అనంతలో మంత్రి అనుచరుల దౌర్జన్యం! బాధిత రైతు సెల్పీ వీడియో వైరల్..
posted on Oct 5, 2021 @ 12:02PM
మూడు దాడులు.. ఆరు ఆక్రమణలు.. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ ఇలానే సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని అంటున్నారు. ఎన్ని విమర్శలు వస్తున్నా.. బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా వైసీపీ నేతలు తీరు మారడం లేదు. వైసీపీ గ్రామ స్థాయి నేతల నుంచి మంత్రుల వరకూ అందరికి ఇదే పరిస్థితి. రెండు రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై బహిరంగంగా వైసీపీ నేతల లంచగొండులుగా మారిపోయారని కామెంట్ చేశారు.
తాజాగా అనంతపురం జిల్లాలో మంత్రి శంకరనారాయణ అనుచరుల దౌర్జన్యానికి పాల్పడ్డారు. హిందూపురం నియోజకవర్గం రాజుపాలెం గ్రామంలో రైతు పొలంలో మంత్రి అనుచరులు జేసీబీలతో కాలువ తవ్వారు. మంత్రి అనుచరులు దౌర్జన్యంతో తీవ్ర నష్టం వాటిల్లిందంటూ రైతు వేమారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. తన బాధను, మంత్రి అనుచరుల దౌర్జాన్యాన్ని ఆయన సెల్పీ వీడియోలో వెలిబుచ్చారు. ప్రస్తుతం రైతు వేమారెడ్డి సెల్పీ వీడియా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అనంతపురం జిల్లాలో మంత్రి అనుచరుల అరాచకంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రంగా స్పందించారు. జగన్ రెడ్డి చెత్త పాలనలో రోజుకో రైతు న్యాయం చెయ్యండంటూ రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా రాజుపాలెంలో నష్టపరిహారం ఇవ్వకుండానే రైతు వేమారెడ్డి భూమి లాక్కొని స్వయంగా మంత్రి అనుచరులే జేసీబీలతో దౌర్జన్యంగా గండి కొట్టి పొలాలు మీదుగా నీటిని మళ్లించడం దారుణమన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని... రైతు వేమారెడ్డికి తక్షణమే న్యాయం చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.