హుజూరాబాద్ లో రేవంత్ వ్యూహం ఇదేనా.. అందరి లక్ష్యం ఒక్కటేనా?
హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహం ఏమిటి? పీసీసీ అధ్యక్ష్ బాధ్యతలు చేపట్టిన తొలిక్షణం నుంచే తెరాస ప్రభుత్వంతో చెడుగుడు ఆడుతూ, ముఖ్యమంత్రి కంటికి కునుకు లేకుండా చేస్తున్న రేవంత్ రెడ్డి, హుజూరాబాద్ విషయంలో ఎందుకు, ఆస్థాయిలో దూకుడు చూపడం లేదు? ఎందుకు నిర్లిప్తంగా ఉన్నారు? చివరకు అభ్యర్థి ఎంపిక విషయంలోనూ నియోజకవర్గంతో అంతగా పరిచయం లేని, విద్యార్ధి నాయకుడు బల్మూర్ వెంకట్ ను ఎందుకు బరిలో దింపారు? ఇలా చాలానే ప్రశ్నలు రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చకు వస్తున్నాయి.
ముఖ్యంగా రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్ మ్యాన్ అనుకున్నమాజీ ఎంపీ కొండ కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధికి కాకుండా, బీజేపీ అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించడంతో ఈ చర్చ మరింత జోరుగా సాగుతోంది. నిజానికి విశ్వేశ్వర రెడ్డి బీజేపీ అభ్యర్ధి ఈటలకు మద్దతు ఇవ్వడం మాత్రమే కాదు, కేసీఆర్’కు వ్యతిరేకంగా, తమ బృందాన్ని ఈటల తరపున ప్రచారానికి దించారు. దీంతో రేవంత్ రెడ్డి వ్యూహం విషయంలో అనుమానాలు ఇంకొంత బలపడుతున్నాయి. అలాగే, తెరాస నాయకులు రేవంత్ రెడ్డి బీజేపీ అభ్యర్ధి ఈటలతో కుమ్ముక్కయ్యారని ఆరోపిస్తున్నారు.
అయితే రేవంత్ రెడ్డి నిర్ణయం వెనక దీర్ఘకాల వ్యూహం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈటల ఏ పార్టీలో ఉన్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను వ్యతిరేకిస్తున్న ఉద్యమ స్పూర్తికి ప్రతినిధిగా ఎన్నికల బరిలో నిలిచారు. అంతే కానీ, కేవలం బీజేపీ అభ్యర్ధిగా మాత్రమే ఆయన పోటీచేయడం లేదు. హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉన్నమాట నిజం. కానీ, గెలిచేందుకు సరిపడే ఓటు బ్యాంక్ అయితే లేదు. ఇంచుమించుగా మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ హుజూరాబాద్ లో కనీసం ఒక్కసారి కూడా గెలవలేదు. ఈని సార్లు ఎన్నికలు జరిగినా అన్ని సార్లు, రన్నరప్ గానే సంతృప్తి పడవలసి వస్తుంది. బీజేపీ పరిస్థితి ఇంకా అద్వాన్నం, ఈ 30 ఏళ్లలో ఎప్పుడైనా డిపాజిట్ దక్కిందో లేదో కూడా అనుమానమే. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో అనివార్యంగా బీజేపీలో చేరిన ఆ పార్టీ అభ్యర్థి ఈటలకు హుజూరాబాద్ పెట్టని కోట. గత 18 ఏళ్లుగా, అక్కడ నుంచి ఆయనే గెలుస్తున్నారు.
ఇలా అన్ని కోణాలలో లెక్కలు వేసిన తర్వాతనే, రేవంత్ రెడ్డి, ప్రధాన శత్రువు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించే లక్ష్యంతోనే హుజూరాబాద్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారని విశ్లేషణలు వినవస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రతి అడుగు, కేసీఆర్ టార్గెట్ గానే ఉంటుందని, ఇది కూడా అందులో భాగంగానే చూడాలని విశ్లేషకులు అంటున్నారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వగలదు,కానీ, కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వడం వలన తెరాస గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. నిజంగానే, చివరకు తెరాస అభ్యర్ధి గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ అపనిందలు మోయవలసి వస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి తెరాసను ఓడించడం ఒక్కటే లక్ష్యంగా హుజూరాబాద్ విషయంలో ఇటు తెరాస నుంచి అటు సొంత పార్టీలోని తెరాస అనుకూల వర్గాల నుంచి, వ్యూహాత్మక వత్తిళ్ళు వచ్చినా, రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల కంటే, 2023 ఎన్నికలపై దృష్టి నిలిపారని అంటున్నారు.
నిజానికి, కొండా విశ్వేశ్వర రెడ్డి సహా కేసీఆర్’ పాలనను వ్యతిరేకిస్తున్న ఉద్యమ పార్టీలు, ఉద్యమ సంఘాలు, ఉద్యమనాయకులు అందరూ కూడా, ఈటలను బీజేపీ అభ్యర్ధిగా కంటే, తమ ప్రతినిధి గానే చూస్తున్నారు. అందుకే ఈటలకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. ఒక విధంగా చూస్తే, హుజూరాబాద్’ ఉప ఎన్నిక పార్టీలు, అభ్యర్ధుల మధ్య జరుగతున్న ఎన్నిక కాదు, కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరుగతున్న ఉప ఎన్నికగానే, పరిశీలకులు కూడా భావిస్తున్నారు. అలాగే, ఇది కేవలం హుజూరాబాద్ కు పరిమితం అయిన ఉప ఎన్నిక కాదు. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఎన్నికగానే పరిశీలకు ప్రజలు భావిస్తున్నారు. అందుకే, సిద్ధాంత రాద్దంతాలను పక్కన పెట్టి కేసీఆర్’ను ఓడించడమే లక్ష్యంగానే అందరి అడుగులు పడుతున్నాయని అంటున్నారు.