టీఆర్ఎస్ లో సోషల్ మీడియా చిచ్చు.. హరీష్ రావే టార్గెట్?
posted on Aug 10, 2021 @ 11:15AM
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అత్యంత కీలకంగా భావిస్తున్న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు సవాల్ గా తీసుకున్నాయి. తమకు కొరకరాని కొయ్యలా మారిన ఈటల రాజేందర్ ను ఎలాగైనా ఓడించేందుకు అన్ని అస్త్రాలు బయటికి తీస్తోంది గులాబీ పార్టీ. దళిత బంధు లాంటి పథకాలను హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే తీసుకువచ్చారనే చర్చ జరుగుతోంది. వివిధ వర్గాలకు వరాలు ఇవ్వడంతో పాటు సోషల్ మీడియా కేంద్రంగా ప్రచారాన్ని హోరెత్తించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ లో కొత్త వివాదానికి కారణమైంది.
హుజురాబాద్ ఉప ఎన్నిక బాధ్యతలు చూస్తున్న హరీష్ రావు.. దుబ్బాకలో జరిగిన లోపాలను, లోటుపాట్లను సమీక్షించుకుంటూ ముందుకు సాగుతున్నారు. దుబ్బాకలో బీజేపీకి సోషల్ మీడియానే ప్లస్ గా మారిందనే అంచనాకు వచ్చిన హరీష్ రావు.. హుజురాబాద్ లో ముందే అప్రపమత్తమయ్యారు. సిద్దిపేట్లో సోషల్ మీడియా యాక్టివ్ మెంబర్స్‌తో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు హరీష్ రావు. విపక్షాలకు ఎత్తుకు పైఎత్తులు ఎలా వేయాలో, ప్రత్యర్థి వర్గాల పోస్టులను ఎలా కౌంటర్ చేయాలో దిశా నిర్దేశం చేశారు. సోషల్ మీడియా మీటింగ్‌లో పాల్గొన్న వారియర్స్ హరీశ్‌రావుతో ఫోటోలు దిగి ఏఫ్‌బీలో పోస్ట్ చేశారు. ఇది కొత్త రగడకు తెరతీసింది.
సిద్దిపేటలో నిర్వహించిన సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి కొందరికి ఆహ్వానం వచ్చిందట. దీంతో సమావేశానికి పిలుపు రాని వారంతా గుస్సాగా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది యాక్టివ్ మెంబర్స్ టీఆరెఎస్ నాయకులతో ప్రత్యేక్ష సంబంధాలు లేకపోయినా కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో, పార్టీ మీద ప్రేమతో ఎప్పటికప్పుడు టీఆరెఎస్ అనుకూల పోస్టులను పెడుతూ వస్తున్నారు. ప్రత్యర్థి వర్గాల దాడులను తమదైన శైలిలో సోషల్ మీడియాలో కౌంటర్ చేస్తున్నారు. ఇలాంటి వారికి కూడా హరీశ్‌రావు నుంచి ఆహ్వానం అందకపోవడం వారిని తీవ్ర అసంతృప్తికి లోను చేసింది. దీంతో ఫేస్‌బుక్‌లో తమ వాల్స్ పై అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇంత పనిచేస్తున్నా కనీస గుర్తింపు లేదనే ఆవేదన వ్యక్తం చేశారు. ఇది హరీశ్‌రావుకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది.
సోషల్ మీడియా సమావేశానికి సంబంధించి మరో ప్రచారం కూడా సాగుతోంది. హరీష్ రావు టార్గెట్ గా కొందరు పోస్టులు పెడుతున్నారు. హరీష్ రావుకు మద్దతుగా ఉండేవారికి మాత్రమే సిద్దిపేట సమావేశానికి ఆహ్వానం వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా సమావేశం పేరుతో తన వర్గాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు హరీష్ రావు చేస్తున్నారని కొందరు పోస్టులు పెట్టారు. త్వరలో హరీష్ రావు కూడా పార్టీ నుంచి బయటికి వెళతారేమోనని, అందుకే ఇలా చేస్తున్నారని కూడా వాదన తెరపైకి వస్తోంది. మొత్తానికి సిద్ధిపేటలో జరిగిన టీఆర్ఎస్ సోషల్ మీడియా సమావేశం కొత్త వివాదానికి దారి తీసిందనే అభిప్రాయం పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది.