గవర్నర్ కు చేరని ఎమ్మెల్సీ ప్రపోజల్! కౌశిక్ రెడ్డికి కేసీఆర్ షాకిస్తారా?
posted on Aug 10, 2021 @ 7:10PM
తెలంగాణ రాజకీయాలన్ని హుజురాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి. ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న సీఎం కేసీఆర్... ప్రభుత్వ పథకాలతో పాటు పదవుల పందేరం కూడా హుజురాబాద్ కేంద్రంగానే అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందుకు సంబంధించి కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేబినెట్ ప్రతిపాదనకు గవర్నర్ తమిళి సై ఆమోదం తెలిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. కాని అదంతా అసత్యమని తెలుస్తోంది. పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఇంకా నియమించబడలేదని సమాచారం.
పాడి కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా నియమిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించినా... దానికి సంబంధించిన ప్రపోజల్ ఇంకా గవర్నర్ కార్యాలయానికే వెళ్లలేదని తెలుస్తోంది. కేబినెట్ లో తీర్మానం చేసినట్లు చెప్పారు కాని... గవర్నర్ కు పంపించలేదని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ప్రభుత్వం నుంచి గవర్నర్ కు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని అధికారిక వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. గవర్నర్ అందుబాటులో లేరని చెప్పడానికి కూడా లేదు. కొన్ని రోజుల క్రితం పుదిచ్చేరిలో ఉన్న తమిళిసై... గత వారం హైదరాబాద్ వచ్చారు. అయినా ప్రభుత్వం నుంచి ఎమ్మెల్సీకి సంబంధించి ఎవరూ ఆమెను సంప్రదించలేదని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చినట్లు ప్రచారం చేసిన అధికార పార్టీ.. ఆ ప్రతిపాదనను గవర్నర్ కు ఇంకా ఎందుకు పంపలేదన్నది చర్చగా మారింది.
కౌశిక్ రెడ్డి గత ఎన్నికల్లో హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల తర్వాత కూడా నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్నారు. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత ఉప ఎన్నిక కోసం కసరత్తు కూడా చేశారు. అయితే హుజురాబాద్ లో తమకు బలమైన అభ్యర్థి లేరని గ్రహించిన టీఆర్ఎస్.. కౌశిక్ రెడ్డికి గాలం వేసింది. ఈ నేపథ్యంలోనే ఓ కార్యక్రమంలో కేటీఆర్ ను కౌశిక్ రెడ్డి కలిసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే తాను కాంగ్రెస్ లోనే ఉంటానని కౌశిక్ రెడ్డి చెప్పినా.. కాంగ్రెస్ లో మాత్రం అనుమానమే ఉంది. చివరకు అదే నిజమవుతూ కౌశిక్ రెడ్డి నిజస్వరూపం బయటపడింది. కాంగ్రెస్ లో ఉండగానే.. తనకు టీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్ అయిందంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో లీకై వైరల్ గా మారింది. దీనిపై కాంగ్రెస్ సీరియస్ గా స్పందించడంతో.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్నారు కౌశిక్ రెడ్డి.
కౌశిక్ రెడ్డిని హుజురాబాద్ బరిలో ఉంచాలని టీఆర్ఎస్ ప్లాన్ చేసినా... ఆడియో లీక్ కావడంతో సీన్ మారిపోయింది. దీంతో అతనికి ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉన్నా తర్వాత పరిణామాలే కౌశిక్ రెడ్డి టీమ్ ను కలవరపరుస్తున్నాయి. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై అధికార పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమైందట. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్లు లీడర్లను కాదని కౌశిక్ రెడ్డికి ఇవ్వడం సరికాదనే అభిప్రాయం కొందరు నేతలు చెప్పారని తెలుస్తోంది. అంతేకాదు కౌశిక్ రెడ్డిపై హుజురాబాద్ లో వ్యతిరేకత ఉందని, ఆయన సెటిల్ మెంట్ విషయాలు బయటికి వస్తే పార్టీకి ప్రమాదమని కొందరు నేతలు సూచించారట. హుజురాబాద్ ఎన్నికల వరకు వెయిట్ చేస్తేనే బెటరని మరికొందరు నేతలు కేసీఆర్ కు సూచించారట.
పార్టీ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో పాటు కౌశిక్ రెడ్డిపై పెండింగులో ఉన్న కేసులు బయటికి రావడం కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. కౌశిక్ రెడ్డిపై ఉన్న కేసుల వివరాలను కొందరు గవర్నర్ కు నివేదించారని సమాచారం. నామినేటెడ్ కోటాలో నియామకం కాబట్టి...కేసుల కారణంతో కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని గవర్నర్ నిలుపుదల చేసే అవకాశం ఉందనే సమాచారం కూడా సీఎం కేసీఆర్ కు వెళ్లిందని అంటున్నారు. అలా జరిగితే ప్రభుత్వం పరువు పోతుందనే భయంతో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో కేసీఆర్ పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు. అందుకే నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీపై మంత్రివర్గంలో చేసిన తీర్మానాన్ని గవర్నర్ కు ప్రభుత్వం పంపించలేదని చెబుతున్నారు.
మరోవైపు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారనే సంతోషంతో సంబరాలు చేసుకున్న ఆయన అభిమానులు మాత్రం తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. ఇంతకు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారా లేదా... కాకుంటే ఎందుకు కాలేదు, ఎప్పుడు అవుతారనే ప్రశ్నలు వాళ్లలే వాళ్లే వేసుకుంటున్నారట. మరికొందరు కౌశిక్ రెడ్డి అనుచరులు మాత్రం కేసీఆర్ రాజకీయాలు ఇలానే ఉంటాయి... ఊబీలో ఇరుకున్నాకా చేసేదేమి ఉండదు.. వెయిట్ చేయాల్సిందేనని సెటైర్లు వేస్తున్నారట. చూడాలి మరీ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ వ్యవహారం ఎటు వైపు దారి తీస్తుందో..