TOP NEWS @ 7pm
posted on Oct 4, 2021 @ 6:45PM
1. పండోర పేపర్ లీక్స్‌లో వైసీపీ నాయకుల పేర్లు కూడా ఉన్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమ ఆరోపించారు. జగన్ కేసులలో విదేశాల్లో ఉన్న డబ్బు భారత్‌కు రప్పించేదుకు సీబీఐ ఇప్పటికే 6 దేశాలకు లేఖలు రాసిందన్నారు. ‘జే’ బ్రాండ్స్ మద్యంలో డ్రగ్స్ కలుపుతునట్లు వార్తలు వస్తున్నాయన్నారు. దేశం మొత్తానికి వైసీపీ నాయకులు గంజాయిని సప్లై చేసి డబ్బు సంపాదిస్తున్నారన్నారు. ఇలా వచ్చిన అక్రమ డబ్బును సూట్ కేసు కంపెనీల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారని బోండా ఉమ ఆరోపించడం కలకలం రేపుతోంది.
2. ‘మా’ ఎన్నికలకు, వైసీపీ ప్రభుత్వానికి, జగన్‌మోహన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి పేర్ని నాని అన్నారు. మా ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వం ఏ వ్యక్తినీ, వర్గాన్నీ సమర్ధించడం లేదని చెప్పారు. మా ఎన్నికలకు రాజకీయం రంగు పులముకున్న నేపథ్యంలో మంత్రి పేర్ని నాని చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది.
3. తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మండిపడ్డారు. టూరిజంతో పాటు పలు విషయాల్లో కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పద్మశ్రీ అవార్డుల్లో అన్యాయం జరుగుతోందని.. తెలంగాణలో పద్మశ్రీకి అర్హులు లేరా? అని ప్రశ్నించారు. పద్మశ్రీ అవార్డు కోసం జాబితా పంపాలా? వద్దా? అని మోదీ, అమిత్‌షాలను కలిసినప్పుడు విజ్ఞప్తి చేశానని చెప్పారు.
4. ఏపీలో వైసీపీ నాయకుల భూకబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా, అక్కంపల్లికి చెందిన రైతు లక్ష్మీరెడ్డి కుటుంబం.. వారి పొలంలోనే ఆత్మహత్యాయత్నం చేసారంటే వైసీపీ దుర్మార్గుల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతోందన్నారు. వైసీపీ నేతలు స్థానికంగా ఉన్న కొంతమంది అధికారులు కుమ్మక్కై రైతు భూమి కొట్టేయ్యాలని కుట్రలు చేయడం దారుణమన్నారు నారా లోకేశ్.
5. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తనకు కులం ప్రాధాన్యత లేదని చెప్పి.. ఇప్పుడు కులాలను రెచ్చగొడుతున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. టీడీపీ, కాంగ్రెస్‌లను పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీని లేకుండా చేయడమే పవన్, సీఎం జగన్‌ల కుట్రని హర్షకుమార్ ఆరోపించారు. నిజంగా పవన్‌కు చిత్తశుద్ది ఉంటే 10 రోజులు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండి రోడ్లు బాగుచేయాలన్నారు.
6. ఎయిడెడ్ స్కూళ్లకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆపడానికి వీల్లేదని ఏపీ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టులో కేసులు ఉన్నంత వరకూ ఎయిడెడ్ స్కూళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది. విద్యాశాఖకు సంబంధించిన అంశాలపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. దీంతో, విద్యాసంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
7. విశాఖలో ఆస్తుల తాకట్టు పెట్టి 2900 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారని, అది ప్రజల ఆస్తి అంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. మద్యం తాగే వాళ్ల తలలు తాకట్టు పెట్టడమే కాకుండా.. సిగ్గు లేకుండా ఇప్పుడు ప్రజల ఆస్తులు, డబ్బులు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. కరోనా కారణం చెపుతూ కాకమ్మ కథలు చెప్తున్నారని ప్రభుత్వంపై రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు.
8. స్థల వివాదంలో వైసీపీ నేతల వేధింపులు భరించలేక ఏపీ హైకోర్టు ఎదుట ఓ కుటుంబం ఆత్మహత్యకు ప్రయత్నించింది. గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం, ధూళిపాళ్లకు చెందిన వ్యక్తి భూమిని గతంలో ఆర్టీసీకి ఇవ్వాలని ప్రభుత్వం భావించగా.. బాధితుడు కోర్టు నుంచి తనకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ భూమిపై వైసీపీ నేతలు కన్నేశారు. ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ కుంటుంబం హైకోర్టు ముందు డీజిల్ ఒంటిపై పోసుకుని సూసైడ్ అటెంప్ట్ చేయగా అక్కడే ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకుని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
9. డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ నెల 7 వరకు ఎన్సీబీ కస్టడీకి అనుమతించింది ముంబై సిటీ కోర్టు. అంతకుముందు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు అతడు ఏడ్చాడని అంటున్నారు. గత 4 ఏళ్లుగా ఆర్యన్ డ్రగ్స్‌ను తీసుకుంటున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. దుబాయ్, బ్రిటన్ ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా మాదక ద్రవ్యాలను వాడుతున్నట్టు సమాచారం. ఎన్సీబీ అధికారులు ప్రశ్నించే సమయంలో తన తండ్రి షారుఖ్‌ఖాన్‌తో 2 నిమిషాలు ఫోన్‌లో మాట్లాడేందుకే అవకాశమిచ్చారు పోలీసులు.
10. వైద్యరంగంలో ఇద్దరు అమెరికన్ సైంటిస్టులకు నోబెల్ బహుమతి వరించింది. వేడి, చల్లదనం, స్పర్శకు సంబంధించిన జ్ఞానం మెదడుకు చేరే క్రమంలో నరాలు ఎలా ప్రేరేపించబడతాయి? వాటి స్పందనలు ఎలా ప్రారంభం అవుతాయి? అనే అంశంలో పరిశోధన చేసి.. గ్రాహకాలను కనుగొన్న డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌటియన్‌కు సంయుక్తంగా నోబెల్ అవార్డు ప్రకటించారు.