పీకేకు కరోనా పాజిటివ్.. మాస్క్ లేకుండానే పబ్లిక్ మీటింగ్!
posted on Aug 10, 2021 @ 4:04PM
తెలంగాణలో కోవిడ్ కేసులు తగ్గినట్లు ప్రభుత్వ లెక్కల్లో కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మరోలా కనిపిస్తోంది. జిల్లాల్లో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రెండు రోజుల క్రితమే బీఎస్పీలో చేరిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. కొవిడ్ నిర్దారణ కావడంతో ఆయన గాంధీ ఆసుపత్రికి వెళ్లి కాక్ టెయిల్ వ్యాక్సిన్ డోస్ తీసుకున్నారు. కొద్దిసేపు అక్కడే ఉండి మధ్యాహ్నానికి ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, మైల్డ్ లక్షణాలే కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
గత నెలలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం బీఎస్పీ పార్టీలో చేరారు. నల్గొండ ఎన్జీ కాలేజీలో నిర్వహించిన భారీ సభలో ఆయన బీఎస్పీ కండువా కప్పుకున్నారు. ఈ సభకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి లక్ష మంది వరకు హాజరయ్యారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఆయన చాలా ప్రాంతాల్లో పర్యటించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో స్వేరోస్ సభలు నిర్వహించారు. వేలాది మందితో ఇంటరాక్ట్ అయ్యారు.
ఇటీవల జరిన సమావేశాల్లో ప్రవీణ్ కుమార్ ఎక్కువగా మాస్క్ ధరించలేదని చెబుతున్నారు. నల్గొండ సభలోనూ ఎక్కువ సమయం ఆయన మాస్క్ లేకుండానే కనిపించారు. వేదికపై ఉన్న అతిథులు కూడా ఎవరూ మాస్క్ పెట్టుకోలేదు. ఆయన సభలకు వచ్చిన వారు కూడా కొవిడ్ రూల్స్ పాటించలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కొవిడ్ సోకడంతో.. ఆయన సభలకు వచ్చిన వారంతా ఆందోళనకు గురవుతున్నారు.