పీకేతో బీఎస్పీ బలపడేనా? ఎవరికి లాభం.. ఏ పార్టీకి గండం?
బహుజన సమాజవాదీ పార్టీ ( బీఎస్పీ) కొత్త పార్టీ కాదు, కానీ, కొత్తగా వస్తున్న పార్టీ. సుదీర్ఘ విరామం తర్వాత, తెలంగాణ రాజకీయ వేదిక మీదకు మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ కుమార్ రూపంలో బీఎస్పీ మళ్ళీ వస్తోంది. ఆరేళ్ళ సర్వీస్ ఉండగానే, స్వచ్చంద పదవీ విరమణ చేసి, రాజకీయ అరంగేట్రం చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ రేపు (ఆగష్టు 8) బీఎస్పీలో చేరుతున్నారు. బీఎస్పీ అధినాయకురాలు, మాయావతి ఈ విషయాన్నీ అధికారికంగా దృవీకరించారు. అంతే, కాదు ప్రవీణ్ కుమార్’ను పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు మాయావతి ప్రకటించారు. ఈ సందర్భంగా నల్గొండలో రేపు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసారు.
నిజానికి అయన ఉద్యోగానికి రాజీనామా చేసిన సమయంలో ఆయన భవిష్యత్ కార్యాచరణ పై చాలా చాలా ఊహాగానాలు వినిపించాయి. సమయ సందర్భాలు, ఆయనకు అధికార పార్టీ నాయకులతో ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆయన అంతర్గత కుటుంబ కోటరీతో ఉన్న సన్నిహిత సంబందాల కారణంగా ఆయన గులాబీ పార్టీలో చేరతారని అనుకున్నారు. సమయ సందర్భాలను బట్టి అయన హుజూరాబాద్ ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్ధిగా పోటీ చేస్తారు,అని కూడా అన్నారు. కానీ, కొద్ది రోజుల్లోనే ఆయన తెరాస మీద యుద్ధం ప్రకటించారు. కారెక్కడం లేదని స్పష్టం చేశారు. సర్వీస్’లో ఉండగానే ముందు చూపుతో స్వేరోస్ స్వచ్చంద సంస్థను స్థాపించి, రాజకీయ పునాదులు నిర్మించుకున్న ప్రవీణ్ కుమార్, జిల్లాల వారిగా నిర్వహించిన స్వేరోస్ సమావేశాలలో తెరాసను, కేసీఆర్ నే టార్గెట్ చేశారు.
రాష్ట్రంలో కుటుంబ పాలన అంతమయ్యే రోజులు దగ్గరపడ్డాయన్నారు. గడీల రాజ్యానికి చరమగీతం పాడే పరిస్థితులు త్వరలోనే వస్తాయంటూ ఆయన, హెచ్చరించారు.తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ, అవినీతి జరిగిందని ఆరోపించారు. చివరకు దలితుల కోసం, తెరాస ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకాన్ని కూడా ప్రవీణ్ కుమార్ ఎండ గట్టారు. అధికారంలోకి వచ్చిన ఏడేళ్ళలో ఏనాడు కూడా దళితుల పేరు ఎత్తని కేసీఆర్.. హుజురాబాద్ ఉపఎన్నిక కోసం దళిత బంధు అంటూ మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఉపఎన్నిక కోసం ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపారని.. కేసీఆర్ తన అవసరాల కోసం ఎంతకైనా తెగిస్తారని ప్రవీణ్ కుమార్ దుయ్యబట్టారు.కేసేఅర్ కుట్రలో తాను పావును కాదు, అని నిరుపించుకోవడం కోసం కావచ్చును, ఆయన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కంటే గట్టిగానే కేసీఆర్ని తిట్టిపోస్తున్నారు.
సరే అవ్వన్నీ ఎలా ఉన్నా, తెలంగాణలోనే కాదు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ బీఎస్పీ ప్రయోగం ఎందుకనో సక్సెస్ కాలేదు. 1994 ఎన్నికల సముయంలో, స్వయంగా కాన్షీ రామ్ హైదరాబాద్’లో మకాం చేసి, పార్టీని పటిష్ట పరిచేందుకు చాలా గట్టి కసరత్తే చేశారు. అంతకు ముందు కూడా కాన్షీ రామ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు.కానీ, అప్పట్లో ఇటు మీడియా గానే, అటు ప్రజలు గానీ ఆయన్ను, ఆయన పార్టీని అంతగా పట్టించుకోలేదు.
అయితే 1993 యూపీ ఎన్నికల్లో 67 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడంతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా బీఎస్పీకి గుర్తింపు వచ్చింది. (ఆతర్వాత 1995లో తొలి సారిగా బీజేపీ మద్దతుతో మాయావతి యూపీ ముఖ్యమంత్రి కూడా అయ్యారు.) ఈనేపధ్యంలో యూపీ తర్వాతగా ఏపీ అనే నినాదంతో 1994 ఎన్నికలకు ముందు రాష్ట్రలో దళిత బహుజనుల జెండా పాతేందుకు కాన్షీ రామ్ చేసిన ప్రయత్నాలకు ప్రజలనుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మీడియా గుర్తించింది. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు కూడా కాన్షీరామ్ ఎవరి కొంప ముంచుతారో అని లెక్కలు వేసుకోవడం మొదలు పెట్టాయి. అదే సమయంలో, హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో కాన్షీ రామ్ నిర్వహించిన భారీ బహిరంగ సభ, రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తుందన్న భ్రమలను సృష్టించింది. కానీ, కాన్షీ రామ్ ప్రభంజనం ఫలితాలలో కనిపించలేదు. ఆ ఎన్నికలలో నిజమైన ప్రభంజనం ఎన్టీఅర్ సృష్టించారు. మొత్తం 294 స్థాన్లాకు గానూ 220కి పైగా స్థానాలలో తెలుగు దేశం విజయ దుందుభి మోగించింది.
అలా 1994 ప్రయోగం ఫెయిల్ అయిన తర్వాత, రాష్ట్రంలో బీఎస్పీ ఉందంటే ఉందనే గానీ, బలమైన శక్తిగా మాత్రం లేదు. కత్తి పద్మారావు వంటి కొదంరు పార్టీని బతికించే ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. అలాగే, తెరాస నుంచి బహిష్కరణకు గురైన ఆలే (టైగర్) నరేంద్ర 2008 లో మాయావతి సమక్షంలో బీస్పీపీ లో చేరారు. అయితే ఆయన ఎక్కువకాలం ఆపార్టీలో కొనసాగలేదు, పాత గూటికి (బీజేపీ) చేరిపోయారు. అయితే, ఎన్నికల ముందు సొంత పార్టీ టికెట్ రాని కొందరు బీస్పీపీ టికెట్ తెచ్చుకుని గెలిచిన సందర్భాలున్నాయి. ప్రస్తుత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా 2014 ఎన్నికల్లో బీఎస్పీ టికెట్ మీద గెలిచి తెరాసలో చేరారు.అలాగే, గతమంలోనూ కొందరు బీఎస్పీ టికెట్ కొనుక్కుని పోటీ చేసిన సందర్భాలున్నాయి.
ఇక ఇప్పుడు మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్, మరో ప్రయత్నం చేస్తున్నారు. అయితే మాయావతి అనుసరిస్తున్న రాజకీయ పంథాకు, ప్రవీణ్ కుమార్ ప్రకటిత పంథాకు మధ్య చాలా చాలా దూరముంది. మాయావతి, ఇంతవరకు నాలుగుసార్లు యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే.. రెండుసార్లు బీజేపీ మద్దతుతోనే గద్దె నెక్కారు. అంతే కాదు ఇప్పుడు కూడా బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓబీసీ జనగణన చేపడితే, పార్లమెంట్ లోపలా వెలుపలా కూడా బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దమని ఆమె ప్రకటించారు. ప్రస్తత పార్లమెంట్ ప్రతిస్తంభన వ్యవహారంలోనూ బీఎస్పీ ఎంపీలు, కాంగ్రెస్ ఇతర విపక్షాల మొండి వైఖరిని తప్పుపడుతున్నారు. మాయావతి అనుసరిస్తున్నఈ బీజేపీ, హిందుత్వ అనుకూల వైఖరిని కరడు కట్టిన హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసుకున్న ప్రవీణ కుమార్ ఎంతవరకు జీర్ణం చేసుకుంటారనేది అనుమానమే అంటున్నారు. అయితే రాష్ట్రంలో రాష్ట్రంలో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలలో రేపేమి జరుగుతుంది, అనేది ఊహాకు అందని ప్రశ్న.