బీరువా మీద పడి చిన్నారి మృతి.. పాఠశాలలో దుర్ఘటన.. బంధువుల ఆందోళన..
posted on Aug 10, 2021 @ 11:25AM
అప్పటి వరకూ ఆడుతూపాడుతూ అక్కడే తిరిగింది. పక్కనే తల్లి కూడా ఉంది. ఆమె తన పనిలో తానుంది. ఈ చిన్నారి ఎంచక్కా ఆడుకుంటోంది. అంతలోనే ఊహించని ఘటన. ప్రమాదం పెను ఉప్పెనలా విరుచుకుపడింది. ఆ చిన్నారి జీవితాన్ని చిదిమేసింది. అనూహ్య ఘటనతో ఆ తల్లి బిత్తరపోయింది. కూతురు ప్రాణాలు కాపాడేందుకు చివరి వరకూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విగతజీవిగా మారిన కన్న బిడ్డను చూసి వెక్కివెక్కి ఏడుస్తోంది. ఓ ప్రైవేట్ స్కూల్‌లో బీరువా మీద పడి ఎనిమిదేళ్ల చిన్నారి చనిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
తల్లి వెంట వచ్చిన కుమార్తెపై ప్రమాదవశాత్తు బీరువా పడటంతో చిన్నారి మృతి చెందింది. హైదరాబాద్, బోడుప్పల్ దేవేందర్‌నగర్‌కాలనీలో ఉండే లత.. స్థానిక సిద్ధార్థ పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్నారు. సోమవారం పాఠశాలకు కుమార్తె కీర్తి(8)తో కలిసి వెళ్లింది లత. స్కూల్‌లో బీరువాలు శుభ్రం చేస్తోంది. తన కూతురు అక్కడే ఆడుకుంటోంది.
ప్రమాదవశాత్తు ఓ బీరువా చిన్నారిపై పడింది. బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కీర్తిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పడంతో ఆ తల్లి కుప్పకూలిపోయింది.
మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాలు వారికి మద్దతుగా నిరసనకు దిగడంతో.. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.