హుజూరాబాద్ లో నిరసన నామినేషన్లు.. కారుకు గండమేనా?
హుజూరాబాద్ ఉప ఎన్నిక నగారా మోగడంతో, రాజీకీయ పార్టీల పరుగులు మొదలయ్యాయి. ముందు నుంచే నువ్వా ... నేనా అన్నవిధంగా పోటా పోటీగా ప్రచారం సాగిస్తున్న తెరాస, బీజేపీ ప్రచారాన్ని మరింత ఉదృతం చేశాయి. హుజూరాబాద్’ను గెలిచి తీరాలని పట్టుమీదున్నఅధికార తెరాస మంత్రి హరీష్ రావు సారధ్యంలో అన్ని స్థాయిలలో సేనలను మొహరించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు అందరిని రంగంలోకి దింపింది.ఇక డబ్బు మూటలు, ‘మందు’ మార్బలం సంగతి అయితే చెప్పనక్కరలేదు. మరో వంక బీజేపీ,పార్టీ అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్’ని ముందు పెట్టి, కమల దళం వెనకనుంచి వెనకనుంచి ప్రచారం సాగిస్తోంది. హుజూరాబాద్’లో పోటీ, రెండు పార్టీల మధ్యకాదు, ఇద్దరి వ్యక్తుల మధ్య అనే విధంగా బీజేపీ ప్రచార వ్యూహాన్ని నడిపిస్తోంది. మరోవంక కాంగ్రెస్ పార్టీ కూడ ఒకటి రెండు రోజుల్లో అభ్యర్ధిని ఖరారు చేసి, కదన రంగంలోకి దూకేందుకు సిద్దమవుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏమిటన్నది, ఇంకా స్పషం కాలేదు. రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగతున్న తొలి ఎన్నిక కావడంతో హుజూరాబాద్’లో పోటీకి సంబంధించి పార్టీలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ప్రధాన పార్టీల బలాలు బలహీనతలు,ప్రచార, ఎన్నికల వ్యూహాలు ఎలా ఉన్నా, ఈ ఎన్నికలలో తెలంగాణ ఉద్యమం నుంచి, తెరాస వ్యతిరేక అజెండాతో పుట్టిన పార్టీలు, అదే విధంగా ఇటీవల కాలంలో, వైఎస్సార్ కుమార్తె, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సోదరి షర్మిలా పెట్టిన వైఎస్సార్టీపీ, దళిత బహుజన వాదంతో రాజకీయ అరంగేట్రం చేసి, బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి, ప్రవీణ్ కుమార్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటాయి అనేది కూడా చాలా కీలకంగామారింది. అయితే, ఇందులో చాలా వరకు పార్టీలు, ఉద్యమ సంస్థలు పార్టీ (బీజేపీ) తో సంబంధం లేకుండా ఉద్యమ స్పూర్తితో ఈటల రాజేందర్’కు ప్రత్యక్ష, పరోక్ష మద్దతు ఇచ్చే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు బహ్విస్తున్నారు. ఈటల బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయడం ఇష్టం లేకున్నా, శతృవు, శతృవు మిత్రుడు అనే నానుడి ఆధారంగా, తెరాసను ఓడించే సత్తా ఉన్నఈటలకు మద్దతు ఇవ్వాలని మెజారిటీ ప్రజాసంఘాలు ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చాయని, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అయితే, కాంగ్రెస్ అభ్యర్ధి, కాంగ్రెస్ వ్యూహం స్పష్టమైతేనే కానీ, ఎవరు ఎటు అనేది స్పష్టం కాదని అంటున్నారు.
తెలంగాణ ఉద్యమంతో గానీ, తెలంగాణ ప్రజల సెంటిమెంట్స్’తో కానీ సంబంధం లేకుండా, వైఎస్సార్ సంక్షేమ పథకాలు, రాజన్న పాలన ప్రచార అస్త్రాలుగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల హుజూరాబాద్’లో పోటీ చేయడం లేదు. అయితే, ఆమె తాను సాగిస్తున్న నిరుద్యోగ పోరాటంలో భాగంగా, నిరుద్యోగ యువకులను బరిలో దించుతున్నారు. అయితే, ఆమె లక్ష్యం నిరుద్యోగులను గెలిపించడం కాదు, నిరుద్యోగుల నిరసనను తెలియ చేసేందుకు, ఎంతమంది నిరుద్యోగ యువకులు ముందు కొస్తే అంతమందికి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని షర్మిల ప్రకటించారు. కాగా, తాజాగా ఉప ఎన్నిక షెడ్యూలు ఖరారైన నేపధ్యంలో, నామినేషన్లు వేయడానికి ఆసక్తి ఉన్న నిరుద్యోగులు, విద్యార్థి నాయకులు, యువకులు, ఇతరులకు సహకరిస్తామని వైఎస్‌ఆర్‌టీపీ వెల్లడించింది. ఈ మేరకు పార్టీ నామినేషన్ల కో ఆర్డినేటర్ బొమ్మ భాస్కర్ రెడ్డి మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
అయితే నిరుద్యోగ యువకులు పెద్ద సంఘ్యలో బరిలో దిగితే, అది పరోక్షంగా అధికార తెరాసకే మేలు చేస్తుందని,విశ్లేషకులు అంటున్నారు. నిజానికే ఉప ఎన్నికల్లో ఒక్క నిరుద్యోగ యువకులు మాత్రమే కాదు, కాంట్రాక్టు లెక్చరర్స్, ఇతర వృత్తి సంఘాలు కూడా పెద్ద సంఖ్యలో నిరశన నామినేషన్లకు సిద్ధ మవుతున్నారు. ఈ నేపధ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక మరింత ఆసక్తిని రేకెత్తిస్తోందని అంటున్నారు.