గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టీఆర్ఎస్ టికెట్.. ఈటలకు విద్యార్థి నేత పోటీ ఇచ్చేనా?
posted on Aug 11, 2021 @ 1:32PM
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోరాటంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎవరిని ఉప ఎన్నిక బరిలోకి దింపుతుందన్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకుడు, టీఆర్ఎస్‌వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్‌వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో పలు సార్లు అరెస్టయి జైలుకెళ్లారని చెప్పింది. గెల్లు శ్రీనివాస్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్ధతను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని చెప్పింది.
దళిత బంధు పథకం ప్రారంభ సమావేశ సందర్భంగా.. ఈ నెల 16న హుజూరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను నియోజకవర్గ ప్రజలకు సీఎం పరిచయం చేయనున్నారు. సామాజిక సమీకరణాలతో పాటు ఉద్యమ నేపథ్యం ఉన్నందున ఆయన వైపే కేసీఆర్ మొగ్గుచూపారు. హుజురాబాద్ ఉప ఎన్నికల బాధ్యతలు తీసుకున్న మంత్రి హరీష్ రావు.. రాజేందర్ రాజీనామా తర్వాత తొలిసారి నియోజకవర్గంలో అడుగు పెట్టారు. భారీ బైక్ ర్యాలీతో హడావుడి చేశారు. హరీష్ రావు హుజురాబాద్ లో పర్యటిస్తున్న సమయంలోనే పార్టీ అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించారు. దీంతో పక్కా ప్రణాళికతోనే టీఆర్ఎస్ అడుగులు వేస్తోందని తెలుస్తోంది.
హుజురాబాద్ అభ్యర్థిగా ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్ నేత ఈటల రాజేందర్‌ను ప్రకటించగా.. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి ఎంపిక కోసం ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. ఈటల పాదయాత్ర మొదలు పెట్టి పల్లెపల్లె చుట్టేస్తుండగా.. ఇటు టీఆర్ఎస్ కూడా సామాజిక వర్గాల వారిగా ఓటర్లకు గాలం వేసే ఎత్తుగడలు అమలు చేస్తోంది.