టాప్ న్యూస్ @ 1PM
posted on Oct 5, 2021 @ 12:43PM
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో 'స్వేచ్ఛ' కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుతున్న బాలికలకు శానిటరీ నాప్కిన్స్‌ను ప్రభుత్వం ఉచితంగా అందచేస్తుందన్నారు సీఎం. బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ అందించడమే 'స్వేచ్ఛ' ఉద్దేశ్యమన్నారు. ప్రతి రెండు నెలలకోసారి ప్రభుత్వ విద్యాసంస్థల్లో 'స్వేచ్ఛ' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.---------అనంతపురం జిల్లాలో మంత్రి శంకరనారాయణ అనుచరుల దౌర్జన్యానికి పాల్పడ్డారు. హిందూపురం నియోజకవర్గం రాజుపాలెంలోరైతు పొలంలో మంత్రి అనుచరులు జేసీబీలతో కాలువ తవ్వారు. మంత్రి అనుచరులు దౌర్జన్యంతో తీవ్ర నష్టం వాటిల్లిందంటూ రైతు వేమారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం రైతు వేమారెడ్డి సెల్పీ వీడియా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
------
జగన్ రెడ్డి చెత్త పాలనలో రోజుకో రైతు న్యాయం చెయ్యండంటూ రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో నష్టపరిహారం ఇవ్వకుండానే రైతు వేమారెడ్డి భూమి లాక్కొని మంత్రి అనుచరులే జేసీబీలతో దౌర్జన్యంగా గండి కొట్టి పొలాలు మీదుగా నీటిని మళ్లించడం దారుణమన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని... రైతు వేమారెడ్డికి తక్షణమే న్యాయం చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.
--------
సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు బిల్లులతో షాక్ కొట్టేలా చేస్తున్నారని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. ట్రూ అప్ పేరుతో ప్రజల జేబులను ట్రాప్ చేస్తున్నారని ఆరోపించారు. కరెంట్ బిల్లులతో దళిత కుటుంబాలు చీకటిలో బ్రతకాల్సి వస్తుందన్నారు. జగ్జీవన్ జ్యోతిని ఆర్పాలనే జగన్ ఆలోచనని, ఉచిత కరెంట్ సంగతి ఎలా ఉన్నా, బిల్లులతో సామాన్యుడు బేజారెత్తిపోతున్నాడని, రైతు మెడకు మీటర్లతో ఉచ్చు బిగుస్తున్నారని మండిపడ్డారు
-------
కడప ఎస్పీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేత ఫారుక్ షిబ్లీ నిర్బంధంపై సమితి నేతలు ఫిర్యాదు చేశారు. కడప జిల్లాలో మైనారిటీలపై పెరుగుతున్న దాడుల గురించి లేఖలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ఎన్‌హెచ్ఆర్సీ పూర్తి వివరాలు పంపాలని కడప ఎస్పీని ఆదేశించింది
-------
లఖీంపూర్ ఖేరీ ఘటనను మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తీవ్రంగా ఖండించారు. యూపీ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.నిందితులకు కఠిన శిక్ష విధించాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్_ఖేరిలో రైతుల నిర్దాక్షిణ్యమైన, కోల్డ్ బ్లడెడ్ మర్డర్‌ను చూసి షాక్, భయం వేసింది. ఈ అనాగరిక సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను’’ అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు
---------
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ వద్ద మాట్లాడుతూ కేసీఆర్ నిరుద్యోగులకు తీరని ద్రోహం చేస్తున్నారన్నారు. ‘‘యువతకు 5 శాతం ఉద్యోగాలు.. మీ కుటుంబంలో వంద శాతం ఉద్యోగాలా?’’ అని ప్రశ్నించారు. కేటీఆర్ షేమ్ ఆన్ యూ.. అసెంబ్లీలో చేసిన ప్రకటనకు సిగ్గు పడాలని షర్మిల వ్యాఖ్యానించారు.
---------
కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండలం పందికోన ఫారెస్ట్‌లో క్షుద్రపూజల కలకలం రేగింది. మట్టితో తయారు చేసిన బొమ్మలు, కోడిగుడ్లతో భారీ ఎత్తున క్షుద్రపూజలు నిర్వహించారు. క్షుద్రపూజలు చేసిన ప్రదేశాన్ని చూసిన గొర్రెల కాపరులు అటువైపు వెళ్లాలంటే భయపెడుతున్నారు. ఫారెస్ట్‌లో క్షుద్రపూజలపై ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
-------------
లఖింపూర్ కేరి హింసాత్మక ఘటనతో ఉత్తరప్రదేశ్ విషాదంలో మునిగిపోయిందని, ఇది సెలబ్రేషన్లు జరుపుకునే సమయం కాదని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు.మంగళవారం లక్నోలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించాల్సి ఉంది. ప్రధాని రాకను దృష్టిలో ఉంచుకుని అఖిలేష్ తాజా ట్వీట్ చేశారు. రైతులను కోల్పోయిన విషాదంలో యూపీ ఉందని, సెలబ్రేషన్లు జరుపుకునేందు ఇదెంత మాత్రం సమయం కాదని అన్నారు
----------
గడిచిన 24 గంటల్లో భారతదేశంలో 18,346 కొత్త కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 209 రోజుల్లో అత్యల్ప రోజువారి కేసులు నేడు నమోదవడం గమనార్హం. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,52,902 ఉండగా.. రికవరీ రేటు ప్రస్తుతం 97.93%గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.