విజయవాడలో లవ్.. యూపీలో మర్డర్.. అమ్మాయిలూ జాగ్రత్త..
posted on Aug 10, 2021 @ 1:35PM
అవును, వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరి కోసం ఒకరు బతుకుదాం అనుకున్నారు. పెళ్లి చేసుకొని బిందాస్‌గా బతికేయొచ్చని భావించారు. అంతలోనే ఆ ప్రేమికుడు సడెన్‌గా తన సొంతూరికి వెళ్లాల్సి వచ్చింది. నీ వెంటే నేనంటూ.. ఆమె సైతం వాళ్ల ఊరికి వెళ్లింది. కట్ చేస్తే.. యమునా నది ఒడ్డున శవమై పడుంది. విజయవాడకు చెందిన యువతి.. ఉత్తరప్రదేశ్‌లో మర్డర్ కావడం కలకలం రేపుతోంది.
విజయవాడకు చెందిన తస్లిమా ఫాతిమా అనే యువతి.. స్థానికంగా ఉంటున్న ఓ యువకుడిని ప్రేమించింది. కొద్దిరోజుల క్రితం ఆ ప్రియుడు తన స్వస్థలమైన ఉత్తర్‌ప్రదేశ్ వెళ్లిపోయాడు. లవర్ తనను కూడా రమ్మని చెప్పడంతో గత నెల పదో తేదీన ఫాతిమా విజయవాడలోని ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. కుమార్తె ఆచూకీ తెలీకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆ యువతి ఉత్తర్‌ప్రదేశ్‌లోని యమునా నదీ తీరంలో మృతిచెందినట్టు గుర్తించారు. ప్రియుడిని నమ్మి యూపీ వెళ్లింది ఆ యువతి. అక్కడికెళ్లాక గానీ వాడి నిజ స్వరూపం బయటపడలేదు. ప్రేమ పేరుతో ఇన్నాళ్లూ డ్రామా ఆడారని తెలుసుకుంది. కానీ, అంతలోనే ఆమె లవర్, అతని స్నేహితులు కలిసి ఆమె దగ్గర ఉన్న నగదు, బంగారం లాక్కొని.. ఫాతిమాను చంపేశారు. డెడ్‌బాడీని యుమునా నదిలో తోసేశారు.
నిందితులు ఫాతిమాది ఆత్మహత్యగా చిత్రీకరించాలనే ప్రయత్నం చేశారు. అనుమానించిన యూపీ పోలీసులు మిస్టరీ డెత్‌గా కేసు నమోదు చేశారు. అప్పటికే విజయవాడ కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదై ఉండటంతో.. సమాచారం అందుకున్న ఇక్కడి పోలీసులు యూపీ వెళ్లి విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించి విజయవాడ తీసుకొచ్చారు. ప్రేమ పేరుతో ఎవరినిపడితే వారిని నమ్మొద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు. మృతురాలు ఫాతిమా ఇంట విషాదం నెలకొంది.