రేవంత్ అంటే సీనియర్లకు జలసీనా? అందుకే అలా చేస్తున్నారా?
posted on Aug 10, 2021 @ 12:35PM
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి వేదికగా దళిత-గిరిజన దండోరా మోగించారు. లక్ష గొంతుకలతో.. లక్ష నినాదాలతో.. లక్ష చప్పట్లతో.. లక్ష డప్పుచప్పుల్లతో.. ప్రగతిభవన్‌లో ప్రకంపణలు సృష్టించారు. కాస్కో కేసీఆర్.. ఇక ఇరవై నెలలే నీ పాలన.. చర్లపల్లి జైల్లో ఊచలు లెక్కబెట్టడం ఖాయమంటూ ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి దాకా ఓ లెక్క.. ఇవాళ్టి నుంచి మరో లెక్క.. దెబ్బకు దెబ్బ.. ఒకటికి వంద.. అంటూ కేసీఆర్‌కు ముచ్చెమటలు పట్టించారు. ఇంద్రవెల్లి దండోరా రేవంత్‌రెడ్డి సత్తాకు మచ్చుతునకగా నిలిచింది. కాంగ్రెస్‌లో, ప్రజల్లో.. రేవంత్ బలాన్ని, బలగాన్ని ఘనంగా చాటింది. ఇంద్రవెల్లి గడ్డ మీద నుంచి చిచ్చర పిడుగులా చెలరేగిపోయారు కాంగ్రెస్ అధినేత రేవంత్‌రెడ్డి.
అంతా బాగుంది. సభ సూపర్ డూపర్ సక్సెస్. రేవంత్ సవాల్ చేసినట్టుగానే.. దండోరాకు లక్ష మంది తరలివచ్చారు. వేదికపై హేమాహేమీలు ఆసీనులయ్యారు. సీతక్క, భట్టి, దామోదర, మధుయాష్కీ, పొన్నాల, గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, మహేశ్వర్‌రెడ్డి.. బడా నేతలంతా తరలివచ్చారు. డయాస్ మీద అంతమంది ఉన్నా.. కొందరి లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. సభకు నల్గొండ రెబల్స్ కోమటిరెడ్డి బ్రదర్స్, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డుమ్మా కొట్టడం కాంగ్రెస్‌లో కలకలంగా మారింది. కావాలనే ఆ ముగ్గురు ఇంద్రవెల్లికి గైర్హాజరు అయ్యారని.. ఇది రేవంత్ నాయకత్వాన్ని ధిక్కరించడమేనని మండిపడుతున్నారు. వీరితో పాటు జగ్గారెడ్డి కూడా సభకు రాలేదు. తనకు జ్వరం వచ్చిందని, దండోరాకు రాలేనని ఆయన ముందే సమాచారం ఇవ్వడంతో జగ్గారెడ్డి డుమ్మా కొట్టారని పార్టీ భావించడం లేదు. జానారెడ్డి వయోభారంతో హాజరు కాలేదు.
కోమటిరెడ్డి బ్రదర్స్. మొదటి నుంచీ రేవంత్‌రెడ్డి అంటే కళ్లమంటతో ఉన్నారు. ఆయనకు పీసీసీ చీప్ పదవి రాగానే వెంకట్‌రెడ్డి.. డబ్బులిచ్చి పదవి కొనుక్కున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం గట్టిగా మొట్టికాయలు వేయడంతో.. అప్పటి నుంచీ అన్నీమూసుకొని గమ్మున కూర్చుంటున్నారు. తనకు రేవంత్‌రెడ్డితో విభేదాలు లేవంటూ లేటెస్ట్‌గా తన నిబద్దతను నిరూపించుకునే ప్రయత్నం కూడా చేశారు. అంతలోనే మళ్లీ ఏమైందో ఏమో కానీ.. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రవెల్లి దండోరాకు డుమ్మా కొట్టి.. రేవంత్‌కు రెబల్ సిగ్నల్ పంపారు.
అన్నదమ్ములు పదురుకున్నట్టున్నారు. రాజగోపాల్‌రెడ్డి సైతం సభకు రాలేదు. ఇటీవల పార్టీ పర్మిషన్ లేకుండానే సొంతంగా తన నియోజకవర్గంలో దళిత గర్జన చేపట్టారు. అటు, మునుగోడులో దీక్ష చేస్తున్న వైఎస్ షర్మిలకు సైతం ఫోన్ చేసి అభినందించారు. పీసీసీతో పని లేకుండా రాజగోపాల్‌రెడ్డి సొంత ఎజెండా అమలు చేసుకుంటున్నారనే ఆరోపణ ఉంది. ఆయన బీజేపీతో టచ్‌లో ఉన్నారనే ప్రచారమూ ఉంది.
పీసీసీ చీఫ్ అయ్యాక ఇంతవరకూ రేవంత్‌రెడ్డి-- కోమటిరెడ్డి బ్రదర్స్ కలిసింది లేదు. ఎవరికి వారే అన్నట్టు ఉన్నారు. నల్గొండలో బలమైన నాయకులైన ఈ సోదరులు రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పీఠం దక్కడంపై గుర్రుగా ఉన్నట్టున్నారు. అందుకే ఇంద్రవెల్లికి రాకుండా మేం వేరు.. మీరు వేరు అన్నట్టు మెసేజ్ ఇచ్చారని చెబుతున్నారు.
ఇక, తాజా మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం ఇంద్రవెల్లి సభకు రాకపోవడం చిన్న విషయమేమీ కాదు. అన్నేళ్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన కాంగ్రెస్ చేపట్టిన ఇంత పెద్ద కార్యక్రమానికి ఎలా డుమ్మా కొడతారు? ఇది కావాలనే చేసిన చర్యగా భావిస్తున్నారు. ఇప్పటికే ఉత్తమ్ కజిన్ కౌశిక్‌రెడ్డి.. రేవంత్‌రెడ్డిపై దుమ్మెత్తిపోస్తూ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. కౌశిక్‌రెడ్డికి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సపోర్ట్ ఉందని.. ఆయనకు తెలిసే అదంతా జరిగిందనే ప్రచారం ఉంది. కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్‌తో ఉత్తమ్ సచ్చీలతను శంకించాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో ఆయన తన నిబద్దతను నిరూపించుకోవాలంటే ఇంద్రవెల్లి సభకు తప్పక హాజరుకావాల్సి ఉండేది. అయినా, ఆయన రాలేదంటే..? అర్థమేంటి? ఉత్తమ్ రేవంత్‌ని డోంట్ కేర్ అంటున్నారా? లేక, కాంగ్రెస్‌నే వీడిపోనున్నారా? అనే అనుమానం.
ఇటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అటు కోమటిరెడ్డి బీజేపీతో టచ్‌లోకి వెళ్తున్నారా? నల్గొండ కాంగ్రెస్‌లో వేరు కుంపటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇదంతా రేవంత్‌రెడ్డిపై ధిక్కార స్వరమా? మరి, ఇలాంటి చర్యలను ఉపేక్షించబోనంటూ, కఠినంగా ఉంటానంటూ ముందే హెచ్చరించిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఈ ముగ్గురి ధిక్కరణను సహించునా? వారిపై కఠిన చర్యలు తీసుకొనునా? చూడాలి.. రేవంత్‌రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందో.....