కేంద్రమంటే భయం పీకేకేనా? కేసీఆర్ కు లేదా?
నిన్న గాక మొన్న కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన మాజీ ఐపీస్ అధికారి, ప్రవీణ్ కుమార్ అధికార తెరాస పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంగా ముఖ్యమంతి కేసీఆర్’ను టార్గెట్ చేస్తున్నారు. విమర్శల తూటాలు సంధిస్తున్నారు. చివరకు, నాలుగు రోజుల క్రితం బీఎస్పీలో చేరిన సందర్భంలో అయితే, ఏనుగుపై ప్రగతి భవన్’కు వస్తా ... కాసుకో .. కేసీఆర్ అంటూ సినిమా ఫక్కీలో సవాలు విసిరారు. అయితే ఇప్పుడు ఆయన విసిరిన సవాలు కాదు, ఆ సవాలుకు తెరాస స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ప్రవీణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్’ను మాత్రమే నిందిస్తున్నారు, కానీ, దళితులకు ఏమీ చేయని, ఇచ్చిన ఏ హామీని నిలుపుకోని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించరని తెరాస నాయకులు ప్రశ్నిస్తున్నారు.
కేంద్రాన్ని, ప్రధాని మోడీని పన్నెత్తు మాట అనరా, అనే ధైర్యం మాజీ ఐపీస్ కు లేదా? అంటూ తెరాస నేతలు ప్రవీణ్ కుమార్ ను నిలదీశారు. అంతేకాదు ప్రవీణ్ కుమార్ తప్పు చేశారు, హిందూ వ్యతిరేకతను ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు, ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి తెచ్చుకున్నారు. అందుకే, రాజీనామా చేశారు, రాజీనామా చేసినా కేంద్ర తలచుకుంటే ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది, అందుకే ఆయన కేంద్రానికి భయపడుతున్నారు. దాసోహం అంటున్నారు. కేంద్రాన్ని వదిలేసి, రాష్ట్ర ప్రభుత్వం మీదనే విమర్శలు చేస్తున్నారు, అంటూ తెరాస నేతలు ప్రవీణ్ కుమార్ పై ఎదురు దాడి చేస్తున్నారు.
అయితే ఒక వేలు ప్రవీణ్ కుమార్ వైపు చూపితే, నాలుగు వేళ్ళు తమ వైపు చుస్తాయనే విషయం తెరాస నాయకులు గుర్తించలేక పోతున్నారని అంటున్నారు. అది కూడా ఇంకెవరో కాదు తెరాస నాయకులే అంటున్నారు. ప్రవీణ్ కుమార్, నిజంగా భయపడుతున్నారో లేదో కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పైకి ఎన్ని బింకాలు పోయినా, లోలోపల కేంద్రానికి దాసోహం అంటారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా, ఏమి తప్పులు చేశారో ఏమో కానీ, కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్’షాను విమర్శించడం లేదు. అంతే కాదు, రాజకీయ, వ్యక్తి గత విమర్శల విషయం పక్కన పెట్టినా, కేంద్ర ప్రభుత్వ విధానాల విషయంలోనూ తెరాస ప్రభుత్వం రాజీ పడుతోందనే విమర్శలున్నాయి. వ్యవసాయ చట్టాల విషయంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. రైతు సంఘాలు ఇచ్చిన భారత బంద్ కు తెరాస మద్దతు నిచ్చింది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు. నాయకులు రోడ్లెక్కారు, రాస్తా రోకోలో పాల్గొన్నారు. కానీ జీహెచ్ఎంసి ఎన్నికల తర్వాత హడావిడిగా ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత కేసీఆర్ టోన్ మారిపోయింది.
అలాగే దుబ్బాక ఎన్నికల సందర్భంగా, ఆతర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేస్తామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్, ఒక సారి ఢిల్లీ వెళ్ళివచ్చిన వెంటనే ఆ విషయమే మరిచి పోయారు. అప్పట్లో విపక్షాలు, ముఖ్యమంత్రిని విమర్శించడం కాదు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు.అయినా, తెరాస నాయకులు రియాక్ట్ అయ్యే సాహసం కూడా చేయలేదని, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ఈడీ, సిబిఐ అస్త్రాలను ప్రయోగించి, విపక్షాల నోరు నొక్కేస్తుందని, మీడియాను మాట్లాడకుండా చేస్తోందన్న విమర్శలు వినిపించినంతగా చర్యలు కనిపించడం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అభార్ధులు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా, 42 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలపై, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదయ్యాయి, కానీ, ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరిపై చర్యలు లేవు. చర్యల సంగతి దేవుడెరుగు, విచారణ అయినా ప్రారంభమైందా లేదా అనేది అనుమానమే.నిజానికి కేసుల విచారణ పూర్తయ్యే సరికి పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుంది.
మరో వైపు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అప్పుడప్పుడు రెచ్చిపోయి హెచ్చరికలు చేస్తారు. తెరాస ప్రభుత్వ అవినీతి, అక్రమాల చిట్టా తీస్తున్నామని, రేపో మాపో కేసీఆర్’ను జైలుకు పంపడం ఖాయమని అంటుంటారు. కానీ, రేపో మాపో మాత్రం అదేమిటో ఎప్పటికీ రాదు. ఎందుకు రాదో అందరికీ తెలుసు, గల్లీలో గోలచేసే నాయకులు, ఢిల్లీ వెళితే ఎలా ప్రవర్తిస్తారో, అందరికీ తెలిసిన విషయమే..