ఎవరిది ద్రోహం ఎవరిది నేరం ? ఎల్ రమణకు సోషల్ మీడియా చురకలు..
చెప్పేవాడికి వినేవాడు లోకువ ... లేదంటే నిన్న గాక మొన్న, ఉన్న పార్టీలో గౌరవ స్థానాన్ని వదలి అధికార పార్టీలో చేరిన ఎల్. రమణ కూడా ఈటల రాజేందర్ పార్టీ మారి తెరాసకు ద్రోహం చేశారని ఆరోపించడం ఏమిటి? తెలుగు దేశం పార్టీ, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనకు ఏ అన్యాయం చేశారని, రమణ పార్టీ వదలి వెళ్లారు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే, తాను తెలుగు దేశం పార్టీకి చేసింది ద్రోహమా లేక మెడపట్టుకుని గెంటిన తర్వాత, గత్యంతరం లేక పార్టీ వదిలి పోయిన ఈటల రాజేందర్’ చేసింది ద్రోహమా, అనేది ఆయనకే అర్థం అవుతుంది.
నిజమే 2016 నుంచి 2021 వరకు పార్టీలో, ప్రభుత్వంలో అవమానాలు భరిస్తూ కూడా పదవి వదులుకోలేక ప్రగతి భవన్ గేట్లు పట్టుకు వేళ్లాడిన ఈటల రాజేందర్, ఇప్పుడు ఆత్మగౌరవం గురింఛి మాట్లాడితే, ఎంత విన సొంపుగా, ఎబ్బెట్టుగా ఉంటుందో, ఈటల పార్టీ మారడం గురించి ఎల్ రమణ మాట్లాడినా అలాగే ఉంటుంది. నిజానికి ఈటల తనంతటతాను పార్టీ మారలేదు, ముఖ్యమంత్రి కేసీఆర్ మెడపట్టి బయటకు గెంటిన తర్వాతనే మరోదారి లేక వెళ్లి బీజేపీలో చేరారు. అంతేగాని, తెరాస సిద్దాంతం నచ్చకనో, బీజేపీ సిద్దాంతం తెగ నచ్చేసో ఆయన పార్టీ మారలేదు.ఇప్పటికి కూడా ఈటల రాజేందర్ ఎక్కడా కూడా గట్టిగా బీజేపీ గురించి మాట్లడ లేదు.అంతే కాదు, పార్టీని చూసి కాదు, నన్ను చూసి ఓటేయమనే ఓటర్లను అభ్యర్దిస్తున్నారు. నిన్నగాక మొన్న తెరాసలో చేరిన రమణ, గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరించి నట్లు, పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో, ఉద్యమంలో. ప్రభుత్వంలో ఉండి కష్టసుఖాలు పంచుకున్న ఈటల పార్టీ మారడం పార్టీకి ద్రోహం చేయడమని మాట్లాడడం విడ్డూరంగానే కాదు, వికారంగా కూడా ఉందని ఎవరైనా అంటే, అది సబబే అనిపిస్తుంది. కాదనేందుకు కారణం కనిపించదు.
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, నారా చంద్రబాబు నాయుడు ఏనాడూ ఎల్.రమణను పల్లెత్తు మాట అనలేదు. ఒక సారి కాదు, రెండు సార్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుని చేశారు. పార్టీ టిక్కెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడ లేక పోయినా, పార్టీని బలోపేతం చేయడంలో విఫలమైనా,ఆయన్ని పార్టీ పదవి నుంచి తప్పించలేదు. అయినా, కేసేఆర్ ఏమి ఎరవేశారో, ఏ పదవి ఆశ చుపారో, ఏమోకానీ, కేసీఆర్ రమ్మనగానే, రమణ ఆ పిలుపు కోసమే వేయికళ్లతో ఎదురుచూస్తున్నట్లు వెళ్లి కారెక్కారు. ఒక విధంగా రాజకీయ పరిభాషలో చెప్పాలంటే, రమణ పదవులకు ఆశ పడి అమ్ముడు పోయారు. అమ్ముడు పోయిన నాయకుడు, అవమానాలకు గురై మరో మార్గం లేక పార్టీ వదిలిన ఈటలను ద్రోహిగా పేర్కొనడం, ఏదైతే వుందో అది, ఆయన్ని అయన అవమాన పరచుకోవడమే అవుతుంది. అందుకే, రమణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.
ఈటల చేసింది పార్టీ (తెరాస) ద్రోహం అయితే, రమణ చేసింది ఏమిటో ... ఇంకేమనాలో ఆయనే చెపితే బాగుంటుందని సోషల్ మీడియాలో రమణను నిలదీస్తున్నారు. అంతే కాదు, నమ్మి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు నాయుడుకి, తెలుగు దేశం పార్టీకి రమణ చేసింది ద్రోహం కాదా అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు, ఈటల అవమానాలను భరిస్తూ తెరాసలో కొనసాగి ఉంటే, హుజూరాబాద్ ఉప ఎన్నికే వచ్చేది కాదు, రమణకు కారెక్కే అవకాశము ఉండేది అలాగే కౌశిక రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కినట్లుగా రేపు పొరపాటున రమణకు కూడా చిన్నదో, పెద్దదో ఎదో ఒక పదవి దక్కితే, అది కూడా ఈటల పుణ్యమే అవుతుందని నెట్జనులు చురకులు వేస్తున్నారు.
నిజమే రాజకీయాలలోపరిశుద్ధంగా పవిత్రంగా ఉండడం ఎవరికి అయినా అయ్యే పని కాదు. కానీ, అద్దాల మేడలో కూర్చున్నవాళ్ళుఇతరుల మీద రాళ్ళేస్తే, ఏమవుతుందో తెలుసుకుని ప్రవర్తిస్తే బాగుటుందని హితవు పలుకుతున్నారు.అంతేకాదు, సుదీర్ఘ కాలం తెలుగు దేశం పార్టీలో కొనసాగిన ఎన్నికలలో గెలిచినా, ఒడి పోయినా రమణ ఎప్పుడూ ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేస్తున్నారు. ఒక విధంగా రమణ జెంటిల్మెన్ పాలిటీషియన్ అనే మంచి పేరుంది, పార్టీ మారి పట్టుమని నెలరోజులు కాకముందే, టీడీపీ సంస్కారాన్ని వదిలి కారు కల్చర్’లోకి జారిపోవద్దని మిత్రులు హితవు పలుకుతున్నారు.