ఒక్క ఓటు ఎక్కువొచ్చినా రాజీనామా... రేవంత్ కు ఎమ్మెల్యే గండ్ర సవాల్ 

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక నామినేషన్లు మొదలు కావడంతో రాజకీయ వేడి పెరిగిపోయింది. పార్టీలు దూకుడు పెంచాయి. గురువారం భూపాలపల్లిలో జరిగిన సభలో టీఆర్ఎస్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి. రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చిన ఓట్ల కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి. తన  భార్య జడ్పీ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తుందని చెప్పారు. తమ జీవితం ప్రజా సేవకే అంకితమన్న గండ్ర.. తన సవాల్ ను ధమ్ముంటే రేవంత్ రెడ్డి స్వీకరించాలని సవాల్ చేశారు. పొద్దున్న లేస్తే ఏసీబీ కోర్టులో నాంపల్లి కోర్టులో ఉండే రేవంత్ రెడ్డి తనపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి.  చిలుక పలుకులు పలుకుతున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ పట్టుకుని దండయాత్ర చేసిన సంగతి తెలంగాణ ప్రజలెవరు మర్చిపోలేదన్నారు గండ్ర, రేవంత్ కు రైఫీల్ రెడ్డి గా కూడా నామకరణం చేయడం జరిగిందన్నారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. ఆమెను బలి దేవత అని రేవంత్ రెడ్డి విమర్శించారని చెప్పారు.  2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 50 లక్షలు పట్టుకుని ఒక్క MLA దగ్గరికి బేర సారాలకు పోయి అడ్డంగా దొరికిన గజ దొంగ రేవంత్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే గండ్ర. అడ్డంగా దొరికిన దొంగ తనను అమ్ముడుపోయాడని విమర్శించడం సిగ్గుచేటుగా ఉందన్నారు.  మిస్టర్ రేవంత్ ఓపెన్ చాలెంజ్ చేస్తున్నా.. త్వరలో  జరుగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కి గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన నా MLA పదవికి,నా భార్య జడ్పీ చైర్పర్సన్ పదవి కి రాజీనామా చేసి మా రాజకీయ జీవితానికి స్వస్తి పలుకుతా అంటూ రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ చేశారు భూపాపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి. 

టాప్ న్యూస్ @ 7PM

ఏపీలో డ్రగ్స్ ఛాలెంజ్ కాకపుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ అక్రమరవాణాపై వైసీపీ, టీడీపీ నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, పలువురు నేతలు హైదరాబాద్ రామంతపూర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వచ్చారు. డ్రగ్స్ పరీక్షకు రావాలంటూ వైసీపీ ప్రజా ప్రతినిధులకు ఏపీ టీడీపీ నేతలు సవాల్ విసిరారు. డ్రగ్ టెస్టుకు రాకుండా వైసీపీ నేతలు తోకముడిచారని ఎద్దేవా చేశారు. ----------- టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుపై నమోదైన అట్రాసిటీ కేసులో తదనంతర చర్యలు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అరెస్ట్‌, ఇతర తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఒకే అంశంపై ఒకటి కంటే ఎక్కువ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంపై సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని న్యాయవాది వీవీ సతీష్‌ తెలిపారు. న్యాయవాది సతీష్‌ వాదనలతో కోర్టు ఏకీభవించింది.  --------- జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ లేవనెత్తిన అంశాలకు సీఎం జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగడం దారుణమని ఆయన మండిపడ్డారు. జనసేనతో కలిసి బీజేపీ ప్రయాణం సాగుతోందని, బద్వేల్ ఉపఎన్నికలపై రెండు పార్టీ కలిసి ముందుకు వెళ్తాయని మాధవ్ చెప్పారు. --------- బద్వేల్‌ ఉపఎన్నికలో జనసేన ఎవరితో కలిసినా తమకు నష్టం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.  జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమదానంపై స్పందించాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. పవన్ పబ్లిసిటీ పోరాటాలు మానుకోవాలని సూచించారు. యాక్షన్ అనగానే చేయడానికి ఇది సినిమా కాదని ఎద్దేవాచేశారు. గోతులు పూడ్చి ఫొటోలుదిగే ఆందోళనల వల్ల ప్రయోజనం లేదని తప్పుబట్టారు -------- టిడ్కో ఇళ్ల కేటాయింపు అంశం విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశాన్ని కుదిపేసింది. రెండున్నరేళ్లయినా ఇంకా ఇళ్లు కేటాయించని అంశాన్ని టీడీపీ కార్పొరేటర్లు ప్రస్తావించడం, దీనిపై దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు బూతులు మాట్లాడటంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది. మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 202 అంశాలతో అజెండా ప్రవేశపెట్టారు -------- ఏపీ రాష్ట్రంలో వైసీపీ, జనసేన పార్టీల మధ్య ఇటీవల బూతుల పురాణం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు. ఈ రెండు పార్టీలను ఒలంపిక్స్‌లో బూతు ఆటలు ఆడితే, వైసీపీకి స్వర్ణపథకం, జనసేనకి రజత పథకాలు వస్తాయని తులసిరెడ్డి అన్నారు. ప్రజలు ఎన్నో సమస్యలతో అల్లాడుతుంటే.. ఈ రెండు పార్టీల నాయకులు పోటీ పడి బూతులు తిట్టుకోవడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు ------ హరితహారం పై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. హరితహారం మరింత సమర్థవంతంగా నిర్వహణకు హరిత నిధి ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పారు. పచ్చదనం పెంపు పట్ల ప్రతీ ఒక్కరు తమ బాధ్యత, పాత్ర పోషించేలా హరిత నిధి ఉపయోగపడుతుంద్ననారు. హరిత నిధికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల జీతాల నుంచి నెలకు రూ. 500, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ప్రతీ నెలా 100 రూపాయల విరాళం ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి. --------- నల్గొండ జిల్లా చిట్యాలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వచ్చారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుపడడంతో ఇరు పార్టీల శ్రేణులు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ----- పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీని కూడా వీడుతున్నట్లు ప్రకటించారు కెప్టెన్ అమరీందర్ సింగ్. అయితే ఆయన భార్య మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పటియాలా ఎంపీగా ఉన్న ప్రెణీత్ కౌర్‌ కూడా పార్టీ వీడతారా అనే అనే ప్రశ్నలు అనేకం వచ్చాయి. అయితే తాను కాంగ్రెస్ పార్టీని వీడనని, పార్టీలోనే కొనసాగుతానని కౌర్ స్పష్టం చేశారు. ------- టాలీవుడ్ దివంగత హాస్యనటులు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అల్లు రామలింగయ్య  అల్లుడు, కేంద్రమాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మంత్రులు ఘంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ , యం.పీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు. ------

గుత్తాకు మరో ఎదురు దెబ్బ.. ఆయన ఖేల్ ఖతమేనా? 

తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, కమ్యూనిస్ట్ పార్టీ మొదలు, తెరాస వరకు ఆయన  ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో క్రియాశీలక పాత్రను పోషించారు. నల్గొండ లోక్ సభ నియోజక వర్గం నుంచి 2004లో టీడీపీ టికెట్ పైన, 2009 కాంగ్రెస్ టికెట్ మీద పోటీచేసి, రెండు సార్లూ గెలిచారు. ఆ తర్వాత 2016లో కాంగ్రెస్ పార్టీని వదిలి తెరాసలో చేరారు. 2018 ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సీనియారిటీ గుర్తించారు. గుత్తాను రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు. 2019లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.ఆవెంటనే కొద్ది రోజులకే  (2019 సెప్టెంబరు 11న) శాసనమండలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం  2021, జూన్ 3న ముగిసింది. నిజానికి, ఈ పాటికి ఎప్పుడోనే ఆయన మళ్ళీ ఎన్నిక కావలసింది. కానీ, కొవిడ్ కారణంగా మండలి ఎన్నికలు వాయిదా పడడంతో గుత్తా ప్రస్తుతానికి ఏమీ కాకుండా, ఏమీలేకుండా, మాజీగానే మిగిలి పోయారు. అడపా తడపా కేంద్ర ప్రభిత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని, పనిలో పనిగా రాష్ట్ర బీజేపీ నాయకులకు విమర్శించి, వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు.  గుత్తాకు ఇప్పుడు మరో కష్టం వచ్చిపడిందని అంటున్నారు. న‌ల్గొండ‌-రంగారెడ్డి జిల్లా రాజకీయాలలో పాడిరైతుల స‌మాఖ్య  డైరీ  ప్ర‌భావం చాలా ప్రధాన పాత్రను పోషిస్తుంది. జిల్లా రాజకీయ నాయకులు డైరీ  సమాఖ్య తొలి రాజకీయ అడుగుగా భావిస్తారు. ప్రతి గ్రామంలో డైరీ సమాఖ్య  సభ్యులు ఉంటారు. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి ఫ్యామిలీకి  డైరీ సమాఖ్యతో విడదీయరాని బంధమే ఉందని అంటారు. ఆయన ఎన్ని పార్టీలు మారినా, ఏ పార్టీలో ఉన్నా డైరీ అధ్యక్ష పదవి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు గుత్తా గుప్పిట్లోనే ఉంది. గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి సోద‌రుడు గుత్తా జితేంద‌ర్ రెడ్డే సుదీర్ఘ కాలంగా డైరీ  చైర్మ‌న్ గా చక్రం తిప్పుతున్నారు. అయితే ఇప్పుడు, జిల్లామంత్రి జ‌గ‌దీష్ రెడ్డి, గుత్తా మంత్రి ఆశలను మొగ్గలోనే తుంచేశారు డైరీ చైర్మ‌న్ ప‌ద‌వి గుత్తా జితేంద‌ర్ రెడ్డికి కాకుండా గంగుల కృష్ణారెడ్డికి దక్కేలా చేశారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ అండ‌దండ‌ల‌తోనే ఇదంతా జ‌రిగింద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఏమటన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారిందని అంటున్నారు.   నిజానికి మంత్రి పదవి ఆశ చూపితేనే గుత్తా తెరాసలో చేరారు. తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే, మంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్సీ పదవి అయినా రెన్యువల్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదని ఆయన తమ అనుచరుల వద్ద ఆందోళన వ్యక్త పరిచినట్లు సామాచారం. ఈనేపధ్యంలో ఆయన మరో మారుపార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ఈ సారి ఏ గూటికి చేరతారు అన్నది ఇంకా స్పష్టం కాలేదు...ఇంతవరకు గుత్తా పద్మ మోపని పార్టీ అయితే ఒకటే ఉంది .. అది బీజేపీ. కానీ, జిల్లా రాజకీయ లెక్కలు  బీజేపీ కంటే, కాంగ్రెస్ పార్టీనే సేఫ్ అని చెపుతున్నాయి. అయితే  అదయినా, ఇదయినా  ఎమ్మెల్సీ ఇష్యూ అటో ఇటో తేలిన తర్వాతనే ... అంతవరకు గప్ చిప్... అంటున్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి అనుచరులు.

రేవంత్‌రెడ్డిని కాద‌ని బీజేపీలోకి తీన్మార్‌ మ‌ల్ల‌న్న‌.. కార‌ణం అదేనా?

చింత‌పండు న‌వీన్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న‌. క్యూ న్యూస్ అధినేత‌. ఒక‌ప్పుడు తెల్లారితే చాలు.. త‌న యూట్యూబ్‌లో కేసీఆర్ స‌ర్కారును కుమ్మేసేవారు. ప‌దునైన మాట‌ల‌తో, ఘాటైన విమ‌ర్శ‌ల‌తో స‌ర్కారుపై చెల‌రేగిపోయేవారు. కొన్ని వారాలుగా మ‌ల్ల‌న్న వాయిస్ లేదు. క్యూ న్యూస్‌లో మున‌ప‌టి జోష్ లేదు. కార‌ణం తెలిసిందే. మ‌ల్ల‌న్న‌పై కేసుల మీద కేసులు పెట్టి.. బెయిల్ మీద బ‌య‌ట‌కు రాకుండా చేసి.. జైల్లోనే మ‌గ్గేలా చేస్తున్నారు. ఆఫ్ ది రికార్డ్ స‌మాచారం ప్ర‌కారం.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కూ మ‌ల్ల‌న్నను జైల్లోనే ఉంచుతార‌ని అంటున్నారు. ఆయ‌న త‌ర‌ఫు లాయ‌ర్ ఉమేశ్‌చంద్ర బెయిల్ కోసం తెగ ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికినీ.. ప్ర‌భుత్వం బ‌లంగా కేసులు మోపి.. సాధ్య‌మైనంత కాలం మ‌ల్ల‌న్న‌ని జైలుకే ప‌రిమితం చేసేలా చేస్తోంది. ఈ విష‌యం ప‌సిగ‌ట్టిన ఆయ‌న‌.. ఇప్పుడు వ్యూహం మార్చారు. ఒంట‌రిగా పోరాడితే ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని.. అధికార ప‌క్షంపై యుద్ధం చేయ‌డానికి త‌నొక్క‌డి బ‌లం స‌రిపోద‌ని ఆల‌స్యంగా గుర్తెరిగారు. అందుకే, త‌న‌కు అండా-దండాగా ఉండేలా జాతీయ పార్టీ ఆశ్ర‌యం కోరుతున్నారు. తీన్మార్ మ‌ల్ల‌న్న ముందు రెండు మూడు పొలిటిక‌ల్ ఆప్ష‌న్స్ ఉన్నాయి. ఒక‌టి.. తానే సొంతంగా పార్టీ పెట్టి.. కేసీఆర్‌పై ఒంట‌రి పోరాటం చేయ‌డం. కానీ, మిగ‌తా ప్ర‌తిప‌క్షాలు సైతం బ‌లంగా ఉన్న ఈ త‌రుణంలో సామాన్యుడైన మ‌ల్ల‌న్న‌కు అది అంత ఈజీ కాదు. పైగా స‌ర్కారు త‌న‌ను అడుగ‌డుగునా టార్గెట్ చేస్తున్న క్ర‌మంలో.. భారీ ఆర్థిక వ‌న‌రులు, కార్య‌క‌ర్త‌ల మ‌ద్ద‌తు లేకుండా పార్టీ స్థాపించి మ‌నుగ‌డ సాధించ‌డం క‌ష్ట సాధ్యం. అందుకే, సొంత పార్టీతో సొంతంగానే ఎద‌గాల‌నే ఆలోచ‌న ఉన్నా.. ప్ర‌స్తుత క్లిష్ట ప‌రిస్థితుల్లో అది వ‌ర్క‌వుట్ కాద‌ని భావించి ఆ ప్ర‌య‌త్నం విర‌మించుకున్నారు. ఇక మ‌ల్ల‌న్న ముందున్న మ‌రో ఆప్ష‌న్.. రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్‌లో చేర‌డం. ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డికి, మ‌ల్ల‌న్న‌కి మంచి సంబంధాలే ఉన్నాయి. ఇన్నాళ్లూ తెర‌వెనుక మ‌ల్ల‌న్న‌కి రేవంత్‌రెడ్డి స‌పోర్ట్ ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయినా, కాంగ్రెస్‌ను ఎంచుకోలేదు మ‌ల్ల‌న్న‌. ఎందుకంటే, వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువే. మోదీ వేవ్ ఇప్ప‌టికీ బాగానే వీస్తోంది కాబ‌ట్టి.. వ‌చ్చే సారి కూడా కేంద్రంలో బీజేపీదే అధికారం అంటున్నారు. ఇక తెలంగాణ‌లో హోరాహోరీ త‌ప్ప‌క‌పోవ‌చ్చు. టీఆర్ఎస్‌-కాంగ్రెస్‌-బీజేపీల ట్ర‌యాంగిల్ వార్‌లో విజ‌యం ఎవ‌రినైనా వ‌రించొచ్చు. ప‌క్కాగా ఈ పార్టీ గెలుస్తుంద‌ని చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరితే.. రాష్ట్రంలో మ‌ళ్లీ టీఆర్ఎస్సే గెలిస్తే..? త‌న‌కు ఇబ్బందులు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. అందుకే, ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా కేంద్రంలో ప‌క్కాగా అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న బీజేపీ అయితే త‌న‌కు సేఫ్‌గా ఉంటుంద‌ని.. అలా అయితే తెలంగాణ‌లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. జాతీయ పార్టీ బీజేపీ సాయంతో సుర‌క్షితంగా ఉండొచ్చ‌నేది మ‌ల్ల‌న్న మ‌త‌ల‌బు అంటున్నారు.  ఇక ప‌లువురు రాష్ట్ర బీజేపీ నేత‌లు మొద‌టి నుంచీ మ‌ల్ల‌న్న‌కి మ‌ద్ద‌తుదారులుగా ఉన్నారు. V6, వెలుగు అధినేత వివేక్ వెంక‌ట‌స్వామి, ఈట‌ల రాజేంద‌ర్‌లు మ‌ల్ల‌న్న‌కి స‌పోర్ట్‌గా నిలిచేవారు. మ‌ల్ల‌న్న జైలుకెళ్లిన‌ప్పుడు వివేక్ ఆయ‌న ఇంటికెళ్లి మ‌రీ కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. ఇక త‌న క్యూ న్యూస్‌లో ఎల్ల‌ప్పుడూ కేసీఆర్ స‌ర్కారును విమ‌ర్శించే మ‌ల్ల‌న్న‌.. కేంద్ర వైఫ‌ల్యాల‌పై ఒక్క‌సారి కూడా ప్ర‌శ్నించిన దాఖ‌లాలు లేవు. అందుకే, బీజేపీవాదులు రెగ్యుల‌ర్‌గా క్యూ న్యూస్‌ను ఫాలో అవుతుంటారు.  అటు.. మ‌ల్ల‌న్న‌కు ఈట‌ల రాజేంద‌ర్ సైతం ఫుల్ క్లోజ్ అంటారు. ఈట‌ల‌ మంత్రిగా ఉన్న‌ప్పుడు.. ప్ర‌భుత్వం, పార్టీకి చెందిన అంత‌ర్గ‌త విష‌యాల‌ను మ‌ల్ల‌న్నకు లీక్ చేసే వార‌ని.. ఆ విష‌యాల ఆధారంగానే క్యూ న్యూస్‌లో స‌ర్కారును ఏకిపారేసే వార‌ని అంటారు. ఇటీవ‌ల‌ మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీగా పోటీ చేసిన‌ప్పుడు సైతం ఈట‌ల రాజేంద‌ర్ ఆయ‌న‌కు ప‌రోక్షంగా, ప్ర‌త్య‌క్షంగా భారీ సాయ‌మే చేశార‌ని చెబుతారు. ప్ర‌భుత్వ సెక్యూరిటీ క‌న్నుగ‌ప్పి మ‌రీ.. మ‌ల్ల‌న్న‌ను ఈట‌ల క‌లిసేవార‌ని అంటారు. ఈట‌ల‌పై కేసీఆర్ వేటు వేయ‌డంలో ఇలాంటి విష‌యాలు కూడా కార‌ణ‌మే. ఈట‌ల‌తో మ‌ల్ల‌న్న‌కు అంత క్లోజ్‌నెస్ ఉంది కాబ‌ట్టే.. ఆయ‌న సల‌హా మేర‌కే.. మ‌ల్ల‌న్న బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.      కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరితే.. సామాన్యుడైన మ‌ల్ల‌న్న ఇక‌పై అస‌మాన్యుడు అవుతారు. కేసుల దూకుడు కాస్త త‌గ్గే ఛాన్స్ ఉంటుంది. బీజేపీ అధిష్టానానికి రాసిన లేఖ‌లో మ‌ల్ల‌న్న భార్య సైతం ఇదే విజ్ఞ‌ప్తి చేశారు. కేసుల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరారు. కేసీఆర్‌ను బ‌లంగా వ్య‌తిరేకించే.. గ‌ట్టిగా గొంతు వినిపించే మ‌ల్ల‌న్న వంటి వారు చేరడం.. తెలంగాణ‌ బీజేపీకి సైతం అద‌న‌పు బ‌ల‌మే. మ‌ల్ల‌న్న‌+బీజేపీ కాంబినేష‌న్‌.. కేసీఆర్‌కు ఇబ్బందిక‌ర‌మే. 

పచ్చదనం కోసం హరిత నిధి.. కేసీఆర్ ప్రకటనతో మొదలైన విరాళాలు 

హరితహారం పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు హరితహారం మరింత సమర్థవంతంగా నిర్వహణకు హరిత నిధి ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పారు. పచ్చదనం పెంపు పట్ల ప్రతీ ఒక్కరు తమ బాధ్యత, పాత్ర పోషించేలా చొరవ అని… తెలంగాణ హరిత నిధి ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు సీఎం కేసీఆర్‌.  హరిత నిధికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల జీతాల నుంచి నెలకు రూ. 500, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ప్రతీ నెలా 100 రూపాయల విరాళం ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి. అలాగే ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి నుంచి నెలకు రూ.25 ఇవ్వాలని తెలిపారు. రిజిస్ట్రేషన్లు, భవనాలు అనుమతులు, వాహన రిజిస్ట్రేషన్ల సమయంలో కొద్ది మొత్తం వసూలు చేయాలని వెల్లడించారు. విద్యార్థుల అడ్మిషన్ల సమయంలో ఒక్కొక్కరికి ఐదు రూపాయలు, అలాగే… స్వచ్ఛందంగా ముందుకు వచ్చే సంస్థలు, వ్యక్తుల నుంచి విరాళాల సేకరణ చేయాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు. హరితనిధిని ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీ సీఎం కేసీఆర్ ప్రకటించిన వెంటనే విరాళాలు మొదలయ్యాయి. తెలంగాణ హరిత నిధి ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్. హరితనిధికి ప్రజా ప్రతినిధులందరూ తమ శక్తి సామర్థ్యాల మేరకు  సహకరించాలని కోరినందుకు ప్రకృతి ప్రేమికుడిగా హర్షిస్తున్నానని చెప్పారు. ప్రకృతి ప్రేమికుడిగా గ్రీన్ ఫండ్ కోసం ప్రతి నెల 5000 విరాళంగా ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు ఎంపీ సంతోష్ కుమార్ 

19 మందిని రే*ప్ చేసిన పోలీస్‌.. సైకో ఉమేశ్‌రెడ్డికి ఉరి క‌న్ఫామ్‌..

వాడు పోలీస్ కాదు.. ఖాకీ దుస్తుల్లో ఉన్న సైకో కిల్ల‌ర్‌. ఒక‌రు ఇద్ద‌రు కాదు.. ఏకంగా 19 మంది మ‌హిళ‌ల‌పై అత్యా-చారానికి తెగ‌బ‌డ్డాడు. వారిలో కొంద‌రిని దారుణంగా చంపేశాడు. వారి మృతదేహాలపై కూడా లై*గిక దాడి చేసేవాడు. ఆ ఉన్మాది పేరు బీజే ఉమేశ్ అలియాస్ ఉమేశ్‌రెడ్డి. క‌ర్ణాట‌క‌కు చెందిన‌ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌.  19 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడి, పలువుర్ని హత్యచేసినట్టు ఉమేశ్ రెడ్డి‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఓ మహిళపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేయడానికి ప్రయత్నిస్తుండగా బాధితురాలు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో ఉమేశ్‌ వ్యవహారం బ‌య‌ట‌ప‌డింది. పోలీసులు వలపన్ని నిందితుడిని పట్టుకున్నారు. విచార‌ణ‌లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగుచూశాయి. ఉమేశ్‌రెడ్డి ఏకంగా 19 మందిపై హ‌త్యా-చారం చేశాడ‌ని తేల్చారు. అందులో కొంద‌రిని హ‌త్య చేసిన‌ట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. ఆధారాలు సేకరించి అత‌న్ని కోర్టులో హాజ‌రుప‌రిచారు.  ఉమేశ్‌పై 11 కేసుల్లో విచారణ పూర్తయి శిక్షలు పడగా.. మరో 8 కేసుల్లో తీర్పు రావాల్సి ఉంది. తాజాగా, నరహంతకుడు ఉమేశ్‌రెడ్డి (48)కి కర్ణాటక హైకోర్టు ఉరి శిక్ష ఖరారు చేసింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లేందుకు ఆరు వారాల సమయమిచ్చింది.  కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో 19 మందిపై అత్యా-చారానికి పాల్పడి.. పలువుర్ని హత మార్చినట్లు కోర్టు విచారణలో తేలింది. బెంగళూరు పరిధిలోని పీణ్యలో 1998లో ఓ మహిళపై హత్యా-చారానికి పాల్పడిన కేసులో 2006లో సెషన్స్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిని 2011లో కర్ణాటక హైకోర్టు సమర్ధించింది. అయితే, తన కుమారుడికి ఉరిశిక్ష రద్దుచేసి, యావజ్జీవిత ఖైదు విధించాలంటూ అతడి తల్లి గౌరమ్మ 2013లో రాష్ట్రపతికి క్షమాభిక్ష అర్జీ పెట్టుకున్నారు. అందుకు రాష్ట్రపతి తిరస్కరించారు.  ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని 2016లో సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు. ఈ విషయంలో హైకోర్టునే సంప్రదించాలని సుప్రీంకోర్టు సూచించింది. సెషన్స్‌ కోర్టు విధించిన ఉరి శిక్ష‌ను హైకోర్టు ధర్మాసనం సమర్థించింది.  

పోసాని ఇంటిపై దాడి చేసిందెవరు? పోలీసుల విచారణలో ట్విస్టులు.. 

జనసేన, వైసీపీ మధ్య రాజుకున్న వివాదం ఇంకా మండుతూనే ఉంది. పవన్ కల్యాణ్ లక్ష్యంగా వైసీపీ నేతలు మాటల దాడి కొనసాగిస్తున్నారు. అటు జనసేన లీడర్లు కూడా అధికార పార్టీపై మండిపడుతున్నారు. ఇక పవన్ కల్యాణ్, పోసాని కృష్ణ మురళీ రచ్చ రగులుతూనే ఉంది. పోసాని ఇంటిపై రాళ్ల దాడి జరగడంతో.. వివాదం కేసుల వరకు వెళ్లింది. పోసాని ఇంటిపై దాడి ఘటనపై పోలీసులు చేస్తున్న విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో ఉన్న పోసాని కృష్ణ మురళీ ఇంటిపై బుధవారం అర్ధరాత్రి కొందరు యువకులు రాళ్ల దాడి చేశారు. బైకులపై వచ్చిన యువకులు ఇంటిపై రాళ్లు విసిరారని పోసాని ఇంటి వాచ్ మన్ పురుషోత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దాడి జరిగిన సమయంలో పోసాని ఇంట్లో లేడు. ఆయన కొన్ని రోజులుగా గచ్చిబౌలిలోని అపార్ట్మెంట్లో ఉంటున్నారు. కేవలం ఆఫీసు అవసరాలకు మాత్రమే దీనిని వాడుతున్నారు. పోసాని వాచ్ మెన్ ఇచ్చిన ఫిర్యాదుతో  విచారణ చేస్తున్న పోలీసులకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి.  పోలీసులు ఎల్లారెడ్డిగూడలోని పోలీసులు ఇంటిని పరిశీలించారు. రాళ్ల దాడిలో పోసాని ఇంటి తలుపుల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇంట్లో  కొన్ని రాళ్లను కూడా పోలీసులు గుర్తించారు. దాడి జరిగిన సమమంలో ఇంట్లోని పనివాళ్లు భయంతో లోపలికెళ్లి దాక్కున్నట్లు తెలిపారు. కొందరు రాళ్లు రువ్వడంతో పాటు అసభ్య పదజాలం ఉపయోగించారని పనివాళ్లు పోలీసులకు తెలిపారు. కొందరు యువకులు  నానా హంగామా చేశారని స్థానికులు చెప్పారు. విచారణలో భాగంగా పోలీసులు పోసాని ఇంటి పరిసరాలను పరిశీలించారు. అయితే వారికి ఒక్క సీసీ కెమెరా కూడా కనిపించలేదు. అయితే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోలేదా..? లేక దాడి చేయడానికి వచ్చిన వారే తీసేసారా..? అన్న కోణంలో విచారిస్తున్నారు.  ఇక దాడి జరిగిన తరువాత పోసాని మరోసారి పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే తన ఇంటిపై దాడి చేయించారని ఆరోపించారు. జనసేన నాయకులు మాత్రం ఈ దాడికి జనసేనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు, పోసాని వెనుక ఏపీ ప్రభుత్వం ఉందని ఆయనతో పవన్ పై ఏపీ  అక్కడి ప్రభుత్వం విమర్శలు చేయిస్తోందని ఆరోపించారు. పోసాని ఇంటిపై దాడి వెనుక కూడా వైసీపీనే ఉందని జనసేన నేతలు ఆరోపించారు. జనసేనను ఇరికించేలా కుట్రలు చేశారని జనసేన నేతలు చెబుతున్నారు.  ఈ నేపథ్యంలో విచారణ జరుపుతున్న పోలీసులకు ఎలాంటి క్లూలు లభించలేదు. దీంతో నిందితులను గుర్తించడం కష్టంగా మారింది. పోసాని ఇంటి సమీపంలో సీసీ కెమెరాలు లేకపోవడం ఆసక్తిగా మారింది.  హైదరాబాద్ లో పోలీసులు వేలాదిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోసాని ఇల్లు ఉన్న ఎల్లారెడ్డి గూట పూర్తి రద్దీగా ఉండే ప్రాంతం. అలాంటి చోట సీసీ కెమెరాలు ఎందుకు లేవన్నది ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. పోసాని ఇంటి పరిసరాల్లో ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాలను కావాలనే ఎవరైనా తొలగించారా అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించాలంటే సీసీ కెమెరా పూటేజీ చాలా అవసరం అంటున్నారు పోలీసులు.  

టీడీపీ+జ‌న‌సేన‌+బీజేపీ.. అందుకేనా వైసీపీ బెదురు?

మంత్రి కొడాలి నాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు స‌వాల్ విసిరారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ.. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ల‌తో పొత్తు పెట్టుకొని పోటీ చేసి.. ద‌మ్ముంటే జగ‌న్‌ను గ‌ద్దె దింపాల‌ని స‌వాల్ చేశారు కొడాలి నాని. ఆయ‌న ఊరికే చేశారా? లేక‌, త‌న‌కొచ్చిన స‌మాచారం మేర‌కే అలా అన్నారా? అనే చ‌ర్చ న‌డుస్తోంది. ఆ డిటైల్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.. బీజేపీతో జ‌న‌సేన తెగ‌దెంపులు. ఈ మ‌ధ్య చాలా వెబ్ పోర్ట‌ల్స్‌లో ఈ టైటిల్ క‌నిపిస్తోంది. బీజేపీ, జ‌న‌సేన‌ల మ‌ధ్య దూరం పెరిగింది.. తిరుప‌తిలో జ‌న‌సేన బీజేపీకి స‌పోర్ట్ చేయ‌లేదు.. త్వ‌ర‌లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీకీ బై బై చెప్పేస్తారు.. అంటూ ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వండివారుస్తున్నారు. ఆ ప్ర‌చారం అలా జ‌రుగుతుండ‌గానే.. బ‌ద్వేల్‌లో ఉమ్మ‌డి అభ్య‌ర్థి ఎంపిక కోసం ఆ రెండు పార్టీలు క‌లిసి చ‌ర్చ‌లు జ‌రిపేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నాయి. సో, వారి మ‌ధ్య దూరం ఉన్న మాట వాస్త‌వ‌మే అయినా.. ఆ రెండు పార్టీలూ ఇప్ప‌ట్లో విడిపోవ‌ని అర్థ‌మైపోతోంది.  ఇక టీడీపీతో జ‌న‌సేన‌-బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా? లేదా? అనేదే కీల‌కం. ప‌వ‌న్ క‌ల్యాణ్‌-వైసీపీల మ‌ధ్య పొలిటిక‌ల్ ఫైట్ తారాస్థాయికి చేరింది. వైసీపీకి ఇప్పుడు ప్ర‌ధాన శ‌త్రువు జ‌న‌సేన‌నే అనే రేంజ్‌లో ఆ రెండు పార్టీల మ‌ధ్య జ‌గ‌డం న‌డుస్తోంది. స్వ‌త‌హాగా ఆవేశ‌ప‌రుడైన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.. ఈసారి జ‌గ‌న్‌కు గ‌ట్టి ఝ‌ల‌క్ ఇవ్వాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. కానీ, జ‌న‌సేన బ‌లం అంతంత‌మాత్రం. కొన్ని జిల్లాల‌కే ప‌రిమితం. ఇక బీజేపీకంటే జ‌న‌సేన‌నే కాస్త బెట‌ర్‌. ఆ లెక్క‌న జ‌న‌సేన‌-బీజేపీ క‌లిసి పోటీ చేసినా.. వైసీపీని గ‌ద్దె దింప‌డం అంత ఈజీ కాక‌పోవ‌చ్చు. ఆ ల‌క్ష్యం నెర‌వేరాలంటే.. టీడీపీతో పొత్తు ఒక్క‌టే మార్గం.  ఏపీలో సంస్థాగ‌తంగా టీడీపీ అత్యంత బ‌లంగా ఉంది. నిస్ప‌క్ష‌పాతంగా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే.. టీడీపీకే మెజార్టీ స్థానాలు ఖాయం. వైసీపీని దెబ్బ‌కొట్ట‌గ‌ల ఏకైక పార్టీ తెలుగుదేశ‌మే. ఎంత‌కాద‌న్నా.. జ‌న‌సేన‌, బీజేపీలు అత్యంత న‌మ్మ‌ద‌గిన పార్టీ టీడీపీనే. ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన‌లు అన‌ధికారికంగా పొత్తు పెట్టుకొని కొన్ని స్థానాలు గెలుచుకున్నాయి కూడా. జ‌న‌సేన‌, బీజేపీ కేడ‌ర్ సైతం టీడీపీతో పొత్తు కోరుకుంటోంది. గ‌తంలోనూ ఆ మూడు పార్టీలు క‌లిసి ప‌ని చేసిన అనుభ‌వం ఉంది. అప్ప‌ట్లో కాస్త పొర‌పొచ్చ‌లు వ‌చ్చినా.. అవి మ‌ళ్లీ రిపీట్ అయ్యే అవ‌కాశాలు త‌క్కువే. అందుకే, బ‌ల‌మైన శ‌త్రువు, ఉమ్మ‌డి ల‌క్ష్య‌మైన వైసీపీకి గుణ‌పాఠం చెప్పాలంటే.. టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీల మైత్రి అవ‌స‌ర‌మ‌నే విశ్లేష‌ణ‌లు జ‌రుగుతున్నాయి. ఆ మేర‌కు ఆయా పార్టీల్లో అంత‌ర్లీనంగా చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయి. పార్టీల అధిష్టానంపై కిందిస్థాయి నుంచి ఒత్తిడి కూడా పెరుగుతోంది. అధినేత‌లు సైతం ఆ దిశ‌గా ఆలోచిస్తున్నార‌ని తెలుస్తోంది. ఆ విష‌యం తెలిసే.. మంత్రి కొడాలి నాని అలా స‌వాల్ చేశార‌ని అంటున్నారు. జ‌న‌సేన పార్టీ బీజేపీ, టీడీపీతో పొత్తుపెట్టుకునైనా.. సీఎం జ‌గ‌న్‌ను మాజీ చేయగ‌ల‌దా అంటూ స‌వాల్ చేయ‌డం వెనుక అస‌లు కార‌ణం అదే అంటున్నారు.  ఆ మూడు పార్టీలు గ‌త ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేసుంటే.. వైసీపీకి ఏపీలో అడ్ర‌స్ లేకుండా పోయేది. విడివిడిగా పోటీ చేశాయి కాబ‌ట్టే.. ఓట్లు చీలి.. వైసీపీ సీట్లు ఎగ‌రేసుకుపోయింది. గ‌త ఎల‌క్ష‌న్స్‌లో జ‌రిగిన పొర‌బాటు ఈసారి జ‌ర‌గ‌కుండా చూస్తారా?  వైసీపీ దుర్మార్గ‌పు పాల‌న నుంచి ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌లిపిస్తారా? జ‌గ‌న్‌ను గ‌ద్దె దించి.. ఏపీని కబంధ‌హ‌స్తాల నుంచి కాపాడుతారా?  చూడాలి ముందుముందు ఏం జ‌రుగుతుందో..   

కాంగ్రెస్ లో ఆగని కల్లోలం.. సోనియాపైనే నేతల భారం

కాంగ్రెస్ పార్టీ అంటే అదో మహా సముద్రం ... ఇప్పుడా మహా సముద్రంలో మహా తుపాను సంభవించింది. పంజాబ్ లో ఏమి జరుగుతోందో వేరే చెప్పనక్కర లేదు. మాజీ క్రికెటర్ సిద్దూ పార్టీని ఒక ఆటాడుకుంటున్నారు. సిద్దూ చెపితే వినాలి, అనే విధంగా ... కాంగ్రెస్ అధిష్టానం ఆయన కోరిందే తడవుగా పీసీసీ అధ్యక్ష పదవిని బంగారు పళ్ళెంలో పెట్టి అప్పగించింది. అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత మాజీ కెప్టెన్ అమరీందర్ సింగ్ అభ్యంతరం చెప్పినా రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా కెప్టెన్ ను పక్కన పెట్టి  సిద్దూకు పట్టం కట్టారు. అయినా, ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోగా, దూరం పెరిగింది.  అంతే కాదు గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించింది అన్నట్లు, వ్యవహారం విషమించడంతో, ఈ అవమానాలు ఇక చాలని, కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజేనామా చేశారు. సిద్దూ సంతోషించారు.కానీ, ఎందుకనో, కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని కాదని, చరణ్’జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రి చేసింది. సిద్దూకు నచ్చలేదు. చన్నీ మంత్రివర్గంలోని కొందరు మంత్రులకు మచ్చలున్నాయని పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మళ్ళీ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందని అంటున్నారు. సిద్దూ ముఖ్యమంత్రి చన్నీని కలిసి జరిపిన చర్చలు ఫలించాయి. ఆ విధంగా పంజాబ్ సంక్షోభం తీ కప్పులో తుపానులా సమసి పోయింది.  ఇది పంజాబ్ కు సంబందిచిన వ్యవహారం అయితే, జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల బృందం ‘జీ 23’ , కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మధ్య వివాదం రోజురోజుకు పెరుగుతోంది. ‘జీ 23’ అంటే  ‘జీ హుజూర్‌ 23’ అని కాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఆయన చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఆయన ఇంటిముందు నిరసనకు దిగారు.రాళ్లు రువ్వారు. కోడి గుడ్లు విసిరారు. ఆయన కారు అద్దాలు బద్దలు కొట్టారు. ఈ సంఘటన కాంగ్రెస్ అధిష్టానం అనుమతితో జరిగిందో  లేక కార్యకర్తలు తమంతట తాముగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో తెలియదు కానీ, దీనిపై  కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు తీవ్రంగా మండి పడ్డారు. ఖండించారు. ఇలాంటివి దాదాగిరి చర్యలేనని మండిపడ్డారు. కపిల్‌ సిబల్‌ వంటి సీనియర్లు ఇచ్చే సూచనలు, సలహాలను స్వాగతించాలే కానీ.. అణచివేత, దౌర్జన్యం వంటి ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ‘పార్టీ తరపున పార్లమెంట్‌ బయట, లోపల పోరాటం చేసే కపిల్‌ సిబల్‌ కాంగ్రెస్‌ పార్టీకి విశ్వాసపాత్రుడు. అటువంటి వ్యక్తి ఏ రూపంలోనైనా చేసే సూచనలు, సలహాలను స్వాగతించాలే కాని.. అణచివేత, దౌర్జన్యం వంటి చర్యలు పనికిరావు’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మరో సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ.. కపిల్‌ సిబల్‌ ఇంటిపై దాడి, దౌర్జన్యం చేసిన వార్తలు తనను షాక్‌కు గురిచేశాయన్నారు. ఇటువంటి దుర్మార్గమైన చర్యలు పార్టీకి చెడ్డపేరు తెస్తాయని.. వీటిని తీవ్రంగా ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు. అసహనం, హింస వంటివి కాంగ్రెస్‌ పార్టీ విలువలకు వ్యతిరేకమని ఆనంద్‌ శర్మ అభిప్రాయపడ్డారు. చిదంబరం సహా ఇంకా అనేకమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తల చర్యను తీవ్రంగా ఖండించారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌లో నాయకత్వలేమి, పంజాబ్‌ సంక్షోభం వంటి పరిణామాలపై గళమెత్తిన సీనియర్ నాయకులు  కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాన్ని తక్షణమే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడు లేకుండానే నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే కపిల్ సిబాల్  ‘జీ 23’ అంటే ‘జీ హుజూర్‌ 23’ కాదని అన్నారు. కపిల్ సిబల్ పై దాడిని, జీ23 నాయకులే కాదు, నట్వర్ సింగ్ వంటి సీనియర్ నాయకులు కూడా తీవ్రంగా ఖండించారు. పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజాజరుతోందని  కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా  పరిస్థితి చేయి దాటుతున్న వైనాన్నిగుర్తించే కావచ్చు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జీ23 నాయకులు కోరిన విధంగా, త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, ఎప్పుడు అన్నది స్పష్టం చేయలేదు.  గతంలోనూ ఇదిగో అదిగో  అంటూ ఎప్పటికప్పుడు సీడబ్యున్సీ సమావేశాని వాయిదా వేస్తూవస్తున్నారని, ఈ సారి అలా జరగకుండా చూడాలని నాయకులు కోరుతున్నారు. మరో వంక కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి సంక్షోభాలు కొత్త కాదని, గతంలోనూ అనేక ఆటుపోట్లను ఎదుర్కున్న కాంగ్రెస్ పార్టీ పడిలేచిన కెరటంలా మళ్ళీ అధికార పగ్గాలను అందుకుందని కొందరు కాంగ్రెస్ నేతలు థీమాగా ఉన్నారు.   అయితే, ప్రస్తుత పరిస్థితులలో అది సాధ్యమా? అనేదే ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు,అభిమానులను వేధిస్తున్న ప్రశ్న.

పుల్ల ఇడ్లీ.. వాట్ ఆన్ ఐడియా స‌ర్‌జీ..

టిఫిన్స్ అందు ఇడ్లీ టిఫిన్ వేర‌యా. సౌత్ఇండియా స్పెష‌ల్ ఇడ్లీ. యావ‌త్ దేశం మెచ్చిన టిఫిన్‌. తెల్ల‌గా, మెత్త‌గా ఉండే ఇడ్లీని నేరుగా తింటే పెద్ద టేస్ట్ ఏమీ ఉండ‌దు. అదే ఇడ్లీని చ‌ట్నీతో కానీ, సాంబార్‌తో కానీ తింటే.. రుచి అదుర్స్‌. అందుకే ఇడ్లి-సాంబార్‌-చ‌ట్నీ కాంబినేష‌న్ అదుర్స్‌.  రుచి ఓకే కానీ, సాంబార్ ఇడ్లీ తిన‌డ‌మే కాస్త క‌ష్టం. ఇడ్లీని ముక్క‌లు ముక్క‌లు చేసి.. సాంబార్‌లో వేసి.. కాసేప‌టి త‌ర్వాత స్పూన్‌తో జుర్రుకుని తింటాం. అయితే, బెంగ‌ళూరులోని ఓ హోట‌ల్‌కు వెళితే ఇక‌పై అలాంటి ఇబ్బందేమీ ఉండ‌దు. ఎందుకంటే.. వాళ్లు వెరైటీగా "పుల్ల ఇడ్లీ" త‌యారు చేశారు కాబ‌ట్టి.   అవును, పుల్ల ఇడ్లీనే. పుల్ల ఐస్‌క్రీం మాదిరే ఈ పుల్ల ఇడ్లీ. ఇడ్లీకి పుల్ల ఉంటుంది అంతే. ఎంచ‌క్కా ఆ పుల్ల‌ను పట్టుకొని.. ఇడ్లీని సాంబార్‌లో ముంచుకొని తినేయొచ్చు. అలానే చ‌ట్నీలో సైతం అద్దుకొని ఇడ్లీని ఈజీగా తినొచ్చు. స్పూన్‌తో క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు.. చేతులకంతా అంటించుకొనే ఇబ్బంది లేదు. ఈజీ టూ ఈట్‌.. కంఫ‌ర్ట్ టు ఈట్‌.  పుల్ల ఇడ్లీ.. ఐడియా అదుర్స్ క‌దూ. అందుకే, ఇది ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్రాకు తెగ న‌చ్చేసింది. ఆయ‌న త‌న ట్విట‌ర్‌లో ఈ పుల్ల ఇడ్లీ గురించి పోస్ట్ పెట్ట‌గానే తెగ వైర‌ల్ అవుతోంది. పుల్ల ఇడ్లీ ఫొటోను ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేస్తూ.. ‘బెంగళూరు.. దేశ వినూత్న ఆవిష్కరణలకూ రాజధాని అయిన ఈ నగరం, తన సృజనాత్మకతను ప్రదర్శించకుండా ఉండలేకపోతోంది’ అంటూ కామెంట్ చేశారు.  పుల్ల ఇడ్లీ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. అలా ఎలా తింటారని కొందరు.. చెయ్యి కడుక్కోవాల్సిన అవసరం లేదని.. నీటి వృథా తప్పుతుందని.. ఇలా ర‌క‌ర‌కాలుగా కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఆనంద్ మ‌హీంద్రా పోస్ట్‌తో బెంగ‌ళూరు పుల్ల ఇడ్లీ తెగ ఫేమ‌స్ అయిపోతోంది.   

బీ అలర్ట్.. అక్టోబర్ తో బ్యాంకింగ్ లో కీలక మార్పులు..

అక్టోబర్ వచ్చేసింది .. వస్తూ వస్తూ మన దైనందిన జీవితంపై ప్రభావం చూపే అనేక మార్పులు తీసుకొంచ్చింది.ముఖ్యంగా బ్యాంకుల లావాదేవీలలో,అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆటోపే రూల్స్ ఈరోజు నుంచే మారి పోయాయి...  పాత చెక్ బూక్కులు ఇక పనిచేయవు. అన్నీ కాదు కానీ, చాలా వరకు  బ్యాంక్ల చెక్బుక్లు ఇక చిత్తూ కాయితాలే.. అంటే కొత్త చెక్కు బుక్కులు మాత్రమే ఇకపై చెల్లుతాయి.ఆటో డెబిట్, నిరుపయోగంగా మారిపోతుంది. పోస్టాఫీస్ ఏటీఎంల వినియోగానికి ఛార్జీల భారం పడుతుంది. పోస్టాఫీస్ ఛార్జీలు సహా ఇంకా అనేక ఇతర అంశాలు ఇందులో ఉన్నాయి.వాహనాల ధరలు పెరుగ్తున్నాయి. ఇందులో పెన్షనర్లకు ఓ చిన్న శుభ వార్త కూడా ఉంది. ఇక పెంశానర్లు జీవన్ ప్రమాణ్ కేంద్రాల్లోనూ..లైఫ్ సర్టిఫికేట్ దాఖలు చేయవచ్చును.. ఇలాగే ..ఇంకా ఏమేమి మార్పులున్నాయో  ... అవేమిటో చూడండి .. ఆర్బీఐ గతంలోనే తెలిపిన విధంగా  బ్యాంకులు ఆటో డెబిట్ రూల్స్లో భారీ మార్పులకు అక్టోబర్ ఒకటిన  శ్రీకారం చుట్టింది. సో .. ఇకపై ఆటో డెబిట్ సదుపాయం వినియోగించుకోవడం అంత సులువు కాదు. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఇకపై ఆటో డెబిట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. ఆ పేమెంట్కు అదనపు ధ్రువీకరణ (ఏఎఫ్‌ఏ) తప్పనిసరి. పెన్షనర్లు ప్రతి సంవత్సరం సమర్పించవలసిన లైఫ్ సర్టిఫికేట్ దాఖలు విషయంలో అనేక సమస్యలు ఎదుర్కోవడం చాలామందికి అనుభవంలో ఉన్నదే, ఇకపై ఆ సమస్య లేకుండా  జీవన్ ప్రమాణ్ కేంద్రాల్లోనూ..లైఫ్ సర్టిఫికేట్ దాఖలు చేయవచ్చును. 80 అంతకన్నా ఎక్కువ వయసున్న పెన్షనర్లకు ఇది సుభ వార్త. వారంతా తమకు దగ్గర్లో ఉన్న జీవన్ ప్రమాణ్ కేంద్రాల్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించేందుకు వీలుంది. దేశవ్యాప్తంగా ఉన్న హెడ్ పోస్టాఫీసుల్లో ఈ కేంద్రాలు ఉంటాయి.  అక్టోబర్ 1 నుంచి- నవంబర్ 30 వరకు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు. ఇక బ్యాంకుల చెక్కు బుక్కుల విషయానికి వస్తే, కొన్ని బ్యాంక్ల పాత చెక్కు బుక్కులు అక్టోబర్  1 నుంచి పని చేయవు..ఇందుకు సంబదించి  ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ సంస్థ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ తమ కస్టమర్లకు కీలక ప్రకటన చేసింది.  అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఓబీసీ), యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(యూబీఐ) చెక్‌బుక్‌లు పనిచేయవని స్పష్టం చేసింది.  ఈ బ్యాంకుల ఖాతాదారులు కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవాలని సూచించింది. గతేడాది ఏప్రిల్‌లో ఓబీసీ, యూబీఐ బ్యాంకులను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే.  విలీనమైనప్పటికీ ఇప్పటివరకు పాత చెక్‌బుక్‌లనే కొనసాగించారు.  అయితే అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆ చెక్‌ బుక్‌లు పనిచేయబోవని పీఎన్‌బీ తాజాగా వెల్లడించింది.  ఈ బ్యాంకుల ఖాతాదారులు వీలైనంత త్వరగా పీఎన్‌బీ ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఐసీఆర్‌లతో ఉన్న కొత్త చెక్‌బుక్‌లను తీసుకోవాలని తెలిపింది. ఏటీఎం, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, పీఎన్‌బీ వన్‌ నుంచి వీటిని దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. లేదంటే కస్టమర్లు నేరుగా బ్యాంకు బ్రాంచీలకు వెళ్లి కూడా కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవచ్చని తెలిపింది. అలాగే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో పని చేసే జూనియర్ స్థాయి ఉద్యోగులకు అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి.  జూనియర్ స్థాయి ఉద్యోగులంతా ఇకపై తమ స్థూల వేతనంలో 10 శాతం మొత్తాన్ని తాము నిర్వహిస్తున్న ఫండ్లో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.  2023 అక్టోబర్ నాటికి ఈ పరిమితిని సెబీ20 శాతానికి పెంచనుంది. ఇంత వరకు చాలా వరకు ఉచిత సేవలు అందిస్తున్న పోస్టాఫీస్ సేవలకు ఇక చార్జీల ఛార్జీల మోత తప్పదు.  పోస్టాఫీస్లో సేవింగ్స్ ఖాతా ఉన్న వారికి.. వచ్చే నెల ఛార్జీల భారం పడనుంది.  పోస్టాఫీస్ ఏటీఎంలలో జరిపే ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఇండియా పోస్ట్ తెలిపింది. 2021 అక్టోబర్ 1 నుంచి 2022 సెప్టెంబర్ 30 కాలానికి సంబంధించి యూన్యువల్ మెయింటెనెన్స్ ఏటీఎం/డెబిట్ కార్డ్ లావాదేవీలకు రూ.125+ జీఎస్టీ ఛార్జ్ చేయనుంది ఇండియా పోస్ట్.  దీనితో పాటు ఎస్ఎంఎస్ అలర్ట్ ఛార్జీల కింద రూ.12+ జీఎస్టీ వసూలు చేయనున్నట్లు పేర్కొంది. మరో ముఖ్యమైన మార్పు అదేమంటే, వాహనాల ధరలు పెంపు.. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టీకేఎం).. వాహనాల ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది.  అన్ని సెగ్మెంట్లలోని వాహనాలపై 2 శాతం వరకు ధరల పెంపు ఉంటుందని తెలిపింది.  వెల్ఫైర్ మోడల్కు మాత్రం ఇందుకు మినహాయింపునిచ్చింది. పెరిగిన ధరలు అక్టోబర్ 1 నుంచే అమలులోకి వస్తాయని టీకేఎం. స్పష్టం చేసింది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ మరోసారి ధరల పెంపు నిర్ణయం తీసుకుంది.  వాణిజ్య వాహనాల ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది.  కొత్త ధరలు అక్టోబర్ 1 నుంచే అమలులోకి రానున్నట్లు వెల్లడించింది.  

టాప్ న్యూస్ @ 1PM

హైదరాబాద్ రామాంతపూర్ సెంట్రల్ మాదాక ద్రవ్యాల ఫోరెన్సిక్ ల్యాబ్ వద్దకు ఏపీ టీడీపీ నేతలు చేరుకున్నారు. డ్రగ్ టెస్ట్‌కు రాకుండా వైసీపీ నేతలు తోక ముడిచారని ఈ సందర్భంగా పట్టాబీ ఆరోపించారు. దేశంలో డ్రగ్ మాఫియా వెనుక వైసీపీ నేతలు ఉన్నారని తేటతెల్లమయ్యిందన్నారు.  రామాంతపూర్ సెంటర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు రాకుండా వైసీపీ నేతల పుత్రరత్నాలు ముఖం చాటేశారని విమర్శించారు. వైసీపీ నేతలు ఎప్పుడూ పిలిచినా డ్రగ్ టెస్ట్‌కు తాము సిద్ధమని పట్టాభి స్పష్టం చేశారు. -------- ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడును కేబినెట్‌ మంత్రి హోదాలో నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రేడియేషన్‌ ఆంకాలజిస్టుల్లో అత్యంత అనుభవజ్ఞుడు, ప్రఖ్యాత వైద్యుడిగా పేరుపొందారు. ఆయన్ని కేబినెట్‌ హోదాలో రెండు సంవత్సరాల పదవీకాలంతో సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలనశాఖ (రాజకీయ) కార్యదర్శి ముత్యాలరాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.  ----- స్వచ్ఛ్ భారత్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పేరుతో క్లాప్ కార్యక్రమం నిర్వహించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. క్లీన్ ఏపీలో భాగంగా కొనుగోలు చేసిన చెత్త సేకరణ వాహనాలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్టాడుతూ వాహనాలపై సీఎం జగన్ పేరుతో స్టిక్కరింగ్, వైసీపీ రంగులు వేయడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో సింగిల్ స్టిక్కర్ వెళ్లి డబుల్ స్టిక్కర్ వచ్చిందని ఎద్దేవా చేశారు --------- సీఎం జగన్‌కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. గులాబ్ తుఫాన్‌తో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దాదాపు 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆహార పంటలకు ఎకరాకు రూ.25 వేలు.. ఉద్యాన, వ్యాపార పంటలకు రూ.50 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి రప్పించి కేంద్రం నుంచి సహాయం కోరాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ------- తెలంగాణ అసెంబ్లీలో విపక్షాలపై విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. గ్రామ పంచాయ‌తీ నిధులపై ప్ర‌తిప‌క్షాలు మాట్లాడిన తీరుపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సభ్యుల మాటలు వింటే జాలేస్తోందని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులే గౌరవంగా బతుకుతున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో వ్యక్తిపై సగటున రూ.4 మాత్రమే ఖర్చు చేశారని, తమ హయాంలో రూ.650 విడుదల చేస్తున్నమన్నారు.  --------- పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై పరిశీలనకు ఏర్పాటైన సంయుక్త కమిటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు నివేదిక సమర్పించింది. ఈ ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టుగా పనులు చేపట్టారని సంయుక్త కమిటీ ధృవీకరించింది. తప్పుడు నివేదిక అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించాలని కమిటీ సిఫార్సు చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 3 కోట్ల 70 లక్షల జరిమానా చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంది.  ---- అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను శుక్రవారం సూర్యకిరణాలు తాకాయి. స్వామి పాదాల నుండి శిరస్సు వరకు కిరణ స్పర్శ అరుదైన దృశ్యాన్ని చూడడానికి భక్తులు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు. ఏడాదిలో రెండుసార్లు ఆదిత్యునికి కిరణ స్పర్శ ఉత్తరాయణం, దక్షిణాయణంలో భక్తులకు కనువిందు చేసింది. ఏటా అక్టోబరు 1, 2, మార్చి 9, 10 తేదీల్లో స్వామివారిని సూర్యకిరణాలు తాకుతాయి. 8 నిమిషాలు పాటు కిరణాలు పడటంతో భక్తులకు అద్భుత దర్శన భాగ్యం కలిగింది. ------ గచ్చిబౌలి స్టేడియంలో క్రీడాకారులు, అథ్లెట్లు ఆందోళనకు దిగారు. స్టేడియంను కాపాడాలని ధర్నాకు దిగారు. టిమ్స్ హాస్పిటల్ కోసం ఇప్పటికే 9ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. స్టేడియంలోని మరో 5 ఎకరాలు టీమ్స్‌కు కేటాయించాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయంపై అథ్లెట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఒకే ఒక్క స్టేడియంను హాస్పిటల్‌కు ఇవ్వడం అన్యాయని అథ్లెట్స్ అన్నారు. ---- కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్  కొత్త రాజకీయ పార్టీ స్థాపించే అవకాశాలున్నాయని సమాచారం. అమరీందర్ ఇటీవల ఢిల్లీలో అమిత్ షాతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌లతో భేటీ అయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమరీందర్ కొత్త పార్టీ ఏర్పాటు కోసం తన మద్ధతుదారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. --------- దేశీయ విమాన దిగ్గజమైన ఎయిర్ ఇండియాను టాటా సన్స్ కొనుగోలు చేయనుంది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడానికి టాటా సన్స్ తుది బిడ్ ను గెలుచుకుందని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ కూడా బిడ్ వేసినప్పటికి, టాటాసన్స్  ఎయిర్ ఇండియా కొనుగోలు కోసం అధిక ఆఫరును సమర్పించారని అధికారులు చెప్పారు. ----------

బిగ్ బ్రేకింగ్.. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకట్! 

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లు మొదలయ్యాయి. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హుజురాబాద్ లో రాజకీయ వేడి రాజుకుంది. అధికార టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును చాలా రోజుల క్రితమే ప్రకటించింది. బీజేపీ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గెల్లు, ఈటలలు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ఇంకా అధికారకంగా ఖరారు కాలేదు. హుజురాబాద్ విషయంలో కాంగ్రెస్ మొదటి నుంచి సైలెంటుగానే వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ టికెట్ రేసులో పలువురు పేర్లు వినిపించాయి. మాజీ మంత్రి కొండా సురేఖ పేరు దాదాపుగా ఖరారైందనే ప్రచారం జరిగింది. అయితే స్థానిక నేతలు వ్యతిరేకించడంతో ప్రకటన ఆగిపోయిందని తెలుస్తోంది. తాజాగా హుజురాబాద్ లో పోటీ చేయడం లేదని కొండా సురేఖ ప్రకటించడంతో కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్ నెలకొంది. అయితే తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి ఖరారైనట్లు తెలుస్తోంది.  తెలంగాణ ఎన్ ఎస్ యు ఐ ఐ రాష్ట్ర అధ్యక్షుడు బాలమూరు వెంకట్ ను అభ్యర్థిగా ఎంపిక చేశారని సమాచారం. ఆయన పేరును రేపో మాపో అధికారికంగా పార్టీ ప్రకటించబోతోంది. బల్మూరి వెంకట్ కొన్ని రోజులుగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాకా మరింత స్పీడ్ పెంచారుల. చలో రాజ్ భవన్ కార్యక్రమంలో భాగంగా పోలీసులకు చుక్కలు చూపించారు వెంకట్. ఈ నేపథ్యంలోనే యువకుడైన వెంకట్ ను హుజురాబాద్ బరిలో దింపాలని పీసీసీ నిర్ణయించిందని తెలుస్తోంది. వెంకట్ కు రేవంత్ రెడ్డి అండదండలు పూర్తిగా ఉన్నాయని అంటున్నారు. అధికార పార్టీ విద్యార్థి నేతను బరిలోకి దింపినందున... కాంగ్రెస్ కూడా అదే ప్రయత్వం చేసినట్లు కనిపిస్తోంది. 

ఏపీ కేబినెట్‌లో అల‌జ‌డి.. మంత్రుల్లో భ‌యం భ‌యం..

న‌మ్మ‌కం ఉన్న‌చోటే ధైర్యం ఉంటుంది. ధైర్యం ఉన్న‌చోటే స‌రైన ప‌నిత‌నం క‌నిపిస్తుంది. ఏమాత్రం న‌మ్మ‌కం స‌డ‌లినా.. ఇక నిత్యం భ‌యం భ‌యం. ఏపీ మంత్రుల ప‌రిస్థితి ఇప్పుడు అలానే ఉందంటున్నారు. కొన్ని వారాలుగా మినిస్ట‌ర్లు అదోర‌కం టెన్ష‌న్‌కు లోన‌వుతున్నార‌ట‌. సీఎం జ‌గ‌న్ ఎప్పుడు తుమ్ముతారో.. త‌మ మంత్రి ప‌ద‌వులు ఎప్పుడు ఊడిపోతాయోన‌నే ఆందోళ‌న మంత్రుల ముఖంలో, మాట‌ల్లో సుస్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఉండ‌బ‌ట్టుకోలేక మంత్రి పేర్ని నాని ఆ విష‌యం బ‌య‌ట‌కు అనేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. రెండున్న‌రేళ్ల త‌ర్వాత స‌గం కేబినెట్‌ను మార్చేస్తా. ప్రమాణ‌స్వీకారం రోజున జ‌గ‌న్ చెప్పిన డైలాగ్ ఇది. ఆ రెండున్న‌రేళ్ల గ‌డువు ముగిసే స‌రికి జ‌గ‌న్ డైలాగ్ మార్చేశారు. స‌గం కాదు.. ఏక మొత్తంగా కేబినెట్ అంత‌టినీ మార్చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఆ విష‌యంలో ఇప్ప‌టికే లీకులు రాగా.. ఇటీవ‌ల మంత్రి బాలినేని బ‌హిరంగంగానే ప్ర‌క‌టించేశారు. అప్ప‌టి నుంచి మిగ‌తా మంత్రుల‌తో పాటు వైసీపీలో ప్ర‌జ‌ల్లో కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌పై చ‌ర్చ జ‌రుగుతోంది.  స‌గం మంది మంత్రుల‌నే మార్చుదామ‌ని అనుకున్న జ‌గ‌న్‌.. ఇప్పుడు అంద‌రినీ తీసేయాల‌ని డిసైడ్ అయ్యారంటే అర్థం.. ఏ ఒక్క మినిస్ట‌ర్‌పైనా ముఖ్య‌మంత్రికి న‌మ్మ‌కం లేన‌ట్టేగా? ఏ ఒక్క మంత్రి కూడా స‌రిగ్గా ప‌ని చేయ‌డం లేద‌నేగా?  రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఆర్థిక మంత్రి బుగ్గ‌న‌ను తీసేస్తారంటే అర్థం ఉంది.. త‌న‌కు పోటీగా మారి, తన బెయిల్ ర‌ద్దైతే సీఎం కుర్చీకే ఎస‌రు పెడుతున్న పెద్దిరెడ్డిని సాగ‌నంపడ‌మూ క‌రెక్టే.. డ‌మ్మీలుగా మారిన ఉప ముఖ్య‌మంత్రులు, ప‌లు శాఖ‌ల మంత్రుల‌నూ ఇంటికి పంపించేస్తారంటే కూడా రీజ‌న్ ఉంది.. మ‌రి, మంత్రి ప‌ద‌వికి త‌గిన‌ ఏ అర్హ‌త‌లూ లేక‌పోయినా.. కేవ‌లం బూతులు మాట్లాడ‌గ‌లిగే టాలెంట్ ఉంద‌నే ఏకైకా కార‌ణంతో ఏరికోరి మంత్రిప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన కొడాలి నాని, అనిల్‌కుమార్ యాద‌వ్‌, పేర్ని నానిలాంటి వారికి కూడా బై బై చెప్ప‌బోతుండ‌టం కాస్త సంచ‌ల‌న విష‌య‌మే.  తాను మోనార్క్‌న‌ని.. తాను మాత్ర‌మే తోపు అని భావించే జ‌గ‌న్‌.. త‌నది వ‌న్ మ్యాన్ షో అని నిరూపించుకోవ‌డానికే, మంత్రుల‌కు ఎలాంటి ప్రాధాన్యం ఉండ‌ద‌ని.. నేత‌లు కేవ‌లం క‌రివేపాకులాంటి వారేన‌ని.. మ‌రింత స్ప‌ష్టంగా చెప్పేందుకే ఇలా చేస్తున్నార‌ని అంటున్నారు. అందుకే, మంత్రి ప‌ద‌వి పోతుంద‌ని తెలీగానే.. ఇన్నాళ్లూ తాము కూడా గొప్పోల్ల‌మ‌ని విర్ర‌వీగిన కొంద‌రు మంత్రులు ఇప్పుడు నైరాశ్యంలో ప‌డిపోయారు. తాజాగా, మంత్రి పేర్ని నాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ‘మంత్రి పదవి మీద ప్రేమ ఎందుకుంటుంది..? నేనెప్పుడు ఊడిపోతానో నాకే తెలియదు’ అని సమాచార-రవాణా శాఖల మంత్రి పేర్ని నాని అన‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  త‌న మంత్రి ప‌ద‌వి పోవ‌డం ప‌క్కా అని తెలిసే.. ఇటీవ‌ల పేర్ని నాని మ‌రింత వాయిస్ పెంచారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై విరుచుకుప‌డుతూ.. సినిమా వాళ్ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతూ.. కాస్త హ‌డావుడి చేసి త‌న మంత్రి ప‌ద‌వి కాపాడుకోవాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అంటున్నారు. అయినా, జ‌గ‌న్ క‌నిక‌రించ‌డం లేద‌ని తెలిసి.. మ‌రింత దిగ‌జారిపోయారు. అవును, నేను సీఎం జ‌గ‌న్‌కు పాలేరునే.. అని బ‌హిరంగంగా ప్ర‌క‌టించేసుకుని.. మంత్రి ప‌ద‌వికి అస‌లైన అర్హుడున‌ని చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని చెబుతున్నారు. కానీ, పేర్ని నాని, కొడాలి నాని లాంటి వాళ్లు తిట్లు, బూతుల‌తో ఎన్ని కుప్పిగంతులు వేసినా.. కేబినెట్ మొత్తాన్ని మార్చేయాల‌నే జ‌గ‌న్ నిర్ణ‌యంలో ఎలాంటి మార్పు లేద‌ని తెలుస్తోంది. అందుకే, ఏపీ మంత్రుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. జ‌గ‌న్ తుమ్మితే ఊడిపోయే త‌మ ప‌ద‌వుల‌ను.. గ‌ట్టిగా ప‌ట్టుకొని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

హుజూరాబాద్ లో ఉమ్మడి పోరు.. రేవంత్ స్కెచ్ మాములుగా లేదుగా?  

హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. పోటీ చేయడమే కాదు, తెరాస,బీజేపీలను దీటుగా ఎదుర్కునే అభ్యర్ధిని బరిలో దించుతుంది. తెరాస, బీజేపీలకు గట్టి పోటీ కూడా ఇస్తుంది. అంతే కాదు ఉప ఎన్నికను అవకాశంగా తీసుకుని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే అన్ని పార్టీలను, ప్రజసంఘాలను కలుపుకుని, అక్కడా ఇక్కడ అధికారంలో ఉన్న తెరాస, బీజేపీలకు వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలతో ఉమ్మడి పోరాట వేదికను ఏర్పాటు చేస్తుంది. ఇందుకు సంబంధించి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రణాళికను తెర మీదకువస్తుందని, రేవంత్ సన్నిహిత వర్గాల సమాచారం.  పార్టీ అభ్య‌ర్థి ఎంపిక కసరత్తు సాగిస్తూనే, మ‌రోవైపు ఉమ్మడి అభ్యర్ధిని బరిలో దించి తెరాస, బీజేపీలకు  బ‌ల‌మైన పోటీ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ ఎన్నిక‌లో ఇప్పటికే పట్టుమీదున్న బీజేపీ, టీఆర్ఎస్ పై సర్జికల్ స్ట్రైక్ చేసేందుకు, పక్కా  వ్యూహాంతో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా  అడుగులు వేస్తున్నారు. నిజానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక కంటే, 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల పైనే, రేవంత్ రెడ్డి దృష్టిని కేంద్రీకరించారు. అదే సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచే భవిష్యత్ వ్యూహాన్ని సిద్దం చేసుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన గతంలోనూ చెప్పారు. అంతే కాదు మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి తెరాస, బీజేపీ వ్యతీరేక శక్తులను ఏకంచేసే ప్రయత్నంలోనే ఉన్నారు. ఇందులో భాగంగానే  ఇటు వామ పక్షాలు, అటు తెలంగాణ ఉద్యమ పార్టీలు, ప్రజా సంఘాలను నిరుద్యోగ భేరి వేదికగా ఏకం చేశారు. అలాగే సెప్టెంబర్ 27న జరిగిన భారత్ బంద్ కార్యక్రమంలోనూ కాంగ్రెస్ శ్రేణులు అన్ని పార్టీలతో కలిసి కదం తొక్కాయి.  ఇప్పుడు అదే ఫార్ములాను, హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ ప్రయోగించేందుకు రేవంత్ రెడ్డి ఇప్పటికే వామపక్ష నాయకులతో స్వయంగా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ఉమ్మడి అభ్యర్ధిగా బరిలో దించేందుకు వామపక్షాలు, తెలంగాణ ఉద్యమ పార్టీల మద్దతు కూడకట్టేందుకు రేవంత్ రెడ్డి వేగంగా అడుగులు వేస్తున్నారు.‘మిత్ర పక్షాలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి’ అనే నినాదంతో ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్న  రేవంత్ రెడ్డి, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం సీఎల్పీనాయకుడు భట్టి విక్రమార్క, గాంధీ భవన్ లో తెరాస, బీజేపీ యేతర పర్టీల ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు, ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఐ, టీజేఎస్, ఇంటి పార్టీ, న్యూ డెమోక్రసీ, తెలంగాణ టీడీపీ, లిబరేషన్ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జరిగే, విద్యార్ధి , నిరుద్యోగ జంగ్, సైరన్ ఆందోళన, పోదు భూముల ఆందోళనతో పాటుగా, హుజూరాబాద్ ఉప ఎన్నిక విష్యం కూడా చర్చించినట్లు సమాచారం.  కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఉద్యమాలకు మద్దతు ఇస్తామని సమావేశంలో పాల్గొన్న అన్ని పార్టీలు అంగీకరించాయి. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలో  కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో పార్టీలో చర్చించి నిర్ణయం తెలియచేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట రెడ్డి చెప్పారు. టీజేఎస్, టీటీడీపీ ఇతర పార్టీలు, ఉమ్మడి అభ్యర్ధి విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. అయితే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని సమాచారం. రాజకీయ పార్టీలతో పాటుగా ప్రజా సంఘాలను కలుపుకుని పోవాలని రేవంత్ రెడ్డి ప్రజా సంఘాల నాయకులను కలసి ఉమ్మడి అభ్యర్ధికి మద్దతు కూడగట్టే ప్రయత్నాలలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు, కృష్ణ మాదిగతో పాటుగా ఇతర సంఘాల నాయకులను కలుస్తున్నారు.   రేవంత్ రెడ్డి చేస్తున్నఈ ప్రయోగం వలన తక్షణ ప్రయోజనం ఉన్నా లేకున్నా, భవిష్యత్ లో దీర్ఘకాల ప్రయోజనం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. గతంలో వైఎస్సార్ తొమ్మిది వామపక్ష పార్టీలతో కలిసి సాగించిన విద్యుత్ తదితర ఉద్యమాలు కాంగ్రెస్ పార్టీకి లభించాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  2018లోనూ ఇదే ప్రయత్నం జరిగింది. కాంగ్రెస్ సారధ్యంలో ప్రజా కూటమి ఏర్పడింది. అయినా ఆశించిన ఫలితం దక్కలేదు. దక్కిన ఫలితం మిగల లేదు. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన 19 మందిలో 12 మంది.. టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరికీ ఇద్దరు తెరాసలో చేరిపోయారు.  ఎన్నికల రాజకీయాల్లో ఒకటి ఒకటీ కలిస్తే రెండు కావలసిన అవసరం లేదని, ఒకటీ ఒకటీ సున్నా కావచ్చని అలాగే నాలుగో నలభయ్యో కూడ కావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకటీ ఒకటీ సున్నా అవుతుందా .. నాలుగో నలభయ్యో అవుతుందో త్వరలోనే తెలిసిపోతుంది..

అఫ్గాన్‌ లో అరాచకం.. చదువు కోసం చిన్నారుల ఆక్రందనలు 

ఆఫ్గనిస్థాన్ లో తాలిబన్ల పాలన, రాక్షస పాలనకంటే ఘోరంగా సాగుతోంది. ముఖ్యంగా మహిళలు,చిన్నారుల జీవితలాను మరింత దుర్భరం చేస్తోంది. చదువులకు దూరం చేయడమే కాకుండా, ఆడవారిని పడక బొమ్మలుగా చేసి వారి జీవితాలతో ఆడుకుంటోంది. ఈ దుర్మార్గ పరిస్థితుల్లో, చిన్నారులు ప్రాణాలకు తెగించి వీధుల్లోకి వస్తున్నారు. చదువుకుంటామని,చదువుకోనీయమని పాలకులను వేడుకుంటున్నారు.  ఇందులో భాగంగా  విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో తమ హక్కులను కాలరాయొద్దంటూ అఫ్గాన్‌ మహిళలు గత కొంత కాలంగా చేపడుతున్న నిరసన ప్రదర్శనలపై తాలిబన్లు విరుచుకుపడుతున్నారు. తాజాగా కాబుల్‌లో ప్రదర్శన చేపట్టిన మహిళలపై వారు హింసాత్మక ధోరణి ప్రదర్శించారు. 6 - 12 తరగతుల బాలికలనూ బడులకు అనుమతించాలంటూ ‘స్పాంటేనియస్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ అఫ్గన్‌ వుమెన్‌ యాక్టివిస్ట్స్‌’ బృందానికి చెందిన పలువురు మహిళలు గురువారం స్థానికంగా ఓ సెకండరీ స్కూల్‌ ముందు నిరసనకు దిగారు. ‘మా పెన్నులు విరగ్గొట్టొద్దు. మా పుస్తకాలను కాల్చొద్దు. మా పాఠశాలలను మూసివేయొద్దు’.. ఇలా వివిధ నినాదాలు రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. ఇది గమనించిన తాలిబన్లు వెంటనే వారిని అడ్డుకున్నారు. వెనక్కి నెట్టేసి, బ్యానర్లు లాగేసుకున్నారు. వారిని అదుపుచేసేందుకు గాల్లో కాల్పులు సైతం జరిపినట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో వారి దుశ్చర్యలను రికార్డు చేస్తున్న విదేశీ జర్నలిస్టులనూ నిలువరించినట్లు పేర్కొంది.  తాలిబన్లు మాత్రం, ఇంకా తమను తాము మోసం చేసుకుంటూ, ప్రపంచాన్ని మోసం చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అఫ్గాన్‌లో 6- 12 తరగతులకు కేవలం బాలురను మాత్రమే అనుమతిస్తూ జారీ చేసిన ఆదేశాలు విషయం ప్రస్తావించకుండా, కేవలం  నిరసనకారులు తమ ప్రదర్శనకు సంబంధించి అనుమతులు తీసుకోలేదని అందుకే వారిని అడ్డుకున్నమని పేర్కొన్నారు. మహిళలను అడ్డుకున్న తాలిబన్ల బృందానికి నాయకత్వంవహించిన మౌలావి నస్రతుల్లా,  నిరసనకారులు తమ ప్రదర్శనకు సంబంధించి అనుమతులు తీసుకోలేదని అందుకే అడ్డుకున్నమని చెప్పు కొచ్చారు. అఫ్గాన్‌లో 6- 12 తరగతులకు కేవలం బాలురను మాత్రమే అనుమతిస్తూ తాలిబన్లు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మహిళల హక్కుల విషయంలోనూ వారు మొదటి నుంచి కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వారి దుశ్చర్యలను నిరసిస్తూ.. హెరాత్‌, కాబుల్‌ తదితర చోట్ల గళం విప్పిన మహిళలపై తమ ప్రతాపాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. మరో వంక తమ ఆజ్ఞలను దిక్కరిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చూపేందుకు, తాలిబన్లు తమ ఆజ్ఞల దిక్కరణకు శిక్షగా చంపిన మహిళల మృతదేహాలను బహిరంగ ప్రదేశాలలో వెళ్లాడదీసి ప్రజలను భయానికి గురిచేస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి.

అర్ధరాత్రి సీఎం ఆకస్మిక తనిఖీలు! స్టాలిన్ మరో సంచలనం..

పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి అప్పుడప్పుడు సైకిల్ పై తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్న సీఎం స్టాలిన్ ఇప్పుడు మరో కొత్త ట్రెండ్‌కు తెరతీశారు. పోలీస్ స్టేషన్‌లో పనితీరును తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలకు దిగారు.  అర్థరాత్రి సమయంలో అధ్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. సేలం నుంచి ధర్మపురికి వెళ్తుండగా ఆయన మధ్యలో అద్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ స్టేషన్ పనితీరును రికార్డులను పరిశీలించారు. సీఎం ఇలా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తనిఖీలు చేయడంతో పోలీసులు షాక్ అయ్యారు. పోలీస్ స్టేషన్‌ను ఎప్పుడు నిర్మించారు. కేసులు నమోదవుతున్న తీరు, కేసుల పరిష్కారం తదితర విషయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.  ప్రభుత్వం మారినప్పటికీ పాత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కొన్నింటిని అలానే కొనసాగిస్తున్నారు స్టాలిన్. జయలలిత పేర్లతో ఉన్న పథకాలను అవే పేర్లతో కొనసాగిస్తున్నారు. పిల్లలకు అందించే పుస్తకాలపై మాజీ సీఎం జయలలిత ఫుటోలు ఉండగా, అలానే వాటిని పిల్లలకు పంపిణీ చేసి ఖజానా భారం కాకుండా చూశారు. అమ్మ క్యాంటిన్లను అలానే కొనసాగిస్తున్నారు. ఖజానాపై భారం పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు సీఎం స్టాలిన్‌. తాజాగా ఆకస్మిక తనిఖీలతో ప్రజల మరింత అభిమానం చూరగొంటున్నారు.    

సాహో సజ్జనార్.. మూడేళ్ల తర్వాత ఆర్టీసీలో ఒకటే తేదీనే జీతాలు! 

పోలీస్ శాఖలో ఆయన సూపర్ కాప్.. డైనమిక్ ఆఫీసర్ గా జనాల నుంచి జేజేలు అందుకున్నారు. ప్రజల భద్రత కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ వ్యాప్తంగా సంచలనమయ్యాయి. ఆ ఆఫీసర్ ఇప్పుడు నాన్ పోలీస్ శాఖకు బదిలీ అయ్యారు. అయితే అక్కడ కూడా ఆయన తన మార్క్ చూపిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే సంస్థను గాడిలో పెట్టే పనిలో పడ్డారు. ఉద్యోగుల సంక్షేమంపై ఫోకస్ చేశారు. అక్కడా ఇప్పుడు సాహో అనిపించుకుంటున్నారు. పైన చెప్పిదంతూ ఎవరి గురించో అంచనా వేశారు.. ఆయన ఎవరో కాదు సీనియప్ ఐపీఎస్ సజ్జనార్. సైబరాబాద్ సీపీ నుంచి తెలంగాణ ఆర్టీసీ ఎండీగా నియమితులైన సజ్జనార్.. ఆర్టీసీలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. కొత్త బాస్  రావడంతోనే సంస్థలో మార్పులు తెచ్చారు.  ఉద్యోగుల సమస్యలకు చెక్ పెట్టారు. ఆర్టీసీ ఉద్యోగులకు దాదాపు మూడేళ్ల తర్వాత ఒకటో తేదీనే జీతాలు అందుకోనున్నారు. ఇన్నాళ్లు పది, పదిహేను రోజులు ఆలస్యంగా వేతనాలు అందుకున్న ఉద్యోగులు.. సజ్జనార్ చర్యలతో సంబరాలు చేసుకుంటున్నారు.  ప్రతి నెల సరిగ్గా ఒకటో తేదీనే జీతాలు  చెల్లించేలా టీఎస్‌ఆర్టీసీ కొత్త ఎండీ సజ్జనార్‌ ప్లాన్ సెట్ చేశారు.. ఈ మేరకు అక్టోబర్‌ నుంచి ఒకటో తేదీనే  తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ కానున్నాయి. 018 డిసెంబర్‌ వరకు ఆర్టీసీ ఉద్యోగులు ప్రతినెలా ఒకటో తేదీకి అటూఇటుగా వేతనాలు తీసుకునేవారు. కానీ రాను.. రాను మరింత దారుణంగా మారింది.  కోవిడ్ వ్యాప్తి, లాక్‌డౌన్ సమస్యలు వచ్చ పడటంతో సంస్థకు ఆర్ధిక భారం మరింత పెరిగిపోయింది.దీంతో ఆర్టీసీ కార్మికుల వేతనాలు సమస్యగా మారిపోయాయి.  గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్, బస్‌భవన్‌ ఉద్యోగులకైతే మరింత దారుణంగా సెప్టెంబర్‌లో 20వ తేదీన వేతనాలు అందాయి. ఉద్యోగుల ఈఎంఐలు, ఇతర ఖర్చుల కోసం ప్రతి నెల అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.  సజ్జనార్‌ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఈ విషయంపై ఆయన ఫోకస్ చేశారు. ఈ సమస్యలపై బ్యాంకులతో చర్చలు జరిపారు. ప్రతినెలా ఒకటో తేదీలోపు రూ.100 కోట్ల ఓవర్‌డ్రాఫ్టు ఇవ్వాలని.. డిపోల్లో రోజువారీ టికెట్‌ కలెక్షన్‌ ఖాతాలను సదరు బ్యాంకులో తెరుస్తామని ప్రతిపాదించారు. దీనికి ఓ ప్రభుత్వరంగ బ్యాంకు ఓకే చెప్పింది. అక్టోబర్‌ ఒకటిన జీతాల చెల్లింపు కోసం రూ.100 కోట్లు అందించింది. రోజువారి టికెట్ల ఆదాయం నుంచి కానీ.. ప్రభుత్వం నుంచి వచ్చే మొత్తం నుంచి కానీ తిరిగి ఈ సొమ్మును బ్యాంకుకు చెల్లించేలా ప్లాన్ చేశారు. ఇలాంటి చిక్కు సమస్యల్లో చిక్కుకున్న ఆ సంస్థకు కొత్త దారిని చూపించే పనిలో పడ్డారు ఎండీ సజ్జనార్. సిబ్బంది తీసుకునే నెలసరి జీతంను సకాలంలో అందించాలనే లక్ష్యంతో సంస్థలో తొలి అడుగు వేశారు కొత్త బాస్. సజ్జనార్ చర్యలతో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎండీ స్పూర్తితో మరింతగా శ్రమించి సంస్థను లాభాల్లోకి తీసుకొస్తామని చెబుతున్నారు.