పండోరా పేపర్స్ ప్రకంపణలు.. జగన్‌రెడ్డి పేరు ఉందా?
posted on Oct 4, 2021 @ 2:06PM
పన్ను ఎగవేశారు. విదేశాల్లో షెల్ కంపెనీలు, ట్రస్ట్‌లు స్థాపించారు. వేల, లక్షల కోట్ల నల్లధనం దాచేశారు. ఆ దేశం ఈ దేశం అనే తేడా లేదు. 91 దేశాలకు చెందిన వందలాది మంది ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు.. ఇలా రకరకాల పెద్ద మనుషుల బాగోతం ఇది. ఇందులో 380 మంది భారతీయులూ ఉన్నారు. అందులో జగన్మోహన్‌రెడ్డి పేరు ఉందా? లేదా? అనేది ఆసక్తికరం. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఆ ఆర్థిక గూడుపుఠానీ అంతా పండోరా పేపర్ లీక్స్‌తో బట్టబయటైంది. గతంలో పనామా లీక్స్.. ఇప్పుడు పండోరా లీక్స్.. యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు చేస్తూ మరోసారి రహస్య పత్రాలు బహిర్గతమయ్యాయి. ఐదేళ్ల కిందట ‘పనామా పేపర్ల’ ప్రకంపణల మాదిరే.. ‘పండోరా పేపర్ల’ పేరుతో ఆదివారం రాత్రి ఎంతోమంది ప్రముఖుల బాగోతాలను వెలుగులోకి తెచ్చాయి. తక్కువ పన్ను ఉన్న దేశాలకు పెద్దఎత్తున తరలించిన రహస్య సంపద, అక్రమ పెట్టుబడుల వివరాలు వీటిలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్- ఐసీఐజే ఈ వివరాలను విడుదల చేసింది. 117 దేశాల్లోని 150కిపైగా వార్తాసంస్థల్లోని 600 మంది విలేకరులు ఈ ఆపరేషన్‌లో భాగస్వాములయ్యారు. ఇది అతిపెద్ద పరిశోధనాత్మక విశ్లేషణగా నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కూటమి వేర్వేరు దేశాల్లోని దాదాపు 1.20 కోట్ల ఆర్థిక లావాదేవీల పత్రాలను పరిశీలించి, గుట్టు రట్టు చేసింది.
పండోరా పేపర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 35 మంది దేశాధినేతలు, ప్రధానులు, మాజీలు ఉన్నారు. మరో 336 మంది అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు, మాజీలు, క్రీడాకారులు, వ్యాపార దిగ్గజాలు ఉన్నారు. భారత్‌లో మొత్తం 380 మంది దాకా పండోరా పేపర్స్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిశోధనలో పాల్గొన్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్.. ఇండియాకు చెందిన 60 మంది జాబితా సంపాదించింది. వారిలో ఆరుగురు దిగ్గజ రాజకీయ నాయకులు కాగా.. మిగతా వారు మాజీ ఎంపీలు. ఇప్పటి వరకూ బయటకు వచ్చిన జాబితాలో ఉన్న వారిలో.. అనిల్ అంబానీ, సచిన్ టెండూల్కర్, బయోకాన్ మజుందర్‌షా భర్త ఉన్నట్లు తెలిసింది. రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
పనామా, దుబాయ్, మొనాకో, స్విట్జర్లాండ్, కేమన్ ఐలాండ్స్ వంటి చోట్ల గోప్యంగా ఆర్థిక లావాదేవీలను సాగించారు. బ్రిటన్‌లోని ఒక కోర్టులో దివాలా ప్రకటించిన భారత పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి 18 ‘అసెట్ హోల్డింగ్ ఆఫ్‌షోర్ కంపెనీ’లు ఉన్నాయి. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ భారత్ వీడటానికి నెల ముందు ఆయన సోదరి ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. బయోకాన్ ప్రమోటర్ కిరణ్ మజుందార్ షా భర్త.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అభియోగాలపై సెబీ నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఒక వ్యక్తితో కలిసి ట్రస్టును నెలకొల్పారు.
2016లో పనామా పత్రాలు బహిర్గతమయ్యాక ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు జాగ్రత్త పడినట్లు తాజా పత్రాలు చెబుతున్నాయి. అనేక మంది భారతీయులు, ఎన్నారైలూ విదేశాల్లోని తమ సంపదను పునర్‌వ్యవస్థీకరించారు. క్రికెటర్ సచిన్ తెందుల్కర్.. పనామా పత్రాలు లీకైన మూడు నెలల తర్వాత బ్రిటిష్ వర్జిన్ దీవుల్లోని తన సంస్థను రద్దు చేసుకున్నారు. తెందుల్కర్ తరఫు న్యాయవాది దీనిపై స్పందిస్తూ ఆయన పెట్టుబడులన్నీ చట్టబద్ధమైనవేనని, పన్ను సంస్థలకు అన్ని వివరాలూ సమర్పించారని స్పష్టం చేశారు.
గతంలో బయటికొచ్చిన పనామా పేపర్లలో.. పన్ను ఎగవేతే లక్ష్యంగా వ్యక్తులు విదేశాల్లో ఏర్పాటుచేసిన కంపెనీల గురించి ఉంది. కార్పొరేట్ సంస్థలు సృష్టించిన దొంగ కంపెనీల బాగోతం పారడైజ్ పేపర్లలో బయటపడింది. అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అలాంటి డొల్ల కంపెనీల ఏర్పాటును అడ్డుకునేలా కొన్ని దేశాలు నిబంధనలను కఠినతరం చేశాయి. ట్రస్టుల రూపాల్లో ఎలా పన్ను ఎగవేత జరుగుతోందన్నది పండోరా పేపర్లతో వెలుగులోకి వచ్చింది.
ఆఫ్‌షోర్ కంపెనీలు, ట్రస్టుల స్థాపనకు ప్రపంచంలోని ఏ దేశం వారికైనా సేవలందించేందుకు 14 అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు పనిచేస్తున్నాయని పండోరా పేపర్స్ చెబుతున్నాయి. పన్ను ఎగవేతకు అనుకూలమైన దేశాల్లో ఈ 14 సంస్థలు.. 29వేలకు పైగా ఆఫ్-ద-షెల్ఫ్ కంపెనీలను, ప్రైవేటు ట్రస్టులను ఏర్పాటు చేసి.. ఆయా దేశాల్లో అక్రమార్కులు, పన్ను ఎగవేతదారులకు సేవలందిస్తున్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యున్నత రాజకీయ నాయకులైన 336 మందికి 956 ఆఫ్‌షోర్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో మూడింట రెండు వంతుల కంపెనీలు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లోనే ఉన్నాయి.
అయితే, షెల్ కంపెనీలు, సూట్‌కేసు సంస్థలు, విదేశాలకు నిధులు మళ్లింపు తదితర వార్తలు ఎప్పుడు వినిపించినా.. తెలుగు ప్రజల చూపంతా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వైపే మళ్లుతుంది. ఎందుకంటే.. గతంలో షెల్ కంపెనీలు, సూట్‌కేసు కంపెనీలనే కాన్సెప్ట్‌ను తెలుగువారికి పరిచయం చేసింది ఏ1, ఏ2లైన జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలే కాబట్టి.. ఇప్పుడూ పండోరా పేపర్స్‌లో వారి పేరు ఉందా అని గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కొందరి పేర్లే బయటకు వచ్చినా.. రాబోయే రోజుల్లో మరింత సమాచారం వెలుగులోకి వస్తుందని చెబుతుండటంతో.. పండోరా పేపర్స్‌లో జగన్‌రెడ్డి పేరుపై తెలుగునాట ఉత్కంఠ నెలకొంది.