ఉపరాష్ట్రపతి వెంకయ్య కంటతడి.. లోక్ సభ నిరవధిక వాయిదా
posted on Aug 11, 2021 @ 2:22PM
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజ్యసభలోకంటతడి పెట్టారు. పార్లమెంట్‌లో ఎంపీలు ప్రవర్తిస్తున్న తీరుపై కలత చెందిన వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం సభలో జరిగిన పరిణామాలను తనను తీవ్రంగా బాధించాయంటూ బుధవారం గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు వెంకయ్య నాయుడు.
‘‘చైర్మన్ పోడియం దేవాలయ గర్భగుడి లాంటిది. భక్తులు గర్భగుడి వరకు రావచ్చుకానీ లోపలకు రాకూడదు. ఇలాంటి ఘటనలు తరచూ జరగడం ఆవేదన కలిగించే విషయం. నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.’’ అంటూ సభ్యులకు వెంకయ్య నాయుడు హితవు చెప్పారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం రాజ్యసభలో పలువురు విపక్ష ఎంపీలు సభ చైర్మన్ స్థానం వద్దకు దూసుకెళ్లారు. కొద్ది రోజుల నుంచి కూడా ఎంపీలు ఇదే తీరును ప్రదర్శించారు. ఆప్, కాంగ్రెస్ సభ్యులు పోడియం ఎదుట టేబుట్‌పైకి ఎక్కి ఆందోళన చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ ఏకంగా చైర్మన్ సీటుపైకి ఫైల్స్ విసిరేశారు.
ప్రతిపక్షాలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తుండడంతో షెడ్యూల్ కన్నా ముందే లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది.ఆశించిన స్థాయిలో సభ జరగకపోవడం బాధించిందని చెప్పారు. లోక్‌సభ ప్రతిష్ఠను తగ్గించేలా ప్లకార్డులు ప్రదర్శించారని చెప్పారు. లోక్‌సభ సమావేశాల నిర్వహణపై స్పీకర్ ఓం బిర్లా వివరాలు తెలిపారు. లోక్‌సభలో 20 కీలక బిల్లులకు ఆమోద ముద్ర పడిందని వివరించారు. ఓబీసీ బిల్లుకు అన్ని పార్టీలు సహకరించాయని చెప్పారు. వర్షాకాల సమావేశాలు మొత్తం 21 గంటల 14 నిమిషాల పాటు జరిగాయని వివరించారు.