వివేకాను చంపిందెవరో జగన్‌కు తెలుసు! సునీల్ సోదరుడి కామెంట్లతో కలకలం..
posted on Aug 10, 2021 @ 9:51AM
ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వివేకాంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇటీవలే అరెస్ట్ చేసిన సునీల్ యాదవ్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది .వైఎస్ వివేకా హత్యకు ఉపయోగించిన మారణాయుధాల కోసం పులివెందుల్లో సీబీఐ బృందాలు మూడు రోజులుగా గాలించాయి. నిందితుడు సునీల్‌తో కలసి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న గెరెండాల వాగు, రోటరిపురం వంకలలో సీబీఐ బృందాలు గాలించాయి.
అయితే వివేకా హత్య కేసులో సీబీఐ తీరుపై నిందితుడు సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.సీబీఐ అధికారులకు తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్న పెద్దలు, సీబీఐ నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని సునీల్‌కుమార్ యాదవ్ సోదరుడు కిరణ్‌కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. పులివెందులలోని తమ నివాసంలో మీడియాతో మాట్లాడిన కిరణ్.. కీలక విషయాలు చెప్పారు. వివేకా హత్య కేసులో ఉన్న కొందరు పెద్ద నాయకులు తప్పించుకునేందుకు తన అన్నని ఇరికిస్తున్నారని అన్నారు. వివేకాను హత్య చేసింది ఎవరో ముఖ్యమంత్రి జగన్‌కు, ప్రజలకు కూడా తెలుసన్నారు. తన అన్నను నిందితుడిగా చూపించేందుకు కాలువలో మారణాయుధాల పేరుతో సీబీఐ అధికారులు లేనిపోనివన్నీ సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వివేకా హత్యపై ఇప్పటి వరకు మాట్లాడని రంగన్న రెండేళ్ల తర్వాత ఇప్పుడు తన వాంగ్మూలంలో తన అన్న పేరు చెప్పారని కిరణ్ ప్రశ్నించారు. వివేకానందరెడ్డి, తన అన్న మధ్య ఎలాంటి లావాదేవీలు జరగలేదని చెప్పారు. వివేకానందరెడ్డి రెండుమూడుసార్లు తమ ఇంటికి వచ్చినట్టు కిరణ్ తెలిపారు. వివేకానందరెడ్డి కుమార్తె హైకోర్టుకు సమర్పించిన జాబితాలోని 11 మంది అనుమానితులను సీబీఐ అధికారులు ఎందుకు విచారించడం లేదని సునీల్ భార్య లక్ష్మి ప్రశ్నించారు. తన భర్తను ఢిల్లీలో 2 నెలల 25 రోజులపాటు దారుణంగా హింసించారని, వివేకా హత్య కేసులో ప్రమేయం ఉందని ఒప్పుకోవాలని కొట్టారని ఆమె ఆరోపించారు.
ధైర్యం ఉంటే అసలైన నిందితులను పట్టుకోవాలని సీబీఐకి సవాల్ విసిరింది సునీల్ కుటుంబం. వివేకా హత్యకేసుతో సునీల్‌కు సంబంధం లేదన్నారు. వివేకాతో సునీల్ సన్నిహితంగా ఉన్నమాట వాస్తవమేనన్నారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికే గోవా వెళ్లామని చెప్పారు. అయితే అక్కడ చనిపోతే నిందలు నిజమవుతాయనే తిరిగి పులివెందులకు వచ్చామని సునీల్ కుటుంబం తెలిపింది. వాచ్‌మన్ రంగన్న మాటల్లో వాస్తవం లేదన్నారు. 24 గంటల్లో సునీల్‌ను సీబీఐ అధికారులు ఇంటికి పంపకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని సునీల్ కుటుంబం హెచ్చరించింది.