అబద్దాలు మానకపోతే నరికేస్తాం.. రేవంత్ కు టీఆర్ఎస్ వార్నింగ్
posted on Aug 10, 2021 @ 1:46PM
ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు అధికార టీఆర్ఎస్ నేతలు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పిచ్చిపిచ్చిగా ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న.. రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. జైలుకు వెళ్లి వచ్చిన దొంగ నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. బీజేపీతో కుమ్మక్కై ఇంద్రవెల్లిలో సభ పెట్టారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అబద్దాలు మాట్లాడటం మానుకోవాలని జోగు రామన్న అన్నారు. లేదంటే కాళ్లు నరికేస్తామని హెచ్చరించారు.
ఓటుకు నోటు కేసులో అతి త్వరలో గాంధీ భవన్ నుండి ఇడ్చుకు వచ్చి రేవంత్‌రెడ్డిని జైలుకు పంపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ అన్నారు. చరిత్ర తెలియని రేవంత్ రెడ్డికి ఆదివాసీల గురించి మాట్లాడే నైతిక హక్కులేదన్నారు. 1981లో గిరిజనులను పోలీసులతో చంపించిన సంస్కృతి కాంగ్రెస్ వాళ్లదేనని, ఇప్పుడు అదే స్థలం వద్ద దండోరా నిర్వహించడం సిగ్గు చేటన్నారు. సభకు లక్షకు పైగా జనం హాజరయ్యారని, లక్ష మందికి జనం తగ్గినట్లు నిరూపిస్తే తలనరుకుంటా అని అన్న రేవంత్ తల నరుక్కోవడానికి సిద్దంగా ఉండాలన్నారు. రూ.20వేల పరిమితి ఉన్న మైదానంలో లక్ష మంది జనాలు ఎక్కడి నుండి వచ్చారని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. జనం 20వేలకు మించి రాలేదని నిరుపించేందుకు తాను సిద్దంగా ఉన్నానని, తన సవాల్ ను స్వీకరించే దమ్ము నీకు ఉందా రేవంత్ అని ప్రశ్నించారు. కేసీఆర్ పేరు తల్చేందుకు కూడా రేవంత్‌కు అర్హత లేదని, తెలంగాణలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ జిమిక్కులు చేయాలని చూస్తోందన్నారు. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని బొందపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎమ్మెల్సీ చెప్పారు.
రేవంత్‌రెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి. రేవంత్ లాగా పగతోని.. ప్రతికారంతో రాజకీయం చేస్తే ఆయన రోడ్డుపై తిరగగలడా? అని ప్రశ్నించారు.. రేవంత్ దిగజారిన భాష చూసి తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఊగి పోతున్నారన్న సైదిరెడ్డి.. టీడీపీలో ఉన్నప్పుడు సోనియాను బలి దేవత అన్నారు.. ఇప్పుడు మహా దేవత అంటున్నారు అని ఎద్దేవా చేశారు.. సీఎం కేసీఆర్ ఒక్కమాట అంటే రేవంత్ రోడ్లపై తిరగలేడు అని కామెంట్ చేశారు.మాకు కేసీఆర్ సంస్కారం నేర్పారు.. రేవంత్ కన్నా ఎక్కువ మాట్లాడగలం అన్నారు సైదిరెడ్డి. హుజూర్ నగర్‌లో నియోజకవర్గానికి సంబంధించి లక్ష మందితో సభ పెట్టే సత్తా నాకుందని.. ఇంద్రవెల్లి సభ ఓ లెక్కా ? అని ఎద్దేవా చేశారు. రేవంత్ బ్లాక్ మెయిలింగ్ విద్యలు ఇక నడవవని హెచ్చరించిన ఆయన.. రేవంత్ రెడ్డి టీపీసీసీ రాగానే అక్కడి సీనియర్లు అందరూ మధనపడుతున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి తనను తాను హైలైట్ చేసుకోవడానికి సభ పెట్టినట్లు ఉందని.. ఇంద్రవెల్లి సభకు 10 వేల మంది వచ్చారా..? లేదా లక్షమంది వచ్చారా…? అనేది అందరూ చూశారన్నారు.