ఆదిత్యనాథ్ దాస్ కు ఢిల్లీ బాధ్యతలు.. సాయిరెడ్డికి ఇక బ్యాండేనా?
posted on Oct 4, 2021 @ 8:39PM
విజయసాయి రెడ్డి.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి.. జగన్ తో పాటు జైలుకు వెళ్లారు. కేసులో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి. వైసీపీలోనూ నెంబర్ టు అంటారు. జగన్ తర్వాత పార్టీలో ఆయనే సూపర్ బాస్ అని, కీలక నిర్ణయాల్లో జగన్ ఆయన సలహా తీసుకుంటారనే టాక్ కూడా ఉంది. పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా చూస్తున్నారు సాయిరెడ్డి. అయితే విశాఖలో విజయసాయి రెడ్డి అరాచకాలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను కాజేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రాజధానిగా విశాఖను ప్రకటించిన జగన్.. ముందస్తుగా విజయసాయి రెడ్డిని అక్కడ మోహరించారనే విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.
వైసీపీలో నెంబర్ టుగా చెప్పుకునే విజయసాయిరెడ్డి పరిస్థితి ఇప్పుడు బాగాలేదని తెలుస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన్ను దూరం పెట్టారని అంటున్నారు. కొన్ని నెలలుగా జగన్ ను విజయసాయి కలవకపోవడం ఇందుకు బలాన్నిస్తోంది. తాడేపల్లి సీఎంవో వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల కాలంలో సాయిరెడ్డి క్యాంప్ ఆఫీసు రావడం లేదని తెలుస్తోంది. తాజాగా ఢిల్లీలో విజయసాయిరెడ్డికి ఉన్న బాధ్యతలన్నీ ముఖ్యమంత్రి జగన్ కొత్తగా సలహాదారు పదవి పొందిన ఆదిత్యనాథ్ దాస్ కు అప్పగించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీలో ఉంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారుగా పని చేసేందుకు విధివిధానాలు , జీత భత్యాల ఉత్తర్వులు ఇచ్చారు. కేంద్రంతో పనులు చక్కబెట్టడం గురించే అన్ని పనులే ఇకపై దాసే చేయనున్నారు. దీంతో విజయసాయిరెడ్డిని జగన్ దూరం పెట్టారని వస్తున్న వార్తలు నిజమేనని భావిస్తున్నారు.
గతంలో ఢిల్లీ వ్యవహారాలను చూసే బాధ్యత విజయసాయిరెడ్డికి ఇచ్చారు జగన్. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డిని.. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఆయనకు విరుద్ధ ప్రయోజనాల కింద పదవీ గండం ఉందని న్యాయనిపుణులు చెప్పడంతో అప్పటికప్పుడు చట్టాన్ని కూడా మార్చేశారు. ఢిల్లీలో వైసీపీ అంటే తానే అన్నట్లుగా వ్యవహరించిన విజయసాయిరెడ్డికి తర్వాత పరిస్థితులు అనుకూలించలేదు. ఢిల్లీలోఆయన పాత్ర తగ్గుతూ వస్తోంది. తాజాగా ఆయన నిర్వహించాల్సిన బాధ్యతలన్నీ ఆదిత్యనాథ్ దాస్‌కు అప్పగించడంతో పార్టీలో ఆయన భవిష్యత్ పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
విజయసాయిరెడ్డి తీరు కూడా ఇటీవల మారిపోయింది. గతంలో దూకుడుగా వ్యవహరించిన ఆయన ఇటీవల సైలెంట్ అయ్యారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండటం లేదు. ఆయనపై వైసీపీ హైకమాండ్‌కు పూర్తి స్థాయిలో విశ్వాసం సన్న గిల్లిందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కొనసాగించడం కష్టమని.. చివరికి పార్టీ తరపున ఉత్తరాంధ్ర బాధ్యతలను కూడా తొలగిస్తారని అంటున్నారు. త్వరలో జరగనున్న మంత్రి వర్గ పునర్ వ్యవస్థికరణలో మంత్రి వర్గం నుంచి తొలగించే సీనియర్ నేతకు విజయసాయి స్థానం ఇస్తారన్న ప్రచారం వైసీపీలోనే జరుగుతోంది. అదే జరిగితే వైసీపీలో నెంబర్ టూ స్టేజ్‌లో ఉండి చక్రం తిప్పిన మైసూరారెడ్డి లాంటి వారి పరిస్థితే విజయసాయిరెడ్డికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.