తెలంగాణలో త్రికోణం తప్పదా? రేవంత్ రాకతో మారిన సీన్..
భారతీయ జనతా పార్టీ - బీజేపీ - తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర తొలిమజిలీ చేరింది. తొవిడత పాదయాత్ర శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ముగిసింది.ఈ సందర్భంగా హుస్నాబాద్’లో ఏర్పాటు చేసిన బహిరణ సభలో, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సహా కేంద్ర,రాష్ట్ర నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తానికి 36 రోజుల పాటు సాగిన బండి సంజయ్ తొలి విడత పాదయాత్ర ఆశించిన విధంగా ఉప ఎన్నిక జరుగతున్న హుజూరాబాద్’ లో ఎంటర్ కాకుండానే, ఉప ఎన్నికల నగారా మోగింది. దీంతో హుజూరాబాద్’ బదులుగా హుస్నాబాద్’లో ముగింపు సభ జరిగింది. నిజానికి, బండి పాదయాత్ర హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని చేసిన పాదయాత్ర కాదు.2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో అధికారం లక్ష్యంగా చేపట్టిన పాదయాత్ర ప్రజాసంగ్రామ యాత్ర.
అయితే ఈ పాదయత్ర సక్సెస్ అయిందా అంటే, అయిందనే బీజేపీ నాయకులు భావిస్తున్నారు. పాదయాత్ర లక్ష్యం, 2023లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే అయితే, అది ఇంతటితో, తొలి మజిలీతో తేలే విషయం కాదు. తెలంగాణలో అధికారం అనేది, బీజేపీకి, ఆ మాట కొస్తే, బీజేపే కంటే మరో పది మెట్లు ముందున్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక సుదూర స్వప్నం. నిజానికి, ఈరోజు ఉన్న పరిస్థితిని గమనిస్తే, సీట్ల సంఖ్య, ఓట్ల శాతం లేదా పాపులర్ పర్సెప్షన్’ ఏది చూసినా,తెరాస, కాంగ్రెస్ పార్టీల తర్వాత మూడవ స్థానంలో బీజేపీ ఉంది. అంటే, బీజేపీ డైరెక్ట్’గా తెరాసతో తలపడాలి అంటే కాంగ్రెస్’ను వెనక్కి నెట్టి, బీజేపీ ... మరో మెట్టు పైకి ఎక్కవలసి ఉంటుంది. నిజానికి, ప్రజా సంగ్రామ యాత్ర తొలి గమ్యం కూడా అదే. అయితే, ఒక్కప్పుడు అయితే ఏమో కానీ,రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత అది అంత ఈజీ టాస్క్ కాదు. రేవంత్ రెడ్డి ఎంట్రీ తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వెళ్ళిన నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎవరూ వెనక్కి రాకపోయినా వలసలు అయితే ఆగిపోయాయి. పార్టీ పట్ల నాయకుల్లోనే కాదు, ప్రజల్లో కూడా విశ్వాసం పెరిగింది.
నిజానికి, ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను పక్కన పెట్టి చిట్ట చివరగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఒక సీటు ఎక్కువగా \ నాలుగు సీట్లు దక్కాయి. కానీ, ఓట్ల లెక్కలలోకి వస్తే, కాంగ్రెస్,బీజేపీల మధ్య పది శాతం వరకు ఓట్ల వ్యత్యాసం వుంది.బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకి పది శాతం ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్’కు 29.48 శాతం ఓట్లు పోలైతే, బీజేపీకి వచ్చిన ఓట్లు 19.49 శాతం. తెరాస ఏకంగా 41.29 శాతం ఓట్లతో అందనంత ఎత్తులో ఉంది. సో.. రానున్న రెండేళ్లలో, బీజేపీ, ఇప్పుడున్న బలాన్ని రెట్టింపు చేసుకుంటేనే గానీ, అధికారం కోసం నేరుగా తెరాసతో తలపడే పరిస్టితి రాదు.
అలాగని అది అసాధ్యమా అంటే కానే కాదు. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ మిత్ర పక్షం ఆర్జేడీ అన్నట్లుగా సింకింగ్ బోటు.. మునుగుతున్న పడవ.. బీజేపీ రాష్ట్రంలో ఎలా ఉన్నాజాతీయ స్థాయిలో అక్కడా ఇక్కడా చిన్న చిన్న ఎదురుదెబ్బలు తిన్నా ఎదుగుతున్న పార్టీ ... ఈశాన్య రాష్ట్రాలలో జీరో నుంచి మొదలు పెట్టి కాంగ్రెస్ కంచుకోట అస్సాం, వామ పక్షాల ఎర్ర కోట త్రిపుర సహా మొత్తం ఏడు రాష్ట్రాలలో పాగా వేసింది. అయితే, బీజేపీ అక్కడ అలా విజయం సాధించింది కాబట్టి, ఇక్కడ కూడా విజయం సాధిస్తుంది, అనుకోవడం పొరపాటే అవుతుంది. నిజానికి, ఎన్నికల లెక్కలు, ప్రతి ఎన్నికకు మారి పోతూనే ఉంటాయి. ఇదే బీజేపీకి ఇదే తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సీటు ఒకటి, పువ్వు గుర్తుకు పోలైన ఓట్లు 7.1 శాతం. కానీ సంవత్సరం తిరగకుండానే 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం ఏకంగా 12 శాతం మేర పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటుకు పరిమిత మయిన పార్టీ లోక్ సభ ఎన్నికల్లో 4 సీట్లు, అంటే ఇంచుమించుగా 25 అసెంబ్లీ స్థానాలలో ఆధిక్యతను సాధించింది.
కాబట్టి ఎన్నికల లెక్కలు ఎన్నికల లెక్కలే ... ఆ సమయానికి ఉన్న లెక్కలను బట్టి ఫలితాలు ఉంటాయి .. తెలంగాణ శాసన సభ ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయముంది. సో .. ఇపుడే లెక్కలు తీయడం.. టూ ఎర్లీ .. తొందరపాటు అవుతుంది. అయితే, ప్రస్తుత పరిస్థితి ఇలాగే, కొనసాగితే మాత్రం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ అనివార్యంగా కనిపిస్తోంది.