విపక్షాలకు కపిల్ సిబాల్ వింద్.. టీఆర్ఎస్ హాజరుతో ట్విస్ట్
posted on Aug 10, 2021 @ 4:42PM
కాంగ్రెస్ సహా బీజేపీ యేతర పార్టీలు అన్నీ, మూడేళ్ళ తర్వాత 2024లో వచ్చే లోక్ సభ ఎన్నికలలో ప్రధాని మోడీని గద్దె దించడమే లక్ష్యంగా ఏకం కావాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్’ తో కలిసి బీజేపీకి ప్రత్యాన్మాయ కూటమిని ఏర్పాటు చేయడమా? కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి తృతీయ ప్రత్యాన్మాయం ఏర్పాటు చేయడమా అనే విషయంలో మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయానికి మూల కారణమని భావిస్తున్న, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గత జూన్’లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ను కలవడంతో మొదలైన ఏకతా క్రతువు చివరకు కాంగ్రెస్ అసమ్మతి నేతల శిబిరానికి చేరింది.
ఇంచుమించుగా సంవత్సరం క్రితం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖస్త్రాని సంధించిన 23 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు (జీ 23) ఇప్పుడ మరో సారి తెరమీదకు వచ్చారు. అప్పట్లో లేఖాస్త్రం సంధించడంలో ముందున్న జీ 23 కీలక నేత కపిల్ సిబల్ , సోమవారం తమ జన్మదినాన్ని పురస్కరించుకుని, విపక్ష పార్టీల నేతలకు విందు ఇచ్చారు. ఈ సమావేశానికి, జీ 23 కీలక నేతలు గులాం నబీ ఆజాద్, చిదంబరం, ఆనంద శర్మ, భూపేంద్రసింగ్ హుడా, శశి థరూర్ సహా ఇంచుమించుగా అందరూ హాజరయ్యారు. అలాగే, ఆర్జేడీ అధినేత లాలలు ప్రసాద్ యాదవ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సమాజవాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, సిపిఐ, సిపిఎం నాయకులు డి.రాజా, సీతారం ఏచూరి, నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా, శివసేన రాజ్య సభ ఎంపీ సంజయ్ రౌత్, తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రిఎన్, డిఎంకే నేత తిరుచ్చి శివ తో పాటుగా తెరాస, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్ఎల్డీ పార్టీల నాయకులు కూడా హాజరైనట్లు సమాచారం.
నిజానికి ఈ విందు సమావేశానికి ఎవరు హాజరయ్యారు అనే దాని కంటే, ఎవరు హాజరు కాలేదు, హాజరు కాని వారు ఎందుకు హాజరు కాలేదు, అనేది కీలకంగా మారింది. పన్నెండు పార్టీల నాయకులు పాల్గొన్న ఈ విందు సమావేశంలో, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్న నాయకులు ఎవరూ, హాజరు కాలేదు. మరో వంక కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు తీసుకురావాలనే తమ డిమాండ్’,లో మార్పు లేదని కపిల్ సిబల్ స్పష్టం చేశారు. అంతే కాకుండా, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, జీ23 చేస్తున్న ప్రయత్నాలను విపక్ష పార్టీల నేతలు కొనియాడారని ఆయన పేర్కొన్నారు.
అయితే ఓ వైపు కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిశోర్ డైరెక్షన్ లో రాహుల్ గాంధీని జాతీయ నేతగా చూపించే ప్రయత్నాలలో ఉన్న సమయంలో, జీ 23 గ్రూప్ నేత కపిల్ సిబలో త్వరలో జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీజేపీ ఓడించడమే లక్ష్యంగా సమాజ్ వాదీ పార్టీ గొడుగు కింత ఒకటవ్వాలని, బేషజాలకు పోకుండా, అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో పనిచేయాలని పిలుపు నిచ్చారు. కపిల్ సిబాల్ ఉద్దేశ పూర్వకంగానే, రాహుల్ నాయకత్వాన్ని తక్కువ చేసి చూపేందుకే ఈ వ్యాఖ్యలు చేశారని, కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీని ఓడించేందుకు, అన్ని పార్టీలు ఏకం కావడం ఎంత అవసరమో, కాంగ్రెస్ పార్టీని ఫస్ట్ ఫ్యామిలీ సంకెళ్ళ నుంచి విముక్తి చేయడం కూడా అంతే అవసరమని, జీ23 నాయకులు పేర్కొన్నట్లు సమాచారం. అంటే, కాంగ్రెస్’లోనే కాంగ్రెస్ నాయకత్వం పట్ల వ్యతిరేకత ఉందనేది స్పష్టమవుతోంది.
రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించేందుకు జీ 23 నాయకులు సిద్దంగా లేరని తెలుస్తోంది. ఈ ట్విస్ట్ ఎటు దారి తీస్తుందో, చూడవలసి వుంది. అయితే ఇంతవరకు జరిగిన కథలో, విపక్షాల ఐక్యతకు కాంగ్రెస్ నాయకత్వ సమస్య ప్రధాన అవరోధంగా నిలుస్తోంది. ఆ కారణంగానే, ఐక్యతా యత్నాలు ఒకడుకు ముందుకు మూడు అడుగులు వెనక్కి అనంట్లుగా సాగుతోంది. అటు అధికార బీజేపీ కూటమికి, ఇటు విపక్షాల కూటమికి కూడా వ్యుహా, ప్రతి వ్యూహాల రచనకు, ఇంకా చాలా సమయం వుంది. ప్రస్తుతానికి అయితే యూపీ అసెంబ్లీ ఎన్నికలే ఇరు కూటముల ముందున్న సవాలు... యూపీ ఫలితాలు తేలిపోతే, ఆ తర్వాత కథ, కధనం మారిపోతుంది.