దేవుని గుళ్ళో దొంగలు పడ్డారు.. జగనన్న పాలనలో కామనేనా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు వెంకన్న హుండీలో చేయి పెట్టింది. భక్తుల కళ్లు మాత్రమే కాదు, దేవుని కళ్లు కూడా కప్పి ఒకేసారి ఏకంగా రూ.50 కోట్లు మూట కట్టుకుని పట్టుకు పోయింది. ఇది ఒకసారి ‘చోరీ’ కాదు, ప్రతి సంవత్సరం ఇదే మొతాన్ని దేవుని హుండీ నుంచి సర్కార్ ఖజానా పట్టుకు పోతుంది. అంతేకాదు ప్రతి ఐదు సంవత్సరాలకు ఈ మొత్తం మరో 10 శాతం పెరుగుతుంది. ఇలా దేవుని హుండీని కొల్లగొట్టేందుకు వైసీపీ ప్రభుత్వం ఏకంగా
ఆర్డినెన్సు జారీ చేసింది.
వివరాలలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ ధార్మిక, హిందూ మత సంస్థలు, ధర్మదాయ చట్టం (దేవాదాయ ధర్మాదాయ చట్టం) 1987ను సవరిస్తూ ఆర్డినెన్సును జారీ చేసింది. ఈ ఆర్డినెన్సు ద్వారా తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఇంతవరకు , సంవత్సరానికి రెండున్నర కోట్ల రూపాయలు మాత్రమే, ప్రభుత్వానికి కామన్ గుడ్ ఫండ్ కింద ప్రభుత్వానికి చెల్లిస్తున్నటీటీడీ ఇకపై సంవత్సరానికి రూ.50 కోట్లు చేల్లిచవలసి ఉంటుంది. అంటే, భక్తుల కానుకలలో నుంచి ప్రభుత్వం రూ .50 కోట్లు పట్టుకు పోతుంది. అంతేకాదు, ఈ మొత్తం ప్రతి ఐదు సంవత్సరాలకు 10 శాతం వంతున పెరిగిపోతుంది.
అంత అర్జెంటుగా ఆర్డినెన్సు తెచ్చి మరీ, చట్టాన్ని సవరించి వెంకన్న హుండీకి కన్నం పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది, అంటే, అందులో అంత విశేషం ఏమీలేదు. కోడి మాంసం, కుక్క మాంసం ప్రభుత్వం ఎందుకు అమ్మవలసి వచ్చింది? సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయం ప్రభుత్వం ఎందుకు చేయవలసి వచ్చింది? సారా దుకాణాలు ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తోంది? ఇది కూడా అందుకే ... పేరు ఏదైనా కావచ్చును, ప్రభుత్వం చెప్పేది ఇంకేదైనా కాకవచ్చును,కానీ, ఈ అన్నిటికీ ఒకటే కారణం, జగన్ రెడ్డి ప్రభుత్వం దివాలా అంచుల్లోకి చేరింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్న స్థితి నుంచి అధః పాతాళానికి పరుగులు తీస్తోంది. అందుకే ఎక్కడ వీలయితే అక్కడ చేయి పెట్టి, చిక్కి నంత తెచ్చుకుంటోంది. పుచ్చుకుంటోంది.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,000 కోట్లు అప్పు చేసింది. రిజర్వు బ్యాంకు ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేసి ఈ రుణం తీసుకొచ్చింది. ఇందులో రూ.1,000 కోట్లను 7.04 శాతం వడ్డీకి 13 ఏళ్లలో చెల్లించేలా తీసుకుంది. మిగతా రూ.1,000 కోట్లను 7.09 శాతం వడ్డీకి 18 ఏళ్లలో చెల్లించేలా తీసుకుంది. ఈ నెలలో ఇంకా రూ.3,000 కోట్లు అప్పు తీసుకుంటామని రిజర్వు బ్యాంకుకు రాష్ట్ర ఆర్థిక శాఖ సమాచారం ఇచ్చింది. కేంద్రం సెప్టెంబరు 3వ తేదీన అనుమతిచ్చిన కొత్త అప్పులు రూ.10,500 కోట్లలో మంగళవారంతో రూ.7,000 కోట్లు తెచ్చేసింది. ఇంకో రూ.3,500 కోట్లు మాత్రమే మిగిలి ఉంది. దానిని కూడా అక్టోబరులోనే తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇలా ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తున్న ప్రభుత్వం అడపా దడపా వెంకన్న స్వామి మీద పడి, ఏదో రూపంలో సర్కార్ ఖజానాకు కైంకర్యం చేస్తోంది.
అయితే ప్రభుత్వం మాత్రం అసలు నిజాన్ని కప్పిపెట్టి, కామన్ గుడ్ ఫండ్ కోసం, దేవుళ్ళు, దేవాలయ మధ్య సమన్యాయం సాధించేందుకు అంటూ కట్టు కథలు, పిట్ట కథలు, పుక్కిటి పురాణాలు వినిపిస్తోంది. ఈ 50 కోట్ల రూపాయలను, దేవాదాయ శాఖ పరిధిలోని తక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలలో, ధూప, దీప నైవేద్యాలు, అర్చక స్వాముల యోగ క్షేమాలు,సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని ప్రభుత్వం ఆర్డినెన్సు లోనే చెప్పు కొచ్చింది. అయితే, వాస్తవంలో ప్రభుత్వం దేవాలయాల ఆదాయం, ఆస్తులను కొల్లగొట్టి, పాస్టర్లకు జీతాలు చెల్లించి, అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తోంది. చర్చిల నిర్మాణానికి ఖర్చుచేస్తోందని, హిందూ ధార్మిక సంస్థలు, భక్తులు, రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. నిజానికి, ఇది ఆరోపణ కాదు, ఆధారాలతో రుజువైన వాస్తవం.
ఈ ఆర్డినెన్సులో ప్రభుత్వం,తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) కి భక్తులు ఇచ్చే విరాళాలు, దర్శనం టికెట్ల విక్రయం, ఆర్జిత సేవ, ప్రసాదం విక్రయం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది, అయినా, కేవలం, రూ.2.5 కోట్లు మాత్రమే దేవాదాయ శాఖకు కామన్ గుడ్ ఫండ్ చెల్లిస్తోంది. విజయవాడ కనక దుర్గమ్మ, సిహచలం, కాణిపాకం, అన్నవరం, ద్వారకా తిరుమల ఆలయాలు చెల్లిస్తున్న మొత్తం కంటే ఇది చాలా తక్కువ, కాబట్టి దేవుళ్ళు, దేవాలయాల మధ్య ఆదాయాలను బట్టి సమన్యాయం సాధించేందుకు టీటీడీ చెల్లింపును రూ. 50కోట్లు పెంచినట్లు చెప్పుకుంది. నిజంగా, చిన్న చిన్నదేవలయాల అభివృద్ధికి ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తే, కాదనేది లేదు. దేవుని సొమ్ము దేవునికి ఖర్చు చేస్తే, అభ్యంతరం చెప్పేది ఉండదు, కానీ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ట్రాక్ రికార్డు చూస్తే, హిదువుల జేబులు కొట్టి అన్య మతస్తుల జేబులు నింపుతున్న వైనమే కనిపిస్తోంది. అదీ అసలు విషాదం..