కేటీఆర్‌కు రేవంత్ ఫీవర్ పట్టుకుందా? అందుకేనా అలాంటి డైలాగ్స్?
posted on Oct 5, 2021 @ 1:50PM
మంత్రి కేటీఆర్ మునుపెన్నడూ లేనంత కలవరపాటు పడుతున్నారు. గతంలో ఏ అమావాస్యకో, పున్నానికో పొలిటికల్ స్టేట్‌మెంట్స్ చేసే ఏ-క్లాస్ మినిస్టర్.. ఇప్పుడు డైలీ రెండు మూడు సార్లు రాజకీయంగా ఓ రౌండ్ వేసుకుంటున్నారు. కేటీఆర్ నోటి నుంచి వచ్చే విమర్శలన్నీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గురించే. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. కనీసం రేవంత్‌రెడ్డి పేరెత్తేందుకు కూడా కేటీఆర్ ఇష్టపడే వారు కాదు. రకరకాల వంకర పేర్లతో పరోక్షంగా విమర్శించే వారు. కానీ, రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక సీన్ మారిపోయింది. కేసీఆర్‌కంటే కేటీఆర్‌నే రేవంత్ ఎక్కువగా టార్గెట్ చేస్తూ.. ఆయన ఇమేజ్‌ను దారుణంగా డ్యామేజ్ చేస్తుండటంతో.. చినబాస్ సైతం నోటికి పని చెప్పక తప్పని పరిస్థితి వచ్చిందంటున్నారు. రేవంత్‌రెడ్డి ఎంతలా డిస్టర్బ్ చేసుంటే.. కేటీఆర్ రోజూ ఆయన్ను ఏదో ఒకటి అనకుండా ఉండలేని తప్పనిసరి పరిస్థితి వచ్చుంటుంది.
తాజాగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరుద్యోగ జంగ్ సైరన్.. బాగా సక్సెస్ అవుతోంది. తెలంగాణవ్యాప్తంగా జంగ్.. హోరెత్తుతోంది. రేవంత్‌రెడ్డి పిలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో మునుపటి ఉత్సాహం ఉరకలెత్తుతోంది. మొదటిరోజు నిరసన కార్యక్రమాలైతే ఓ రేంజ్‌లో సాగాయి. ఎల్బీనగర్‌లో శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసేందుకు.. పోలీసుల లాఠీలు, ఇనుప కంచెలను కాచుకుంటూ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాంగ్రెస్ కార్యకర్తలు రోజంతా దండయాత్ర చేస్తూనే ఉన్నారు. చివరాఖరికి సాయంత్రానికి శ్రీకాంతాచారి విగ్రహానికి పూల దండ వేసి.. కాంగ్రెస్ జెండా ఎగరేయడంలో విజయం సాధించారు. ఆ ప్రయత్నంలో ఖాకీల లాఠీ దెబ్బలు తిన్నా.. ఒంటిమీద వాతలు తేలినా.. ఏమాత్రం వెనకంజ వేయకుండా తెగువ ప్రదర్శించారు. ఆ ఎపిసోడ్‌లోనే ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు, హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నర్సింగ్‌రావు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఇదంతా రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రేసుగుర్రాల్లా మారిన కాంగ్రెస్ శ్రేణుల తెగువ, పట్టుదలకు నిదర్శనం అంటున్నారు.
రేవంత్‌రెడ్డి దూకుడు, కాంగ్రెస్‌లో ఉత్సాహం చూసి.. కేటీఆర్‌లో తీవ్ర కలవరం, అసహనం పెరిగిపోయిందంటున్నారు. అందుకే, ఇటీవల మంత్రి కేటీఆర్.. పదే పదే రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని భావిస్తున్నారు. రేవంత్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే పనిలో నోటికి పని చెబుతున్నారని అంటున్నారు. ఇటీవల కేటీఆర్ చేసిన కామెంట్లు పరిశీలిస్తే....
జంగ్ లేదు.. సైరన్ లేదు.. అది జంగు పట్టిన పార్టీ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. ‘తుపాకీ లేదు.. ఉత్తి తుపేల్ పార్టీ’ అని కొట్టిపారేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తుపాకీ పట్టుకొని ఉద్యమకారులపైకి రేవంత్‌రెడ్డి వెళ్లారంటూ పాత విషయాలను కొత్తగా కెలుకుతున్నారు కేటీఆర్. చంపిసోడే సంతాపం తెలిపినట్టు.. శ్రీకాంతాచారి విగ్రహానికి రేవంత్ పూలదండ వేశారని.. తెలంగాణకు మొదటి ద్రోహి రేవంత్ అంటూ మంత్రి కేటీఆర్ పేలాల్లా పేలుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అవుతున్నారు. ఇదంతా.. రేవంత్‌రెడ్డి దూకుడు చూసి.. కేటీఆర్‌లో కలుగుతున్న కంగారేనని భావిస్తున్నారు.