ఏపీకి రేవంత్‌రెడ్డి కావలెను.....
ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. చచ్చిపోతుందని తెలిసి కూడా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు ... కొద్ది రోజుల క్రితం ఇంద్రవెల్లి సభలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. నిజం అయినా కాక పోయినా, చాలా మందిలో అదే అభిప్రాయం ఉంది. రాష్ట్ర విభజన కారణంగానే, ఏపీలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయిందనే అభిప్రాయం చాలా మందిలో నాటుకు పోయింది.
అదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కొత్తగా నడుంబిగించిన ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏపీ మీద కూడా దృష్టి పెట్టారు. దేశ వ్యాప్తంగా పీసీసీలకు యంగ్ బ్లడ్ ఎక్కించే పనిలో పడిన రాహుల్ గాంధీ ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తం ఎక్కించే పనికి శ్రీకారం చుట్టారు. ఏడున్నర ఏళ్లలో తొలిసారిగా ఏపీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయలతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని సమీక్షించారు. ఎమీ చేస్తే కాంగ్రెస్ మళ్ళీ పూర్వ వైభవ పరిస్థతికి చేరుకుంటుందని విచారించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్య సభ మాజీ ఎంపీ కేవీపే రామచంద్ర రావు. కేంద్ర మాజీ మంత్రులు పల్లం రాజు, జేడీ శీలం, చింతా మోహన్, మాజీ ఎంపీ హర్ష కుమార్, పీసీసీ చీఫ్ శైలజానాథ్, మరి కొందరు నేతలతో ఆయన విడివిడిగా, సమిష్టిగా చర్చలు జరిపారు.
అయితే, ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్జీవనం సాధ్యమా అంటే, అది సమీప భవిష్యత్తులో అయ్యే పనికాదని, అలాగని, ఎప్పటికీ ఇంతే, అని అనుకోవడానికి వీలు లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి, రాష్ట్ర విభజనకు ముందు నుంచే, ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, వైఎస్ ఆకస్మిక మృతితోనే కాంగ్రెస్ పతన యాత్ర మొదలైనదని, విశ్లేషకులు చెపుతున్నారు. అందుకే, తెలంగాణ ఇచ్చినా అక్కడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేక పోయింది. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందే కానీ, బలపడింది లేదు, ఇది కళ్ళముందు కనిపిస్తున్న వాస్తవం.
తెలంగాణ ఏర్పాటు క్రెడిట్’ను తమ ఖాతాలో వేసుకున్న తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ పునరేకీకరణ పేరున హస్తం పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. కేసీఆర్ సంధించిన ‘ఆకర్ష్’ అస్త్రానికి హస్తం పార్టీ చాలా వరకు ఖాళీ ఐపోయింది.కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు,ఇతర ప్రజా ప్రతినిధులు అధికార పార్టీలో చేరిపోయారు. పాత పద్దును పక్కన పెట్టినా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 19 మందిలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాస గూటికి చేరారు. అలాగే, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన హుజూర్’నగర్ ఉపఎన్నిక మొదలు నిన్నమొన్నటి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వరకు కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు. అయితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. అందుకు ఇంద్రవెల్లి సభ సక్సెస్సే ప్రత్యక్ష సాక్ష్యం. అయితే, ఈ కొత్త వింత ఎంతకాలం ఉంటుందనే చర్చ ఒకటి ఉంది, అయినా ఒడిదుడుకులు ఉన్నా, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లేచి నిలబడిందని అనేది మాత్రం నిజం.
ఈ నేపధ్యంలో ఏపీలో కూడా, రేవంత్ రెడ్డి లాంటి నోరున్న లీడర్’కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే, రాష్ట్రంలోనూ పార్టీ పునర్జీవనం పొందుతుందని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు,తెలుస్తోంది. అయితే అలా అనుకోవడం పొరపాటే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ డౌన్ బట్ నాట్ అవుట్ , కానీ, ఏపీలో పరిస్థితి అది కాదు. రేవంత్ రెడ్డే అన్నట్లుగ్గా ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయింది. ఉంటే గింటే కొంత కొన ఊపిరి ఇంకా మిగిలుందేమో కానీ, అంతకు మించిని పరిస్థితి అయితే లేదు.
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఇంచిమించుగా 20 అసెంబ్లీ స్థానంలో విజయం సాధించింది. చివరకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి 28 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. అలాగే, 2019 లోక్ సభ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుచుకుంది. అదే ఏపీ విషయానికి వస్తే విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికలలోనూ హస్తం పార్టీకి ఒక్క సీటు గెలవలేదు. కనీసం ఒక్కటంటే ఒక్క సీటులోనూ డిపాజిట్ దక్కలేదు. ఓటు షేర్ చూసుకున్నా ఒక శాతానికే, కొంచెం అటూ ఇటుగానే ఉంది.
మరోవంక కాంగ్రెస్ ప్రధాన ఓటు బ్యాంక్’ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, క్రిస్టియన్, రెడ్డి ఓటు బ్యాంకును వైసీపీ గంప గుత్తగా తమ ఖాతాలో చేర్చుకుంది. అలాగే రెడ్డి సామాజిక వర్గం, గతంలో కాంగ్రెస్’కు అండగా ఉన్న ఇతరత్రా కులాలను కూడా వైసీపీ లాగేసుకుంది. నిజానికి, నిన్నటి కాంగ్రెస్సే నేటి వైసీపీ, అన్నవిధంగా రాజకీయ కుల సమీకరణలు మారిపోయాయి. గుర్తు మారింది, నాయకుడు మారాడు. మిగిలినిదంతా సేమ్ టూ సేమ్...
నిజానికి, కాంగ్రెస్ మాత్రమే కాదు, బీజేపీ పరిస్థితి కూడా ఇంచుమించుగా అంతే. తెలుగు దేశం, జనసేనతో పొత్తు పెట్టుకున్న పుణ్యానే 2014లో బీజేపీకి నాలుగు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటు దక్కాయి. ఒంటరిగా పోటీ చేసిన 2019 ఎన్నికల్లో బీజేపీ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అలాగే, కొద్ది నెలల క్రితం జరిగిన తిరుపతి ఉప ఎన్నికలో, బీజీపీ, జనసేన కలిసి పోటీచేసినా డిపాజిట్ దక్కలేదు. సో, జాతీయ పార్టీలకు ఏపీలో, సమీప భవిష్యత్తులో గొప్ప భవిష్యత్ ఆశించడం అత్యాశే అవుతుంది.
ప్రస్తుతానికి అయితే, ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలు, వైసీపీ, తెలుగు దేశం బలంగా ఉన్నాయి. తమిళనాడులో ఏ విధంగా అయితే, జాతీయ పార్టీలకు స్థానంలేదో, అదే విధంగా ఏపీ లోనూ రెండు బలమైన ప్రాంతీయ పార్టీల నడుమ ఒక జాతీయ పార్టీ ఎదిగి రావడం ఇప్పట్లో అయ్యే పనికాదని విశ్లేషకులు బావిస్తున్నారు. అయితే, జాతీయ స్థాయిలో బీజేపీ, మోడీ వ్యతిరేక కూటమి సారధ్యం కోసం పాకులడుతున్న కాంగ్రెస్ పార్టీ, మమతా బెనర్జీతో పోటీ పడుతున్న రాహుల గాంధీ, ఎపీలోనూ హస్తం పార్టీ ఉందని చెప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే, రాహుల్ గాంధీ చేస్తున్నప్రస్తుత పునర్జీవన ప్రయత్నాలను చూడాలని విశ్లేషకులు భావిస్తున్నారు, అదలా ఉంటే, ఇంతకీ ఏపీ రేవంత్ ఎవరు? రాహుల్ గాంధీని కలిసిన, ‘ముఖ్య’ నేతల్లో రేవంత్ పోలికలు ఎవరిలోనూ కనిపించడం లేదు.