జగన్ సర్కారును శపించిన స్వామీజీ...
posted on Aug 10, 2021 @ 1:46PM
జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్‌లో అనేక అరాచకాలు. వరుసగా ఆలయాలపై దాడులు.. చర్చిల నిర్మాణం.. మత మార్పిడిలు.. ఇలా రాష్ట్రాన్ని క్రైస్తవంలోకి మార్చేస్తున్నారంటూ ఆరోపణలు. ఇటీవల ఆర్ఎస్ఎస్ సైతం జగన్ సర్కారు పాలనపై మండిపడుతూ తన పత్రిక ది ఆర్గనైజర్‌లో సంచలన కథనం ప్రచురించింది. తాజాగా, ఓ స్వామీజీ సైతం ఏపీ పరిస్థితులపై ధ్వజమెత్తారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై స్వామి శ్రీనివాసానంద సరస్వతి సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువులు, హిందూ దేవాలయాలు, దేవాలయాల భూములు, హిందూ సనాతన సంప్రదాయాలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఒక క్రైస్తవ రాష్ట్రంగా మారిపోయిందన్నారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసి బలవంతపు మతమార్పిడిలు జరుగుతున్నాయన్నారు. చర్చిల నిర్మాణానికి ప్రభుత్వమే టెండర్లు పిలిచి ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలో హిందూసనాతన ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయడానికి జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని స్వామి శ్రీనివాసానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు దోషులను పట్టుకోలేదని విమర్శించారు. కొంతమంది మంత్రులు కూడా హిందు సనాతన సంప్రదాయాన్ని అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ఇన్ని దుశ్చర్యలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దోషులను శిక్షించి హిందూ సమాజానికి మనో ధైర్యాన్ని ఎందుకు ఇవ్వలేకపోతోందని స్వామి శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు. స్వామి ఆగ్రహించారని కాదు కానీ.. అంతర్వేది రథ దగ్థం, రామతీర్థం విగ్రహ ధ్వంసం వెనుక ఉన్నదెవరో ఇప్పటికీ గుర్తించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమే.