దసరాకి జీతాలు వచ్చేనా.. పండుగ గడిచేదెలా!
posted on Oct 5, 2021 @ 10:00AM
ఉద్యోగులంతా ఒకటో తారీఖు కోసం ఎదురు చూస్తుంటారు. ఆ రోజున వచ్చే వేతనం కోసమే వాళ్ల వెయిటింగ్. జీతం రాగానే నెలసరి బడ్జెట్ సెట్ చేసుకుని ఖర్చు చేసేస్తుంటారు. ఒకటో తేదీతో వాళ్ల జీవితాలు అలా ముడిపడి ఉంటాయి. ఈఎమ్ఐలు, నిత్యావసరాల కొనుగోళ్లు ఇతరత్రా పనులన్ని దానిపైనే ఆధారపడి ఉంటాయి. గతంలో ఠంచన్ గా ఒకటో తారీఖే జీతాలు రావడంతో.. ఆ రోజుకే అందరూ అలా సెట్ చేసుకున్నారు. కాని కొన్ని రోజులుగా సీన్ మారిపో.యింది. ఉద్యోగులకు వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.
తెలంగాణ ప్రభుత్వం కొన్ని నెలలుగా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడంతో వేతనాలు ఆలస్యమవుతున్నాయి. కొన్ని సార్లు 15వ తారీఖు వరకు కొందరు ఉద్యోగులకు సాలరీలు అందడం లేదు. గతంలో రాష్ట్రమంతా ఒకేసారి వేతనాలు ఇచ్చేవారు. కాని ప్రస్తుతం జిల్లాకోరోజు... ఇంకా చెప్పాలంటే శాఖల వారీగా ఒక్కోరోజు వేతనాలు జమ చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో తమ వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఉద్యోగులు ఉంటున్నారు. మొదటి వారంలోనే ఈఎమ్ఐలు కట్టాల్సిన వాళ్లు అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.
తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. 10 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. బతుకమ్మ వేడుకలు దసరాకి స్పెషల్. ఆడపడుచులు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మలు పేర్చి ఆడిపాడుతారు. దసరా ఉత్సావాలు ఆరవ తేదీ బుధవారం నుంచి మొదలవుతున్నాయి. కాని ఉద్యోగులకు వేతనాలు మాత్రం ఇంకా అందలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల వేతనాలు ఆలస్యమవుతున్నాయి. ఆగస్టు జీతాన్ని సెప్టెంబరు 6 వరకు చెల్లిస్తూ వచ్చారు. బతుకమ్మతో పాటు దసరా ఉన్నందున కనీసం సెప్టెంబరు వేతనాన్ని అయినా అక్టోబరు 1న లేదా 4న చెల్లిస్తారని ఉద్యోగులు ఆశించారు. కానీ సోమవారం వరకు ఏడు జిల్లాలవారికే అందాయి. మిగితా 27 జిల్లాల వారికి ఎప్పుడు ఇస్తారన్నది క్లారిటీ లేదు. బతుకమ్మ నేపథ్యంలో.. ఈసారి కాస్తముందుగా అయినా జీతాలు వస్తాయని ఆశించిన మహిళా ఉద్యోగులు నిరుత్సాహానికి గురవుతున్నారు. అతిపెద్ద పండుగ అయిన దసరా ముందు కూడా ఆలస్యంగా ఇవ్వడంపై ఉద్యోగ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి ఆర్బీఐకి వెళ్లిన సంకేతాల మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, కరీంనగర్ జిల్లాల ఉద్యోగులకు మాత్రమే సోమవారం వేతనాలు, పెన్షన్లు జమయ్యాయి. మిగతా 26 జిల్లాల వారికి ఎప్పుడు అందుతాయో, ఏ జిల్లావారికి ముందుగా అందుతాయో ఇంకా స్పష్టత లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర రాబడి పెరిగినందున ఈసారైనా 1వ తేదీన చెల్లిస్తారని అనుకుంటే ఎందుకు చెల్లించడం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పెళ్లిళ్లు, ఇళ్లు, స్థలాల కొనుగోలు కోసం ఉద్యోగులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటారని, వాటికి నెల వాయిదాలు కట్టాల్సి ఉంటుందని అంటున్నారు. కొంతమంది పిల్లలకు ఫీజులు చెల్లిస్తుంటారని, అద్దె ఇళ్లలో ఉండేవారికి మరీ ఇబ్బందికరంగా మారిందన్నారు. ఇలాంటివాటికి వేతనాలపైనే భరోసా ఉంచుతామని.. కానీ అవి ఎప్పుడు చేతికందుతాయో తెలియని అయోమయం నెలకొందని ఉద్యోగులు వాపోతున్నారు.
30 ఏళ్లుగా ఒకటో తేదీన ప్రభుత్వాలు వేతనాలు చెల్లిస్తూ వచ్చాయని, ఇప్పుడే విధానం మారిందని ఉద్యోగులు అంటున్నారు. ఈ విషయంలో ఉద్యోగ సంఘాల నేతలు పెదవి విప్పడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంతో వివాదం ఎందుకన్న ధోరణితో తప్పించుకుంటున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వారి కారణంగా ప్రభుత్వం కూడా జీతాలు ఆలస్యంగా మంజూరును తీవ్రంగా తీసుకోవడం లేదని తెలిపారు. దసరాకు దుస్తులు, ఇతర వస్తువులు కొనాల్సి ఉంటుందని కొందరు వివరిస్తున్నారు. పెద్ద పండుగ ముందైనా వేతనాలను సకాలంలో చెల్లించకపోవడం దురదృష్టమని మండిపడుతున్నారు.