వీరీ వీరీ 'గూగుల్'పండు.. ఏపీ రాజధాని పేరేంటి? దిమ్మతిరిగే ఆన్సర్..
posted on Oct 5, 2021 @ 12:31PM
వీరీ వీరీ గుమ్మడిపండు వీరి పేరేంటి? అని చిన్నపిల్లలు సరదాగా అడుకుంటారు. కళ్లు మూసి ఉంటాయి కాబట్టి ఆ పేరు చెప్పడం కాస్త కష్టమే. కానీ, గూగుల్ అలాకాదు. ప్రపంచంలో ఏ విషయం గురించి అడిగినా.. గూగుల్‌కు టక్కున సమాధానం ఇస్తోంది. అలాంటి గూగులమ్మకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే క్వశ్చన్ ఒకే ఒక్కటుంది. అది, ఏపీ రాజధాని ఏంటి? ఈ ప్రశ్న అడిగితే మాత్రం.. గూగుల్ నేరుగా, సూటిగా ఒక ఆన్సర్ చెప్పలేక పోతోంది. డౌట్ ఉంటే మీరే గూగుల్‌లో సెర్చ్ చేసి చూడండి.. వాట్ ఈజ్ ఏపీ కేపిటల్ అని కొట్టి చూడండి.. తమాషా ఏంటో మీకే తెలుస్తుంది..
చూశారుగా.. వాట్ ఈజ్ ఏపీ కేపిటల్ అని గూగుల్ తల్లిని అడిగితే.. నాలుగు ఆన్సర్లు ఇస్తోంది. విశాఖపట్నం, హైదరాబాద్, అమరావతి, కర్నూల్. అంటే ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు రాజధానులు ఉన్నాయని గూగుల్ భావన. ఇంతకుముందు ఇలా వచ్చేది కాదు. ఏపీ కేపిటల్ అని కొడితే.. నేరుగా అమరావతి అని చూపించేది. రాజధానితో జగన్ మూడుముక్కలాట తర్వాతే.. ఇలా నాలుగు పేర్లు చూపిస్తోంది. విశాఖ, అమరావతి, కర్నూలుతో పాటు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి.. పనిలో పనిగా హైదరాబాద్ పేరునూ చూపిస్తోంది. ఇక, వికీపీడియాలోనైతే దేశంతో మూడు రాజధానులున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటూ కీర్తిస్తోంది కూడా.
సీఎం జగన్ కేపిటల్ గేమ్‌తో గూగుల్ సెర్చ్ ఇంజనే కన్ఫ్యూజ్ అవుతోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆంధ్రుల కలల రాజధానిని కనుమరుగు చేసే కుట్రలో.. జగన్ ఆడిన జగన్నాటకంలో.. రాజధాని నాలుగు ముక్కలు అయిందనేది గూగుల్ అభిప్రాయం. ఒకప్పుడు ఏపీ కేపిటల్ అని సెర్చ్ చేస్తే.. అమరావతి పేరుతో పాటు.. సన్ రైట్ స్టేట్ అంటూ.. అంతర్జాతీయ స్థాయి రాజధానంటూ.. అద్భుతమైన ఫోటోలు, అత్యద్భుతమైన రాజధాని మాస్టర్ ప్లాన్ నమూనాలు గూగుల్‌లో ప్రత్యక్షమయ్యేవి. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ రాకతో.. ఏపీ ఆగమాగమైంది. ఆంధ్రుల కలల రాజధాని కుప్పకూలిపోయింది. జగన్ ఆడిన మూడు ముక్కలాటతో.. రాజధాని పీలికలు, చీలికలుగా మారి.. ఎటూ కాకుండా.. ఎవరికీ కాకుండా పోయింది. అమరావతి, విశాఖపట్నం, కర్నూలు.. పేరుకే రాజధానులు కానీ.. వీటిలో ఏ ఒక్క నగరానికైనా జగన్ హయాంలో అభివృద్ధి కానీ, ప్రాధాన్యం కానీ దక్కిందా? రాజధాని కోసం కొత్తగా ఒక్క బిల్డింగ్ అయినా కట్టారా? ఒక్క ప్రాజెక్ట్ అయినా చేపట్టారా? మరెందుకీ మూడు రాజధానులు? ఎవరి బాగు కోసం? ఇంకెవరి నాశనం కోసం? అంటూ సీఎం జగన్‌పై విరుచుకుపడుతున్నారు ఏపీ ప్రజలు.