ఖేల్ రత్న.. రాజకీయ రచ్చ!
కాదేడీ కయ్యానికి అనర్హం అని ఏ కవి అయినా అన్నారో లేదో గానీ, రాజకీయాలలో మాత్రం, ప్రతి చిన్నా పెద్ద విషయంపై అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు కాలుదువ్వడం, పరస్పర దుశనలకు దిగడం, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం ఆనవాయితీగా మారిపోయింది. ప్రస్తుతం జరుగతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. దేశంలో కొవిడ్, అధిక ధరలు, ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, రైతుల ఆందోళన .. ఇంకా వందల సంఖ్యలో సమస్యలు ఉన్నాయి. అయినా, ‘పెగాసస్ స్పైవేర్’ ఒక్కటే దేశం ముందున్న భయంకర సమస్య అన్నట్లుగా ఆ ఒక్క విషయం చుట్టూనే, తిరుగుతూ అధికార, విపక్షాలు పార్లమెంట్ ఉభయ సభలను రాజకీయ మైదానంగా మార్చి వేశారు. సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. అయినా, ఇంతవరకు ఒక్క రోజు సభ సక్రమంగా జరగలేదు. కొవిడ్ సహా ఏ ఒక్క ప్రధాన ప్రజా సమస్య చర్చకు రాలేదు.
ఇప్పుడు మరో వివాదం, తెరపైకొచ్చింది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం పేరును కేంద్ర ప్రభుత్వం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారంగా మార్చింది. మార్చ వచ్చును, అయితే, ఆ నిర్ణయం ఏదో ప్రజాసామ్య బద్ధంగా తీసుకుంటే, ఇంత వివాదం అయ్యేది కాదు. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని పేరును ఒక ట్వీట్’ తో తీసేశారు. అంతే కాకుండా, దేశ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. మాజీ ప్రదాని, కాంగ్రెస్ నేత పేరును తీసేయడం దేశ ప్రజల మనోభావాలను గౌరవించడం అవుతుందా? అంతే కాదు ప్రదాని తమ ట్వీట్ లో, ఖేల్ రత్న అవార్డుకు మేజర్ ధ్యాన్ చంద్ పేరు పెట్టాలని దేశం నలుమూలల నుంచి వినతులు వస్తున్నాయని, ఆ అందరికి ధన్యవాదాలు చెప్తున్నానని పేర్కొన్నారు.
“ఖేల్ రత్న అవార్డును ఇకపై మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా పిలుస్తాం. జై హింద్!’’ అని పేర్కొన్నారు. ఇది ఒక విధంగా పుండు మీద కారం చల్లడమే అవుతుంది. దీనిపై సహజంగానే, కాంగ్రెస్ పార్టీ, కాస్త ఘాటుగానే స్పందించింది. క్రీడా పురస్కారం పేరు మార్పుతో మోదీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని, కాంగ్రెస్ నాయకులు మండి పడుతున్నారు. మోడీ ప్రభుత్వం సాగిస్తున్న కాషాయీకరనకు ఇదొక నిదర్శన మని కాంగ్రెస్ భగ్గుమంది. ఈపేరు మార్పుకు ధ్యాన్ చంద్ పై గౌరవం కారణం కాదని, రాజీవ గాంధీ ప్రతిష్టను దిగజార్చడమే మోడీ లక్ష్యమని, కాంగ్రెస్ ఎంపీ కే సురేష్ ఆరోపించారు. నిజమే, కావచ్చును, నిజానికి ధ్యాన్ చంద్ పై గౌరవమే ఉంటే కాంగ్రెస్ నాయకులు సూచించిన విధంగా ఆయనను ‘భారత రత్న’ పురస్కారంతో గౌరవిస్తే మరింత సమంజసంగా ఉంటుందని, క్రీడాభిమానులు సైతం పేర్కొంటున్నారు.
క్రీడా రంగంలో జీవిత కాల సాఫల్యం సాధించిన వారికి ధ్యాన్ చంద్ పేరున 2002లో అవార్డును ఏర్పాటు చేశారు. అలాగే, న్యూఢిల్లీలోని ఓ స్టేడియంకు కూడా 2002లో ధ్యాన్ చంద్ పేరు పెట్టారు.ఇప్పుడు మరో పురస్కారాన్ని అయన పేరున ఏర్పాటు చేసినా ఎవరికీ అబ్యంతరం ఉండక పోవును. కానీ, ఒకరి పేరును తుడిచేసి ధ్యాన్ చంద్ పేరును చేర్చడం ఒక విధంగా ఆయన్ని అవమానించడమే అవుతుందనే మాట వినిపిస్తోంది. అదీ కాక ఈ మధ్యనే గుజరాత్ లోని మొతోరా స్టేడియం పేరును నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంగా మార్చారని,ఒక స్టేడియంకు తమ పేరు పెట్టుకున్న ప్రధాని, మాజీ ప్రధాని పేరున ఉన్న పురస్కారం పేరును మార్చడం వలన అయన ప్రతిష్టే దిగాజరుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
అయితే పేరు పేరున రాజకీయ వివాదం చెలరేగడం ఇదే తోలి సారి కాదు, గతంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విషయంలో కూడా చాలా పెద్ద వివాదమే జరిగింది. అలాగే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నగరాలు, పట్టణాలు, వీదుల పేర్ల మార్పుపై కూడా వివాదం చెలరేగుతోంది, అలాగే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి పథకానికి వైఎస్సార్ లేదా జగనన్న పేరును తగిలించడం విషయంలోనూ వివాదం ఉంది. ఈ నేపధ్యంలో పురస్కారాల మొదలు పథకాల వరకు పేరు పెట్టడంలో ఒక జాతీయ విధానమ ఉంటే మంచిందని అంటున్నారు విజ్ఞులు.