గవర్నర్ తో కేసీఆర్ గ్యాప్ పెరిగిపోయిందా? సంచలనాలు జరగబోతున్నాయా?
posted on Oct 4, 2021 @ 3:13PM
తమిళి సైతో కేసీఆర్ కు విభేదాలొచ్చాయా? ప్రభుత్వ తీరుపై గవర్నర్ గుర్రుగా ఉన్నారా? రాజ్ భవన్ కు ముఖ్యమంత్రి ఎందుకు వెళ్లడం లేదు? ఈ చర్చే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల కాలంలో గవర్నర్ ను కలవడం లేదు సీఎం కేసీఆర్. గవర్నర్ తమిళి సై కూడా ప్రభుత్వ విధానాలపై ఓపెన్ గానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గాంధీ జయంతి రోజున గవర్నర్ తో కలిసి నివాళి అర్పించాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఇద్దరి మధ్య గ్యాప్ భారీగా పెరిగిపోయిందనే చర్చ జరుగుతోంది.
సెప్టెంబర్ 8తో రాష్ట్ర గవర్నర్ గా తమిళి సై రెండేండ్లు పూర్తి చేసుకున్నారు. అయినా గవర్నర్ ను కలిసి విషెస్ చెప్పలేదు సీఎం కేసీఆర్. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజ్ భవన్ వెళ్లి ఆమెను కలిశారు. గవర్నర్‌గా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తన విధుల నిర్వహణ, అనుభవాలపై రాసిన పుస్తకాన్ని రాజ్ భవన్‌లో ఆమె విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కూడా కేసీఆర్ వెళ్లలేదు. గవర్నర్ గా నరసింహన్ ఉన్న సమయంలో తరచూ రాజ్ భవన్ వెళ్లేవారు సీఎం కేసీఆర్. వారానికి ఒకసారి వెళ్లి కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు నరసింహన్ ను ఆహ్వానించేవారు. పండుగల సమయంలో గవర్నర్ ను కలిసి శుభాకాంక్షలు చెప్పేవారు. ఇక నరసింహన్ పుట్టినరోజు వచ్చిందంటే కేసీఆరే ఎంతో హడావుడి చేసేవారు. కాని ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. తమిళి సై గవర్నర్ వచ్చిన మొదట్లో రాజ్ భవన్ కు బాగానే వెళ్లేవారు కేసీఆర్. కాని ఇటీవల కాలంలో రాజ్ భవన్ వెళ్లడం లేదు కేసీఆర్. అంతేకాదు ఆగస్టులో గవర్నర్ తమిళి సై కి మాతృవియోగం కలిగింది. అయినా వెళ్లి ఆమెను పరామర్శించ లేదు కేసీఆర్. రాజ్ భవన్ ను కేటీఆర్ వెళ్లి పరామర్శించి వచ్చారు. గవర్నర్ తో విభేదాలు పెరగడం వల్లే కేసీఆర్ ఆమెను పరామర్సించడానికి వెళ్లలేదంటున్నారు.
గవర్నర్ తమిళి సై కూడా ఇటీవల కాలంలో దూకుడు పెంచారు. ప్రభుత్వ విధానాలపై ఓపెన్ గానే వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. కొవిడ్ కట్టడి, వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపడుతూ పలుసార్లు కామెంట్లు చేశారు. ట్వీట్లు కూడా చేశారు. యూనివర్శిటీల విషయంలోనూ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా కామెంట్లు చేశారు. గత నెలలో వచ్చిన తెలంగాణ విమోచన దినం సందర్భంగా సంచలన ట్వీట్ చేశారు గవర్నర్ తమిళి సై. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు. బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేసినా స్పందించలేదు. అలాంటి పరిస్థితుల్లో విమోచన దినం పేరిట తమిళి సై ట్వీట్ చేయడం సీఎం కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించిందంటున్నారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని నామినేట్ చేస్తూ కేసీఆర్ కేబినెట్ తీర్మానం చేసింది. అయితే కేబినెట్ ప్రతిపాదనను ఆమోదించకుండా పెండింగులో పెట్టారు గవర్నర్ తమిళి సై. దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఇంకా ఆమోదించలేదు. కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు మరింత సమయం కావాలని ఆమె స్పష్టం చేశారు. గవర్నర్ కోటాలో అభ్యర్థుల అమోదంపై తాను క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నందునే కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వానికి గవర్నర్ చెక్ పెట్టారనే చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దల సూచనల ప్రకారమే ఆమె అలా నడుచుకుంటున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కౌశిక్ రెడ్డి వ్యవహారంలో గవర్నర్ తీరుపై సీఎం కేసీఆర్ అసహనంగా ఉన్నారని చెబుతున్నారు. అందుకే ఆయన రాజ్ భవన్ వైపు కన్నెత్తి చూడటం లేదని అంటున్నారు.
నిజానికి నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ విషయంపై గవర్నర్ ను కలిసి సీఎం చర్చిస్తే సమస్య ఎప్పుడో పరిష్కారమయ్యేదని అంటున్నారు. ఎందుకంటే గతంలో నరసింహన్ కొన్ని ఫైళ్లను పెండింగులో పెట్టినప్పుడు సీఎం కేసీఆర్ వెళ్లి ఆయనతో చర్చించేవారు. తర్వాత వెంటనే ఫైళ్లు క్లియరయ్యేవి. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీపైనా కేసీఆర్ వెళ్లి గవర్నర్ తో చర్చిస్తే ఆమోదం లభించేదని, గవర్నర్ ను కలవడానికి ఇష్టం లేకపోవడం వల్లే ఆయన వెళ్లడం లేదని చెబుతున్నారు. అంతేకాదు గవర్నర్ తో కలిసి పాల్గొనడం ఇష్టం లేకే గాంధీ జయంతి సందర్భంగా నివాళి అర్పించేందుకు బాపూఘాట్ కు కేసీఆర్ వెళ్లలేదని అంటున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేసీఆర్.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ తీరుపై అమిత్ షాకు కేసీఆర్ ఫిర్యాదు చేశారని కూడా తెలుస్తోంది. వరుసగా జరుగుతున్న ఘటనలతో గవర్నర్ తమిళి సైతో సీఎం కేసీఆర్ కు గ్యాప్ మరింతగా పెరిగిపోయిందని తెలుస్తోంది. ఇది ఎటు వైపు దారి తీస్తుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. రాష్ట్రంలో త్వరలో సంచలనాలు ఉండబోతున్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. చూడాలి మరీ గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య విభేదాలు ఎటు వైపు దారీ తీస్తాయో