గంజాయి స్మగ్లర్లు, సెక్స్ వర్కర్లుగా కూలీలు! కరోనా కాటుతో దుర్భర బతుకులు..
"మనం ఉన్నామన్న నమ్మకం ప్రజలకు కల్పించాలి. లేకపోతే మనం ఉండీ లేనట్టే". న్యాయవ్యవస్థ మీద ప్రజల్లో కల్పించాల్సిన నమ్మకం గురించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు మన పాలక ప్రభుత్వాలకు కనువిప్ప కావాలి. లేకపోతే భవిష్యత్తు అంధకారమే అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. లాక్ డౌన్ తరువాత ఉపాధి దెబ్బతిన్న క్రమంలో పెరిగిన క్రైమ్ రేట్ ను దృష్టిలో పెట్టుకుంటే ప్రభుత్వాలు ఏం చేయాలో తెలుస్తుందంటున్నారు నిపుణులు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా చేష్టలుడిగి చూస్తుంటే... రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్యుల పరిస్థితేంటి? అసంఘటిత రంగంలో ఉన్న వృత్తి పనివారు, కూలీపనివారు, ఆటోడ్రైవర్లు, ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు, ఉపాధి కోసం వెదుకుతున్న యువకులు.. ఇలా అనేక సెక్షన్ల ప్రజల దీనావస్థను అర్థం చేసుకునేదెవరు? ఎవరికీ పట్టని, ఎవరూ పట్టించుకోని ఇలాంటి కోట్లాది మందికి ఏ వైపు నుంచి కూడా భరోసా లేకపోవడంతో దాని దుష్ప్రభావం సామాజికంగా పడుతోందంటున్నారు విశ్లేషకులు.
హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న కొన్ని చీకటి కార్యకలాపాల ఆనవాళ్లు ఈ మధ్య బయటపడ్డాయి. వాటి లోతుల్లోకి వెళ్తే దిమ్మతిరిగిపోయే నిజాలు వెలుగుచూశాయి. బతుకుదెరువు లేక.. భరోసా ఇచ్చే నాథుడు లేక.. ఆకలితో పస్తులు ఉండలేక కొందరు యువకులు పక్కదార్లు తొక్కారు. తప్పుడు బాటను ఎంచుకున్నవారిలో పాత నేరస్తులకు తోడు కొందరు కొత్తవారు కూడా ఉండడం ఆందోళన రేపుతోంది. ఇక పాత చిల్లర నేరగాళ్లయితే తాజాగా చాలా తీవ్రమైన, విస్తృతమైన నేర సామ్రాజ్యంలోకి వెళ్లిపోతున్నట్టు తెలుస్తోంది. ఆ నేరాల్లో అక్రమ గుట్ఖా వ్యాపారం నుంచి మొదలుకుంటే స్మార్టుగా చేసే సైబర్ క్రైమ్స్ వరకూ ఉన్నాయి. 2020 మార్చి తరువాత అనూహ్యంగా వచ్చిన లాక్ డౌన్ తరువాత విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఏరియా నుంచి గంజాయి అక్రమ రవాణా ఎంతగా పెరిగిందో పోలీసు నివేదికలే రుజువు చేస్తున్నాయి. అలాగే ఉద్యోగాలు కల్పిస్తామని, మంచి శాలరీలు ఇప్పిస్తామని, విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చంటూ స్మార్ట్ గా వల వేసే సైబర్ నేరగాళ్ల ఉదంతాలు కూడా లెక్కకు మించి బయటపడుతున్నాయి. ఎన్నడూ లేంది ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా ప్రకటనలు ఇవ్వడం గమనార్హం.
ఈ మధ్య హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డ ఓ నేరస్తుడు వెల్లడించిన విషయాలు లాక్ డౌన్ ప్రభావానికి అద్దం పడుతున్నాయి. చాంద్రాయణగుట్టకు చెందిన ఓ పండ్ల వ్యాపారి.. కొద్దిరోజుల క్రితం గంజాయి సరఫరా కేసులో పట్టుబడ్డాడు. అతను చెప్పిన వివరాలు వింటే విస్తుపోవాల్సిందే. లాక్ డౌన్ కారణంగా పండ్ల వ్యాపారం కూడా దారుణంగా దెబ్బ తిందని, కొనేవారు లేక బతుకు భారమైపోయిన తరుణంలో వేరే ఉపాధి కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సమయంలోనే అతనికి తన మిత్రులు చేస్తున్న గంజాయి తరలింపు లాభసాటిగా కనిపించింది. ఇప్పటివరకు బుద్ధిగా పండ్లు అమ్ముకునే ఇతన్ని గంజాయి తరలింపు ఆకర్షించింది. వెంటనే ఆ బ్యాచ్ లో కలిసిపోయి విశాఖ నుంచి గంజాయి తరలించే పనికి ఒప్పుకున్నాడు. వ్యాపారం బాగుందని, అంతకుముందు నెలకు 30 వేలు కూడా గగనకష్టంగా వచ్చేవని, కానీ గంజాయితో 60 వేల సంపాదన సులభ సాధ్యమైందని పోలీసు విచారణలో ఒప్పుకున్నాడు.
ఇక మరో కూలీని హషిష్ ఆయిల్ ఆకర్షించింది. హషిష్ ఆయిల్ కూడా గంజాయే. కాకపోతే ఇది ఆకురూపంలో కాకుండా గంజాయి ఆకుల్ని ప్రాసెస్ చేసి, దానికి గాఢమైన వాసన వచ్చేందుకు ఆల్కహాల్, వార్నిష్ వంటి పదార్థాలను కలుపుతారట. 5 ఎంఎల్, 10 ఎంఎల్ లాంటి చిన్నసైజు బాటిళ్లలో నింపి అత్యధిక ధరలకు అమ్ముతున్నట్టు పోలీసు విచారణలో తేలింది. ఈ హషిష్ బాటిల్ మూత తీయగానే ఆ వాసనకే మత్తు నషాళానికి అంటుతుందని పోలీసులు చెబుతున్నారు. హషిష్ గాల్లో కలిసిపోయి.. ఆ పరిసరాల్లో ఉన్నవారికి కూడా మత్తు సోకుతుందని చెబుతున్నారు. అందుకే ఒక చిన్న బాటిల్ ఖరీదే వేలల్లో ఉంటుందని పోలీసులు ధ్రువీకరిస్తున్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ నల్లబజారులో కనిపించని ఈ హషిష్.. లాక్ డౌన్ తరువాతనే పుంజుకుందని చెబుతున్నారు.
అంతేకాదు.. ఉపాధి కోల్పోయిన పురుషులు కుటుంబాలను వదిలేస్తే... ఆ భారం కాస్తా మహిళలపై పడుతోంది. ఇప్పటివరకు ఇంటిపట్టునే ఉండి పిల్లల్ని, కుటుంబాన్ని చూసుకున్న మహిళలు... భర్తల నిర్వాకంతో అడ్డదార్లు తొక్కాల్సి వస్తోంది. అందుకే ఈజీ మనీ ప్రాసెస్ లో భాగంగా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా సెక్స్ వర్కర్ల అవతారం కూడా ఎత్తుతున్నారని సామాజికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. మరి ఇలాంటివాటికి చెక్ పడాలంటే పాలకులు, ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించే కార్యక్రమాలు కాకుండా సమాజ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పథక రచన చేయాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.