హుజూరాబాద్ కోసం అబద్ధాలా? త్వరలో 80వేల ఉద్యోగాలు..
posted on Oct 5, 2021 @ 5:25PM
దళితబంధు హుజూరాబాద్ కోసం తీసుకొచ్చింది కాదని.. 1986లోనే ఈ పథకం పురుడుపోసుకుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అన్నారు. ‘‘వచ్చే ఏడాది మార్చి లోపు 100 నియోజకవర్గాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తాం. పథకం అమలుకు ఇప్పుడు దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చు చేస్తాం. రూ.10 లక్షలతో ఎక్కడైనా, ఎన్ని వ్యాపారాలైనా చేసుకోవచ్చు. నిధులతో పలానా పని చేయాలని ప్రభుత్వం బలవంతం చేయదు. లబ్ధిదారులు బృందంగా ఏర్పడి పెద్ద పరిశ్రమ కూడా పెట్టొచ్చు. వచ్చే బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తాం. ఆ నిధులతో నియోజకవర్గానికి 2వేల మందికి దళిత బంధు అందజేస్తాం. ఒక్క హుజూరాబాద్ ఎన్నిక కోసం అబద్ధాలు అడతామా? అని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.
దళితులకు 3ఎకరాల భూమి ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ‘‘ప్రతి ఎస్సీ కుటుంబానికి కనీసం 3 ఎకరాలు ఉండాలని చెప్పాను. దళితులకు ఎకరం ఉంటే రెండు ఎకరాలు కొనిస్తామని చెప్పాం. ఒకటిన్నర ఎకరం ఉంటే మరో ఒకటిన్నర ఇస్తామన్నాం. 75 లక్షల మంది దళితులుంటే.. 13 లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉంది’’ అని కేసీఆర్ అన్నారు.
ప్రభుత్వ లైసెన్సు అవసరమయ్యే వ్యాపారాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులకు దళితబంధు ఇచ్చాం. ఎస్సీ ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఈ పథకం వర్తింపజేస్తాం. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ కుటుంబాలకు దళితబంధు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ పెంచాలి. కుల గణన జనాభా లెక్కలు జరగాల్సిందే. ఇందుకోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఎన్నోసార్లు తీర్మానం చేసి పంపించాం. ఎన్ని తీర్మానాలు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి.
ఇక.. 2, 3 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. దాదాపు 80వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశముందని చెప్పారు. ‘‘రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. రేపు కేంద్రాన్ని శాసించే అవకాశం టీఆర్ఎస్‌కు రావొచ్చు. కేంద్రంలో టీఆర్ఎస్‌కు పాత్ర దొరికే అవకాశం కావచ్చు. ప్రధానికి మారెడు కాకుంటే బారెడు దరఖాస్తులు ఇస్తాం. కేంద్ర సహకరిస్తే ఇంకా బలంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తాం. ఇప్పటికే 1.35లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. జోన్ల ఆమోదం కోసం పంపితే విపరీతమైన జాప్యం జరిగింది. 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా నిబంధన పెట్టాం. దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతాం. జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ఉటుంది. కొత్త జిల్లాల ప్రకారం నవోదయ పాఠశాలలు అడిగితే ఇవ్వట్లేదు. బీజేపీ ఎంపీలు నవోదయ పాఠశాలలు మంజూరు చేయించాలన్నారు కేసీఆర్.