వైసీపీ నేతల వేధింపులు!.. హైకోర్టు ముందు సూసైడ్ అటెంప్ట్..
posted on Oct 4, 2021 @ 4:05PM
ఏపీలో అధికారపార్టీ ఆగడాలు ఆగడం లేదు. వైపీసీ నేతలు బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. గుంటూరు జిల్లా ధూళిపాళ్లకు చెందిన ఓ కుటుంబాన్ని కొంతకాలంగా వేధిస్తున్నారు గ్రామ పెద్దలు. దీంతో విసిగి వేశారిపోయిన ఆ దంపతులు హైకోర్టు ముందు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది.
ధూళిపాళ్ల గ్రామానికి చెందిన భార్యాభర్తలు చీలికోటి దేవేంద్రరావు, చీలికోటి భానుశ్రీల ఇంటి స్థలానికి సంబంధించిన వివాదంలో కొందరు వ్యక్తులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని హైకోర్టు దగ్గర ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే గమనించిన ఎస్పీఎఫ్ సిబ్బంది ఆ దంపతుల చేతిలో ఉన్న డీజిల్ సీసాను లాక్కున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
2003 నుంచి తమకు ఉన్న స్థలంలో నివాసం ఉంటున్నామని.. తమ స్థలాన్ని బస్ షెల్టర్ నిర్మాణానికి బలవంతంగా తీసుకొనేందుకు ప్రయత్నించగా తాము హైకోర్టును ఆశ్రయించామని బాధితుడు దేవేంద్ర తెలిపారు. హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. గ్రామంలో కొంత మంది పెద్దలు తమను నిత్యం వేధిస్తున్నారని వాపోయారు. దీంతో విసుగు చెంది హైకోర్టు దగ్గరే ఆత్మహత్యకు యత్నించామని చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
మరోవైపు, ఏపీలో వైసీపీ నాయకుల భూకబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతపురం జిల్లా, అక్కంపల్లికి చెందిన రైతు లక్ష్మీరెడ్డి కుటుంబం.. వారికి జీవనాధారమైన పొలంలోనే ఆత్మహత్యాయత్నం చేసారంటే వైసీపీ దుర్మార్గుల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతోందన్నారు. వైసీపీ నేతలు స్థానికంగా ఉన్న కొంతమంది అధికారులు కుమ్మక్కై రైతు భూమి కొట్టేయ్యాలని కుట్రలు చేయడం దారుణమన్నారు. దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను శిక్షించి రైతు లక్ష్మీరెడ్డి కుటుంబానికి న్యాయం చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నారా లోకేష్.