హస్తానికి హాయ్.. బీజేపీకి బైబై! పీకే డైరెక్షన్ లో జగన్ రూట్?
posted on Aug 10, 2021 @ 6:19PM
వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రూట్ మార్చారా? కాంగ్రెస్ సారధ్యంలో వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ పౌరోహిత్యంలో ఏర్పడే బీజేపీ, మోడీ వ్యతిరేక కూటమితో చేతులు కలిపారా? అందుకే కేంద్ర మంత్రి వర్గంలో చేరేందుకు ముందు అంగీకరించి, ఆపైన వెనక్కి తగ్గారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. అందుకే ఇంతకాలం రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలను చూసి చూడనట్లు వదిలేసిన కేంద్రం.. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కన్నేసిందని చెబుతున్నారు ఇరు పార్టీల మధ్య సాగిన చీకటి చర్చల లోగుట్టు తెలిసిన రాజకీయ విశ్లేషుకులు...
రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇక చీకటి పొత్తులు, చీకటి ఒప్పందాల విషయం అయితే చెప్పనే అక్కరలేదు. నువ్వోకందుకు పోస్తే, నేనోకందుకు తాగుతున్నాను అన్నట్లుగా, చీకటి సంబంధాలు సాగిపోతుంటాయి. గత రెండున్నర సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీల నడుమ ఇదిగో, ఇలాంటి చీకటి ఒప్పందమే ఉందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నిజానిజాలు ఎలా ఉన్నా, నిన్న మొన్నటి దాక రెండు పార్టీల నడుమ సంబంధాలు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒకే విధంగా ఉన్నాయి అనేది మాత్రం నిజం.
నిజానికి, 2019 ఎన్నికలకు ముందే బీజేపీ, వైసీపీ సంబంధాలకు బీజం పడింది. టీడీపీ, బీజేపీ బంధం తెగిపోయిన తర్వాత బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఓటర్లు వైసీపీ వైపు మొగ్గుచూపారు. ఇది బహిరంగ రహస్యం. ఆ ఎన్నికల్లో వైసీపీకి ఏకంగా 151 సీట్ల భారీ మెజారిటీ రావడానికి, ఇంకా అనేక కారణలు ఉన్నా, బీజేపీ వైసీపి వైపు మొగ్గు చూపడం కూడా ఒక కారణం అనేది అందరూ అంగీకరిస్తున్నదే. అదే రహస్య బంధం నిన్న మొనంటి వరకు సాగుతూ వచ్చింది. స్నేహ బంధ ఇప్పుడు కొంత చెడి నట్లు కనిపిస్తోంది. రెండు పార్టీల మధ్య విబేధాలు బజారున పడడానికి ముందు, రెండు పార్టీలను మరింత దగ్గర చేసే, మరో రహస్య యవ్వారం, చివరి క్షణంలో చేజారినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల కేంద్ర మంత్రి వర్గ విస్తరణ సమయంలో, ప్రాంతీయ పార్టీలను దగ్గర చేసుకునే ఎత్తుగడలో భాగంగా, బీజేపీ నాయకత్వం,ఇతర ప్రాంతీయ పార్టీలతో పాటుగా వైసీపీతోనూ మంతనాలు సాగించింది. కేంద్ర మంత్రి వర్గంలో చేరేందుకు, వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక కాబినెట్, ఒక ఇండిపెండెంట్ చార్జి, ఒక సహాయ మంత్రితో మొదలైన బేరసారాలు రెండు కాబినెట్ బెర్తులు, ఒక సహాయ మంత్రి వద్ద ఫైనలైజ్ అయిందని, అయితే, చివరి క్షణంలో వైసీపీ, వెనక్కి తగ్గిందని సమాచారం.
అయితే ఇలా వైసీపీ వెనకడుగు వేయడం వెనక ప్రశాంత్ కిశోర్ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికలలో బీజేపీని ఓడించేందుకు, విపక్షాలను ఏక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రశాంత్ కిశోర్, డీల్ నుంచి జగన్ రెడ్డిని వెనక్కి లాగినట్లు సమాచారం. ఒక దశలో వైసీపీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయి రెడ్డి కూడా, అవును మాటలు అయితే జరిగాయి, డీల్ కుదిరిందో లేదో మాత్రం గౌరవ ముఖ్యమంత్రే చెప్పాలని అన్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. వైసీపీ ఆఖరి క్షణంలో తీసుకున్న నిర్ణయం ఢిల్లీ పెద్దలకు ఆగ్రహం తెప్పించినట్లు తెప్పించినట్లు తెలుస్తోంది. అందుకే, జగన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక అరాచకం మీద కేంద్రం దృష్తి పెట్టిందని అంటున్నారు. అయితే, 2014 నుంచి కేంద్ర ప్రభుత్వానికి తమ పార్టీ అవసర సమయంలో అందిస్తున్న సహకారం ఇకపై కూడా కొనసాగుతుందని జగన్ రెడ్డి బీజేపీ నేతలకు తెలిపినట్లు సమాచారం. జగన్ రెడ్డి 2014 నుంచి కూడా అవసరార్ధం బీజేపీకి, ముఖ్యంగా పెద్దల సభలో కీలక బిల్లులు పాస్ చేసుకోవడంలో సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. కానీ, అవకాశం చిక్కితే దెబ్బ తీసేందుకు సిద్దంగా ఉన్నారని, లేటెస్ట్ డెవలప్మెంట్ తో తెలిసిపోయిందని అంటున్నారు.
అంతే కాదు 2024 ఎన్నికలకు ముందు, బీజేపీ వ్యతిరేక శక్తుల కూటమి ఏర్పాటుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమత్రి మమత బెనర్జీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేస్తున్న ప్రయత్నాలతో జగన్ సైతం చేతులు కలిపారని మరోసారి రుజువైందని అంటున్నారు. నిజానికి జగన్ రెడ్డి, 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే, కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. దురదృష్ట వశాత్తు బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చిందని, అందుకని ఇక ప్రత్యేక హోదాను మరిచి పోవడమే మంచిదనే అర్ధం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇంకొంత బయట పడ్డారు. కానీ కనీసం మరో రెండున్నర సంవత్సరాలు అయితే కేంద్రంలో బీజీపీనే అధికారంలో ఉంటుంది.. జగన్ ఎలా తట్టుకుంటారో చూడాలి..