పూల పండుగ సంబరాలు షురూ.. బతుకమ్మ ఎందుకు చేస్తారో తెలుసా?
భారతదేశం అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు పెట్టినిల్లు. మన దేశంలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది. అయితే ఆ పండగల్లో కేవలం తెలంగాణలో మాత్రమే జరుపుకునే బతకుమ్మ ప్రత్యేకమైనది. బతుకమ్మ పండగ ఇక్కడి వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూలు పేరుతో ఎంగిలి కాని, వాడని పూలతో పేర్చిన బతుకమ్మ దుర్గాష్టమి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ప్రకృతిలో లభించే ప్రతీ పూవును ఏరికోరి బతుకమ్మలను తయారు చేయడం, వాటిని గృహలు, వీధులు, ఆలయాల్లో నిల్పి దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ, ఆటలు ఆడడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
గుమ్మడి పూలలోని పసుపు వర్ణపు దుద్దును గౌరీ దేవిగా భావించి అందులో పసుపు గౌరమ్మను నిల్పి సుందరంగా ముస్తాబు చేసిన బతుకమ్మ చుట్టూ చిన్నా పెద్ద తేడా లేకుండా మహిళలు, ఆడ పిల్లలు బతుకమ్మ ఆడుతారు. తుమ్మెదా, రామచిలుక, రాచగుమ్మడి, చెలియా, ఉయ్యాల, కోల్, వరలో, కోయిలా, సందమామ వంటి వంత పదాలను ఉపయోగిస్తూ పాడే పాటలు ప్రతి ఒక్కరిని పరవశింపజేస్తాయి. ఒక స్త్రీ పాట పాడగా మిగిలిన వాళ్ళు వంత పాడటం దీని ప్రత్యేకత.
ఈ బతుకమ్మ పాటలలో పురాణ, ఇతిహాస కథలు మొదలు తెలంగాణ వీరుల కథల వరకు వర్తమాన అంశాలకు చెందిన విషయాలను పాటల రూపంలో పాడుతూ ఉంటారు. గోధుమలు, పెసళ్ళు, బియ్యం, మినుములు, తదితర ధాన్యాలతో తయారు చేసిన సత్తు (పిండి వంటలను) ప్రసాదంగా స్వీకరిస్తారు.
రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి..
బతుకమ్మ పండుగ కథ..
తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యలు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతంచేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. అప్పటి వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందరచోళా కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళానే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది.
అతని కుమారుడైన రాజేంద్రచోళ సత్యాస్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. క్రీస్తు శకం 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బ్రిహదేశ్వరాలయంలో ప్రతిష్టించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బ్రిహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళ రాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి, బ్రిహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది. బృహదమ్మ(పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణవాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణవాసులు జరుపుకుంటున్నారు.
బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలాగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు. బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు "బొడ్డెమ్మ" (మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ) ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగ జానపదులు తమసంతు దక్కాలని అమ్మదేవతలకు మొక్కుకునే ఆనవాయితీ పురాతనమైనది. పుట్టిన పిల్లలను చల్లగా చూడమని అమ్మదేవతల ముందు కట్టిన ముడుపులు, మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది పుట్టినపిల్లలు పుట్టినట్లు చనిపోతుంటే, పిల్లలు పుట్టిన వెంటనే పెంట మీద వేసి తెచ్చుకుని 'పెంటమ్మ లేదా పెంటయ్య' అని పేరు పెట్టుకుంటారు. మరి కొందరు పుట్టినపిల్లల్ని ఎవరికైనా ఇచ్చి 'బిచ్చంగా' తిరిగియ్యమని కోరుకుంటారు. అట్లా తీసుకున్న పిల్లలకు 'భిక్షపతి, భిక్షమ్మ' లని పేరు పెట్టుకుంటారు. వాళ్ళే బుచ్చపతి, బుచ్చమ్మలుగా పిలువబడుతుంటారు. ఇట్లాంటి సందర్భాల్లోనే బతుకనిపిల్ల బారెడనే సామెతలు పుట్టాయి. పిల్లల్ని బతికించమనే వేడుకునే దేవతల్లో మన బతుకమ్మ ఒక దేవత. ఆ దేవత వరాన బతికితే బతుకమ్మ, బతుకయ్యలని పేర్లు పెట్టుకుంటారు.
పూలపండుగ బతుకమ్మ ఎంగిలిపూలతో మొదలుపెట్టి సద్దులబతుకమ్మతో ముగిసిపోతుంది. బొడ్డెమ్మపండుగ నాడు 'బొడ్డెమ్మ బొడ్డెమ్మా వలలో, బిడ్డాలెందారే.. వలలో' అని పాడే పాట సంతానం గురించే కదా. నాటి రోజుల్లో నీళ్ళాడే(ప్రసవ)సమయాల్లో శిశుమరణాలు జాస్తిగా వుండేవి. నీటిరేవులే ఆనాటి తల్లులకు ప్రసూతి స్థలాలు. నీళ్ళల్లో ప్రసవించే సమయంలో తల్లులు తమసంతు బతికినందుకు ప్రతీకగా నీటివారనపెరిగే తంగేడు, గునుగు పూలముద్దలను నిమజ్జనం చేసివుంటారు. ఆ తల్లుల ఆచారమే బతుకమ్మపండుగగా మారి వుంటుంది. ఇది తెలంగాణా ప్రాంతానికే చెందడం మనగొప్పసంస్కృతికి సాక్ష్యం. ఎవ్వరికన్న ఐదారుగురు కన్నా ఎక్కువమంది పిల్లలుంటే ఆ తల్లిని గౌరవించేవాళ్ళు. మానవజాతి పిల్లలవల్లనే కదా ఇన్ని వేలయేండ్లుగా మనగలిగింది. అందుకే తల్లికంత గౌరవం. అమ్మతనం మీద భక్తి. ఆ భక్తే అమ్మదేవతలను కల్పించింది. పూజించింది.
అమ్మదేవతల పూజల్లో ఒక ఆరాధనా రూపమే మన బతుకమ్మ. జనపదుల ఆచారాలు చాలా ప్రాచీనమైనవి. అవి వేలయేండ్ల పూర్వపువి. ఒక్కో జాతికి, ప్రాంతానికి పరిమితమైనవి. బతుకమ్మ మనకు, మన తెలంగాణాకే పరిమితమైంది. బతుకమ్మ ఆటలో గుస్సాడి నృత్యం, చప్పట్లలో జానపదుల పాట, ఆటల కలయిక మనమూలాలను ఎరుకపరిచే మంచి సాంప్రదాయం. బతుకమ్మ అచ్చతెలుగు మాట. దాన్ని సంస్కృతీకరించి పౌరాణికం చెయ్యొద్దు. తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు 9 రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.
పెత్రామస నుంచి సద్దుల బతకుమ్మ వరకు..
ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
నానే బియ్యం బతుకమ్మ నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
అట్ల బతుకమ్మ అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు..
అలిగిన బతుకమ్మ ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.
వేపకాయల బతుకమ్మ బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
వెన్నముద్దల బతుకమ్మ నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
సద్దుల బతుకమ్మ ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం.
బతుకమ్మ సంబరాలు తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు , శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం వాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. చివరి రోజు బతుకమ్మ (సద్దుల బతుకమ్మ) పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడు, గునుగు మొదలగు పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళపాదీ కూర్చుని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునుగు పూలు, తంగెడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి.