రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. కారెక్కిన మున్సిపల్ చైర్ పర్సన్
posted on Oct 4, 2021 @ 7:10PM
పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న వరుస కార్యక్రమాలతో కాంగ్రెస్ కేడర్ యాక్టివ్ అయ్యారని, గతంలో పార్టీని వీడిన నేతలంతా తిరిగి హస్తం గూటికి వస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన కొందరు నేతలు సొంత గూటికి చేరుకున్నారు కూడా. ఇటీవల భూపాలపల్లి నేత గండ్ర సత్యనారాయణ భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఇకపై కాంగ్రెస్ లోకి వెల్లువలా వలసలు ఉంటాయని అంతా భావించారు. కాని అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి దిమ్మతిరిగే షాకిచ్చింది అధికార టీఆర్ఎస్ పార్టీ.
కాంగ్రెస్ బలంగా ఉన్న నల్గొండ జిల్లాలో మున్సిపల్ చైర్ పర్సన్ హస్తానికి హ్యాండిచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ తో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా కారెక్కారు. మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఫైర్ బ్రాండ్ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. అయినా కోమటిరెడ్డిని కాదని, రేవంత్ రెడ్డి షాకిస్తూ కాంగ్రెస్ మున్సిపల్ చైర్ పర్సన్ టీఆర్ఎస్ పార్టీలో చేరడం చర్చగా మారింది.
కాంగ్రెస్ మున్సిపల్ చైర్ పర్సన్ టీఆర్ఎస్ లో చేరడంలో నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు కూసుకుంట్ల. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం హైదరాబాద్ కు పరిమితం అవుతున్నారు. రెండు ,మూడు నెలలకొకసారి అలా వచ్చి ఇలా వెళుతున్నారో తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యే తీరుపై విసిగిపోయిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు అధికార పార్టీలో చేరుతున్నారని అంటున్నారు. గతంలోనే చండూరు జడ్పీటీసీ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. చౌటుప్పల్ మండలంలోనూ ఎంపీపీ సహా పలువురు సర్పంచ్ లు, ఎంపీటీసీలు కారెక్కారు. మున్సిపల్ చైర్ పర్సన్ ను చేరిక సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు కేటీఆర్.
కాంగ్రెస్ నేతల చేరిక సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డిపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసింది ఏం లేదన్నారు కేటీఆర్. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గానికి ఫ్లోరోసిస్ ఇచ్చిందన్నారు. తెలంగాణ తొలి ఉద్యమ కారుడు శ్రీకాంత చారి అయితే ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమం టైం లో చంద్రబాబు పక్కన ఉండి ఉద్యమ కారులపై దాడుల చేయించిన వ్యక్తి రేవంత్ రెడ్డి కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. మునుగోడు ఎమ్మెల్యే మాటి మాటికి రాజీనామా చేస్తా అంటున్నడు.. ఆయినా రాజీనామా చేసిన చేయకపోయినా రాష్ట్రం అంతట దళిత బందు అమలు చేస్తామని తెలిపారు. ప్రశాతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని కొంత మంది నాయకులు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.