిన చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. ర‌మేశ్‌కు చెయ్యి విరిగింది. తలకు, కాలికి గాయాల‌య్యాయి. మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట తరలించారు. స్థానిక వైసీపీ నాయ‌కులు, వినుకొండ మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులుపై ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.   

ఆంధ్రా ప్రజల కొంప ముంచటానికే జగన్ లో ఇంత మార్పా?

జగన్ లో అకస్మాత్తుగా ఇంత మార్పు ఎందుకొచ్చినట్టు? ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా అయ్యగారు అమిత్ షా దగ్గర హాజరుపడే వైఎస్ జగన్.. తాజాగా అయ్యగారే ఏపీకి వస్తే ఆ రాచమర్యాదల జాడలేవీ కనిపించలేదే. ఏమైంది వీరికి... ఎక్కడ బెడిసికొట్టింది వీరి మధ్య. ఈ గ్యాప్ రావడానికి కారణమేంటి? ఎవరూ గుర్తించనంత గ్యాప్ అంటే లైట్ తీసుకోవచ్చు. కానీ... మీడియా సాక్షిగా అందరికీ తెలిసిపోయిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. దక్షిణకాశీగా పేరున్న శ్రీశైలానికి భార్యాసమేతంగా వస్తే... జగన్ అధికార లాంఛనాలతో కనీస స్వాగతాలు పలుకలేదెందుకని అటు ఆంధ్రాలోనే కాదు.. తెలంగాణలో సైతం ప్రజలంతా చెవులు కొరుక్కుంటున్నారు. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో ఈ విషయం మీద పెద్ద చర్చే నడుస్తోంది.  అమిత్ షా భార్యాసమేతంగా వ్యక్తిగత పూజాదికాల కోసమే వచ్చారనుకుందాం. అయితే జగన్ భార్య భారతిని వెంటబెట్టుకొని రాకపోయినా.. కనీసం సింగిల్ గా నైనా వచ్చి, ఓ శాలువా కప్పి.. శ్రీశైల మల్లన్న విగ్రహమో, తిరుపతి వెంకన్న ప్రసాదమో చేతిలో పెడితే కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ జెనరేట్ అయ్యి జగన్ మీద కేంద్రానికి కాస్త ప్రేమ పెరుగుతుంది కదా. రాష్ట్రంలో ఇప్పుడు రగులుతున్న జల రాజకీయాలు కాస్తయినా చల్లబడే ఆస్కారం ఉండేది కదా.. ఈ మాత్రం లాజిక్కయినా బ్రదర్ జగన్ కు తెలియకపోతే ఎలా అంటున్నారు ఏపీ రాజకీయ మేధావులు.  కృష్ణా, గోదావరి నదుల మేనేజ్ మెంట్ బోర్డు విషయంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యాక జగన్ కోరుకున్నట్టే కేంద్రం పని పూర్తి చేసిందన్న ఫీలర్స్ వెలువడ్డాయి. కానీ ఆ తరువాత జరిగిన బోర్డు అధికారుల సమావేశాల్లో... దాని జాబితాలో ఉన్న పలు ప్రాజెక్టులను తప్పించాలని, అప్పటిదాకా కేంద్రం అడిగిన సమాచారం ఇవ్వబోమని ఏపీ అధికారులు మొండికేశారు. దీంతో కేంద్రం వైఖరికి భిన్నంగా జగన్ వ్యవహార శైలి ఉందన్న విషయం కేంద్రంలోని పెద్దలకు అర్థమైందని, అదే వారి మధ్య పొరపొచ్చాలకు దారి తీసిందంటున్నారు. ఉమ్మడి బోర్డు ఏర్పాటును తొలుత స్వాగతించిన జగన్.. ఆ వెంటనే ఇలా తొండాట ఎందుకు ఆడుతున్నారో ఢిల్లీ బాసులకు అర్థం కాలేదంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కుమ్మక్కయ్యే జగన్ కేంద్రంతో దొంగాట డ్రామాలాడుతున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జగన్ తాజా నిర్వాకం ఆ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  అమిత్ షా పర్యటనను రాష్ట్రంలోని జల సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకొని ఉండాల్సిందని, వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి అనవసరంగా ఓ గోల్డెన్ అపార్చునిటీ మిస్సయ్యారంటున్నారు. అక్కడ ఢిల్లీలో అధికారికంగా కలిసి విజ్ఞాపనా పత్రం ఇచ్చినదానికీ.. అలాగే ఇక్కడికి దైవ దర్శనార్థం వచ్చినప్పుడు కలిసి విన్నవించుకునే సందర్భానికి చాలా వ్యత్యాసం ఉంటుందని... అధికారిక హోదాలో కాలేని ఎన్నో పనులు.. దైవసన్నిధిలో సాఫీగా పూర్తవుతాయంటున్నారు. అందుకే ఈ చాన్స్ ఉపయోగించుకొని.. కేజీఆర్ఎంబీ ఎలాంటి సవరణలు చేపట్టాలో సూచించి ఉన్నట్టయితే అది తప్పకుండా మేలు చేసి ఉండేదంటున్నారు. ఈ విషయంలో కేంద్రాన్ని సవాల్ చేస్తున్న కేసీఆర్ అడుగుజాడల్లోనే జగన్ కూడా ప్రయాణిస్తున్నట్టు అర్థం చేసుకోవాల్సి వస్తోందంటున్నారు. అదే గనక నిజమైతే... జగన్ వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి రాష్ట్ర జల ప్రయోజనాలు గాలికొదిలేసినట్లేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.