ప్రియాంక అరెస్టుతో యూపీలో హై టెన్షన్! దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు..
posted on Oct 4, 2021 @ 5:37PM
ఉత్తర్ ప్రదేశ్ లో హై టెన్షన్ కనిపిస్తోంది. రైతుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో విపక్షాలు తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్నాయి. కాంగ్రెస్ యువ నేత ప్రియాంక గాంధీ పోరాటంతో యూపీ పోలీసులకు చుక్కలు కనిపిస్తున్నా. ఆదివారం మొదలైన హింసాత్మక ఘటనలు సోమవారం మరింత ఉద్రిక్తతలకు దారి తీశాయి. కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఆ పార్టీ యూపీ ఇంచార్జీ ప్రియాంకా గాంధీ వాద్రాను పోలీసులు అరెస్ట్ చేయడం మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. తీవ్ర వాగ్వాదం నేపథ్యంలో ప్రియాంకా గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్‌కు ముందు ప్రియాంక గాంధీపై పోలీసులు చేయి చేసుకున్నారన్న వాదనలూ కలకలం రేపుతున్నాయి. పోలీసుల తీరుపై నిరసన తెలిపిన ప్రియాంకా గాంధీ.. తనను ఉంచిన జైలు గదిని స్వయంగా చీపుపు పట్టి ఊడ్చిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ వీడియోలను చూసిన కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డెక్కుతున్నారు.
ఆదివారం ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ భేరీలో పర్యటించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనలో రైతులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో మంత్రి కారు రోడ్డు పక్కనే ఆందోళనలు చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు దుర్మరణం చెందడంతో లఖీంపూర్ ఖేరి జిల్లాలో హింసాకాండ ప్రారంభమైందని అక్కడి రైతులు చెబుతున్నారు. ఈ దుర్ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో వాహనాలు దగ్ధం చేయడం వంటి హింసాత్మక దృశ్యాలు కనిపించాయి.
ఈ ఘటనలో చనిపోయిన బాధిత రైతుల కుటుంబాలను పరామర్శించడానికి ప్రియాంక గాంధీ సోమవారం బయలుదేరారు. సీతాపూర్ రాగానే అక్కడ పోలీసులు ఆమె కాన్వాయ్ ను అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులపై ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. “మీరు చంపిన వ్యక్తులు, మీరు సమర్థిస్తున్న ప్రభుత్వం కంటే నేను ముఖ్యం కాదు కదా! మీరు నాకు లీగల్ వారెంట్, లీగల్ ప్రాతిపదిక ఇచ్చి అడ్డుకోండి. లేదంటే నేను ఇక్కడి నుంచి కదలను. మీరు నన్ను తాకడానికి కూడా వీలు లేదు” అని సీతాపూర్‌లో ఆమె పోలీసులపై ధ్వజమెత్తారు. పక్కకి జరగాలంటూ ఒక మహిళా పోలీసు ఆమెను అభ్యర్థించిన్నట్లు సమాచారం. అదే సమయంలో ప్రియాంక గాంధీ వాద్రాను సీతాపూర్ పోలీస్ లైన్‌కు తీసుకువెళుతున్నారని.. ప్రజలు అక్కడికి రావాలని యూపీ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ ఒక వీడియోను ట్వీట్ చేసింది. వారెంట్ లేదా లీగల్ ఆర్డర్ ఇచ్చి తనని అడ్డుకోవాలంటూ ఆమె పోలీసులకు తెలిపారు. ఒకవేళ మీరు నన్ను ఆ కారులో ఎక్కించుకుంటే.. మీరు నన్ను కిడ్నాప్ చేసినట్లు కేసు ఫైల్ చేస్తానని ఆమె హెచ్చరించారు.
ఈ కేసు అనేది మొత్తం పోలీసులపై కాదు కానీ తనని అడ్డుకునే ఒక్క పోలీస్ పైనే పెడతానని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఆమె పక్కన కాంగ్రెస్ నాయకుడు దీపేందర్ హుడా ఉన్నారు. ప్రియాంక గాంధీ వాద్రాపై ఎలా చేయి చేసుకుంటారని అతడు ఒక పోలీసును ప్రశ్నించారు. ఈ ఉద్రిక్తతలలో ప్రియాంకపై పోలీసులు చెయ్యి చేసుకున్నారా లేదా అనేది స్పష్టంగా తెలియరాలేదు. కానీ హుడా మాట్లాడుతూ.. పోలీసుల భౌతిక దాడి గురించి తాను సాక్ష్యం ఇమివ్వబోతున్నానని.. వారి అరాచకాలు కళ్లారా చూశానని చెప్పారు. ఇంతలో ఒక పోలీస్ అధికారి హుడాని ఒక కారులోకి తరలించే ముందు గట్టిగా తోస్తూ తీసుకెళ్లారు. ఇది చూసి.. “మళ్లీ మొదలెట్టారా.. ఆపండి” అని ప్రియాంక గాంధీ వాద్రా ఆగ్రహం వెళ్లగక్కారు.
ఈ క్రమంలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియాంకా ఒక మహిళతో కూడా మాట్లాడలేని మీరు హుడాని కొడతారా? అంటూ జోక్యం చేసుకున్నారు. అనంతరం హుడాపై దాడి చేయనివ్వకుండా పోలీసుల బృందానికి అడ్డుగా నిలబడ్డారు. వారెంట్ లేదా లీగల్ ఆర్డర్ ఇచ్చి తమని అడ్డుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఇలా ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకోగా.. పోలీసులు ప్రియాంకాను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సమీపంలోని పోలీస్ లైన్‌కు తరలించారు. అక్కడ ఆమెను ఓ గదిలో ఉంచారు. అయితే ఆ గది అపరిశుభ్రంగా ఉన్న వైనాన్ని గ్రహించిన ప్రియాంకా అక్కడే ఉన్న చీపురుని చేతబట్టి గది మొత్తాన్ని శుభ్రంగా ఊడ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన మరుక్షణమే ప్రియాంకా సోదరుడు రాహుల్ గాంధీ ఆమెకె మద్దతుగా ఓ ట్వీట్ చేశారు. “ప్రియాంక.. మీరు వెనక్కి తగ్గరని నాకు తెలుసు.. మీ ధైర్యానికి వారు ఆశ్చర్యపోయారు. న్యాయం కోసం జరిగే ఈ అహింసా పోరాటంలో మనం ఈ దేశ అన్నదాతలు గెలిచేలా చేయగలం” అని రాహుల్ గాంధీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.