జ‌గ‌న్‌ను టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే.. మీకో రూల్ మాకో రూలా..?

ఆయ‌న‌ వ‌ద్ద‌న్నారు. ఆయ‌న అలా అన‌లేదని ఎమ్మెల్యే అంటున్నారు. కుద‌ర‌దంటూ స్ప‌ష్టంగా ఉత్త‌ర్వులు ఇచ్చారు. అవి పాత‌వి అంటూ ప‌క్క‌న ప‌డేస్తున్నారు. అక్క‌డ కాక‌పోతే ఇంకో ద‌గ్గ‌ర అంటున్నారు. జ‌గ‌న్ చేస్తే ఒప్పు.. నేను చేస్తే త‌ప్పా అన్న‌ట్టు నిల‌దీస్తున్నారు. ఎలాగైనా ఆ ప‌ని చేసి తీరుతానంటున్నారు. ఇదంతా బీజేపీ నేత‌ల డ్రామా అని తిట్టిపోస్తున్నారు. సోము వీర్రాజు, విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డిలపై మండిప‌డుతున్నారు. ఇలా, తిమ్మినిబ‌మ్మి చేస్తూ.. జ‌గ‌న్‌నే ఇర‌కాటంలో ప‌డేస్తూ.. వైఎస్సార్ విగ్ర‌హాల‌తో పోలుస్తూ.. టిప్పు కోసం నానా తిప్ప‌లు ప‌డుతున్నారు వైసీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి.  కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్‌ విగ్రహ ఏర్పాటుపై రాజకీయ ర‌చ్చ కంటిన్యూ అవుతోంది. ముగిసిన‌ట్టే అనిపించిన ర‌గ‌డ‌.. మ‌ళ్లీ రాజుకుంటోంది. ఎమ్మెల్యే ర‌చ‌మ‌ల్లు ప‌ట్టు విడ‌వ‌డం లేదు. బీజేపీ నేత‌లు వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. మ‌ధ్య‌లో క‌లెక్ట‌ర్ ఉత్త‌ర్వులు కాక రేపుతున్నాయి. టిప్పు సుల్తాన్‌ విగ్ర‌హం పెట్ట‌డానికి క‌లెక్ట‌ర్ అనుమ‌తి నిరాక‌రించారు. ఆ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు. అయితే, జిల్లా కలెక్టర్ అనుమతి నిరాకరించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఈ విషయంలో బీజేపీ నేతలు సోమువీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. త్వరలోనే ప్రభుత్వ అనుమతితోనే టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వ స్థలంలో అనుమతి లభించకపోతే ప్రైవేటు స్థలంలో అయినా టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రాచమల్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ విగ్రహానికి అనుమతులు లేవని, ఆయా సందర్భాలను బట్టి అధికారులు మౌనంగా ఉంటారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే చేసిన ఈ కామెంట్లే ఇప్పుడు కాక రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ విగ్ర‌హాలు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఇష్టారీతిలో ఏర్పాటు చేశారు. ఓదార్పు యాత్ర పేరుతో ఊరూరా త‌న తండ్రి  విగ్ర‌హాలు పెట్టారు జ‌గ‌న్‌. వాటిలో వేటికీ అనుమ‌తులు లేవ‌నేలా వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు చేసిన ఆరోప‌ణ‌లు పార్టీలో క‌ల‌క‌లానికి కార‌ణ‌మ‌వుతున్నాయి.  టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తూ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పటివి కాదని, జిల్లా ఎస్పీ అభ్యర్థన మేరకు గత నెల 24న ఇచ్చినవన్నారు ఎమ్మెల్యే. బీజేపీ నేతలు పాత ఉత్తర్వులను చూపించి అందరినీ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాచమల్లు మండిప‌డ్డారు. విగ్రహం ఏర్పాటు కోసం కౌన్సిల్ ఇచ్చిన తీర్మానాన్ని ప్రభుత్వ అనుమతి కోసం పంపామని, అనుమతి రాగానే ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలు మతాల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని శివప్రసాద్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.   

జగన్ సర్కార్ కు షేమ్..! అవార్డు తిరస్కరించిన మరో జర్నలిస్ట్ 

ఆంధ్రప్రదేశ్ లోని జగన్ రెడ్డి ప్రభుత్వానికి అన్నింటా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలపై న్యాయ స్థానాలు ఎన్నోసార్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొన్నింటిని రద్దు చేశాయి. మరికొన్నింటిని కోర్టు హెచ్చరికలతో ప్రభుత్వమే వెనక్కి తీసుకుంది. తాజాగా జగన్ రెడ్డి ప్రభుత్వానికి దారుణమైన పరాభవం ఎదురైంది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అవార్డును తిరస్కరించి షాకిచ్చారు ఓ సీనియర్ జర్నలిస్ట్. ప్రభుత్వ  ప్రజా వ్యతిరేక విధానాలు, మీడియాపై ఆంక్షలకు నిరసనగా తాను అవార్డును స్వీకరించడం లేదని ప్రకటించారు.  ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన సంస్థలు, ప్రతిభ కనబర్చిన వ్యక్తులు, కళాకారులకు వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌, అచీవ్‌మెంట్‌ పురస్కారాలను ప్రకటించింది. 31 మంది  లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌, 32 మంది అచీవ్‌మెంట్ పుర‌స్కారాల‌కు ఎంపిక‌య్యారు. ఇందులో జర్నలిస్టుల విభాగంలో సీనియర్ జ‌ర్న‌లిస్టు తెలకపల్లి రవికి అవార్డు ప్రకటించింది. అయితే, ఈ అవార్డును తిర‌స్క‌రిస్తున్న‌ట్లు తెల‌క‌ప‌ల్లి ర‌వి ప్రకటించారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలోనూ స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న వివాదాస్పద రాజకీయ మీడియా, సామాజిక మాధ్య‌మాల వాతావరణంలో ఈ అవార్డును స్వీకరిండం లేదని తెలకపల్లి రవి తెలిపారు. అయితే, ఈ పురస్కారం త‌న‌కు  ఇస్తాన‌ని ప్ర‌క‌టించిన త‌న ప‌ట్ల‌ గౌరవాదరణ క‌న‌బ‌ర్చిన ఏపీ ప్రభుత్వం, కమిటీ మిత్రులకు, ధన్యవాదాలు చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం అవార్డులను ప్రకటించిన రోజే మరో సీనియర్ జ‌ర్న‌లిస్టు పాలగుమ్మి సాయినాథ్ కూడా ఈ అవార్డును తిరస్కరించారు. ఇప్పుడు  తెలకపల్లి రవి కూడా తిర‌స్క‌రించ‌డం ఏపీ ప్రభుత్వానికి షాకింగ్ గా మారింది.  లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్ కింద రూ.10 లక్షలు, అచీవ్‌మెంట్ కింద రూ.5 లక్షలు, జ్ఞాపిక అందజేసి  ఆగస్టు 14న లేక‌ 15న‌ సత్కరించనుంది ఏపీ ప్రభుత్వం.   

హుజురాబాద్‌లో ఉద్రిక్తత.. బీజేపీ జెండా గద్దె కూల్చివేత..

ఇన్నాళ్లూ మాట‌ల తూటాలు పేలాయి. స‌వాళ్లు-ప్ర‌తిస‌వాళ్ల‌తో ప్ర‌కంప‌ణ‌లు పుట్టాయి. ఆక‌ర్ష్‌-విక‌ర్ష్‌ల‌తో రాజ‌కీయ సెగ ఎగిసింది. ఇంకా ఎన్నిక‌ల న‌గారానే మోగ‌లేదు.. అప్పుడే రాజ‌కీయం హ‌ద్దులు దాటుతోంది. మునుపెన్న‌డూ లేనివిధంగా హుజురాబాద్ ఎల‌క్ష‌న్ నువ్వా-నేనా అన్న‌ట్టు వాడి-వేడిగా సాగుతోంది.  మాట‌ల మంట‌లు రేపుతూనే.. చేత‌ల‌కూ దిగుతున్నారు ప్ర‌త్య‌ర్థులు. తాజాగా, హుజురాబాద్‌ మండలం సింగపూర్‌లో బీజేపీ జెండా గద్దెను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కూల్చేయ‌డం తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. ఇన్నాళ్లూ విమ‌ర్శలు, ఆరోప‌ణ‌లకే ప‌రిమిత‌మైన వైరి వ‌ర్గాలు.. ఇప్పుడిలా జెండా గ‌ద్దె కూల్చే వ‌ర‌కూ రావ‌డంతో ప‌రిస్థితి అదుపు త‌ప్పుతోంది.  త‌మ పార్టీ జెండా గ‌ద్దె కూల్చ‌డంపై.. స్థానిక బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. సింగపూర్‌లో బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. విష‌యం జిల్లా స్థాయి నేత‌ల‌కు తెలిసింది. జెండా గ‌ద్దెను కూల్చ‌డాన్ని నిరసిస్తూ ‘ఛలో సింగపూర్‌’కు పిలుపునిచ్చారు బీజేపీ నేతలు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహ‌రించారు.  వారం రోజులుగా హైద‌రాబాద్ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న ఈట‌ల రాజేంద‌ర్ గురువారం హ‌ఠాత్తుగా హుజురాబాద్ వ‌చ్చారు. ఈటల రాక గురించి తెలుసుకున్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని అభిమానులు, బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఇందుకు కౌంట‌ర్‌గా అన్న‌ట్టు.. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు సింగ‌పూర్‌లో బీజేపీ జెండా గ‌ద్దెను కూల్చేయ‌డం క‌ల‌కలం రేపుతోంది. స్థానికంగా తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. 

ప్రజా బంధు, త్యాగశీలి కాకాని వెంకటరత్నం                           

ఉక్కు కాకానిగా పిలుచుకునే కాకాని వెంకటరత్నం జీవితమంతా త్యాగమయమే. ఈ మహానేత దివికేగి సుమారు 50 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా ఆయన ప్రజల మనసుల్లో నిలిచే ఉన్నారు. రైతు కుటుంబంలో పుట్టి, 5వ తరగతి మాత్రమే చదివిన కాకాని.. స్వాతంత్ర సంగ్రామంలో గాంధీ చేపట్టిన  ప్రతి ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. పలుమార్లు జైలు కెళ్లారు. స్వాతంత్ర్య సాధన అనంతరం జిల్లా బోర్డ్ అధ్యక్షునిగా , ఏపి కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేశారు. ఏపీ ఏర్పడ్డాకా మంత్రిగా  పని చేసిన కాకాని వెంకటరత్నం.. 1972లో ఎగసిపడిన జై ఆంద్రా ఉద్యమంలో మంత్రి పదవి త్యదించారు. ఉద్యమ బాట పట్టి , పోలీస్ కాల్పులకు నేల కొరిగిన విద్యార్ధులకు కోసం సమరశంఖం పూరించారు. బాధిత ఆర్త నాదాలకు  గుండెపగిలి అసువులు బాసిన త్యాగధనుడు, ప్రజాబంధు కాకాని వెంకటరత్నం. 1900, ఆగస్టు 3న ఇప్పటి ఉయ్యూరు మండలం లోని ఆకునూరు గ్రామంలో చినతాతయ్య, సీతమ్మ దంపతులకు కాకాని వెంకటరత్నం జన్మించారు. సీతమ్మ చనిపోవడంతో శేషమ్మను ద్వితీయ వివాహం చేసుకున్నాడు చిన తాతయ్య. వ్యవసాయ భూమి ఎక్కువ ఉండడం , పాడి పశువులు ఉండడం వల్ల  సీతమ్మ అందరినీ ప్రేమగా ఏ లోటూ లేకుండా పెంచింది. చిన్న తనం నుండి భయం లేకుండా, పిల్లల్ని పోగుచేసి అల్లరి చేసేవాడు కాకాని. ఏదైనా తప్పు చేస్తే నిర్బీతిగా చెప్పేవాడు. ఊరిలో పాఠశాల లేని కారణాన వణుకూరు నుండి పెద్దిబొట్ల నర్సయ్య గారు  వచ్చి దేవాలయ ఆవరణలో ప్రైవేటు పాఠాలు చెప్పేవాడు. కాకాని కూడా అక్కడే చదివాడు. చదువులోనూ ముందుండే వాడు. శతకాలు,  నామ వాచకం లాంటివి చదివాక తెలుగు భాష మీద పట్టు కుదిరింది. 5వ తరగతి పూర్తయ్యింది. ఆరోజుల్లో విద్య కంటే వ్యవసాయానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. సోదరులతో పాటు వ్యవసాయంలో దిగి పోయాడు కాకాని. ఎడ్లు, గేదెలు, ఆవులతో ఎప్పుడూ ఏదో ఒక పని ఉండేది. వ్యవసాయ మెళకువలు తెల్సుకుని , నాగలి దున్నేవాడు. కొత్తగా బోదెలు తవ్వించి , తనదైన శైలిలో వ్యవసాయం చేసి అధిక దిగుబడి పొంది అందరిచేతా శభాష్ అనిపించుకున్నాడు కాకాని వెంకటరత్నం. 1920 లో వెంకట సుబ్బమ్మ తో కాకానికి వివాహం జరిగింది. కుమారుడు రామమోహన రావు  జన్మించాడు. గాంధీ సత్యాగ్రహ ఉద్యమం ఊపందుకుంది. వ్యవసాయానికి మాత్రమే పరిమితమైన కాకాని , గాంధీ బాట పట్టి శిష్యునిగా మారాడు. చీరాలలో దుగ్గిరాల గోపాల కృష్ణయ్య రామదండు సేవాదళం, జగ్గయ్యపేటలో సాధు రామ కృష్ణయ్య బాలభట సంఘ సేవా దళాలు  ఏర్పడితే కాకాని ఉయ్యూరు కేంద్రంగా బాలభట సంఘాన్ని స్థాపించాడు. ఆకునూరులో గ్రంధాలయం ఏర్పాటు చేసి ఉయ్యూరు నుండీ దిన పత్రికలు తీసుకు వచ్చేవారు. హిందీ భాష అవసరాన్ని గుర్తించి ఉత్తర భారతం నుండీ హిందీ పండితుణ్ణి రప్పించి కుందేరులో పాలడుగు శేషాచలం బ్రహ్మచర్య ఆశ్రమంలో హిందీ విద్య ప్రారంభించి  తనూ నేర్చు కున్నాడు. 1921 లో విజయ వాడలో అఖిలభారత  కాంగ్రెస్  సమావేశాలు 2 లక్షల మంది తో జరిగితే మితృలను 15 మందిని తీసుకుని వంట సరుకులు భుజాన వేసుకుని నడిచి విజయవాడ  చేరారు . సమావేశాలకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 500 మంది రామదండు సైన్యం బారులు తీరి కవాతు చేస్తూ వేదికకు వచ్చిన దృశ్యం చూసి ఉత్తేజి తుడైనాడు. ఎందరో దేశ నాయకులు వచ్చిన ఆ సభకు పింగళి వెంకయ్య త్రివర్ణ  పతాకాన్ని మొదటగా రూప కల్పన చేసి ప్రదర్శించాడు. సమావేశ అనంతరం ఖద్దరు ప్రచారం కోసం, తిలక్ స్వరాజ్య నిధి కోసం గాంధీ కృష్ణా జిల్లా పర్యటనకు వస్తే కాకాని తమ స్వగ్రామానికి ఆహ్వానించి ఖద్దరు నిధికి, తిలక్ నిధికి విరాళాలు ఇప్పించాడు.  ఉయ్యూరు లోనూ, కుమ్ముమూరు లో గాంధీ సభలు ఏర్పాటు చేసి భూరి విరాళాలు ఇప్పించాడు కాకాని. 1923 కాకినాడ  సభలో బాల భట సంఘ సభ్యులతో సభ అధ్యక్షుడు కొండా వెంకటప్పయ్య అనుమతితో సభ నిర్వహణలో పాల్గొని నేరుగా రాజకీయ సభలో పాల్గొన్నాడు. ఆ సభలో కాకానికి టంగుటూరి ప్రకాశం పై అభిమానం పెరిగింది . టంగుటూరికి కాకాని వెంకట రత్నం మీద సధభిప్రాయం ఏర్పడినది. బులుసు సాంబమూర్తి కాకానిని ఎంతో మెచ్చు కున్నాడు. నాయకుల ప్రసంగాల ప్రభావంతో గ్రామం లో, ఇతర గ్రామాల్లో సేవా కార్య క్రమాలు , హిందీ ప్రచారం మొదలు పెట్టాడు. 1930 లో ఉప్పు సత్యాగ్రహంలో తయారీ ఉప్పుని గ్రామల్లో పంచుతున్నా డని అరెస్ట్ చేసి 2 సం.లు కఠిన కారాగార శిక్ష విధించారు. 1931 లో గాంధీ - ఇర్విన్ వడంబడికలో కాకానిని విడుదల చేసారు. 1930 లో దేశంలో ఆర్ధిక మాంద్యంతో ధరలు పడిపోతే రైతులొక పక్క ఇబ్బందులు పడుతుంటే భూమి శిస్తును  పెంచారు. అదనపు శిస్తు రద్దుకు ఆచార్య రంగా చేస్తున్న ఆందోళనలో పాల్గొని ఉద్యమాన్ని ఉదృతం చేసాడు. 1932 లో శాసనోల్లం ఘన ఉద్యమం తో కాంగ్రెస్ వారిని అరెస్ట్ చేస్తుంటే కాకాని వెంకతరత్నం ను పశ్చిమ కృష్ణా సమన్వయ కర్తగా నియమించారు. మితృలతో ఉద్యమాన్ని తీవ్రతరం చెయ్యడంతో 16 జూన్ 1932 న అరెస్ట్ చేసి 6 నెలలు శిక్ష వేసి తంజావూరు జైలుకు తరలించగా అక్కడ కామరాజ్ నాడార్ తో పరిచయ మయ్యింది. డిసెంబర్ లో విడుదలైనాడు. అస్పృశ్యతా నిర్మూలన కార్యక్రమం చేపడితే హరిజన వాడల్లో సహపంక్తి భోజనాలు, బావుల్లో నీళ్ళు తోడించడం, దేవాలయ ప్రవేశాలు చేయించాడు. అడ్డు వస్తే ఎదిరించాడు. గాంధీ అస్పృశ్యత గురించి యాత్ర చేసేందుకు కృష్ణా జిల్లా వస్తే సభలకు అన్ని సౌకర్యాలను కల్పించి గాంధీ సమక్షంలో హరి జనులను దేవాలయ ప్రవేశం చేయించాడు.  1934 నుండి 37 వరకు ఆకునూరు  గ్రామ పంచాయితీ అధ్యక్షుని గా పనిచేసి, మరుగుదొడ్లు, కొత్త రోడ్లు నిర్మించాడు. ప్రాధమిక పాఠశాల అభివృద్ధి, ఆసుపత్రి ఏర్పాటు చేసాడు. 1937 లో  మద్రాస్ ప్రాన్సిస్ లో స్థానికపాలన మంత్రి బెజవాడ గోపాలరెడ్డి ని ఆకునూరు తీసుకు వచ్చి సన్మానించాడు. 1937 ఎన్నిక లప్పుడు జస్టీస్ పార్టీ కృష్ణా జిల్లాలో బలంగా ఉన్నందున , బలమైన నేత కావాలని పశ్చిమ కృష్ణా కు ఎన్నికల నిర్వ హకునిగా కాకాని వెంకటరత్నం ను నియమించగా విజయాన్ని చేకూర్చగా , పేట బాపయ్య పార్టీ అద్యక్షునిగా, కాకానిని సెక్రటరీగా నియమించారు. Ng రంగా ప్రోత్సాహంతో  రైతు సంఘాలను ఏర్పరచి రైతు హక్కుల కోసం పోరాడాడు.  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అధ్యక్షునిగా భోగరాజు తో Ng రంగా , సెక్రటరీకి గొట్టిపాటి బ్రహ్మయ్య, పుచ్చలపల్లి సుందరయ్యలు  పోటీపడితే కాకాని వర్గం Ng రంగా, పుచ్చలపల్లి కి మద్దతిస్తే వారు ఓటమి చెందారు. పార్టీ సభ్యత్వాల చేర్చడంలో గొడవలు జరిగి భోగరాజు 2 సం.లు కాకానిని పార్టీ నుండి సస్పెండ్ చేసాడు. అప్పుడు కాకాని వర్గం నిరుత్సాహంలో ఉండగా కమ్యూనిస్ట్ లు ఈ అవకాశాన్ని వాడుకుని సుందరయ్య , చండ్ర రాజేశ్వర రావు, కాట్రగడ్డ రాజగోపాల రావు, కడియాల గోపాల రావు, పిల్లలమర్రి , కంభంపాటి ఇంకా అనేకులు కమ్యూనిస్ట్ పార్టీలో చేరిపోయారు. కాని కాకాని వారితో వెళ్ళలేదు. 1938 లో జిల్లా బోర్డ్ ఎన్నికలు వస్తే పోటీ అభ్యర్దులను నిలిపాడు కాకాని. ఇది  తెల్సిన టంగు టూరి ఇద్దరికీ రాజీ చేస్తే పోటీ లేకుండా 10 సీట్లు కాకానికి వచ్చాయి.  ఫార్వర్డ్ బ్లాక్ ను స్థాపించి సుభాస్ చంద్ర బోస్ ఏలూర్ వస్తే ఆ సభలో కాకాని పాల్గొన్నాడు. బోస్ మార్గంలో నడిచాడు. ప్రపంచ యుద్ధం లో పాల్గొనే విషయంలో బోస్ వ్యతిరేకం కనుక విభజించు పాలించు ప్రకారం కమ్యూనిస్ట్ లపై విధించిన నిషేదాన్ని బ్రిటీష్ ప్రభుత్వం ఎత్తి వేసింది. దానితో వారు బ్రిటీష్ ప్రభుత్వా నికి మద్దతు దారులుగా మారిపోయారు . బోస్ ను అరెస్ట్ చేసి గృహ నిర్భంధంలో ఉంచితే మాయమయ్యాడు. అందుకు మద్దతుగా విజయ వాడలో పోస్టర్స్ వేస్తే కాకాని వర్గం పోస్టర్లు వేసిందని వెదికితే కాకాని దొరక లేదు. బాపయ్య ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 1942 ఆగస్ట్ బొంబాయిలో జరిగిన సమావేశంలో బ్రిటీష్ వారు దేశం వదలి వెళ్ళాలి అని క్విట్ ఇండియా ఉద్యమంతో మారు మోగించారు. కాకాని దొరకగుండా ఆ ఉద్యమాని  తీవ్రతరం చేసాడు. ఒక రోజు రాత్రి కలువపాముల లో బస్సు  టాపు పై ఎక్కి విజయవాడ చేరితే , ఆ సమాచారం తెల్సు కుని  బస్  దిగగానే పట్టుకుని విజయవాడ పోలీస్ స్టేషన్లో ఉంచితే వారం అయినా ఆధారాలు చూపలేక పోయినా వదలగుండా  రాయ వెల్లూర్ జైలుకు తరలించారు. అప్పటికే బాపయ్య అక్కడ ఉన్నాడు. అప్పుడే కాకాని సోదరుడు కోటయ్య కలరాతో చనిపోయాడని తెలిసి పెరోల్ పై విడుదలై , సోదరుడు గ్రామంలో కట్టించే స్కూల్ ను పూర్తి చేయించి మరలా జైలుకు వెళ్ళాడు. 1946 తుఫాన్ కు కోస్తా కకావికలమయితే మంత్రిగా ఉన్న ప్రకాశం ను తీసుకువచ్చి చూపించాడు కాకాని. ఊరూరా విరాళాలు వసూలు చేసి బాధితులకు అందించి, వాటి వివరాలూ ఆడిటింగ్ చేయించి ప్రకాశంకు అందించాడు. 1946 మద్రాస్ శాసన సభ ఎన్నికల్లో పశ్చిమక్రిష్ణా 2 సీట్లు తన వారికి ఇవ్వకున్నా కృషి చేసి వారిని గెలిపిం చాడు. ఇది స్వాతంత్యం వచ్చే నాటికి కాకాని చరిత్ర.

ట్రబుల్ షూటర్ వ్యాఖ్యలతో ట్రబుల్? గులాబీలో హుజురాబాద్ టెన్షన్? 

హుజూరాబాద్‌లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరు? ఈ ప్రశ్నకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేదా ఆ పార్టీ నాయకులు సమాధానం చెపితే, అది సబబుగా ఉంటుంది. కానీ, తమ పార్టీ అభ్యర్ధి ఎవరో చెప్పలేని తెరాస ట్రబుల్ షూటర్ తగుదునమ్మా, అని కాంగ్రెస్ దళిత అభ్యర్ధిని పోటీలో దించుతోందని, చెప్పడం ఏమిటి? ఏం దళితులు పోటీకి పనికిరారా? రాజ్యాధికారానికి అర్హులు కాదా, బాంచను దొరా ‘ అంటూ దొరల అడుగులకు మనుగులొత్తాలా? అని దళిత సామాజిక వర్గం ప్రశ్నిస్తోంది.  హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన ఇతర పార్టీల చోటామోటా నాయకులు,కార్యకర్తలు  సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో గురువారం తెరాస లో  చేరారు.ఈ సందర్భంగా మాట్లాడిన తెరాస ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు, హుజూరాబాద్‌లో దళితుల ఓట్లను చీల్చడానికి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అక్కడ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో వేరే నియోజకవర్గానికి చెందిన దళిత నాయకుడిని రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుండగా, మరి కొందరు దళిత నేతలతో పోటీ చేయించాలని బీజేపీ చూస్తోందని హరీష్ ఆరోపించారు.దళిత బంధు పథకంతో దళితులందరూ తెరాస  వైపే నిలవడాన్ని కాంగ్రెస్‌, బీజేపీ జీర్ణించుకోలేక పోతున్నాయని మండిపడ్డారు. హరీష్ చేసిన వ్యాఖ్యలు, ఇటు రాజకీయ వర్గాల్లో, అటు దళిత వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిన దళితులను విస్మరించి, ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించిన తెరాసకు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణలోనే దళితులు ఎక్కువ అవమానాలు అనుభవిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌కు ఏడేళ్ల తరువాత దళిత సాధికారత గుర్తుకు వచ్చిందని, దళితులను మరోసారి మోసగించేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారని అన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా, త్యాగాలంటే తెలియని వారే,  పదవులు అనుభవించటం దుర్మార్గమని, ఒక్కశాతం ఉన్న వెలమ, 4 శాతం ఉన్న రెడ్లకు మెజారిటీ పదవులు ఇచ్చారని, అధిక శాతం ఉన్న బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు అరకొరగానే పదవులు దక్కాయన్నారు. అలాగే, దళిత ఎజెండా జెండాగా చేసుకుని ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని వదులుకుని వచ్చిన మాజీ ఐపీఎస్ ప్రవీణ కుమార్ అయితే, దళిత బందు వంటి పథకాలు దళితుల అభివృద్ధికి ఉపయోగపడేవి పడేవి, కాదని, దళితుల ఓట్ల కోసం జరుగుతున్న కుట్రగా ఎప్పుడోనే పేర్కొన్నారు. దళిత బంధు బదులు దళితుల విద్యావకాశాలు మెరుగు పరిచేందుకు కృషి చేయాలని, గురుకుల విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని అన్నారు.  అవును దళిత బంధు పథకం దళితుల పట్ల ప్రేమతో కాదు, దళితుల ఓట్ల మీదున్న ప్రేమతోనే తీసుకు వచ్చామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత, విపక్షాలు దళితుల ఓట్లను చీల్చేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించడంలో అర్థమేమిటని ప్రతిపక్ష పార్టీలు  ప్రశ్నిస్తున్నాయి. నిజానికి ప్రతిపక్షాలే కాదు, అధికార పార్టీ నాయకులు కూడా, ఒక్క అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక కోసం ప్రభుత్వ యంత్రంగాన్ని, నిధులను ఈ స్థాయిలో దుర్వినియోగం చేయడం ఇంతవరకు చూదలేదని, ఇంత చేసిన తర్వాత కూడా అధికార పార్టీ ఓడిపోతే, తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. అలాగే,  రానున్న ఎన్నికల్లో ఈటల గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం జరుగుతుందని, అదే తెరాస అభ్యర్థి గెలిస్తే హుజూరాబాద్‌ ప్రజలందరికీ ప్రయోజనం కలుగుతుందని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపు తున్నాయి. తెలంగాణ వచ్చినా ఇంటికో ఉద్యోగం రాలేదు గానీ, కేసీఆర్  ఇంట్లో మాత్రం ఐదారు ఉద్యోగాలు వచ్చాయని, అలాగే, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వారికీ మంత్రి పదవులు,  ఉద్యమకారులపై రాళ్ళేసిన వారికి పార్టీలో చేరిన పది రోజులకే ఎమ్మెల్సీ పదవులు వచ్చాయని, తెరాస అభ్యర్ధి గెలిస్తే, హుజూరాబాద్ ప్రజలందరికీ ప్రయోజనం జరగడం  కూడా అంతే అని  నిరుద్యోగ యువకులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్న సమీపిస్తున్నకొద్దీ తెరాసలో  ఓటమి భయం పెరుగుతోందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తెరాసలో అయితే హుజూరాబాద్ కొంప ముచుతుందనే ఆందోళన వ్యక్తమవుతోందని  అంటున్నారు.

టీవీ5 కార్యాలయంపై రాళ్ల దాడి.. నిందితుడు జగన్ అభిమాని? 

హైదరాబాద్ లోని టీవీ5 న్యూస్ చానెల్ ప్రధాన కార్యాలయంపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. గురువారం ఓ వ్యక్తి  జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్ 1లో ఉన్న టీవీ 5 కార్యాలయానికి చేరుకున్నాడు. అనంతరం కార్యాలయం అద్దాలపై రాయితో దాడిచేశాడు. ఈ ఘటనలో కార్యాలయ అద్దం దెబ్బతినడంతోపాటు ఓ వైద్యుడి కారు అద్దాలు పగిలిపోయాయి. ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు టీవీ 5 కార్యాలయానికి వచ్చిన వైద్యుడు శ్రీధర్‌రెడ్డి కారుపై ఆ రాయి పడడంతో దాని అద్దం పగిలింది. అప్రమత్తమైన టీవీ 5 సిబ్బంది నిందితుడిని పట్టుకున్నారు. టీవీ5 సిబ్బంది ఫిర్యాదులో పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు.  టీవీ5 కార్యాలయంపై రాయి విసిరిన వ్యక్తిని కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం పెద్దలపురానికి చెందిన తేజేశ్వర్‌రెడ్డి (37) గా పోలీసులు గుర్తించారు. నిందితుడు మద్యం తాగి ఉన్నట్టు  ప్రాథమికంగా నిర్దారించారు. అతడిని పోలీసులు విచారించగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిమాని అని తేలినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ టార్గెట్ గా వరుసగా కథనాలు ప్రసారం చేస్తున్నారనే కోపంతోనే దాడికి పాల్పడినట్లు తేజేశ్వర్‌రెడ్డి పోలీసులకు చెప్పారని చెబుతున్నారు. పోలీసులు నిందితుడిని లోతుగా విచారిస్తున్నారు. మద్యం మత్తులో అతనే చేశాడా లేక ఎవరి ప్రోద్బలం అయినా ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారని సమాచారం. గతంలోనూ టీవీ5 కార్యాలయంపై రెండు సార్లు రాళ్ల దాడి జరిగింది.  

మంత్రికో న్యాయం.. ఇదెక్కడి అన్యాయం?

మాకో రూలు, మీకో రూలు ఇదెక్కడి న్యాయం? చట్టసభల్లో, రాజకీయ చర్చల్లో తరచూ విని పించే ప్రశ్న ఇది. అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రభుత్వమో, అధికార యంత్రాంగమో ఇంకొకరో వ్యతాసం, వివక్ష చూపించి నప్పుడు, ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావును ఇదే ప్రశ్న బోనులో నిలబెట్టింది. అవును, ఆయన తమ సహచర మంత్రుల మధ్య వివక్ష చుపుతున్నారా ... ఒక్కొక్కరికీ ఒక్కొక్క రూల్ అప్లై చేస్తున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. ఈ వివక్షే ఇప్పుడు ఆయన్ని బోనులో నిలపెట్టిందని అంటున్నారు.   ఈ సంవత్సరం (2021) మే మొదటి వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్, రెండు దశాబ్దాలకు పైగా తమ వెంట ఉన్న సహచర మంత్రి ఈటల రాజేందర్ పై ఎవరో చేసిన ఆరోపణల ఆధారంగా చర్యలు తీసుకున్నారు. ఆరోపణలు వచ్చిందే తడవుగా, ఆగమేఘాల మీద విచారణ జరిపించారు. అంతే వేగంగా అధికారులతో నివేదిక తెప్పించుకున్నారు. అంతకంటే ఇంకా వేగంగా ఆయన మీద చర్యలు తీసుకున్నారు. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారు. చివరకు ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేవరకు, అధికార తెరాస నాయకులు వెంటాడారు. తప్పు లేదు, ప్రభుత్వ ప్రతిష్ట  దెబ్బతినకుండా, ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం సన్నగిల్ల కుండా ముఖ్యమంత్రి ఈటల మీద చర్యలు తీసుకున్నారు. అలాగే, పార్టీ ప్రతిష్ట కాపాడేందుకు తెరాస అధ్యక్షుని హోదాలో పార్టీ నుంచి కూడా దిగ్విజయంగా బయటకు పంపారు. అందుకు కూడా ఎవరూ అభ్యంతరం చెప్పరు.ఇక కేసు విషయానికి వస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది.  అయితే  మంత్రుల మీద అవినీతి ఆరోపణలు రావడం ఇదే మొదటి సారా? అప్పుడెప్పుడో  ఇలాగే, ఇంతే అవమానకరంగా మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్య మీద, మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్ళకు బడుగు బిడ్డ ఈటల రాజేందర్ మీద తప్పించి ఇంకెవరి మీద అవినీతి ఆరోపణలే రాలేదా?. సరే  గతం గతః గతాన్ని వదిలేసినా, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ మంత్రులను పక్కన పెట్టినా, ఈటలపై వేటు వేసిన తర్వాత అదే విధమైన ఆరోపణలు వచ్చిన వారిని ఎందుకు వదిలేశారు. ఈటల మీద వేటు తర్వాతే కదా, మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ, ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ పై అదే తరహ ఆరోపణలు చేసింది? అది కూడా ఏ దేవయాంజిల్ దేవుడి భూములను ఈటల ఆక్రమించుకున్నారని అంటున్నారో, ఆరోపిస్తున్నారో, అదే దేవయాంజల్ భూములలో మంత్రి కేటీఆర్, మరో తెరాస వ్యాపార వేత్త, నమస్తే తెలంగాణ చైర్మన్, ఎండీ దామోదర రావుకు కూడా భూములు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు కదా .. అందుకు తమ వద్ద  ఆధారాలు ఉన్నాయని బహిరంగగా సవాలు విసిరారు కదా, మరి అలాంటప్పుడు ఈటల మీద ప్రయోగించిన మంత్ర దండాన్ని మంత్రి  కేటీఆర్ మీద ఎందుకు ప్రయోగించలేదు? మంత్రివర్గం నుంచి తొలిగించక పొతే పాయ్, కనీసం ఒక కంటి తుడుపు విచారణ అయినా ఎందుకు జరిపించలేదు? ఎందుకీ వివక్ష? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  మంత్రి శ్రీనివాస గౌడ్ పై మహబూబ్ నగర్ కు చెందిన విశ్వనాథ రావు, పుష్పలత దంపతులు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఒక పాత కేసుకు సంబంధించి తాము సాక్షులుగా ఉన్నందున  మంత్రి, మంత్రి సోదరుడు శ్రీకాంత్ గౌడ్ తమపై కక్ష కట్టి స్థానిక సీఐ మహేశ్వర ద్వారా తప్పుడు కేసులు పెట్టి వేదిస్తునారని, ఉద్యోగం తీయించి  బాధలకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  అయితే, మంత్రి మీద చర్యలు లేవు  సరికదా, బాధితుల కథనాన్ని లైవ్’లో చూపిన క్యూ న్యూస్ చానల్ (తీన్మార్ మల్లన్న) పై పోలీసులు సోదాలు పేరుతో దాడులు చేశారు. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు అందరిని  సమానంగా  చూడడం, సమ న్యాయం పాటించడమే కాదు, పాటిస్తున్నట్లుగా కనిపించడం కూడా ముఖ్యమే అంటారు పెద్దలు. ఈటల వ్యవహారంలో ముఖ్యమంత్రి అందుకు విరుద్ధంగా మంత్రుల మది వివక్ష చూపడమే కాదు, ఆ బొమికలు మెళ్ళో వేసుకుంటున్నారని అంటున్నారు.  ఈ అన్నిటినీ మించి, ఇపటికే ఇతరత్రా ఆరోపణలు ఎదుర్కుంటున్న కరీంనగర్ మంత్రి గంగుల కమలాకర్’కు ఏకంగా ఈడీ నోటీసులు జారీ చేసింది.  మంత్రి కి సంబందించిన కంపెనీ గ్రానైట్ తవ్వకాలు, తరలింపులో అక్ర‌మాలు జ‌రిగాయంటూ ఈడీ రూ.360 కోట్ల పెనాల్టీ విధించింది. కేవలం ఆరోపణలు వచ్చినందుకే ఈటలపై వేటు వేసిన ముఖ్యమంత్రి, ఏకంగా ఈడీ పెనాల్టీ విధించిన గంగుల పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ప్రజా కోర్టు ప్రశ్నిస్తోంది.  అంతే కాదు ఈటల మీద వేటు వేయడానికి  వేరే కారణం ఉందని, అవినీతి ఆరోపణలే ప్రామాణికంగా తీసుకుంటే, ముఖ్యంగా ఈటల మీద చేసిన ప్రధాన ఆరోపణ, అసైన్డ్ భూముల అక్రమ ఆక్రమణే ప్రామాణికంగా తీసుకుంటే, పార్టీలతో ప్రమేయం లేకుండా కనీస సగానికి పైగా ప్రస్తుత,  మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇతర ప్రజా ప్రతినిదులలో సగం మందికి  పైగా అదే కోవలోకి వస్తారు. ఆ సంగం మందిలో ఈటలే కాదు కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యలు కూడా ఉంటే ఉండ వచ్చును. అందుకే కేసీఆర్ ప్రజా కోర్టు బోనులో నిలబడవలసి వచ్చిందని అంటున్నారు. హుజురాబాద్ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, ఈటల విషయంలో కేసీఆర్ ప్రత్యర్ధుల నుంచే కాదు, ప్రజల నుంచి కూడా విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఈటల ఎపిసోడ్ కేసీఆర్ రాజకీయ జీవితంపై ఒక మాయని మరకగా మిగిలిపోతుందని అంటున్నారు.

లారీలు అడ్డుపెట్టి.. దేవినేని కాన్వాయ్‌ని అడ్డ‌గించి.. ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు ఫైర్‌..

దేవినేని ఉమాపైనే దాడి చేశారు. మాజీ మంత్రినే అడ్డుకున్నారు. ఆ త‌ర్వాత బాధితుడిపైనే అడ్డ‌గోలుగా కేసులు పెట్టారు. అర్థ‌రాత్రి హైడ్రామా చేశారు.బెయిల్ రాకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు మోపారు. అరెస్ట్ చేసి జైలుకు కూడా త‌ర‌లించారు. అయినా, పాల‌కుల‌కు దేవినేనిపై క‌సి తీర‌న‌ట్టుంది. ప్ర‌భుత్వాన్ని ప‌దే ప‌దే ప్ర‌శ్నిస్తున్నార‌ని కాబోలు మ‌రోసారి అదే దుస్సాహ‌సానికి తెగించారు. హైకోర్టు దేవినేని ఉమాకు బెయిల్ ఇవ్వ‌డంతో తాజాగా రాజ‌మండ్రి జైలు నుంచి విడుద‌ల‌య్యారు. ఉమాకు మ‌ద్ద‌తుగా తెలుగుదేశం శ్రేణులు త‌ర‌లిరావ‌డంతో.. త‌మ్ముళ్ల తోడుగా భారీ కాన్వాయ్‌తో విజ‌య‌వాడ బ‌య‌లు దేరారు. దేవినేని ఆద‌ర‌ణ‌, ఘ‌న‌స్వాగ‌తం చూసి పాల‌కుల‌కు, పోలీసుల‌కు మ‌రోసారి క‌ళ్లుమండిన‌ట్టున్నాయి. బెజ‌వాడ వ‌స్తున్న దేవినేని కాన్వాయ్‌ను మార్గ‌మ‌ధ్య‌లో.. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా జాతీయ ర‌హ‌దారిపై అడ్డుకున్నారు పోలీసులు. ఏకంగా లారీలు, జీపులు అడ్డుపెట్టి వాహ‌న శ్రేణిని అడ్డుకోవ‌డం వివాదాస్ప‌ద‌మైంది.   రాజ‌మండ్రి నుంచి పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సమీపంలోకి రాగానే ఉమా కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రహదారికి అడ్డంగా లారీలు, ట్రక్కులు పెట్టి టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రయాణిస్తున్న వాహనాలను రోడ్డుపైనే నిలిపివేశారు. దేవినేని ఉమా ప్రయాణిస్తున్న ఒక్క కారును మాత్రం పంపిచేసి ఆయ‌న వెంట ఎవ‌రూ వెళ్ల‌కుండా కుట్ర చేశారు. కాన్వాయ్‌లోని మిగతా కార్లను అడ్డుకోవ‌డంపై దేవినేని ఉమా, పట్టాభి త‌దిత‌ర‌ నేతలు అక్కడే నిరసన చేప‌ట్టారు. దీంతో భీమడోలులో ఉద్రిక్తత త‌లెత్తింది. పోలీసుల తీరుతో హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌లిగింది.    మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడం దారుణ‌మంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిప‌డ్డారు. హింసించి ఆనందించడం సీఎం జగన్‌కు పరిపాటిగా మారిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జనం నీరాజనాలు పలుకుతుంటే తట్టుకోలేక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జాతీయరహదారిపై పోలీసులు ఏవిధంగా వాహనాలు ఆపుతారని చంద్రబాబు ప్రశ్నించారు. చట్టాన్ని అధికార పక్షం వాళ్లు చుట్టంలా మార్చుకున్నారని ఆరోపించారు.  అంత‌కుముందు, జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక దేవినేని ఉమా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా న్యాయదేవత అనుగ్రహంతో విడుదలయ్యానన్నారు. అక్రమ నిర్బంధాలతో తమ పోరాటం ఆగదంటూ జ‌గ‌న్ స‌ర్కారును హెచ్చ‌రించారు.   

రెజ్లింగ్‌లో రజతం.. రాంబో రవికుమార్‌...

అరే, స్టార్ రెజ్ల‌ర్‌ సుశీల్‌కుమార్ లేక‌పోయే.. ఈసారి ఒలింపిక్స్ కుస్తీ పోటీల్లో ఒత్తి చేతుల‌తోనే ఇండియా తిరిగొస్తుందా? అని సందేహించారు చాలామంది. సుశీల్ లేక‌పోతేనేం.. తానున్నానంటూ విక్ట‌రీ సింబ‌ల్ చూపించారు ర‌వికుమార‌ఱ్ ద‌హియా. అన్న‌ట్టుగానే టోక్యో దంగ‌ల్‌లో తొడ‌గొట్టి వెండి ప‌త‌కం సాధించాడు. రెజ్లింగ్‌లో ఇండియాకు తిరుగులేద‌ని నిరూపించాడు.  ఒలింపిక్స్‌లో భారత పతాకం మరోసారి రెపరెపలాడింది. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌ విభాగంలో రవి కుమార్‌ దహియా 4-7 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఫైన‌ల్‌లో ఓడినా.. రజతంతో మెరిశాడు. స్వ‌ర్ణ ప‌త‌కం రష్యా ఎగ‌రేసుకుపోయింది.  2012 తర్వాత రెజ్లింగ్‌ పురుషుల విభాగంలో భారత్‌కు పతకం సాధించిన ఘ‌న‌త‌ రవికుమార్‌కు ద‌క్కింది. సుశీల్‌కుమార్‌ 2008లో కాంస్య పతకం సాధించగా 2012లో రజత పతకం గెలుచుకున్నాడు. తొమ్మిదేళ్ల త‌ర్వాత‌.. రవికుమార్‌ రెజ్లింగ్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్‌ సాధించి చ‌రిత్ర సృష్టించాడు.

న్యాయ ప్రముఖుల ఫోన్లు హ్యాక్! పెగాసస్ మరో కలకలం.. 

పెగాసస్ స్పైవేర్ అంశం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పలువురు కేంద్రమంత్రులు, పాత్రికేయులు సహా 300 మంది భారతీయుల ఫోన్లపై పెగాసస్ నిఘా పెట్టిందనే ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. పెగాసస్‌పై పార్లమెంట్ వేదికగా విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. పెగాసస్ అంశంపై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇంత వివాదం సాగుతుండగానే పెగాసస్ కు సంబంధించి మరో సంచలం విషయాలు తాజాగా వెలుగులోనికి వచ్చాయి. పెగాసస్ స్పై వేర్ కు సంబంధించి ది వైర్ మరో సంచలన కథనాన్ని పబ్లిష్ చేసింది. పెగాసస్ నిఘా పెట్టిన వారిలో  న్యాయ వ్యవస్థకు చెందిన ప్రముఖులు ఉన్నట్లుగా పేర్కోంది. తాజాగా పబ్లిష్ చేసిన కథనంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పాత ఫోన్ నంబరు.. మాజీ అటార్నీ జనరల్ సహాయకుడి ఫోన్ నంబరు కూడా నిఘా పెట్టాల్సిన జాబితాలో ఉన్నట్లుగా చెబుతున్నారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు ఎన్ కే గాంధీ టీఐ రాజ్ పుత్ ల ఫోన్లను 2019లోనే నిఘా జాబితాలో ఉన్నట్లుగా ది వైర్ తాజా కథనంలో వెల్లడించింది.  సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ల ఫోన్లపై నిఘా పెట్టాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నకు ది వైర్ వివరణ ఇచ్చింది. సుప్రీంకోర్టులో కీలకమైన రిట్ పిటిషన్ల విభాగంలో రిజిస్ట్రార్లు పని చేస్తుంటారు. సంవత్సరానికి దాదాపు వెయ్యికి పైగా రిట్ పిటిషన్లు వస్తుంటాయి. వాటిల్లో కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికిగురి చేసేవి.. రాజకీయంగా సున్నితమైన అంశాలు కూడా సదరు పిటిషన్ లో ఉంటాయి కాబట్టి.. అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకునేందుకు కేంద్రం నిఘా పెట్టి ఉండొచ్చన్న అభిప్రాయాన్ని ది వైర్  వ్యక్తం చేసింది.  ఇక మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వద్ద పని చేసే జూనియర్ న్యాయవాది తంగతురై ఫోన్ నెంబరు కూడా స్నూపింగ్ జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు. అటార్నీజనరల్ పదవి నుంచి రోహత్గీ వైదొలిగిన రెండేళ్ల తర్వాత తుంగతురై ఫోన్ నెంబరును హ్యాక్ చేయాల్సిన జాబితాలో ఉన్నట్లుగా రోహత్గీ అధికారపక్షానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం స్వతంత్రంగా వ్యవహరిస్తుంటారు. అందుకే.. ఆయన పేరును కూడా నిఘా జాబితాలో చేర్చి ఉండొచ్చని విశ్లేషించింది. గతంలో వచ్చిన కథనమే తీవ్ర కలకలం రేపుతుండగా.. తాజాగా న్యాయ ప్రముఖులపైనా నిఘా పెట్టారని తేలడంతో ఇంకెంత రచ్చ జరుగుతుందో చూడాలి మరీ.. 

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సైకిల్‌దే విజ‌యం.. ఉత్త‌రాది నేత‌ కీల‌క వ్యాఖ్య‌లు..

డౌటే లేదు. సైకిలే గెలుస్తోంది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సైకిల్ రాజ్యం త‌ప్ప‌క వ‌స్తుంది. ప్ర‌భుత్వంపై ప్ర‌జావ్య‌తిరేక‌త అలా ఉంది మ‌రి. నిరుద్యోగులు స‌ర్కారుపై ర‌గిలిపోతున్నారు. ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో ప్ర‌జ‌లు క‌డుపుమంట‌తో ఉన్నారు. రైతుల ఆక్రంద‌నను పాల‌కులు ప‌ట్టించుకోవ‌డం లేదు. నేరాలు బాగా పెరిగాయి. ప్రజలకు ఆక్సిజన్‌, ఔషధాలు కూడా అందుబాటులో ఉంచకుండా వారి చావుకు వారిని వదిలేశారు. ఇలాంటి ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లే బుద్ధి చెబుతారు. సైకిల్ గుర్తును భారీ మెజార్టీతో గెలిపిస్తారంటూ స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్ అన్నారు.  సోషలిస్టు నేత జ్ఞానేశ్వర్‌ మిశ్రా జయంతి సందర్భంగా యూపీలో సైకిల్‌ ర్యాలీ నిర్వ‌హించారు ఎస్పీ అధినేత‌ అఖిలేష్‌. యూపీ వ్యాప్తంగా చేపట్టిన సైకిల్ ర్యాలీలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతు చట్టాలు, నేరాల రేటు పెరుగుదల.. తదితర అంశాలను లేవనెత్తారు.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స‌మాజ్‌వాదీ పార్టీ 400 స్థానాలు గెలుచుకుంటుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు అఖిలేష్ యాద‌వ్‌. ‘‘ వచ్చే ఎన్నికల్లో 350 స్థానాలు గెలుస్తామని గతంలో చెప్పా.. కానీ బీజేపీ పాలనపై ప్రజల ఆగ్రహం చూస్తుంటే 400 సీట్లలో విజయం ఖాయమని చెప్పగలను’ అని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలు ఉన్నాయి.  కరోనా కట్టడిలో బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు అఖిలేష్‌.  కొవిడ్‌ సెకండ్‌వేవ్‌లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వం సాయం చేయలేదని విమ‌ర్శించారు. ప్రజలకు ఆక్సిజన్‌, మెడిసిన్‌ కూడా అందుబాటులో ఉంచకుండా వారి చావుకు వారిని వదిలేసిందని త‌ప్పుబ‌ట్టారు. బీజేపీ 2017 ఎన్నికల మేనిఫెస్టోను చదవకుండా.. మనీ-ఫెస్టోపై దృష్టి పెట్టిదంటూ ఎద్దేవా చేశారు. బీజేపీలో వర్క్‌ కల్చర్ లేదన్న అఖిలేశ్‌.. తమ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు పేర్లు మార్చడం మిన‌హా.. ఈ నాలుగేళ్లలో బీజేపీ స‌ర్కారు చేసిందేమీ లేదన్నారు. పిల్లల్లో పోషకాహార లోపం, కస్డడీ మరణాలు, గంగా నదిలో మృతదేహాలను పారవేసే వ్యవహారంలో యూపీని యోగి ప్రభుత్వం మొద‌టి స్థానంలో నిలిపిందంటూ మండిప‌డ్డారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాద‌వ్. స‌మాజ్‌వాదీ పార్టీ ఎన్నిక‌ల చిహ్నం సైకిల్‌.  

సలహాదారు పదవికి పీకే రాజీనామా.. కాంగ్రెస్ గూటికి ఖాయమేనా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న వార్త చాలా కాలంగా రాజకీయ, మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. జూలై 13 వ తేదీన ఆయన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ, అయన సోదరి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రాతో సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఇక అక్కడి నుంచి పీకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న వార్త సోషల్ మీడియాలో ఇతరత్రా వినవస్తూనే ఉంది. అయితే, ఇంతవరకు అటు కాంగ్రెస్ వర్గాలు గానీ, ఇటు పీకే గానీ,’అసలేం జరిగింది?’ అనే దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, ఆ తర్వాత రాహుల్ గాంధీ పార్టీ కమల్ నాథ్, ఏకే అంటోనీ, వేణుగోపాల్, వంటి సీనియర్  నాయకులతో ఇదే విషయంగా సుదీర్ఘంగా చర్చించారని, పార్టీలో పీకేకు ఇచ్చే పోస్టు, ప్రాధాన్యతల విషయంలోనూ రాహుల్ గాంధీ ఒక నిర్ణయానికి వచ్చారని కథనాలు వినవచ్చాయి. అప్పట్లోనే, పీకే కాంగ్రెస్’లో చేరడం ఖాయమని ఊ(వ్యూ)హాగానాలు షికార్లు చేశాయి. అయినా, షరా మాములుగా అధికారిక సమాచారం మాత్రం లేదు. అంతే కాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ జరగ లేదు, ఎవరూ ఏమీ కాలేదు.   ఇప్పుడు తాజాగా ప్రశాంత్ కిశోర్ మరో పుకారుకు ప్రాణం పోశారు. పంజాబ్  ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు ప్రధాన సలహాదారుగా ఉన్న ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఏమో కానీ, ఆయన పంజాబ్ పదవికి రాజీనామా చేసింది అందుకే, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే అని ప్రచారం అయితే మొదలైంది. నిజానికి ప్రశాంత్ కిశోర్  తన రాజీనామాకు, పెద్దగా ఊహకు అందని కారణాలు ఏమీ లేవని చెప్పకనే చెప్పారు.ప్రజాజీవితంలో క్రియాశీల పాత్ర నుంచి కొంత విరామం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ ‘ కు రాసిన లేఖలోనే పేర్కొన్నారు.అలాగే, తమ   భవిష్యత్‌ కార్యాచరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు.  అయినా ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు గత కొంతకాలంగా వ్యూహాత్మకంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు మరిన్ని ఊహాగానాలకు తావిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకే పీకే పంజాబ్ సీఎం ప్రధాన సలహాదారు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో వినికిడి. అయితే దీనిపై అటు పీకే గానీ.. ఇటు కాంగ్రెస్‌ గానీ ఇంతవరకూ స్పందించలేదు. ఈ ఏడాది మార్చిలో పీకే.. అమరీంద్‌ సింగ్‌ ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఆయనకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ ఈ పదవిలోకి తీసుకున్నారు.2022 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్‌ను అమరీందర్‌ తన సలహాదారుగా నియమించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.2017 ఎన్నికల్లో పంజాబ్‌లో కాంగ్రెస్‌ గెలుపునకు అమరీందర్‌- పీకే కలిసి పనిచేశారు. అంతేగాక, ఇటీవల పంజాబ్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న కెప్టెన్‌- సిద్ధూ సమస్య పరిష్కారంలో పీకే క్రియాశీలకంగా పనిచేశారు. పలు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన పీకే.. బెంగాల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాజకీయాల్లో తాను ఇప్పటికే విఫలమయ్యాయనన్న కిశోర్‌.. భవిష్యత్తు ప్రణాళిక ఏమిటో మాత్రం చెప్పలేదు. కొన్నేళ్ల క్రితం పీకే.. జేడీయూ పార్టీలో చేరారు. అయితే ఆ పార్టీతో భేదాభిప్రాయాలు రావడంతో పార్టీ నుంచి వైదొలిగారు. అయితే ఇటీవల కాలంలో ఆయన తమ వ్యాపార ఎత్తుగడల్లో భాగంగానో లేక వేరే కారణాల చేతనో గానీ, జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా విపక్షాలు అన్నింటినీ ఏక చేసి, మోడకి వ్యతిరేకంగా కూటమి కట్టేందుకు ఇటు మమత, అటు పవర్ చేస్తున్న ప్రయత్నాలకు పీకేనే సూత్రధారిగా అనిచేస్తున్నారు. ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆయన వేసే ప్రతి అడుగు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. అందుకే, పంజాబ్ ముఖ్యమంత్రి సలహదారు పదవికి రాజీనామా చేయడం కూడా  ఊహగానాలకు ఊపిరి పోసింది. వాస్తవం ఏమిటన్నది ... ఇప్పుడే తెలిసే అవకాశం అయితే లేదు.  అందరికీ  శకునం చెప్పీ ఎలుక కుడితిలో పడింది అన్నట్లుగా, వ్యూహకర్తగా ఎదరినో అందలం ఎక్కించిన ప్రశాంత్ కిశోర్ ... తొందర పడి తప్పుడు నిర్ణయం తీసుకుంటారు అని మాత్రం అనుకోలేము. అందులోనూ ఆయన ఒక సారి, జేడీయూలో వేలు పెట్టి చేయ కాల్చుకున్నారు. జేడీయూలో చేరి సంవత్సరం తిరగ కుండానే రాజకీయలానుంచి తప్పు కున్నారు. రాజకీయ వ్యూహకర్తగా అద్భుత విజయాలు సాధించిన పీకే, రాజకీయ నాయకుడిగా ఫెయిల్ అయ్యారు .. ఆ నిజం ఆయనే చెప్పారు. సో .. పీకే నెక్స్ట్ స్టెప్ ఏమిటన్నది .. ఒక్క పీకే నే చెప్పగలరు.

ఉన్న‌తాధికారిపై ఇసుక చల్లిన ఉద్యోగి.. దేవాదాయ‌శాఖ‌లో 'భూ'కంపం..

పై అధికారిపై కోపం వ‌స్తే ఏం చేస్తారు? తిడితే ప‌డ‌తారు.. లేదంటే ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేస్తారు.. అదీ కాదంటే తోటి ఉద్యోగులకో, ఇంట్లో వారికో చెప్పుకొని బాధ‌ప‌డతారు. బాస్ పీడ ఎప్పుడు విర‌గ‌డ‌వుతుందా.. ఎప్పుడు ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుందా అని ఎదురుచూస్తుంటారు. కానీ, ఆమె మాత్రం అలా కాదు. కోపం వ‌చ్చింది. ఆవేశంతో ర‌గిలిపోయింది. ఇక అంతే.. గుప్పెడు ఇసుక తీసుకొచ్చి ఆ అధికారి ముఖంపై కొట్టింది. ఇదంతా సీసీకెమెరాల్లో రికార్డు అవ‌డంతో.. ఏపీ దేవాదాయ శాఖ‌లో ర‌చ్చ రంబోలా అవుతోంది.  విశాఖ జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయంలో ఇద్దరు అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్ధన్‌పై అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి ఇసుక వేయ‌డం క‌ల‌క‌లం రేపింది.  పుష్పవర్ధన్‌ నెలరోజుల క్రితం తెలంగాణ నుంచి ఏపీకి బదిలీపై వచ్చారు. జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టారు. ఆ భూముల వ్యవహారంలో కిందిస్థాయి సిబ్బందిపై పలుమార్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ క‌మిష‌న‌ర్ శాంతి ఉదాసీనతను పుష్పవర్ధన్‌ ప్రశ్నించడంతో ఈ ఘటన చోటుచేసుకుంద‌ని అంటున్నారు.  ఆమె అలా ముఖం మీద ఇసుక చ‌ల్లినా.. డిప్యూటీ క‌మిష‌న‌ర్ పుష్ప‌వ‌ర్థ‌న్ మాత్రం ఏమాత్రం కంట్రోల్ త‌ప్ప‌లేదు. కోపానికి రాలేదు. కుర్చీలో అంతే శాంతంగా కూర్చున్నారు. ఆమెను ప‌ల్లెత్తి మాట కూడా అన‌లేదు. అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి చర్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు పుష్ప‌వ‌ర్థ‌న్‌. విజిలెన్స్‌ సిబ్బంది కార్యాలయానికి చేరుకుని మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టారు. డీసీ పుష్ప‌వ‌ర్థ‌న్‌పై ఏసీ శాంతి ఇసుక చల్లిన సీసీకెమెరా దృశ్యాలు తెగ వైర‌ల్ అవుతున్నాయి.     

ప్రకాశం జిల్లా వైసీపీలో ఫైటింగ్! త్వరలో ఎంపీ మాగుంట జంప్?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమంటోంది. కొంత కాలంగా అంతర్గతంగా సాగుతున్న విభేదాలు.. ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. జగన్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో.. ఇదే అదనుగా పార్టీ నుంచి బయటికి వచ్చేందుకు కొందరు నేతలు చూస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు దూకుడుతో కష్టాలు పడుతున్న వైసీపీకి. త్వరలో మరో ఎంపీ షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. జగన్ రెడ్డికి గుడ్ బై చెప్పి... ఆ ఎంపీ టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని  సమాచారం. ఇప్పటికే సదరు ఎంపీ టీడీపీ ముఖ్య నేతలతో మంత్రాంగం నడుపుతున్నారని చెబుతున్నారు.  ప్రకాశం జిల్లా వైసీపీ నేతల మధ్య చాలా కాలంగా విభేదాలున్నాయి. తాజాగా అవి తీవ్ర రూపం దాల్చినట్లు తెలుస్తోంది. ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మంత్రి బాలినేని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందట. తాజాగా వెలుగులోనికి వచ్చిన అక్రమ మైనింగ్ విషయంలోనూ ఎంపీ మాగుంటను సొంత పార్టీ నేతలే ఇరికించే ప్రయత్నాలు చేశారని చర్చ జరుగుతోంది. సర్వేపల్లి రిజర్వాయర్‌లో మట్టి తవ్వకాలకు సంబంధించి వివాదం జరుగుతోంది. దీనిపై స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. అయితే అందులో ఏ2గా ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి పేరు పెట్టారు. ఇదే ఇప్పుడు రచ్చగా మారింది. ఎంపీ మాగుంట పేరును ఎఫ్ఐఅర్ లో చేర్చడాన్ని టీడీపీ తప్పుపడుతోంది. మాగుంటకు మద్దతుగా నిలిచారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అంతేకాదు వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కుట్ర పూరితంగా ఎంపీ మాగుంటను ఇరికించారని ఆరోపించారు.   సర్వేపల్లి ఎమ్మెల్యే అనుచరులతో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతకాలు ఫోర్జరీ చేయించి సర్వేపల్లి రిజర్వాయర్‌లో మట్టి తవ్వకాలకు తెరలేపారని సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జీపీఎస్ విధానం అమర్చి వాహనాల గురించిన సమాచారం తీసుకొని మరీ స్థానికులే స్వయంగా ఫిర్యాదు చేశారన్నారు సోమిరెడ్డి. పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్‌లో ఏ2గా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు చేర్చారన్నారు. సాధారణ గ్రావెల్ తవ్వకాలకు ఎంపీ స్థాయి వ్యక్తి ఎలా దరఖాస్తు చేసుకుంటాడని అధికారులు ఆలోచించరా అని చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎంపీ మాగుంట  సంతకాన్ని గోవర్థన్ రెడ్డి అనుచరుడే ఫోర్జరీ చేశారని ఆరోపించారు. ఒకే సంతకంతో మూడు దరఖాస్తులు వచ్చినప్పుడు ఇరిగేషన్ అధికారులు ఎందుకు పరిశీలించ లేదని ప్రశ్నించారు. వైసీపీ సాగిస్తున్న అక్రమ మైనింగ్ కోసం ఎంపీని బలిచేస్తారా అని ప్రశ్నించారు. ఎంపీ మాగుంటపై ఎమ్మెల్యే కాకాణి కక్ష తీర్చుకున్నారని.. కాకాణి దోపిడీపై, అరాచకాలపై తాము ముఖ్యమంత్రికి అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఇష్టానుసారం గ్రావెల్ దోపిడీచేస్తూ, ఏమాత్రం సంబంధంలేని సొంతపార్టీ ఎంపీనే ఇరికించడం దేనికి సంకేతమన్నారు. ఎంపీసంతకం ఫోర్జరీ చేసిన కాకాణి అనుచరుడిపై క్రిమినల్ కేసులు నమోదుచేసి, అరెస్ట్ చేయాలన్నారు. తప్పుడు ఆర్డర్ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. వైసీపీ ఎంపీ మాగుంటకు మద్దతుగా టీడీపీ నేత ఇలా ఓపెన్ ప్రకటన చేయడం చర్చగా మారింది.  ఇదిలా ఉండగానే పార్లమెంటు వర్షాకాలు సమావేశాల సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి  ఓ పార్టీ ఏర్పాటు చేశారు. మాగుంట నివాసంలో జరిగిన పార్టీకి అనూహ్యంగా టీడీపీ ఎంపీలు హాజరయ్యారు. నిజానికి ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య వార్ ఓ రేంజ్ లో ఉంటుంది.  పార్లమెంట్ లోనూ ఇరు పార్టీల ఎంపీలు చాలా గ్యాప్ మెయింటేన్ చేస్తుంటారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు పార్టీలకతీతంగా ఢిల్లీలో ఉంటారు. కాని ఏపీ లీడర్లు మాత్రం కలవడానికి ఇష్టపడరు. ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలతో కనీసం టీడీపీ ఎంపీలు ఉన్న లాబీల్లోకి కూడా వైసీపీ ఎంపీలు వెళ్లడం లేదు.అలాంటిది వైసీపీ ఎంపీ మాగుంట ఇచ్చిన పార్టీకి టీడీపీ ఎంపీలు రావడం చర్చనీయాంశంగా మారింది. మాగుంట ఇంట్లో జరిగిన పార్టీకి వచ్చిన వైసీపీ ఎంపీలు.. అక్కడ టీడీపీ ఎంపీలను చూసి షాకయ్యారట. సొంత పార్టీ ఎంపీలకు.. మాగుంట కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే.. ప్రతిపక్ష పార్టీ ఎంపీలను ఆహ్వానించడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాగుంట వైఖరిపై కొందరు వైసీపీ ఎంపీలు ఆగ్రహంగా ఉన్నారని కూడా తెలుస్తోంది. మాగుంట పార్టీలో టీడీపీ ఎంపీలు హాజరైన విషయం బయటకు పొక్కటంతో వైసీపీ పెద్దలు నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారట.  గతంలో కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్నారు మాగుంట శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి ఎంపీగా  గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల సమయంలో ఆయన టీడీపీలో చేరారు.  టీడీపీ అభ్యర్థిగా ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. తర్వాత మాగుంటను ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు చంద్రబాబు. 2019 ఎన్నికల సమయంలో  టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు మాగుంట. జగన్ సునామీలో మాగుంట విజయం సాధించారు. అయితే జిల్లా వైసీపీ నేతలతో మొదటి నుంచి ఆయనకు పొసగడం లేదనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో మాగుంటకు విభేదాలు ఉన్నాయి. జిల్లాకు సంబంధించిన విషయాల్లోనూ మంత్రి మాగుంటను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డితోనూ మాగుంటకు పడటం లేదు. ఇటీవల ఆనందయ్య కరోనా మందు విషయంలోనూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి.. మాగుంటకు మధ్య  వివాదం రేగింది. మాగుంట సపరేట్గా ఆనందయ్య మందును సేకరించి.. ప్రత్యేక శిబిరాలు వేసి ప్రజలకు పంచారు. ఈ కార్యక్రమానికి మంత్రిని ఆహ్వానించలేదు.జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేష్తోనూ ఇతర నేతలతోనూ మాగుంటకు పడడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈక్రమంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.  ఈ నేపథ్యంలో తాను ఏర్పాటు చేసిన విందుకు మాగుంట,, టీడీపీ ఎంపీలను ఆహ్వానించడం.. వైసీపీ ఎంపీలకు కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అదే సమయంలో మట్టితవ్వకాల విషయంలో ఎంపీ మాగుంట పేరు కేసులో చేర్చడం, దీనికి వ్యతిరేకంగా టీడీపీ మాట్లాడటం ఆసక్తిగా మారింది. తాజా పరిణామాలతో మాగుంట వైఖరిలో మార్పు వచ్చిందా? దీని వెనుక ఏమైనా రాజకీయ కోణం ఉందా? అనే చర్చ  మొదైలంది. త్వరలోనే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి.. టీడీపీ గూటికి చేరడం ఖాయమనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. 

సానియా మిర్జాపై రాజాసింగ్ ర‌చ్చ‌..

తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్ ఎవ‌రు? వెంట‌నే స‌మాధానం చెప్ప‌లేరు కొంద‌రు. గూగుల్‌లో సెర్చ్ చేసి.. ఓహో, సానియా మిర్జానా అనుకుంటారు. తెలంగాణ‌కు ఓ బ్రాండ్ అంబాసిడ‌ర్ ఉన్నార‌ని.. అది టెన్నిస్‌ ప్లేయ‌ర్ సానియా అని తెలిసాక కూడా అనేక ప్ర‌శ్న‌లు వ‌స్తుంటాయి. బ్రాండ్ అంబాసిడ‌ర్ అంటే ఏం చేస్తారు? ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది? అనే విష‌యాలు ప‌క్క‌న‌పెడితే.. ఇప్పుడు ఆ హోదాపై కిరికిరి స్టార్ట్ చేశారు బీజేపీ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌. పాకిస్తాన్ కోడ‌లు మ‌న‌కెందుకు.. తెలంగాణ అమ్మాయి పీవీ సింధును బ్రాండ్ అంబాసిడ‌ర్ చేయాల‌ని డిమాండ్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య ప‌త‌కం సాధించిన‌ పీవీ సింధుని సీఎం కేసీఆర్ మరింత ప్రోత్సహించాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్‌. స్పోర్ట్స్ కోసం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నారు. పీవీ సింధు తెలంగాణ అమ్మాయి.. తెలంగాణ‌కే కాకుండా భారతదేశానికి కూడా పేరు తెచ్చిందన్నారు. అందుకే, పీవీ సింధును తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా చేయాలన్నారు. పాకిస్తాన్ కోడలు (సానిమా మిర్జా)ను సీఎం కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగించడం సరికాదన్నారు.  ప్రముఖ టెన్నీస్ స్టార్‌ సానియా మిర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించాలని రాజా సింగ్ గతంలో కూడా డిమాండ్ చేశారు. హైద‌రాబాద్‌కు చెందిన సానియా మిర్జా.. పాకిస్తాన్ క్రికెటర్‌ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చారు.   

రేపోమాపో హుజురాబాద్ నోటిఫికేష‌న్‌.. బీజేపీ స్కెచ్.. కేసీఆర్ అల‌ర్ట్‌.. ఈటల జంప్!

అవును, మీరు చ‌దివింది నిజ‌మే. రేపోమాపో హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ రాబోతోంద‌ట‌. ఈ మేర‌కు ఢిల్లీ నుంచి లీకులు వ‌స్తున్నాయి. సీఎం కేసీఆర్‌కు పై నుంచి స‌మాచారం అందింద‌ట‌. ఈట‌ల చెవికీ ఆ మెసేజ్ రీచ్ అయిందే. అందుకే, ఆ ఇద్ద‌రు నేత‌లు వెంట‌నే అల‌ర్ట్ అయ్యారు. కేసీఆర్ ప‌రుగున వాసాల‌మ‌ర్రిలో వాలిపోయి.. ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ప్రారంభించేశారు. అటు, కాలికి స‌ర్జ‌రీ అయింది.. 10 రోజులు రెస్ట్ అవ‌స‌ర‌మ‌న్నా విన‌కుండా.. ఈట‌ల రాజేంద‌ర్ ఆసుప‌త్రి నుంచి నేరుగా హుజురాబాద్‌కు ప‌రుగులు పెట్టారు. వాళ్లిద్ద‌రి దూకుడు అలా ఉంటే.. ఇటు కాంగ్రెస్ సైతం నిద్ర‌మ‌బ్బు నుంచి మేల్కొని.. కేండిడేట్ సెల‌క్ష‌న్ స్పీడ‌ప్ చేసింది. ఇలా తెలంగాణ‌లో బైపోల్ వార్ ఒక్క‌సారిగా వేడెక్కి.. రాజ‌కీయ హ‌డావుడి అమాంతం పెరిగిపోయింది.  బుధ‌వారం సీఎం కేసీఆర్ స‌డెన్‌గా త‌న ద‌త్త‌త గ్రామం వాసాల‌మ‌ర్రికి వెళ్ల‌డం ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామం. నాగార్జున సాగ‌ర్‌కు వెళ్లిన‌ట్టే.. వాసాల‌మ‌ర్రిలో కూడా ప‌ర్య‌టిస్తారేమో అనుకున్నారంతా. కానీ చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు సీఎం కేసీఆర్‌. అది పేరుకే వాసాల‌మ‌ర్రి ప‌ర్య‌ట‌న అయినా.. ఆయ‌న టూర్ అంతా ద‌ళితుల చుట్టూనే తిరిగింది. ద‌ళితవాడ‌లో ఇంటింటికీ కాలిన‌డ‌క‌న వెళ్లి ప‌రిశీలించారు. వారి మంచిచెడ్డ‌లు అడిగి తెలుసుకున్నారు. ఆ త‌ర్వాత ద‌ళితుల‌తోనే ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. మిగ‌తా కులాల వారినెవ్వ‌రినీ ఆ మీటింగ్‌కి రానివ్వ‌లేదు. కొంద‌రు వాసాల‌మ‌ర్రి వాసులు గొడ‌వ చేసినా.. వారిని లోనికి అనుమ‌తించ‌లేదు. అప్పుడు కూడా ఎవ‌రికీ అనుమానం రాలేదు. ఆ మీటింగ్‌లో మాట్లాడుతూ.. స‌డెన్‌గా ద‌ళిత‌బంధు ప‌థ‌కం వాసాల‌మ‌ర్రి నుంచే ప్రారంభిస్తున్న‌ట్టు.. ఇప్పుడు.. ఈ గంట‌నుంచే ద‌ళిత‌బంధు ప్రారంభం అయిపోయిన‌ట్టు.. ప్ర‌క‌టించేశారు సీఎం కేసీఆర్‌. తర్వాత కొన్ని గంటల్లోనే దళిత బంధుపై జీవో ఇచ్చేశారు, 76 ద‌ళిత కుటుంబాల‌కు  త‌లా 10ల‌క్ష‌లు అకౌంట్లో జ‌మ చేసేశారు.   అంతా ఆశ్చ‌ర్యం. అంద‌రిలోనూ సందేహం. ద‌ళిత‌బంధు స్టార్ట్ అయిపోయిందా.. అని గిల్లి మ‌రీ చూసుకున్నారు కొంద‌రు. హుజురాబాద్‌లో క‌దా ప్రారంభం కావాల్సింది? వాసాల‌మ‌ర్రిలో ఎందుకు మొద‌లు పెట్టారు? ల‌క్ష కోట్ల ప‌థ‌కాన్ని అంత సింపుల్‌గా, ఎలాంటి హంగామా లేకుండా.. అలా ఎలా ప్రారంభించేశారు? కేసీఆర్‌ ఇలా ఎలా చేశారు? అంటూ అనేక అనుమానాలు. ఆ ప్ర‌శ్న‌ల‌న్నిటిపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వ‌స్తోంది. అస‌లు గుట్టు ర‌ట్ట‌వుతుంది. హ‌మ్మా.. కేసీఆర్ ఇంత‌టి ఎత్తుగ‌డ వేశారా? దాని వెనుక ఇంత పెద్ద రీజ‌న్ దాగుందా? అని తెలిసి అంతా నోరెళ్ల బెగుతున్నారు. రేపోమాపో హుజురాబాద్ బైపోల్‌కు కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేష‌న్ జారీ చేస్తుంద‌నే ప‌క్కా స‌మాచారం కేసీఆర్‌కు వ‌చ్చింద‌ట‌. అదే జ‌రిగితే.. షెడ్యూల్ వెలువ‌డితే.. ఇంకా ప్రారంభం కాని ద‌ళిత‌బంధును ఆపేయ‌డం ఖాయం. అది కేసీఆర్‌కు అస‌లుకే ఎస‌రు తెస్తుంది. అందుకే, వెంట‌నే ద‌ళిత‌బంధును స్టార్ట్ చేసేస్తే.. ఆన్ గోయింగ్ ప‌థ‌కం కింద చూపించొచ్చు. అప్పుడు హుజురాబాద్ నోటిఫికేష‌న్ వ‌చ్చినా.. ద‌ళిత బంధుకు ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు. ఇదంతా హుజురాబాద్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాబోతోంద‌నే లీకుల‌తోనే కేసీఆర్ ఇలా స్కెచ్ వేశార‌ని అంటున్నారు.  కేసీఆర్ తీసుకురాబోతున్న‌ ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ఎలాగైనా అడ్డుకోవడానికి బీజేపీ పెద్ద‌లు గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. స‌డెన్‌గా హుజురాబాద్ నోటిఫికేష‌న్ జారీ చేయ‌డానికి ఈసీ సిద్ద‌మ‌వ‌డం అందులో భాగ‌మేనంటున్నారు. ఆ విష‌యం ప‌సిగ‌ట్టే సీఎం కేసీఆర్ ద‌ళిత‌బంధును సింపుల్‌గా, ఎలాంటి హ‌డావుడి లేకుండా, అప్ప‌టిక‌ప్పుడు స్టార్ట్ చేసేశారు. దీంతో.. కంగుతిన్న క‌మ‌ల‌నాథులు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. వెంట‌నే మేట‌ర్ ఈట‌ల చెవిలో వేసేశారు. అటు ఈసీ నోటిషికేష‌న్‌, ఇటు ద‌ళితబంధు.. విష‌యం తెలిసి ఈట‌ల రాజేంద‌ర్ ఆసుపత్రి బెడ్ మీద‌నుంచి నేరుగా హుజురాబాద్ ప‌య‌న‌మయ్యారు. కాలి గాయం అలానే ఉన్నా.. ఆరోగ్యం కుద‌టప‌డ‌కున్నా.. డాక్ట‌ర్లు వారించినా.. డోంట్‌కేర్ అంటూ.. స‌మ‌యం లేదంటూ.. ఆల‌స్యం అయితే అస‌లుకే మోసం వ‌స్తుందంటూ.. కంగారు కంగారుగా ఈట‌ల మ‌ళ్లీ రంగంలోకి దిగిపోయారు.  కేసీఆర్‌, ఈట‌ల ఇలా హ‌డావుడి ప‌డుతుంటే.. కాంగ్రెస్ మాత్రం హుజురాబాద్ విష‌యంలో త‌న‌ న‌త్త‌న‌డ‌క‌లో ఇప్పుడిప్పుడే వేగం పెంచుతోంది. తాజాగా, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నిక విష‌యంలో ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేసి స‌మీక్ష నిర్వ‌హించారు. స‌రైన అభ్య‌ర్థిని ఎంపిక చేసే బాధ్య‌త‌ను దామోద‌ర రాజ‌న‌ర్సింహా, పొన్నం ప్ర‌భాక‌ర్‌లకు అప్ప‌గించారు. తాము త‌గ్గైనా.. ఈట‌ల‌ను గెలిపించైనా.. కేసీఆర్‌ను ఓడించేలా రాజ‌కీయ జూదం ఆడుతున్న‌ట్టుంది కాంగ్రెస్‌పార్టీ. అందుకేనేమో.. హుజురాబాద్ విష‌యంలో మొద‌టినుంచీ అంత దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం లేదు రేవంత్‌రెడ్డి.  ఇలా మూడు పార్టీలు జోరుతో.. రేపోమాపో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌నే లీకుల‌తో.. తెలంగాణ రాజ‌కీయం మ‌రోసారి వేడెక్కింది. అప్ప‌ట్లో కొడంగ‌ల్ ఎన్నిక‌లా.. ఇప్పుడు హుజురాబాద్ ఎల‌క్ష‌న్ మ‌ళ్లీ స్టేట్ వైడ్ హాట్ టాపిక్‌గా మారింది. చూడాలి.. ఎవ‌రి వ్యూహాలు, ఎవ‌రి ఎత్తుగ‌డ‌లు ఎలా ఉంటాయో.. ఓట‌ర్లు ఎవ‌రి వైపు ఉంటారో..

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా? బీజేపీ మనసు మారేనా? 

అసెంబ్లీ, లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన అంశం మరో మారు చర్చకు వచ్చింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ మనీష్ తివారి, కేంద్ర ప్రభుత్వం లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన కసరత్తు ప్రారంభించిందని, ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మనీష్ తివారీ  ట్వీట్  ప్రకారం  ప్రస్తుతం 543 ఉన్న లోక్ సభ స్థానల సంఖ్య రెట్టింపు గీతను కూడా దాటి ఏకంగా 1200 ప్లస్ సంఖ్యకు చేరుకుంటుంది. అలాగే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా లోక్ సభ స్థానాల సంఖ్య రెట్టింపు గీతను దాటేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్’లో ప్రస్తుతమున్న 25 స్థానాలు 52, తెలంగాణలో ప్రస్తుతమున్న 17 స్థానాలు 39కి చేరుకుంటాయి.  నిజానికి, దేశంలో నియోజక  వర్గాల పునర్విభజన 2026 వరకు గడువుంది.అది కూడా 2021 జనాభా లెక్కల ప్రకారం జరగవలసి ఉంటుంది. కొవిడ్ కారణంగా 2021లో జరగవలసిన జనగణన జరగలేదు.ఆ కారణంగా నియోజక వర్గాల పునర్విభజన ఇంకొంత ఆలస్యం అయినా అవుతుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తేనే తుట్టెను కదిపింది. జమ్మూ కశ్మీర్’ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణలో భాగంగా నియోజక వర్గాల  పునర్విభజన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం  శ్రీకారం చుట్టింది. దీంతో నియోజక వర్గాల పునర్విభజన వివాదం మళ్ళీ మరో మారు తెరపైకి వచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, మరో మెలిక కూడా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 (రాష్ట్ర విభజన చట్టం) దేశంలో నియోజక వర్గాల పునః విభజన ప్రక్రియతో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాల పునః విభజనకు అవకాశం కల్పించిందనే అభిప్రాయాన్ని కల్పిచింది.ఆంధ్ర ప్రదేశ్’లో ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ నియోజక వర్గాలను 225కు తెలంగాణలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ నియోజక వర్గాలను 153కు పెంచుకోవచ్చని విభజన చట్టం సూచించింది. ఈ నేపధ్యంలోనే దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాల పునర్విభజన అంశం తరచు చర్చకు వస్తోంది. వివాదానికి దారి తీస్తోంది.  కాంగ్రెస్ ఎంపీ మనోజ్ తివారీ ట్వీట్ సంచలనంగా మారిన నేపధ్యంలో, కాంగ్రెస్ ఎంపీ టీపీసీసీ అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి లోక్ సభలో అడిగిన ప్రశ్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, ఉభయ తెలుగు రాష్టలలోనూ 2026 తర్వాతనే నియోజక వర్గాల పునర్విభజన ఉంటుందని, అంతవరకు ప్రస్తుత స్థితే యథాతథంగా కొనసాగుతుందని లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు. అంతే కాకుండా రాష్ట్ర విభజన చట్టం సూచించిన విధంగా నియోజక వర్గాల పునర్విభజన చేపట్టాలంటే, రాజ్యాంగ సవరణ అవసరం అవుతుందని గతంలో చెప్పిన  విషయాన్నే నిత్యానంద రాయ్ మరోమారు స్పష్టం చేశారు.  నియోజక వర్గాల పునర్విభజన ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్న ప్రాతీయ పార్టీలు, ముఖ్యంగా తెరాస కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతోంది.తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్ర సవతి తల్లి ప్రేమ చూపుతోందని, తెరాస సీనియర్ నాయకుడు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ విరుచుకు పడుతున్నారు. జమ్మూ కశ్మీర్ ‘ కు ఒక న్యాయం తెలుగు రాష్ట్రాలకు ఒక న్యాయమా అని నిలతీస్తున్నారు. కేంద్ర తలచుకుంటే, రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే, విభజన చట్టంలో చిన్న మార్పు చేస్తే నియోజక వర్గాల పునర్విభజన చేపట్ట వచ్చని అంటున్నారు. నిజమే, కానీ, ఒకే ఒక్క నియోజక వర్గం ఉప ఎన్నికలో గెలిచేందుకు, వేల కోట్ల రూపాయల పధకాలను ప్రకటించుకుంటూ పోతూ, అవును హుజురాబాద్’లో గెలిచేందుకే దళిత బంధు వంటి పథకాలు అని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటింఛి నప్పుడు లేని తప్పు కేంద్రంలో అధికరమలో ఉన్న బీజేపీ  నియోజక వర్గాల పునర్విభజనలో రాజకీయ ప్రయోజనాలను చూసుకుంటే తప్పవుతుందా? అని కమల దళం నాయకులు ప్రశ్నిస్తున్నారు.  తెరాసనే కాదు,బీజేపీ కూడా సన్యాసుల సత్రం కాదు, కదా. ఆవిషయాన్ని ఆ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి  రామ్ మాధవ్, ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే ముందు చెప్పారు కదా నాయి గుర్తు చేస్తున్నారు.  అదలా ఉంటే, కారణాలు ఏవైనా, అవి సహేతుకం అయినా కాకున్నా, ఇప్పట్లో తెలుగు రాష్ట్రాలలో సీట్లు పెరగవు, తెలంగాణ అసెంబ్లీలో 119, ఏపీ అసెంబ్లీలో 175, లోక్ సభలో ఏపీకి 25, టీఎస్ 17...అంతే, ప్రస్తుతానికి ఇంతే.

మోడీ సర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసులు.. పెగాసస్ నిఘా నిజమైతే తీవ్రమైన అంశమన్న సీజేఐ

దేశంలో రాజకీయ ప్రకంపనలు స్పష్టిస్తున్న పెగాసస్ హ్యాకింగ్ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎడిటర్స్ గిల్డ్ తో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాలో వస్తున్నట్లు గూఢచర్యం ఆరోపణల్లో వాస్తవం ఉంటే, అటువంటి చర్యకు పాల్పడటం చాలా తీవ్రమైన విషయం అనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. పిటిషనర్లు తమ పిటిషన్ కాపీలను ప్రభుత్వానికి అందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. దీనిపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.    పెగాసస్ నిఘా వివాదంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఇజ్రాయెల్‌లోని ఎన్ఎస్ఓ గ్రూప్ తయారు చేసిన ఈ స్పైవేర్‌తో కొందరు రాజకీయ నేతలు, ఉద్యమకారులు, పాత్రికేయులపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టినట్లు పిటిషనర్లు ఆరోపించారు. పిటిషనర్లు ఎన్ రామ్, తదితరుల తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ, పెగాసస్ ఓ రోగ్ టెక్నాలజీ అని ఆరోపించారు. ఇది మనకు తెలియకుండానే మన జీవితాల్లోకి ప్రవేశిస్తోందన్నారు. ఇది మన గణతంత్ర దేశ విలువలు, వ్యక్తిగత గోప్యత, గౌరవ, మర్యాదలపై దాడి అని తెలిపారు. దీనిపై జస్టిస్ రమణ స్పందిస్తూ, గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే, నిస్సందేహంగా ఇది తీవ్రమైన విషయమేనని తెలిపారు. గూఢచర్యం, నిఘా జరుగుతున్నట్లు 2019లో ఆరోపణలు వచ్చాయన్నారు. మరింత సమాచారం తెలుసుకోవడానికి ఏమైనా కృషి జరుగుతోందో, లేదో తనకు తెలియదన్నారు.  ఈ స్పైవేర్‌ను కేవలం ప్రభుత్వ వ్యవస్థలకు మాత్రమే అమ్ముతున్నారని కపిల్ సిబాల్ తెలిపారు. ప్రైవేటు సంస్థలు దీనిని సంపాదించడం సాధ్యం కాదన్నారు. జర్నలిస్టులు,  కోర్టు ఆఫీసర్స్, విద్యావేత్తలు, రాజ్యాంగ అధికారులపై ఈ స్పైవేర్‌తో నిఘా పెడుతున్నారని చెప్పారు. దీనిని ఎవరు కొన్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. దీనికి సంబంధించిన హార్డ్‌వేర్‌ను ఎక్కడ పెట్టారో చెప్పాలన్నారు. ప్రభుత్వం దీనిపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేయాలని కోరారు. పెగాసస్ స్పైవేర్ అంశం కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదన్నారు. పెగాసస్ సాప్ట్‌వేర్ ను ఆసంస్థ కేవలం ప్రభుత్వ ఏజెన్సీలకు అమ్మినప్పుడు, ఫోన్ హ్యాకింగ్ అంశం కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఉండదన్నారు సిబల్.  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెగాసస్‌ లక్ష్యంగా చేసుకున్నవారిలో 300 మందికిపైగా భారతీయులు ఉన్నారు. వారిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పలువురు కేంద్రమంత్రులు, పాత్రికేయులు ఆ జాబితాలో ఉన్నట్లు తెలిసింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లుగా పనిచేసిన ఇద్దరు ఫోన్లూ హ్యాకింగ్‌ జాబితాలో కనిపించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పెగాసస్‌పై పార్లమెంట్ వేదికగా విపక్షాలు ఆందోళన చేపడుతున్నాయి. దీంతో ఉభయ సభలూ వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై తాజాగా విచారణ జరిగింది. ఇందులో భాగంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘ఫోన్ల ట్యాపింగ్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపడతారని తెలుసు. కానీ ఇక్కడ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న వారిపై జరుగుతోంది. ఇది రాజ్యాంగబద్ధత, నేరతత్వానికి సంబంధించింది’’ అని వాదించారు. 

అమ‌ర‌రాజాపై అన్నీ కుట్ర‌లేనా? అస‌లక్క‌డ ఏం జ‌రుగుతోంది? రియాల్టీ చెక్‌..

తిరుప‌తి స‌మీప క‌ర‌కంబాడిలో 36 ఏళ్లుగా అమ‌ర‌రాజా ఉంది. ద‌శాబ్దాలుగా ఎవ‌రికీ ఏ స‌మ‌స్యా లేదు. స‌డెన్‌గా జ‌గ‌న్ స‌ర్కారుకే కాలుష్యం గుర్తుకొచ్చింది. ఇక్క‌డి నేల‌, నీరు, గాలి పొల్యూట్ అవుతున్నాయ‌ని.. వెంట‌నే ఫ్యాక్ట‌రీ మూసేయాల‌ని ఆదేశించింది. ఆ ఆర్డ‌ర్స్ చూసి.. 'అవునా'.. అంటూ అంతా ఆశ్చ‌ర్యం. ఇదేమీ చోద్యం అంటూ ఆగ్ర‌హం. ఎందుకంటే అబ‌ద్దం అలాంటిది మ‌రి. అమ‌ర‌రాజా వ్య‌వ‌స్థాప‌కులు  గ‌ల్లా రామ‌చంద్రనాయుడు కుటుంబం ఫ్యాక్ట‌రీ ఆవ‌ర‌ణ‌లోనే నివ‌సిస్తోంది. అంతా ఆరోగ్యంగా, కులాసాగానే ఉన్నారు. అంత కాలుష్య‌మే ఉంటే.. కంపెనీ ఓనర్లు అక్క‌డే ఎందుకు ఉంటారు చెప్పండి. ఈ చిన్న‌ లాజిక్ జ‌గ‌న్ స‌ర్కారుకు అర్థంకావ‌డం లేదా? లేక‌, అంతా అర్థ‌మ‌య్యే, అక్క‌డ ఎలాంటి ప్రాబ్ల‌మ్ లేద‌ని తెలిసే.. కావాల‌నే ఇలా చేస్తున్నారా?  అమ‌ర‌రాజా ఫ్యాక్టరీ ఆవరణలో సిబ్బంది కోసం 375 క్వార్టర్స్‌ ఉన్నాయి. వాటిలో సుమారు 2వేల మంది ఉంటున్నారు. ఇదే ప్రాంగణంలో సంస్థ యాజమాన్యం హైస్కూలు నిర్వహిస్తోంది. ఉద్యోగుల పిల్లలు, చుట్టుపక్కల గ్రామాల పిల్లలు కలిపి 990 మంది చదువుకుంటున్నారు. అక్క‌డ కాలుష్యం లేద‌న‌డానికి ఇంత‌కంటే ఆధారం ఇంకేం కావాలి. ఇంకా చెప్పాలంటే..  అమరరాజా బ్యాటరీస్‌ ప్రధాన ప్లాంటు తిరుపతికి బాగా సమీపంలోని కరకంబాడిలో ఉంది. కంపెనీ సమీపంలో కరకంబాడి, తారకరామా నగర్‌, దొడ్లమిట్ట, ఇందిరానగర్‌, రాజీవ్‌గాంధీ కాలనీ, గొల్లపల్లె గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో సుమారు 20వేల మంది వ‌ర‌కూ నివ‌సిస్తున్నారు. వీరిలో ఎవ‌రూ కూడా కంపెనీ కాలుష్యం వ‌ల్ల అనారోగ్యం పాలైన‌ది లేదు. ప్ర‌భుత్వం మాత్రం కరకంబాడిలోని ప్లాంటు కారణంగా గాలి, నీరు, భూమిలో 'లెడ్‌' స్థాయికి మించి ఉందంటోంది. అదే నిజ‌మైతే.. అధిక మోతాదు లెడ్ వ‌ల్ల ఒక్క‌రైనా ఆసుప‌త్రి పాల‌య్యే వారుగా? మ‌రి, అలాంటి కేసు ఒక్క‌టున్నా బ‌య‌ట‌పెట్ట‌మంటూ స‌వాల్ విసురుతున్నారు స్థానికులు. అమ‌ర‌రాజాపై రాజ‌కీయ క‌క్ష్య‌తోనే కాలుష్య‌మంటూ పీసీబీతో కుట్ర‌లు చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే.. ఆ పీసీబీ అధికారులు ఎప్పుడు వ‌చ్చారో.. స్థానిక గ్రామాల్లో ఎలాంటి ప‌రిశీల‌నలు చేశారో.. ఎవ‌రిని ప్ర‌శ్నించారో.. ఎవ‌రి నుంచి ర‌క్త‌ న‌మూనాలు సేక‌రించారో.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రికీ తెలీని చిదంబ‌ర ర‌హ‌స్యం.  ఇక‌, ప్ర‌జ‌ల‌తో పాటు ఫ్యాక్టరీ సమీపంలోని పంటపొలాలు కూడా చక్కగా ఉన్నాయి. అంటే గాలి, నీటి కాలుష్యం లేద‌నేగా అర్థం? పోనీ, స్థానికులెవ‌రైనా ఫిర్యాదు చేశారా? అమ‌ర‌రాజాకు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు జ‌రిగాయా? ప‌ర్యావ‌ర‌ణ సంస్థ‌లేవైనా ఆందోళ‌న చేశాయా? మ‌రెందుకు ఇంత‌టి ఓవ‌రాక్ష‌న్ అంటూ నిల‌దీస్తున్నారు స్థానిక ప్ర‌జ‌లు.  ఇది.. ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థల్లో ఒకటిగా అమరరాజా గ్రూప్‌కు లభించిన సర్టిఫికెట్‌. గత ఏడాది ఫోర్బ్స్‌, స్టాటిస్టికా సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థలకు చెందిన లక్షన్నర మంది ఉద్యోగులు/కార్మికులను ప్రశ్నించి... తాము పని చేస్తున్న సంస్థ ప్రతిష్ఠ, విశ్వసనీయత, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీతో అందించే సేవ, స్వభావం, అందుతున్న ప్రయోజనాలు తదితర అంశాలపై వారి అభిప్రాయాలు తెలుసుకుంది. సుమారు 50 లక్షల డాటా పాయింట్స్‌ను విశ్లేషించి ఆయా సంస్థలకు ర్యాంకింగ్స్‌ ప్రకటించింది. ఇందులో.. అమరరాజా గ్రూప్‌ను ‘ప్రపంచంలోని అత్యుత్తమ యాజమాన్య సంస్థ’లలో ఒకటిగా గుర్తించింది. అమరరాజాకు ప్రపంచస్థాయిలో 316 ర్యాంకు రావడం విశేషం. ఈ జాబితాలో భారత్‌కు చెందిన రిలయన్స్‌, హెచ్‌సీఎల్‌ వంటి అతికొద్ది కంపెనీలు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. ఇంత‌టి గొప్ప కంపెనీ ఏపీలో ఉన్నందుకు, వేలమందికి ఉపాధి క‌ల్పిస్తున్నందుకు, ప‌న్నుల రూపంలో ప్ర‌భుత్వానికి వేల కోట్ల రాబ‌డి అందిస్తున్నందుకు గ‌ర్వ‌ప‌డ‌దామా? లేక‌, కంపెనీ యాజ‌మాన్యం టీడీపీ వారు కాబ‌ట్టి ఇంత‌టి క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల‌కు తెగ‌బ‌డ‌తామా? జ‌గ‌న్ స‌ర్కారు అవ‌లంభిస్తున్న‌ దుర్నీతితో అమ‌ర‌రాజాలాంటి ప్ర‌పంచ స్థాయి కంపెనీ ప‌క్క రాష్ట్రానికి త‌ర‌లిపోయేందుకు సిద్ధ‌మ‌వ‌డం నిజంగా ఆంధ్రుల దుర‌దృష్ట‌మే. జ‌గ‌న్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఇలాంటి దుష్ఫ‌లితాలెన్నో అనుభ‌వించాల్సిందే..  అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారంతా.