హుజూరాబాద్ లో ఉమ్మడి పోరు.. రేవంత్ స్కెచ్ మాములుగా లేదుగా?
హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. పోటీ చేయడమే కాదు, తెరాస,బీజేపీలను దీటుగా ఎదుర్కునే అభ్యర్ధిని బరిలో దించుతుంది. తెరాస, బీజేపీలకు గట్టి పోటీ కూడా ఇస్తుంది. అంతే కాదు ఉప ఎన్నికను అవకాశంగా తీసుకుని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే అన్ని పార్టీలను, ప్రజసంఘాలను కలుపుకుని, అక్కడా ఇక్కడ అధికారంలో ఉన్న తెరాస, బీజేపీలకు వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలతో ఉమ్మడి పోరాట వేదికను ఏర్పాటు చేస్తుంది. ఇందుకు సంబంధించి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రణాళికను తెర మీదకువస్తుందని, రేవంత్ సన్నిహిత వర్గాల సమాచారం.
పార్టీ అభ్యర్థి ఎంపిక కసరత్తు సాగిస్తూనే, మరోవైపు ఉమ్మడి అభ్యర్ధిని బరిలో దించి తెరాస, బీజేపీలకు బలమైన పోటీ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ ఎన్నికలో ఇప్పటికే పట్టుమీదున్న బీజేపీ, టీఆర్ఎస్ పై సర్జికల్ స్ట్రైక్ చేసేందుకు, పక్కా వ్యూహాంతో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నిజానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక కంటే, 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల పైనే, రేవంత్ రెడ్డి దృష్టిని కేంద్రీకరించారు. అదే సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచే భవిష్యత్ వ్యూహాన్ని సిద్దం చేసుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన గతంలోనూ చెప్పారు. అంతే కాదు మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి తెరాస, బీజేపీ వ్యతీరేక శక్తులను ఏకంచేసే ప్రయత్నంలోనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఇటు వామ పక్షాలు, అటు తెలంగాణ ఉద్యమ పార్టీలు, ప్రజా సంఘాలను నిరుద్యోగ భేరి వేదికగా ఏకం చేశారు. అలాగే సెప్టెంబర్ 27న జరిగిన భారత్ బంద్ కార్యక్రమంలోనూ కాంగ్రెస్ శ్రేణులు అన్ని పార్టీలతో కలిసి కదం తొక్కాయి.
ఇప్పుడు అదే ఫార్ములాను, హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ ప్రయోగించేందుకు రేవంత్ రెడ్డి ఇప్పటికే వామపక్ష నాయకులతో స్వయంగా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ఉమ్మడి అభ్యర్ధిగా బరిలో దించేందుకు వామపక్షాలు, తెలంగాణ ఉద్యమ పార్టీల మద్దతు కూడకట్టేందుకు రేవంత్ రెడ్డి వేగంగా అడుగులు వేస్తున్నారు.‘మిత్ర పక్షాలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి’ అనే నినాదంతో ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం సీఎల్పీనాయకుడు భట్టి విక్రమార్క, గాంధీ భవన్ లో తెరాస, బీజేపీ యేతర పర్టీల ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు, ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఐ, టీజేఎస్, ఇంటి పార్టీ, న్యూ డెమోక్రసీ, తెలంగాణ టీడీపీ, లిబరేషన్ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జరిగే, విద్యార్ధి , నిరుద్యోగ జంగ్, సైరన్ ఆందోళన, పోదు భూముల ఆందోళనతో పాటుగా, హుజూరాబాద్ ఉప ఎన్నిక విష్యం కూడా చర్చించినట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఉద్యమాలకు మద్దతు ఇస్తామని సమావేశంలో పాల్గొన్న అన్ని పార్టీలు అంగీకరించాయి. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో పార్టీలో చర్చించి నిర్ణయం తెలియచేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట రెడ్డి చెప్పారు. టీజేఎస్, టీటీడీపీ ఇతర పార్టీలు, ఉమ్మడి అభ్యర్ధి విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. అయితే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని సమాచారం. రాజకీయ పార్టీలతో పాటుగా ప్రజా సంఘాలను కలుపుకుని పోవాలని రేవంత్ రెడ్డి ప్రజా సంఘాల నాయకులను కలసి ఉమ్మడి అభ్యర్ధికి మద్దతు కూడగట్టే ప్రయత్నాలలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు, కృష్ణ మాదిగతో పాటుగా ఇతర సంఘాల నాయకులను కలుస్తున్నారు.
రేవంత్ రెడ్డి చేస్తున్నఈ ప్రయోగం వలన తక్షణ ప్రయోజనం ఉన్నా లేకున్నా, భవిష్యత్ లో దీర్ఘకాల ప్రయోజనం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. గతంలో వైఎస్సార్ తొమ్మిది వామపక్ష పార్టీలతో కలిసి సాగించిన విద్యుత్ తదితర ఉద్యమాలు కాంగ్రెస్ పార్టీకి లభించాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 2018లోనూ ఇదే ప్రయత్నం జరిగింది. కాంగ్రెస్ సారధ్యంలో ప్రజా కూటమి ఏర్పడింది. అయినా ఆశించిన ఫలితం దక్కలేదు. దక్కిన ఫలితం మిగల లేదు. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన 19 మందిలో 12 మంది.. టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరికీ ఇద్దరు తెరాసలో చేరిపోయారు. ఎన్నికల రాజకీయాల్లో ఒకటి ఒకటీ కలిస్తే రెండు కావలసిన అవసరం లేదని, ఒకటీ ఒకటీ సున్నా కావచ్చని అలాగే నాలుగో నలభయ్యో కూడ కావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకటీ ఒకటీ సున్నా అవుతుందా .. నాలుగో నలభయ్యో అవుతుందో త్వరలోనే తెలిసిపోతుంది..