పర్యాటకులను మోసం చేస్తే జైలుకే.. కొత్త చట్టానికి ఆమోదం
posted on Oct 5, 2021 @ 9:34AM
పర్యాటకుల కోసం కొత్త చట్టం తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ చట్ట ప్రకారం పర్యాటకులను మోసం చేస్తే జైలుకు వెళ్లేలా కఠిన చట్టాలను బిల్లులో పొందు పరిచారు. పర్యాటకులను ఆకర్షించడంతో పాటు వాళ్ల భద్రత కోసమే కొత్త బిల్లును తీసుకొచ్చామని టీఆర్ఎస్ సర్కార్ ప్రకటించింది.
రాష్ట్రాన్ని సందర్శించే పర్యాటకుల భద్రతకు బిల్లులో రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. వీరిని మోసంచేసే వారిపై కఠినచర్యలు తీసుకొనేలా చట్టాన్ని రూపొందించింది. ఈ బిల్లును సోమవారం అసెంబ్లీలో మంత్రి మహమూద్ అలీ ప్రవేశపెట్టగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. పర్యాటకులు, ప్రయాణికులను మోసంచేయడం, దురుసుగా ప్రవర్తించడం, దళారీతనానికి ప్రయత్నించడం వంటి చర్యలను నిరోధించడమే దీని లక్ష్యం.
కొత్త బిల్లు ప్రకారం.. పర్యాటకులను మోసంచేసిన వారికి 10 వేల జరిమానా, ఏడాది జైలు శిక్ష విధిస్తారు. మోసాన్ని ప్రేరేపించిన వారికి ఆరు నెలల జైలు, రూ.5 వేల జరిమానా వేస్తారు. మోసగించేందుకు ప్రయత్నించిన వారికి 3 నెలల జైలు, రూ.2 వేల జరిమానా విధించనున్నట్టు మంత్రి మహమూద్ అలీ తెలిపారు. దీనితోపాటు సీఎం కేసీఆర్ తరపున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రవేశపెట్టిన తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
రాష్ట్రంలో పర్యాటకన అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం ద్వారా గోదావరి నదిలో 160 కిలోమీటర్ల మేర నీరు నిలిచి ఉంటున్నదని.. అద్భుత సుందర దృశం ఆవిష్కృతమవుతున్నదని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటివరకు విద్యుత్తు, వ్యవసాయం, సాగు, తాగునీరు మీద దృష్టి పెట్టడం వల్ల పర్యాటకం, చారిత్రక ప్రదేశాలపై అంతగా దృష్టి పెట్టలేదన్నారు. అన్ని జిల్లాల శాసనసభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాల్లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని పర్యాటక ప్రాంతాలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ప్రతిపాదనలు అందించాలని సూచించారు. వాటన్నింటిపై చర్చించి అభివృద్ధి ప్రణాళికను అమలు చేయడం జరుగుతుందని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో పర్యాటక పరంగా కోటలు, బురుజులు విశిష్ట దేవాలయాలు, ప్రాకృతిక ప్రాంతాలు ఇలా అన్ని ప్రముఖ ప్రాంతాల పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు.